Sep 13,2023 16:46

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈ ఏడాది ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించమని క్లబ్‌ అధ్యక్షురాలు కాపుగంటి సుధ పేర్కొన్నారు. పట్టణంలోని రింగ్‌ రోడ్డు సుజాత కన్వెన్షన్‌ హాల్‌లో మంగళవారం జరిగిన మహిళా ఉత్సవ్‌ 2023ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మహిళ ఉత్సవ్‌లో మహిళలచే రూపొందించబడిన వివిధ రకాల చేతి వృత్తుల ఉత్పత్తుల స్టాల్‌లను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ ద్వారా ఈ ఏడాది సేవా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహణకు వెచ్చిస్తామన్నారు. తమ కార్యవర్గం ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్‌ చైర్లు, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ వంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేశామన్నారు. ఈ మహిళా ఉత్సవ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో మెగా ప్రాజెక్టును ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ విజయనగరంలో ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు త్రాగునీటి కోసం వాటర్‌ ప్యూరిఫైయర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పోలియో నిర్మూలనకు నిధులు అందజేయడంతో పాటు ఉచిత వైద్య శిబిరాలు కొనసాగిస్తామన్నారు. ఈ మహిళా ఉత్సవ్‌ కు మూడు జిల్లాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు . ఈ కార్యక్రమంలో ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ కార్యదర్శి జి. సంధ్యారమ, ప్రాజెక్టు చైర్మన్‌ జి.శిరీష, కె.విజయ తదితరులు పాల్గొన్నారు.