
చాలా పెద్ద మొత్తంలో వచ్చి పడుతున్న విదేశీ పంటలతో, వస్తువులతో దేశీయ వ్యవసాయం కునారిల్లుతున్నది. డబ్య్లుటిఓ ఒప్పందాలు ఎలా అమలుపరచాలా అనే గొడవ తప్పితే ఈ వ్యవసాయ సంక్షోభంలో భారత రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారనేది పాలక వర్గాలకు పట్టడంలేదు. మన వ్యవసాయాన్ని, రైతును కాపాడుకోవాలంటే స్వామినాధన్ కమిషన్ చెప్పినట్టు (సి2+50) రైతులు పెట్టిన ఖర్చుల పైన 50 శాతం ఆదాయం వచ్చేలా కనీస మద్దతు ధర చట్టం చెయ్యాలి. లేనిపక్షంలో భారతదేశ వ్యవసాయాన్ని, రైతును కాపాడలేరు.
సంవత్సరానికి 10 వేల మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకోవడాన్ని బట్టే వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో వుందని ఎవరికైనా అర్థమవుతుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తానని దేశవ్యాప్తంగా 13 నెలల పాటు సాగిన రైతు ఉద్యమాల విరమణ ఒప్పంద సందర్భంగా రైతులకు మోడీ వాగ్దానం చేశారు. విద్యుత్ బిల్లును కూడా రైతు సంఘాలతో సంప్రదించిన తర్వాతనే పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ వాగ్దానాలను మోడీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కానీ వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారాలు వెతికేందుకు కమిటీ వేస్తున్నట్టుగా మోడీ ప్రకటించారు. ఆ కమిటీలో రైతు వ్యతిరేక చట్టాలను తయారు చేసిన అధికారులు, ఆర్‌ఎస్‌ఎస్ అభిమానులైన రైతు నాయకులు 12 మంది వరకు ఉన్నారు. 3 స్థానాలను ఖాళీ పెట్టి ఆ ఖాళీలలో ఎస్‌కెఎం నాయకులు చేరాలంటూ ప్రభుత్వం పకటించింది. కనీస మద్దతు ధరల చట్టం తయారు చేయటం కూడ ఈ కమిటీ కర్తవ్యాల్లో వున్నదా అని ఎస్‌కెఎం నాయకత్వం బహిరంగంగా ప్రశ్నించినదానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. కీలకమైనటువంటి ఈ ఎంఎస్‌పి చట్టాన్ని తప్పక తీసుకువస్తామని ప్రభుత్వం సమాధానం చెప్పకపోవటమే కేంద్ర ప్రభుత్వం డ్రామా ఏమిటో అందరికి అర్థమైంది. అందువల్ల నిరుపయోగమైన ఈ ప్రభుత్వ కమిటీలో ఎస్‌కెఎం సభ్యులు చేరకపోవటం సమంజసమే.
పెట్రోలు, డీజిల్ ధరలు ఈ కాలంలో విపరీతంగా పెరిగాయి. ఎరువుల ధరలు రెట్టింపయ్యాయి. ఇతర ఉత్పత్తి ఖర్చులు బాగా పెరిగాయి. ప్రకృతి విపత్తులు, వరదలు, కరువులు వెంటాడాయి. దిగుబడి బాగా తగ్గింది. పండిన పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనే బాధ్యత తీసుకోలేదు. ఫలితంగా ప్రైవేట్ వ్యాపారస్థులకు అతి తక్కువ ధరకు రైతులు పంటలను అమ్ముకోవలసి వచ్చింది. కౌలు రైతుల పరిస్థితి వేరేగా చెప్పనవసరం లేదు. చిన్న, పేద రైతులు, కౌలు రైతులు తను పెట్టిన ఖర్చు కన్నా వచ్చే ఆదాయం తక్కువగా ఉండటం వలన అప్పులపాలౌతున్నారు. ఇలా 3,4 సంవత్సరాలు చూసిన తర్వాత అప్పు పెరిగి వ్యవసాయం గిట్టుబాటుకాక వేరే ప్రాంతాలకు, పట్టణాలకు వలస పోతున్నారు. గ్రామాలలో 5 శాతంగా వున్న భూస్వాములు, పెట్టుబడిదారీ పెద్దరైతులు ఎరువులు, పురుగు మందుల వ్యాపారాలతో, ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు నిర్వహించుకోవటం... పెట్రోలు బంకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పేదల పొట్ట కొట్టి రోజురోజుకూ ఆర్థికంగా బలపడుతున్నారు. ప్రభుత్వ పథకాలన్నిటిని వీరే కాజేస్తున్నారు. గ్రామ రాజకీయాలను, కుల, మత వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. దేశంలో జనాభా పెరుగుదల రేటు 1.6 శాతం ఉండగా ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు 0.7 శాతం మాత్రమే వుంది. ప్రతి సంవత్సరం 3 కోట్ల ఎకరాల్లో పంటలు ప్రకృతి విపత్తుకు గురవుతున్నాయి. రైతులకు రక్షణగా ఉంటుందన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా ఒక మాయ నాటకంగా మారుతున్నది. పంటల బీమా పేరుతో కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వేల కోట్ల రూపాయలను మూట కట్టుకుంటున్నాయి. కానీ పంట దెబ్బతిన్న రైతులకు ఒరిగిందేమీ లేదు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని నడుపుతున్న పంటల బీమా తీరు సరేసరి. పంటలు దెబ్బతిన్న 45 లక్షల మంది రైతులకు గాను 9 లక్షల మంది రైతులకు మాత్రమే కొద్దో గొప్పో చెల్లించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇది కూడా లేకుండా చేతులెత్తేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా లోకి చేరుతున్నట్లుగా ప్రకటించింది.
ఈ కాలంలో ప్రభుత్వం మార్కెట్ వ్యవస్థ తన బాధ్యతను నెరవేర్చటం మానేసింది. గత 30 సంవత్సరాలలో వున్న ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ నాశనమైంది. సహకార వ్యవస్థలు కాగితాలకు పరిమితమయ్యాయి. ప్రభుత్వాలు ప్రకటించే మద్దతు ధరల అమలు కోసం మార్కెట్ యార్డుల దగ్గర పోరాడేందుకు అవకాశం వుండేది. అది కూడా లేకుండా చేశారు. ఎఫ్‌సిఐ ని, ప్రభుత్వ నిల్వ గిడ్డంగులను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చే బదులు ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.
వివిధ పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరలు ప్రకటిస్తున్నా ఆచరణలో అమలు లేదు. పేద, చిన్న రైతులు ప్రైవేట్ వ్యాపారస్థులు దయాదాక్షిణ్యాలకు బలికావలసి వస్తున్నది. మన రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలే ధాన్యం మరియు ఇతర పంటలన్నిటినీ కొనుగోలు చేస్తాయని రాష్ట్రప్రభుత్వం ప్రకటించినా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను మిల్లర్లకు అంటగట్టి తప్పుకుంటున్నది. మిల్లర్లు అతి తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారు. ఈ కాలంలో ప్రభుత్వ బ్యాంకులు పేద రైతాంగానికి రుణాలు ఇవ్వటం తగ్గిపోయింది. చిన్న రైతులు వడ్డీ వ్యాపారస్థుల పైన ఆధారపడాల్సి వస్తుంది. విద్య, వైద్యం, నిత్యావసర వస్తువుల ధరలు, ఉత్పత్తి ఖర్చులు కొండలా పెరిగిపోతున్నాయి. విదేశాల నుంచి పాలు, గోధమలు, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, కాఫీ, టీ, చక్కెర లాంటి వస్తువులు కుప్పలుగా వస్తున్నాయి. ఇప్పటికే 56 దేశాలతో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు వున్నాయి. 16-ఏషియన్ దేశాలతో ఒప్పందం చేసుకోవడానికి మోడీ సిద్ధంగా ఉన్నారు. చాలా పెద్ద మొత్తంలో వచ్చి పడుతున్న విదేశీ పంటలతో, వస్తువులతో దేశీయ వ్యవసాయం కునారిల్లుతున్నది. డబ్య్లుటిఓ ఒప్పందాలు ఎలా అమలుపరచాలా అనే గొడవ తప్పితే ఈ వ్యవసాయ సంక్షోభంలో భారత రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారనేది పాలక వర్గాలకు పట్టడంలేదు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు తమ రైతాంగానికి అవసరమైన వ్యవసాయ సబ్సిడీలు ఇచ్చి వారి పంటలను మన దేశంపైకి వదులుతున్నారు. కేరళ ప్రభుత్వం వరి ధాన్యానికి కింటాకు రూ.1000 మద్దతు ధరపై అదనంగా చెల్లించడం, రుణ మాఫీ చట్టం అమలు ద్వారా ఆ రైతాంగానికి వ్యవసాయ సంక్షోభాన్ని ఎదిరించగలిగే ధైర్యాన్నిస్తున్నది. మన వ్యవసాయాన్ని, రైతును కాపాడుకోవాలంటే స్వామినాధన్ కమిషన్ చెప్పినట్టు (సి2+50) రైతులు పెట్టిన ఖర్చుల పైన 50 శాతం ఆదాయం వచ్చేలా కనీస మద్దతు ధర చట్టం చెయ్యాలి. లేనిపక్షంలో భారతదేశ వ్యవసాయాన్ని, రైతును కాపాడలేరు.
( వ్యాసకర్త : ఎ.పి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు )
వి. కృష్ణయ్య