Aug 07,2022 13:13

జీవితం మొత్తం నదీప్రవాహంలా సాగుతోంది
రేపే సాగరంలో కలుస్తుందో అర్థంకాకుండా ఉంది
వెనక్కు తిరిగి చూస్తే అన్నీ చీకటి అరణ్యాలు
అవగతం కాని ఎత్తుపల్లాలే కనిపిస్తున్నాయి

నిన్నటి తీరని కోరికల మురికిపట్టిన మనసును
కడిగిపారేయాలంటే కొత్త ఆలోచనల ఊటలతో
ఉత్సాహంగా ఉరకలేస్తూ ప్రవహించే జీవనదిలా
జీవితం కడదాకా కొనసాగుతూనే వుండాలి

కష్టాల ఆనకట్టలు తెంచుకొని ఉరకలెత్తే బతుకునది
అనుభవాల తీరాల వెంటపడి మహాసముద్రమై
మొదట భయపెట్టినా తుదకు ప్రశాంత సాగరమై
ప్రతి కన్నీటిబొట్టునూ తనలో దాచుకుంటుంది

ఆవేశాలు, ఆనందాలు అన్నీ పైకి ఎగసిపడే అలలే
అగ్నిపర్వతాలు, ఆణిముత్యాలు లోలోన దాచుకుని
నిశ్చలంగా నిర్మలంగా కనపడటమే దాని పని
అప్పుడే మనగలదు జీవనసాగరం ప్రశాంతంగా

నీటి ప్రవాహాలు నదిగా మారటం సహజం
నది మహాసముద్రంగా మారటం కూడా అంతే సహజం
కానీ మహాసముద్రం మానస సరోవరంలా మారినప్పుడే
జీవితానికి జీవనానికి నిజమైన సార్థకత చేకూరుతుంది
 

- ఈదర శ్రీనివాసరెడ్డి
78931 11985