May 07,2023 07:50

కవితలు అల్లుకున్న వనమే
సద్భావనలద్దిన క(వితా)వనం
అక్షరాల వేర్లకు నీరు పెట్టి..
పదాల పైరుకు ఎరువులందించి..
కవితా వస్తువుకు పూల శోభలద్ది..
శిల్పాన్ని సుందర మాలగా చుట్టి..
పాఠకుల మది కంఠాన వేసేదే..
సుమధుర బృందావన కవనం !

అసంకల్పితంగా కన్నీరు పెట్టించి..
బడుగు బతుకు వెతల్ని కళ్లకు కట్టి..
నిన్నను రేపటితో అనుసంధానించి..
వర్తమాన వాస్తవాన్ని నగంగా చూపి..
సిగ్గులేని జనాన్ని నిస్సిగ్గుగా కడిగేసి..
అక్షర అగ్గితో కుళ్లును భస్మంగా కాల్చి..
అమృత భవితకు అద్దాలి కొత్తదనం !

అమాయకంగా నిర్జీవ పేజీలో దాగి..
సమాజ నలుపుకు తెల్ల రంగులద్ది..
అవినీతిని అంగట్లో ఏకరువు పెట్టి..
నిజాన్ని నిర్మొహమాటంగా నిలబెట్టి..
నిర్భల పౌరుల పక్షపాతిగా శక్తినిచ్చి..
ప్రతోడి నోట్లో నాలుకయ్యింది కవనం
కవిత లేని చోటు చెట్టులేని ఎడారే !

డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037