Oct 24,2022 11:31
  • 'విద్యుత్‌' ప్రైవేటీకరణతో జరిగేది అదే
  • ప్రజాశక్తితో విద్యుత్‌ రంగ పరిరక్షకులు అశోక్‌ రావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల లాభాలు  ప్రైవేట్‌కు, నష్టాలు ప్రభుత్వానికి మిగులుతాయని విద్యుత్‌ రంగ పరిరక్షకులు కె అశోక్‌ రావు అన్నారు. విద్యుత్‌ను ప్రైవేటీకరించాలని ప్రపంచంలో చాలా చోట్ల ప్రభుత్వాలు ప్రయత్నించి వెనక్కు తగ్గాయని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ చట్ట సవరణ-2022 బిల్లు అమలయితే విద్యుత్‌ రంగం ప్రైవేట్‌ పరమయ్యేందుకు బాటలు వేసిన్నట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ రంగంపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను కూడా కేంద్రం హరిస్తుందని మండిపడ్డారు. విద్యుత్‌ సంస్కరణల అమలు చేయడం వల్ల 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయారని గుర్తుచేశారు. అదే ఉచిత విద్యుత్‌ వల్ల వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారని వివరించారు. ఈ పరిణామాలను చూసి కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణల అమల్లో దూకుడుగా ఉందని పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ చట్టసవరణ బిల్లు, విద్యుత్‌ సంస్కరణలపై ప్రజాశక్తితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

 

 ప్రశ్న:విద్యుత్‌ రంగంలో ప్రైవేట్‌ డిస్కంలు వస్తే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి.

జ: ప్రైవేట్‌ డిస్కంల వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. క్రాస్‌ సబ్సిడీ విధానంలో పరి శ్రమలకు ప్రభుత్వం అధిక ధరకు విద్యుత్‌ సరఫరా చేసి, ప్రజలకు తక్కువ ధరకు సరఫరా చేస్తోంది. దీనివల్ల ప్రజలకు లబ్ధి పొందుతున్నారు. ప్రైవేట్‌ డిస్కంలు క్రాస్‌సబ్సిడీ విధానాన్ని రద్దుచేస్తుంది. దీంతో ప్రజలపై భారాలు పడతాయి. అదేవిధంగా ప్రైవేట్‌ డిస్కంలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా అందించేందుకు ముందుకు రావు. లాభాలు వచ్చే నగరాలు, పట్టణాల్లో మాత్రమే సరఫరా చేస్తాయి.

 

 ప్రశ్న: ఇతర దేశాల్లో ప్రైవేట్‌ డిస్కంల పరిస్థితి ఎలా ఉంది ?

జ: విదేశాల్లో ప్రైవేట్‌ డిస్కంలు విఫలమయ్యాయి. ఫ్రాన్స్‌లో ప్రైవేట్‌ సెక్టార్‌లో ఉన్న విద్యుత్‌ రంగాన్ని ఆ దేశం ఇప్పుడు జాతీయకరణ చేసింది. యుకెలో కూడా అదే జరగబోతుంది. విద్యుత్‌ రంగం ప్రైవేటీకరణ వల్ల పరిస్థితులు మెరుగుపడతాయని హామీ ఇవ్వలేమని 2009లో ప్రపంచ బ్యాంకు తన సర్వేలో పేర్కొంది.
 

  ప్రశ్న: వ్యవసాయ కనెక్షన్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా డిస్కంను తీసుకురాబోతుంది.? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది.

జ: ప్రైవేటీకరణలో భాగంగానే ప్రత్యేక డిస్కం తీసుకొస్తుంది.వ్యవసాయ కనెక్షన్ల కోసం ఏర్పాటు చేసే డిస్కం ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఇందులో లాభాలు ఉండవు. భవిష్యత్‌లో ఈ డిస్కం పరిధిలోకి పేదల ఇళ్లను కూడా తీసుకొస్తుంది. మిగిలిన డిస్కంలను ప్రైవేట్‌కు అప్పగిస్తారు. దీంతో లాభాలు ప్రైవేట్‌కు, నష్టాలు ప్రభుత్వానికి మిగులుతాయి.

 

ప్రశ్న: అన్ని వినియోగదారులకు ప్రిపెయిడ్‌ మీటర్లను బిగించాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఇది ఆచరణలోకి వస్తే ఎలా ఉంటుంది?
జ : ప్రిపెయిడ్‌ మీటర్ల విధానం విఫలమవుతుంది. ఈ మీటర్లు వల్ల పేద ప్రజలే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. టెలీకాం రంగంలో పేద ప్రజలంతా తమ ఫోన్లకు ప్రిపెయిడ్‌ విధానంలోనే రీచార్జ్‌ చేయించుకుంటున్నారు. ఇది అయిపోయిన తరువాత డబ్బులు ఉంటే వెంటనే రీచార్జ్‌ చేయిస్తారు. లేదంటే కొన్ని రోజుల తరువాత చేయిస్తారు. విద్యుత్‌ రంగంలో పరిస్థితి అలా ఉండదు. విద్యుత్‌ నిరంతరం నిత్యావసరమైన సరుకు. ఒక గంట లేకపోయినా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనీసం ఫోన్‌కు చార్జీంగ్‌ పెట్టాలన్నా విద్యుత్‌ కావాల్సిందే. పంటకు నీరు పెడుతూ సగంలో విద్యుత్‌ నిలిచిపోతే రైతు ఏం చేయాలి. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు. సౌతాఫ్రికాలోని సొవటేతో పాటు వివిధ దేశాల్లో అక్కడి ప్రజలు ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. అప్పుడు ప్రభుత్వమే మరలా ప్రిపెయిడ్‌ విధానాన్ని రద్దు చేస్తుందని నా అభిప్రాయం.
 

 ప్రశ్న: విద్యుత్‌ రంగంలో విదేశీ కంపెనీలు వస్తే వాటి ప్రభావం ఎలా ఉంటుంది ?.

జ : మహారాష్ట్రలో ఎన్‌రాన్‌ కంపెనీ భారీ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ ప్రాజెక్టు విఫలమైంది. కంపెనీకి సంబంధించిన వారు జైలుకు కూడా వెళ్లారు. తరువాత ఈ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడంతో ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోంది. అమెరికాకు చెందిన కంపెనీ ఒడిస్సా విద్యుత్‌ పంపిణీ కంపెనీని తీసుకుని రాత్రికి రాత్రే పారిపోయింది. విదేశాల నుంచి పెట్టుబడులు రావు. దేశంలో ఉన్న అదానీ వంటి బడా కార్పొరేట్లే బ్యాంకులు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిసిటీ నుంచి రుణాలు పేరుతో దోచుకుంటారు. బొగ్గు కొరత పేరుతో ఆదానీకి కేంద్రప్రభుత్వం దోచిపెట్టింది.
 

ప్రశ్న: ఒకే దేశం, ఒకే గ్రిడ్‌, ఒకే ఫ్రీక్వేన్సీ, ఓకే ధర అని కేంద్రప్రభుత్వం చెబుతోందని, ఇది ఆచరణలో ఎలా ఉంటుంది ?

జ : ఇది కేవలం నినాదం వరకే పరిమితమవుతోంది. ఈ విధానం ఆచరణాత్మాకమైంది కాదు. ఇది అమలు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. దేశంలో కొన్ని చోట్ల డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల డిమాండ్‌ తక్కువగా ఉంటుంది. ఫ్రీక్వేన్సీ కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి ఇది అమలులో సాధ్యపడదు.