Oct 02,2022 08:34

'కొన్ని పుస్తకాల్ని రుచి చూడాలి.. మరి కొన్నింటిని మింగేయాలి.. ఇంకొన్నింటిని నమిలి, జీర్ణం చేసుకోవాలి' అంటాడు రచయిత బేకన్‌. నాజీ జర్మనీ 1941లో సోవియట్‌ యూనియన్‌పై దండయాత్ర చేసిన కాలంలో ఎర్ర సైన్యంలో అనివార్యంగా ఓ మహిళా దళం చేరి, యుద్ధ పరిస్థితుల్ని ఎదుర్కొన్న వీరోచిత త్యాగాల గాథే ఈ పుస్తకం.

రెండో ప్రపంచ యుద్ధంలో రెడ్‌ ఆర్మీ తరపున, యుద్ధ దళంలో పనిచేసిన రచయిత, తన అనుభవాల్లో నుండి.. స్ఫూర్తి పొందిన సందర్భాలను కూర్చిన అక్షరాలే ఈ నవల. తొలిసారిగా నిుష్ట్రవ ణaషఅర నవతీవ Aతీవ Qబఱ్‌వు అనే పేరుతో 1969లో రచయిత 'బోరిస్‌ వసీల్యేవ్‌' దీనిని రచించారు. ఈ నవలనే ''ప్రశాంత ప్రత్యూషాలు'' అనే పేరుతో తెలుగులో అనువదించి, మనకు అందించారు నిడమర్తి ఉమారాజేశ్వరరావు గారు.
1942, అది మే మాసం. పడమట కందకాలలో గట్టి రక్షణ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, నిలకడగా యుద్ధం సాగుతోంది. తూర్పున జర్మన్లు కాలువ పైనా, మూర్మ, రైలుమార్గం పైనా రాత్రింబగళ్లు ఎడతెరిపి లేకుండా బాంబులు కురిపిస్తున్నారు. ఉత్తరాన సముద్ర మార్గాల కోసం ఘోరమైన పోరు సాగుతోంది. దక్షిణాన జర్మన్ల ముట్టడిలో వున్న లెనిన్‌గ్రాడ్‌ తీవ్రమైన ప్రతిఘటనను నిబ్బరంగా ఎదుర్కొంటోంది.
కానీ 171వ నంబరు రైల్వేస్టేషన్‌ సమీప ప్రాంతం.. పంపిన శతఘ్ని బృందానికి మాత్రం పదిరోజుల తర్వాత ఓ యుద్ధ ప్రాంతంలాగా కాకుండా విశ్రాంతి కేంద్రంలా తలపించింది. ఆ ప్రాంతాన్ని సోమరితనంతో, నాటుసారాతో, ఘాటు కంపు కమ్మేసే ఆ పరిస్థితుల్ని కమాండెంటుకు వివరిస్తూ.. మేజర్‌ సార్జెంట్‌ రాతపూర్వక ఫిర్యాదునిస్తాడు. అందులో 'నాకు తాగనివాళ్లని పంపండి..!', అలాగే 'తాగుబోతులు కానివాళ్లూ... ఇంకా ఆడదాని గౌను అంచు తగిలితేనే చాలు వాల్ల అలంగం తిరిగేవాళ్లూ కాకుండా చూపి పంపండి!' అంటాడు. ఇచ్చిన ఫిర్యాదు ప్రకారమే.. చురుకుగా ఉండే కొత్త బృందాన్ని ఒకదాన్ని పంపుతానని వస్కోవ్‌కి వాగ్దానం చేస్తాడు. అన్నట్లుగానే మూడురోజుల తర్వాత.. సైనిక యువతుల బృందాన్ని పంపిస్తాడు. ఆ బృందంలోని యువతులంతా వాగుడు పిట్టలనీ, తంటాలమారి మేళమనీ మొదట్లో అనుకున్నా.. ఒక్కొక్కరూ ఒక్కో స్థితిగతుల నుండి ఈ యుద్ధ రంగంలోకి ఎలా వచ్చారో.. రచయిత కళ్లకు కట్టినట్లు ఈ నవలలో పొందుపరిచిన తీరు చెప్పుకోదగ్గది.
అనారోగ్యం కారణంగా భార్యనీ, బిడ్డనీ కోల్పోయిన పరిస్థితితో నవ్వడమే మానేస్తాడు సార్జింట్‌ మేజర్‌. ఈ యుద్ధ భూమిలో తమ పాత్ర అయిపోయిందని తెలిసిన రీత్యా.. చివరి క్షణాల్లో కొడుకుని తలచుకుంటూ.. జరిగిపోయిన ఆ బరువైన ఆ పరిస్థితులను చదువుతుంటే కంటికి చెమ్మని తెప్పిస్తాయి.
మర్గరీతా ముప్తకోవా 18 ఏళ్లు నిండని వయసులో ప్రేమలో పడి, చట్టం ఒప్పుకోకపోయినా పంతం పట్టి.. ఓ రెడార్మీ కమాండరుని పెళ్లాడుతుంది. ఈ లోకంలో తనకంటే సంతోషంగా మరొకరు లేరని అనుకుంటుంది. తన సహచరుడితో పాటే తానూ మహిళా సమితికి ఎన్నుకోబడుతుంది. తన భర్త వెంటే ఉండటం ఎంతో సంతోషంగా భావిస్తుంది. ఆ సందర్భంలోనే తాను గాయాలకు కట్టు కట్టడం, తుపాకి కాల్చడం, గుర్రపు స్వారీ, గ్రెనేడ్‌ విసరడం, విషవాయు దాడుల నుండి ఆత్మరక్షణ చేసుకోవడం వంటివి నేర్చుకుంటుంది. మరు ఏడాది యుద్ధం మొదలై.. ఇతర కుటుంబాలతో పాటు రీతాని యుద్ధరంగం నుండి దూరంగా పంపించాలని సహచరుడి ప్రయత్నిస్తాడు. కానీ రీతా ఈ యుద్ధ పోరాటం చేయాలనే నిర్ణయించుకుంటుంది. తాను కన్నబిడ్డని తల్లిదండ్రుల వద్దకు పంపేస్తుంది. ఇతర బిడ్డల్ని కాపాడేందుకే సిద్ధపడుతుంది. సరిహద్దు స్థావరంపై శత్రువు దాడితో భర్త దూరమైనా.. ఆమె నిబ్బరాన్ని కోల్పోదు. అయినా ఆమె తనను యుద్ధానికి పంపమనే కోరుతుంది. ఆమెకు చేతినిండా పని, మొయ్యాల్సిన బాధ్యతలు, మనసారా ద్వేషించడానికి కొన్ని నిర్ధిష్ట లక్ష్యాలున్నాయని భావిస్తుంది.
అలా ఇప్పుడు శతఘ్ని బృందంలో వచ్చిన వారిలో రీతా నిజమైన యుద్ధభూమిపై అడుగిడుతుంది. తాను వేయాల్సిన ప్రతి అడుగూ తన మృత్యువువైపే అని తెలిసినా.. తన లక్ష్యంవైపుగా అని భావించే ముందుకు సాగుతుంది. చివరికి ఆ యుద్ధభూమిపైనే తుదిశ్వాసను విడుస్తుంది. అయితే, అందుకు కొన్ని నిమిషాల ముందు ఆమెలోని మాతృమూర్తి కన్నబిడ్డ భవిష్యత్తులో ఏవిధంగా ఉండబోతాడో అని ఊహించుకుంటూ చిరుననవ్వుని పెదవిపై నిలిపి, తదేకంగా ఆకాశంవైపు చూస్తూ ప్రాణాలొదులుతుంది.
జర్మన్‌ ఆఫీసర్ల కుటుంబంసభ్యుల్ని పట్టుకుని తుపాకీ ఎదుట నిలబట్టి, జేన్యా తల్లిని, చెల్లెల్ని, తమ్ముడుని కాల్చి చంపేస్తారు. ఎదురింట్లో ఉండే ఓ ఎస్తోనియన్‌ మహిళ జేన్యాను దాయడం వల్లే ప్రాణాలతో ఉంటుంది. జేన్యా జీవితం విషాదంతో నిండినా.. తాను మాత్రం దళంలో అందరితోనూ ఎంతో కలిసిమెలసి, చలాకీగా ఉంటుంది.
విమాన విధ్వంసక శతఘ్నిదళ సైనికులు యుద్ధరంగం నుంచి ఎక్కడో ఉన్న రైల్వేస్టేషకు బదిలీ చెయ్యబడుతున్నారని తెలియడంతో.. తీవ్రమైన అభ్యంతరాలు తలెత్తుతాయి. అయినప్పటికీ 'రీతా', 'జేన్యా', 'గాల్వా చెత్‌వెర్తాక్‌' అందుకు సంసిద్ధమయ్యారు. గాల్వా ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. ఆమె స్థితిని అర్థంచేసుకొని గాల్వాని రీతా, జేన్యా తమ వెంటే ఉంచుకుని, తనకు అండగా నిలిచేవారు. లీజాది మరొకగాథ. ఈ విధంగా ఆ యుద్ధం ఎందరో జీవితాలతో ముడిపడి, అనేకరకాల ముగింపులతో కొనసాగుతుంది.
జీవితం అంటే ఏంటో పూర్తిగా చూడని కుసుమాలు పరిస్థితుల కారణంగా యుద్ధంలో చావడం మాత్రమే కాదు.. తమ చావు ఒక గొప్ప ఆశయం కోసం అని నమ్ముతారు. తాము చనిపోతున్నామని తెలిసినా, తమ చివరిశ్వాస వరకూ తమ వంతుగా పోరాడతారు. అలాంటి స్ఫూర్తినిచ్చిన ఎన్నో గాథలే సమరహారమే ఈ పుస్తకం. చిరునవ్వుతో ప్రాణాల్ని లెక్కచేయని వారి గురించి చదువుతుంటే.. చెంపపై కన్నీళ్లు కారుతూనే, చైతన్యాన్ని కలిగిస్తాయి. ఆ వీరోచిత యువతుల గురించి నేటి యువతరం చదవి, తెలుసుకోవాలంటే సాహితి ప్రచురణలు, విజయవాడ వారు ప్రచురించిన ''ప్రశాంత ప్రత్యూషాలు'' పుస్తకం చదవాలి. వెల రూ. 125 మాత్రమే. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ దొరుకుతాయి.


ప్రశాంత ప్రత్యూషాలు
రచయిత : బి.వసీల్యెవ్‌
వెల : 125
ప్రచురణ : సాహితీ ప్రచురణలు
ఫోన్‌ : 9849992890

- వర్థని