Aug 28,2022 09:43

అక్షరవనంలో సిరిమల్లె తెలుగు,
పసిపాపల బోసి నవ్వుల
అందం తెలుగు.
మింట జాబిల్లి తెలుగు,
సంక్రాంతి రంగవల్లి తెలుగు.

ఎన్ని మార్లు పలికినా
తనివి తీరని పదబంధం,
ఎంత విన్నా శ్రవణపేయమైన భావగాంభీర్యం, అక్షర రమ్యత
మన తేనెలూరు తెలుగుకే సొంతం.

తెలుగు భాష అంటేనే...
మధుర మంజుల నాదం,
ఓ హిమవన్నగం, ఓ పారిజాత సుమం,
ఆనందాల హరివిల్లు,
ఆత్మీయానుబంధాల విరిజల్లు.

పరాయి భాష మోజులో,
సరళమై అమతధారలై విరిసే
తెలుగుకి తెగులు పట్టి
గురజాడవారి పూర్ణమ్మలా
విలపిస్తోంది విలవిల్లాడుతూ.

ఆమె అశ్రునయనాలను
తెలుగువాడిగా తుడిచేద్దాం
తెలుగు నా నేస్తం
నాకు సమస్తం,
తెలుగుతల్లీ! వీడను నీ హస్తమని
ప్రతిన పూనుదాం.

తెలుగుభాషా ప్రావీణ్యాన్ని
నేల నుండి నింగి దాకా చాటుదాం,
తెలుగుభాషాయోషను
ఆనందతాండవం చేయిద్దాం.

 

వేమూరి శ్రీనివాస్‌
99121 28967