ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మణిపూర్ అల్లర్లకు కేంద్రం, ఆ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వమే కారణమని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు తెలిపారు. సోమవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి బొప్పన రాజశేఖరరావు, జాయింట్ సెక్రటరీ ఖాజారావు, సభ్యులు జొన్నలగడ్డ శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. బిజెపి అధికారంలో ఉంటే మున్ముందు మణిపూర్ లాంటి ఘటనలు ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుందని తెలిపారు. అత్యంత క్రూరమైన ఘటనలు మణిపూర్లో జరిగాయని, బిజెపి ప్రభుత్వం వాటిని నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. జరిగిన తీరును బట్టి చూస్తే ప్రభుత్వమే దగ్గరుండి ఘర్షణలు రెచ్చగొట్టినట్లు కనిపిస్తోందని తెలిపారు. అక్కడి వీడియోలను చూస్తుంటే హిట్లర్ యూదులను చంపినట్లు ఉందని అన్నారు. మణిపూర్ ఘటనలో దీర్ఘకాలిక కుట్రకోణం దాగుందని పేర్కొన్నారు. మెజారిటీ వర్గమైన మెయితీలను ఎస్‌సి, ఎస్‌టిల్లో చేర్చడానికి బిజెపి మేనిఫెస్టోలో పెట్టిందా? అని ప్రశ్నించారు. 55కు పైగా టెర్రిరిస్టు గ్రూపులు ఉన్న ప్రాంతాల్లో అత్యంత సున్నితమైన నిర్ణయం తీసుకోబోయే సమయంలో ఆయుధ ఎఫ్‌ఎస్‌పిఎ చట్టాన్ని తీసేయడం ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. బలమైన వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వమే మైనార్టీ తెగమీద ఉద్దేశపూర్వక లక్ష్యంతో పనిచేసినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఓట్లకోసం మైనార్టీలను లక్ష్యంగా వాడుకుంటున్నారని తెలిపారు. గోద్రా అల్లర్లు కూడా ఇదే తరహాలో చేశారని, అక్కడ మతాలను విడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారని విమర్శించారు. దేశ ప్రధాని కాశ్మీర్‌ఫైల్స్, కేరళ ఫైల్స్ చూడండని చెప్పడం సరైంది కాదని విమర్శించారు. తెగల మధ్య గొడవని, మతాల మధ్య గొడవగా చూపించడం అత్యంత నీచమని పేర్కొన్నారు. పార్టీలు మతాన్నో, వర్గాన్నో నెత్తినపెట్టుకుని పనిచేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.










