
'జొన్న పిండి కొనుక్కురారాదూ? జొన్నలు కడిగి ఎండబెట్టడం నాకు పెద్ద శ్రమ కాదు కానీ, మీరు మరలా ఆ దుమ్ము ధూళిలో నుంచుని పిండి పట్టించడానికి శ్రమ పడాలి.'
'ఫర్వాలేదులే పార్వతీ! ఇలా మనమే కొని, పట్టించుకుంటే రేటు కాస్త కలిసొస్తుందని' అంటూ కృష్ణమూర్తి నిట్టూర్చుతూ వెళ్లి, ఒక గ్లాసు మంచినీళ్లు తాగి, నిన్న రిపేరు చేయటానికి వచ్చిన సోనీ టీ.వీ ముందు కూర్చున్నాడు.
గోధుమపిండి కంటే, జొన్న పిండి చవకని రాత్రి పూట జొన్న రొట్టెలు తింటూ పార్వతీ, కృష్ణమూర్తులు కాలక్షేపం చేస్తున్నారు. భర్తకు వినపడనంత దూరంగా వెళ్లి, పార్వతి కొడుక్కి ఫోన్ చేసింది. ఇప్పుడైతేనే వాసు ఆఫీసులో ఉంటాడు మరి. 'వాసూ! ఈ నెల ఇంటద్దె కట్టలేకపోయాం. అది నువ్వు పంపగలవా?'
'మీక్కావాల్సిన సరుకులకు, కరెంటు బిల్లుకే ఎలాగో తంటాలు పడి, దీపకు తెలియకుండా నీ ఫోనుకు గూగుల్ పే చేస్తున్నాను. ఆవిడగారికి అంతా లెక్కే కదా? ఇంటి అద్దె కూడా పంపటానికి చూస్తాను. అక్కడ అక్క వాళ్ల ఇంట్లో అక్క మాట సాగదు. మన ఇంట్లో నా మాట నా పెళ్లాం వినదు. మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దంటుంది. మీ పరిస్థితికి నాకు చాలా బాధ వేస్తుందమ్మా. కానీ ఇంట్లో గొడవ పెట్టుకుంటే మా ఇద్దరి మధ్య పిల్లలు నలిగిపోతారని సర్దుకుపోతున్నాను.'
'అంతా మా దురదృష్టం వాసూ! వుంటాను.' అంటూ పార్వతి ఫోన్ పెట్టేసింది.
పార్వతి మనసు గతంలోకి వెళ్లింది.
1980లో మా పెళ్లయ్యింది. పాలిటెక్నిక్ చదివాడు కదా? ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. కుటుంబాన్ని పోషించుకుంటాడని కృష్ణమూర్తికి తననిచ్చి పెళ్లి చేశారు. వాణి, వాసులు పుట్టుకొచ్చారుగానీ, కృష్ణమూర్తికి సరైన ఉద్యోగం రాలేదు. చిన్నాచితక ఉద్యోగాలు చేస్తూనే రేడియో అండ్ టీవీ మెకానిజంలో కూడా డిప్లమో చేశాడు.
అప్పటివరకూ మన ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులతో పాటు క్రాఫ్ట్ టీచర్లు కూడా ఉండి నవ్వారు అల్లడం, తోటపని, గ్రాఫ్ పుస్తకాల్లో వివిధ రంగులతో డిజైన్లు వేయటం లాంటివి నేర్పేవారు. వాటికి అదనంగా మరికొంత వృత్తి విద్యా శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం పూనుకుంది. కుట్టు పనితో దుస్తుల తయారీ, ఊలుతో రకరకాల అల్లికలు, వ్యవసాయపు క్లాసులు, రేడియో, టీవీ మెకానిజం అంటూ కొన్ని కోర్సులు ప్రవేశపెట్టింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్యా నిపుణులు అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేరారు. కానీ వారికి నెలకు 'కన్సాలిడేట్' పేమెంటుగా 600 రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు. తర్వాత నిదానంగా రెగ్యులర్ చేస్తామన్నారు. అలా కృష్ణమూర్తి కూడా 'చాట్రగడ్డ'లోని 'ఎయిడెడ్' పాఠశాలలో రేడియో, టీవీ ఉపాధ్యాయుడిగా చేరాడు. ఏళ్లు గడుస్తున్నాయి. విద్యార్థుల శిక్షణకు కావాల్సిన మెటీరియల్ సప్లై చేస్తోంది. కానీ, నేర్పే వారి జీతాలు మాత్రం ప్రభుత్వం ఏమాత్రం పెంచడంలేదు. ఈ వృత్తి విద్యా నిపుణులు అందరూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేశారు. ఉపాధ్యాయ యూనియన్ల వారు కూడా సహకరించారు. 600 నుండి 1000 రూపాయల వరకూ జీతం మాత్రం పెంచారు. ఇంట్లో పిల్లల చదువులు, కుటుంబ పోషణ వీరికి భారంగానే ఉంది. కొన్ని సంవత్సరాల నుండి నేనూ ఇంట్లో ట్యూషన్లు చెబుతోంది.
మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. ఈ వృత్తి విద్యా నిపుణులు మరలా ఆందోళన చేపట్టారు. ఎన్నోసార్లు చర్చలు జరిపారు. '8,9,10 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రతిరోజూ క్లాసులు, నెలవారీ పరీక్షలు, మిగతా అన్ని సబ్జెక్టుల్లాగానే జరుగుతున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఒకేషనల్ ఎగ్జామినేషన్ అంటూ ఒక పేపర్ కూడా ఉంటుంది. మిగతా ఉపాధ్యాయులతో పాటు వెళ్లి పబ్లిక్ పేపర్లు దిద్ది వస్తున్నాం. ఫలితాలు, సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇలా చాకిరీ చేస్తున్నాం. ఇకనైనా మా ఉద్యోగాలు రెగ్యులర్ చేయండి!' అంటూ ఎన్నోసార్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు.
ఇక్కడ పాఠశాలల్లో 8,9,10 తరగతుల విద్యార్థినులు ఈ క్లాసుల్లో దుస్తుల తయారీ, ఊలు అల్లకం, రకరకాల ఎంబ్రాయిడరీ ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్నారు. విద్యార్థులు ఎక్కువగా మెకానిజం, వ్యవసాయపు క్లాసులకు హాజరయ్యే వాళ్లు. వెయ్యి రూపాయల జీతంతో విసుగు వచ్చిన కొంతమంది ఉద్యోగాలు మానేశారు. కృష్ణమూర్తి మాత్రం ఆశగా అలాగే కొనసాగిస్తున్నాడు. అందరూ కలిసి ఎన్నో ప్రయత్నాలు చేసి, చివరకు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయించుకో గలిగారు.
కానీ ఇంకా పదేళ్లు మాత్రమే సర్వీసు మిగిలి ఉన్నది. పాత పెన్షన్ విధానం వీరికి వర్తించలేదు. సరే ఇప్పటి స్కేలు ప్రకారం జీతం వస్తుంది. రిటైర్ అయిన తర్వాత ఎంతోకొంత పెన్షన్ వస్తుంది కదా అని తృప్తి పడ్డారు కృష్ణమూర్తిలాంటి వాళ్ళు. ఇప్పుడు వచ్చే జీతంలో కొంతభాగం ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రభుత్వం మదుపు చేస్తుంది. ఆ మొత్తం మీద వచ్చే వడ్డీనే వీరికి నెలవారీ పెన్షన్‌గా కంపెనీ చెల్లిస్తుంది. అలా 'సిపియస్' పెన్షన్ అందుకునే విధానంలో పడిపోయారు వీళ్లంతా.
వాణి ఎంసిఎ చేసింది. మంచి సంబంధమే కుదిరింది అనుకున్నారు. వాసు ఎంబిఎ చేశాడు. హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. లోగడ జరిగిన సమావేశాల్లో కృష్ణమూర్తికి, రవి కుమార్ పరిచయమయ్యాడు. అతడు భట్టిప్రోలు పాఠశాలలో పనిచేస్తాడు. వీళ్లిద్దరి మధ్య పరిచయం, ఆ తర్వాత స్నేహము పెరిగాయి. రవికుమార్ కూతురు దీప. దాంతో మాట్లాడి, వాసూ, దీపల వివాహం జరిపించారు. ఇద్దరి ఉద్యోగాలు హైదరాబాదులోనే.
క్రమేణా ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఉపాధ్యాయులను, జిల్లా పరిషత్ స్కూళ్లకు సర్దుబాటు చేశారు. ఆ క్రమంలో కృష్ణమూర్తి కూడా చాట్రగడ్డ నుండి వెల్లటూరు స్కూల్లో చేరాడు. ఒకేషనల్ వాళ్లందర్నీ క్రాఫ్ట్ టీచర్లగానే పరిగణించసాగారు. కృష్ణమూర్తి వెల్లటూరులోనే రిటైర్ అయ్యాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎనిమిది లక్షలు వచ్చాయి. కృష్ణమూర్తికి పెదపూడిలో వాళ్ళ నాన్న ఇచ్చిన రెండు ఎకరాల పొలం మాత్రం ఉన్నది. దాంట్లో ఒక ఎకరం వాణికి కట్నంగా ఇచ్చారు. రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులో నాలుగు లక్షలు ఇస్తానని మాట ఇచ్చాడు. అన్న ప్రకారం నాలుగు లక్షలు ఇచ్చాడు. పెళ్లినాటి నుండి రావాల్సిన వడ్డీ ఇవ్వలేదని అల్లుడు రుస రుసలాడాడు. మిగతా నాలుగు లక్షలు మాకెందుకు ఇవ్వరని దీప పేచీ పెట్టుకున్నది.
'అలా అనకమ్మా దీపా! మాకింకా వేరే ఆధారమేమున్నది? ఎకరం పొలంలో పంట పెద్దగా రాదు. సిపిఎస్ పెన్షన్ కాబట్టి నాకు నెలకు 1802 రూపాయలు మాత్రమే వస్తుంది. ఈ నాలుగు లక్షలు ఏ పోస్ట్ ఆఫీస్‌లోనో వేసుకున్నా, మూడు నెలలకు ఒకసారి 8000 మాత్రమే వడ్డీ వస్తుంది. ఈ కాస్త ఆదాయాలతో మేం ఎలా బతుకుతామో ఆలోచించు. ఇప్పటికే ఎలాగురా భగవంతుడా అని మేం సతమతమవుతున్నాం. అర్థం చేసుకో అమ్మా!' అని మామగారు ఎంత నచ్చజెప్పినా.. వాసు మాట కూడా వినిపించుకోకుండా అలిగి వెళ్లింది. రాకపోకలు లేవు.
కృష్ణమూర్తి దంపతులు వెల్లటూరులోనే ఇంకా చిన్న ఇంట్లోకి మారారు. స్వంతగా టివీల రిపేర్లు చేస్తూ, రేపల్లెలోని టివీ షాపుల వాళ్లు పిలిచినప్పుడు వెళ్లి, రిపేర్లు చేసి వస్తూ అతి పొదుపుగా కాలం గడుపుతున్నారు.
కృష్ణమూర్తి వియ్యంకుడు రవికుమార్ తన కూతురు దీపకు ఫోన్ చేశాడు. 'అమ్మా! దీపా! ఈ నెల 30వ తేదీన నా రిటైర్మెంట్ ఫంక్షన్ హైస్కూల్‌లోనే జరుగుతుంది. మీరిద్దరూ తప్పకుండా రండి. నేను నాలుగు మాటలు చెప్తాను. ఓర్పుగా వినమ్మా. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు నీకేమీ ఇవ్వలేను. నీకు మంచి ఉద్యోగం ఉన్నది. మాకు వచ్చే పెన్షన్ చాలా తక్కువ. అది మీ అమ్మ మందులకే సరిపోదు. నాకొచ్చే బెనిఫిట్స్ మీద వచ్చే వడ్డీ, నా పెన్షన్తో మేం అతి కష్టం మీద గడపాలి. మా సొంత ఇంటి ఆలోచన కూడా లేకుండా, నీ చదువుకు, నీ పెళ్లికే ప్రాధాన్యత ఇచ్చాం. మా జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అవి ఆ భగవంతుడికే తెలుసు. అందుకే నిన్నొక్కదాన్నే కని, సరి పెట్టుకున్నాం. అనారోగ్యాలతో రోజులు ఎలా గడపాలా అని మీ అమ్మ ఒకటే దిగులు పడుతుంది. అమ్మకు నేనే ధైర్యం చెబుతున్నాను. బంగారంలాంటి, బాధ్యత ఎరిగినటువంటి కూతురు ఉండగా మనకేం దిగులు అంటున్నాను. అర్థం చేసుకుని, ప్రతి నెలా వీలైనంత డబ్బు పంపించు. అమ్మానాన్నల ఆవేదనను అర్థంచేసుకో' అంటుంటే రవికుమార్ గొంతు గద్గదమైంది.
తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ అయ్యాక నేరుగా వెల్లటూరు వెళ్దామన్నది దీప. అక్కడికెళ్ళి మళ్లీ డబ్బు విషయమై ఏం గొడవ పెట్టుకుంటుందో అని వాసు భయపడ్డాడు. వెల్లటూరు వచ్చిన వాసును, దీపను చూచి పార్వతీ దంపతులు కలవరపడ్డారు. కాసేపు కూర్చుని లేచిన దీప వంటగదికి వచ్చి గిన్నెల్ని పరిశీలించింది. కొద్దిగా కాచిన పాలు, పలుచని మజ్జిగ, తోటకూర పులుసు, చిన్న చిన్న గిన్నెలో ఉన్నాయి. ఇంకా అన్నం వండినట్లు లేదు. ఇంట్లో కొద్దిపాటి పాత సామాన్లు, అత్తగారి మెడలో మాసిపోయిన పసుపుతాడు, ఈ మధ్యనే ఎల్.వి ప్రసాద్ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో శుక్లం ఆపరేషన్ చేయించుకున్న గుర్తుగా మామగారి కళ్ళకు నల్ల కళ్లజోడు కనిపించాయి. వీళ్లకు ఏం వండి పెట్టాలా? అని పార్వతి కలవరపడసాగింది.
'భోజనానికి భట్టిప్రోలు వెళ్తామత్తయ్యా. చూచి వెళ్దామని వచ్చాం. సాయంకాలం సికింద్రాబాద్ బండికి భట్టిప్రోలులోనే ఎక్కుతాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. వస్తా మామయ్యా. వాసు వెళ్దామా?' అంటూ బయల్దేరారు.
'వాసు! ఈ నెల నుంచి భట్టిప్రోలు ఒక పది వేలు, వెల్లటూరు ఒక పది వేలు ప్రతి నెలా పంపుదాం. వాళ్ల సంపాదనతో వాళ్లేదో దర్జాగానే బతుకుతున్నారని ఇన్నాళ్లు నేను పొరపాటు పడ్డాను.' అన్నది దీప.
దాసరి శివకుమారి
98660 67664