న్యూఢిల్లీ : 2021లో మధ్యప్రదేశ్‌లోనే దళితులపై అత్యధిక నేరాలు జరిగాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 2019లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. 2021లో ఎస్సీలపై నేరాల విషయంలో జాతీయ సగటు రేటు 22.6 కాగా మధ్యప్రదేశ్‌లో 63.6గా నమోదైంది. రాజస్థాన్ 60.8 రేటులో రెండో స్థానంలో నిలిచింది. 2011 జనగణన ఆధారంగా ఎస్సీల జనాభాను లెక్కించారు. లక్ష మంది ఎస్సీ జనాభాపై జరిగిన నేరాలకు సంబంధించి రేటును లెక్కించారు. అన్ని రకాల నేరాలు, వేధింపులను దీనిలో చేర్చారు. ఎస్సీలపై జరిగిన నేరాల సంఖ్యకు సంబంధించి ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో (9,492) ఉండగా రాజస్థాన్ (7,435), మధ్యప్రదేశ్ (7,211) తర్వాతి స్థానాలలో నిలిచాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద 2011లో దేశంలో 45,619 కేసులు నమోదయ్యాయి. ఇక ఎస్టీలపై నేరాలకు సంబంధించి కేరళ మొదటి స్థానంలో నిలవగా రాజస్థాన్ రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. నేరాల సంఖ్య విషయానికి వస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా మొదటి మూడు స్థానాలలో నిలిచాయి.










