Jun 20,2023 06:46

            పెద్ద నోట్ల రద్దు రాజ్యం చేసిన అతి పెద్ద కుంభకోణమని రూ.500 నోట్ల లెక్కల తకరారుతో మరోసారి రుజువైంది. డీ-మోనిటైజేషన్‌ పేరిట 2016 నవంబర్‌ 8న అప్పటికి చెలామణిలో ఉన్న 500, వెయ్యి నోట్లను మోడీ ప్రభుత్వం రద్దు చేసి పడేసింది. పాత ఐదొందల నోట్ల స్థానే కొత్త ఐదొందల నోట్లను ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టగా అప్పుడు ముద్రించిన కొత్త ఐదొందల నోట్లు భారీగా గల్లంతయ్యాయన్న వార్తలతో యావత్‌ దేశం భయంకరమైన ఆశ్చర్యానికి గురైంది. ఆర్‌టిఐ కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారంలో ఐదొందల నోట్ల మాయం గుట్టు రట్టయింది. ముద్రించిన 1,760 మిలియన్‌ (176 కోట్ల) రూ.500 నోట్లు ఆర్‌బిఐకి చేరలేదు. ఆ నోట్ల విలువ రూ.88 వేల కోట్లు. 2016-17 సంవత్సరంలో బెంగళూరులోని రిజర్వ్‌బ్యాంక్‌ నోట్‌ ముద్రాస్‌ (పి) లిమిటెడ్‌, నాసిక్‌ లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌, మధ్యప్రదేశ్‌లోని దేవస్‌ నోట్‌ ప్రెస్‌లలో కరెన్సీ నోట్లు ముద్రించారు. అప్పుడు ఆ మూడు ప్రెస్‌లలో కలిపి 8,810 మిలియన్‌ నోట్లు ముద్రించగా వాటిలో 7,260 మిలియన్‌ నోట్లు మాత్రమే ఆర్‌బిఐకి చేరాయి. 1,760 మిలియన్‌ నోట్ల జాడ లేదు. ఇంతటి కఠోర వాస్తవం ఆర్‌టిఐ ద్వారా బయల్పడ్డాక కూడా కేంద్ర రిజర్వు బ్యాంకు కానీ, ఆర్థిక మంత్రిత్వశాఖకాని నోరు మెదపట్లేదు.
            కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌కు సమానమైన ద్రవ్యం గాయబ్‌ కావడం మామూలు విషయం కాదు. మన ఆర్థిక వ్యవస్థ సమగ్రతనే ఇది సవాల్‌ చేస్తున్నది. చిన్న చిన్న ఆర్థిక నేరాల విషయాల్లో, ప్రతిపక్షాలను సతాయించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి), ఐ.టి వంటి సంస్థలను రంగంలోకి దింపేందుకు తెగ ఉబలాటపడుతున్న మోడీ ప్రభుత్వంలో రూ.88 వేల కోట్ల విలువైన ఐదొందల నోట్లు కనబడకుండా పోయినా లవలేశ మాత్రం కదలిక లేదంటే ఏమనుకోవాలి? ప్రభుత్వానికి విషయం ఎరుకగానే భావించాలి. ప్రభుత్వ వ్యవస్థల అకౌంట్స్‌ విషయంలో ఏ చిన్న పొరపాటు దొర్లినా చర్యలు తీవ్రంగా ఉంటాయి. అలాంటిది దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఆర్‌బిఐలో, ముద్రించిన, తనకు తిరిగి చేరిన కరెన్సీ నోట్ల మధ్య భారీ వ్యత్యాసంపై నెలకొన్న ఉదాసీనత అనేక అనుమానాలకు తావిస్తున్నది. నిజంగా నిర్లక్ష్యమే అయితే అంతకు మించిన బాధ్యతారాహిత్యం, నేరం మరొకటి ఉండదు. వెల్లువెత్తుతున్న సందేహాల నివృత్తికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ మనుగడకు సెంట్రల్‌ ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఇ.డి.లతో దర్యాప్తు చేయిస్తే అసలు రహస్యం బహిర్గతమవుతుంది. దోషులపై కఠిన శిక్షలు చేపడితే భవిష్యత్తులో ఇటువంటి ఘోరాలు పునరావృతం కాకుండా ఉంటాయి. ప్రజలు కోరుకుంటున్నదిదే.
            డీ-మోనిటైజేషన్‌ అవాంఛిత వ్యవహారంగా ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇటీవల రూ.2 వేల నోట్ల ఉపసంహరణ వేళ పరోక్షంగా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు లక్ష్యం అవినీతి, నల్లధనం, ఉగ్రవాదులకు నిధుల నియంత్రణ కోసమని ప్రధాని మోడీ కొండంత రాగం తీయగా ఆచరణలో అవేమీ అదుపులోకి రాలేదు. నాలుగైదు లక్షల కోట్ల నల్లధనం బయటపడుతుందనగా చెలామణిలో ఉన్న పెద్ద నోట్ల కంటే ఎక్కువ డబ్బు బ్యాంకులకు చేరి వైట్‌ అయింది. సంపన్నులు, కార్పొరేట్లు ఎంచక్కా తమ వద్ద ఉన్న బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకున్నారు. తాజాగా ముద్రించిన ఐదొందల నోట్లలో కోట్లాది నోట్లు ఆర్‌బిఐకి చేరకపోవడం అటువంటిదే. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే, నిరసించే వారిపై మోడీ ప్రభుత్వం రాజద్రోహం, ఉపా ఇత్యాది కేసులను అక్రమంగా బనాయిస్తోంది. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే, విచ్ఛిన్నం కావించే నోట్ల రద్దు, దాని వినాశకర పరిణామాలకు బాధ్యులైన వారిపై ఏ తరహా కేసులు పెట్టాలో మోడీ ప్రభుత్వమే చెప్పాలి. నోట్ల రద్దు వలన సామాన్యులు, పేదలు, కార్మికులు నానా అవస్థలూ పడ్డారు. ఇప్పటికీ వారి జీవనోపాధులు మెరుగుపడలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. నోట్ల రద్దును కొందరు స్కాంలకు ఉపయోగపెట్టుకుంటున్నారని రూ.500 నోట్ల గల్లంతుతో మరోసారి తేటతెల్లమైంది. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల విలువైన స్టాంపులు ఆచూకీ తెలియకుండా పోయాయి. ఇప్పటికీ చర్యల్లేవు. ఇప్పటి రూ.500 నోట్ల గల్లంతుపై సైతం అలానే వ్యవహరిస్తే ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే పెనుముప్పునకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి దోషులను బోనులో నిలబెట్టాలి.