Aug 13,2023 15:36

మిఠాయిలు.. మధురాలు.. స్వీట్సు.. ఇలా తియ్యని పదార్థాలకు ఎన్ని పేర్లో. పండుగలు లేదా ప్రత్యేకమైన రోజుల్లో నోరు తీపి చేసుకోవడం.. ఆత్మీయులకు పంచడం ఆనవాయితీగా వస్తున్నదే. వాటిలో ఈ బిజీ రోజుల్లో తేలికగా.. కమ్మగా చేసుకునేలా ఉండే తియ్యందనాల గురించి తెలుసుకుని స్వాతంత్య్ర దినోత్సవానికి పిల్లల నోరు తీపి చేద్దాం.

డబుల్‌ కా మీటా..

1

కావలసినవి : మిల్క్‌ బ్రెడ్‌ స్లైసులు - 4, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపోయినంత, పాలు - 300 మి.లీ., పంచదార - 100 గ్రా., పచ్చికోవా - 50 గ్రా., జీడిపప్పు, కిస్‌మిస్‌ - 10 చొప్పున

తయారీ : బ్రెడ్‌ స్లైసుల అంచులను కట్‌ చేయాలి. మధ్య భాగాన్ని ముక్కలుగా కట్‌ చేసి, నూనెలో గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేలా వేయించాలి. మందపాటి గిన్నెలో పాలు పోసి, దానిలో స్పూను నెయ్యి, పంచదార వేసి లోఫ్లేమ్‌లో ఇరవై నిమిషాలు కాయాలి. ఆ పాలలో వేయించిన బ్రెడ్‌ ముక్కలు వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు కోవా, జీడిపప్పు, కిస్‌మిస్‌ పైన చల్లి కదపకుండా మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. స్టౌ ఆఫ్‌చేసి 15 నిమిషాలు కదపకుండా పక్కనుంచాలి. అంతే నోరూరించే డబుల్‌ కా మీటా రెడీ.

బ్రెడ్‌ డిజర్ట్‌..

3

కావలసినవి : పంచదార పొడి - 1/4 కప్పు, బ్రెడ్‌ ముక్కలు - 12, పాలపొడి - 3 స్పూన్లు, మలాయి (గడ్డకట్టించిన వెన్న) - 3 స్పూన్లు, బాదం తురుము - 2 స్పూన్లు, ఎండుకొబ్బరి పొడి
తయారీ : గిన్నెలో పంచదార పొడి అరకప్పు నీళ్ళు, చిటికెడు కలర్‌ వేసి బాగా కలపాలి. పాలపొడి, మలాయి, స్పూను పంచదార పొడి, బాదం తురుము అన్నీ బాగా (క్రీమ్‌లా అయ్యేంతవరకూ) కలపాలి. బ్రెడ్‌ ముక్కల మధ్యలో గ్లాసును బోర్లించి గుండ్రని ముక్కలు కట్‌ చేసుకోవాలి. ముక్కలపై పాలపొడి మిశ్రమాన్ని రాసి, రెండు ముక్కలను అతికించాలి. వాటిని పంచదార నీటిలో ముంచి నీరు పోయేలా అరచేతిలో ఉంచి నెమ్మదిగా నొక్కాలి. అలా అన్నీ తయారైన తర్వాత ఎండుకొబ్బరి పొడిలో అద్ది, ఒక్కొక్క దానిపై డ్రైఫ్రూట్‌ పొడి చల్లి మధ్యలో చెర్రీ గుచ్చాలి. అంతే యమ్మీ యమ్మీ బ్రెడ్‌ డిజర్ట్‌ రెడీ.

రాస్‌బోరా..

3

కావలసినవి : బొంబాయి రవ్వ - 150 గ్రా., నెయ్యి - 6 స్పూన్లు, పాలు - 1/2 కప్పు, పంచదార - 1/4 కేజీ, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపోను, జీడిపప్పు
తయారీ : ముందుగా నేతిలో రవ్వ రంగు మారేంత వరకూ వేయించాలి. దానిలో పాలు పోసి కలుపుతూ ఇరవై నిమిషాలపాటు ఉడికించి చల్లారనివ్వాలి. మరో గిన్నెలో పంచదార లేత పాకం పట్టి పక్కనుంచాలి. రవ్వ మిశ్రమాన్ని ముద్దగా కలిపి (అవసరమైతే కొంచెం పాలతో) కొంచెం మందంగా చపాతీలా ఒత్తుకుని, మనకు కావలసిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి. పైన జీడిపప్పు అద్ది, బాండీలో నూనె వేడిచేసి వేయించుకోవాలి. వాటిని పంచదార పాకంలో వేసి గంటసేపు నాననివ్వాలి. అంతే రుచికరమైన రాస్‌బోరా రెడీ.

అడ

5

కావలసినవి : బెల్లం - 1/4 కేజీ, బియ్యం పిండి - కప్పు, బొంబాయి రవ్వ - 2 స్పూన్లు, ఎండుకొబ్బరి పొడి - 2 స్పూన్లు, చిటికెడు ఉప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌, నెయ్యి - 2 స్పూన్లు
స్టఫ్ఫింగ్‌ కోసం : కొబ్బరి పొడి, వేయించిన వేరుశనగ పప్పు పొడి, బెల్లం కలిపి మిక్సీపట్టాలి.
తయారీ : స్టౌ మీద మందపాటి గిన్నెలో బెల్లం, చిన్నగ్లాసు నీళ్ళు పోసి కరిగించాలి. దానిలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, కొబ్బరిపొడి, ఉప్పు వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. ముద్దగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి, రెండు స్పూన్ల నెయ్యి, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌, సన్నగా రౌండుగా తరిగిన అరటిపండు ముక్కలు వేసి బాగా కలపాలి. అరటి ఆకులకు నెయ్యి రాసి ఈ పిండిని ఉండలా చేసి అద్ది, మధ్యలో స్టఫింగ్‌ మిశ్రమం పెట్టి, అంచులు కలపాలి. తర్వాత దానిని ఆకుతో పూర్తిగా కప్పి ఉంచి, ఆవిరిమీద ఉడికించాలి. అంతే కేరళా స్వీట్‌ అడ రెడీ.