ఓ మహాత్మా!
చెడు అనకు, వినకు, చూడకు
అన్న పలుకులు నీవైతే
నేటి సమాజానికవే ప్రీతిపాత్రం
అహింసాయోధుడవు నీవు
హింసా వీరులు నేటి నాయకగణం
సర్వమత ఐక్యత నీ పథం
అనైక్యతే నేటి జనుల మార్గం.
మద్యం వద్దని నీవు
అదే ముద్దని నేటి ప్రభుత్వం
మహిళా సాధికారత నీ కల
మరి నేడో...
కలకంఠి కంట కన్నీరు చూడందే
నిద్రపోని పాషండులెందరో!
గ్రామ స్వరాజ్యం నీ ఊహాసుందరి
దాని అభావానికై
నేటి పాలకుల శక్తివంచన లేని కృషి
నీవు చూపిన నాటి విరిబాట
నేటి రాజకీయులకు ముళ్లబాట
సమానతే నీ ధ్యేయం
అసమానతే
నేటి తరం లక్ష్యం
నిరాడంబరతే నీ భావనైతే
ఆడంబరయుత పోకడలు
నేటి యువత చిరునామా!
నాటి నీ పాదయాత్ర
దండును ప్రేరేపిస్తే..
దండి యాత్రగా చరిత్రలో నిలిస్తే..
నేటి పాదయాత్రలు
హింసకు మార్గాలు
శాంతి భద్రతలకు భగ్నాలు
నిస్సిగ్గుగా పదవీ యాచనకు
తార్కాణాలు
బాపూ! నేటితరానికి
నీ మార్గం స్ఫూర్తి కావాలి..!
నీ త్యాగఫలం భారతమ్మకు
కీర్తి తేవాలి..!
జై భరతమాత.. జై గాంధీ తాత..
వేమూరి శ్రీనివాస్
99121 28967