మృగరాజు గుహలో బల్లి ఒకటి తన సంతతితో నివసిస్తుండేది. సింహం తీరికగా ఉన్నప్పుడు ఆ బల్లి సింహంతో మాట కలుపుతుండేది. సింహం కూడా కాలక్షేపం చేసేది బల్లితో.
'మృగరాజా! మీ దగ్గర జంతువులన్నీ భయభక్తులతో మెలుగుతున్నాయి. రాజసమంటే మీదే' అంటూ అప్పుడప్పుడు పొగడ్తలందుకొనేది బల్లి. సింహం ఆ మాటలకు నవ్వి ఊరుకునేది.
ఓ రోజు 'మృగరాజా! గుహ పక్కనే ఉన్న చెరువులో ఉన్న కప్పలు మాత్రం మీరంటే భయభక్తులు చూపించడం లేదు ఎందుకు?' అని అడిగింది బల్లి.
'ఎప్పుడూ ఆ కప్పలు నా ఎదుట పడలేదు. నా ఛాయలకు రానేలేదు. నాపై భయభక్తులు చూపలేదని నువ్వెలా చెప్పగలుగుతున్నావు?' అడిగింది సింహం.
'కప్పది అదోరకమైన గర్వం. మనలా నేల మీద తిరుగుతూ, నీటిలోనే ఉండిపోతుంది గదా! గత సంవత్సరం వర్షాకాలం గుర్తు తెచ్చుకోండి. బెకబెక అరుపులతో మీకు నిద్రాభంగం చేసిన విషయం నాకు గుర్తుంది' అంటూ సాగదీతగా మాట్లాడింది బల్లి.
వర్షం వెలిసిపోయిన రాత్రి వాటి అరుపులు సింహానికి గుర్తుకు వచ్చాయి. అప్పుడు అవునని తలూపింది సింహం.
'భయభక్తులున్న జంతువులన్నీ మీకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మసలుకుంటాయి. కప్పలు మాత్రం మీకు కనీస గౌరవం ఇవ్వకుండా వాటి ఆనందం కోసం మీకు నిద్రలేని రాత్రులు మిగల్చడం విచారించ దగ్గ విషయం' అని ఈసారి కప్పను ఆడిపోసుకుంది బల్లి.
'ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన' అని ఊరుకుంది సింహం.
'వస్తున్నది వర్షాకాలం. ఈ ఏడు కూడా మీ నిద్రాభంగాన్ని నేను చూడలేను. ప్రభువుగా మీరు ఇబ్బందిపడితే నేను తట్టుకోనులేను. అది నా బలహీనత అనుకుంటారో, ప్రభుభక్తి అనుకుంటారో మీ ఇష్టం' అంది బల్లి.
'ప్రభుభక్తి చాటుకొనే నీలాంటి వాళ్ళు నాకు తోడుగా ఉండడం గర్వించదగ్గ విషయమే. ఆ కప్పల పని పట్టమని మంత్రి నక్కను ఆదేశిస్తా' అంది సింహం.
బల్లి కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది.
నక్క పాలనా వ్యవహారాలు మాట్లాడేందుకు మృగరాజు దగ్గరకు వచ్చింది. వెంటనే కప్పల నిర్మూలన విషయం చెప్పింది సింహం.
సింహం ఆదేశానుసారం పాములను ఉపయోగించి, కప్పల నిర్మూలనకు చర్యలు తీసుకుంది నక్క.
వర్షకాలం వచ్చింది.. వర్షాలు కురుస్తున్నాయి. గుహ పక్కనున్న చెరువు నిండుతుంది. కానీ అక్కడ నుండి కప్పల బెకబెకల హోరు వినిపించడం లేదు. దోమల బెడద ఎక్కువై, మృగరాజుకి నిద్రలేదు. కొద్దిరోజులకు రాజుకు అనారోగ్యం చేసింది. నక్క ద్వారా ఎలుగు వైద్యుడుకి కబురు పంపింది. వైద్య పరీక్షలు చేసిన ఎలుగు వైద్యుడు దోమకాటు వలన వచ్చిన జబ్బుగా నిర్ధారించింది.
'నిజమే కావచ్చు!' అని నిట్టూర్చింది సింహం.
'గత సంవత్సరం కప్పలతో అప్పుడప్పుడు ఇబ్బంది కలిగినా ఈ సంవత్సరం కప్పలను నిర్మూలించాక దోమల బెడద ఎక్కువగా ఉంది' అంటూ వాపోయింది నక్క.
'కప్పల నిర్మూలనా?' అంటూ నోరెళ్లబెట్టింది ఎలుగు వైద్యుడు.
'మృగరాజు ఆదేశానుసారం కప్పలను నిర్మూలించాం!' నిజాన్ని చెప్పింది నక్క.
'దాని ఫలితమే ఈ దోమల విజృంభణ మృగరాజా! ఎందుకు కప్పల నిర్మూలనకు ఆదేశించారు?' అడిగింది ఎలుగు వైద్యుడు.
'గత వర్షాకాలంలో అప్పుడప్పుడు కప్పల వలన జరిగిన అసౌకర్యం బల్లి గుర్తు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నా' మూలుగుతూ చెప్పింది సింహం.
'ఇది బల్లి చేసిన లొల్లా? ఇబ్బడిముబ్బడిగా ఆహారం తమ నోటి దగ్గరకు తెచ్చుకోవడానికి పన్నిన పన్నాగంలా ఉంది. దోమలు నీరు నిల్వ వున్న ప్రాంతాల్లో గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు సూర్యరశ్మికి పిల్లలుగా మారకముందే ఈ కప్పలు ఆహారంగా తీసుకుంటాయి. అందువలన దోమల సంతతి వృద్ధి చెందకుండా కప్పలు సహకరిస్తుంటాయి. కప్పల బాధ తొలగించుకోవడానికి బల్లి వేసిన ఎత్తు' అని వివరించింది ఎలుగు వైద్యుడు.
ఇదంతా వింటున్న బల్లి 'వచ్చిన దోమలను వచ్చినట్టుగా మా సంతతి తింటున్నాయి. మృగరాజుకి ఈ విధంగా సాయం చేస్తున్నాంగా?!' అంటూ బుకాయించింది బల్లి.
ఎలుగు వైద్యుడు మృగరాజుకి వైద్యం చేస్తూ 'మృగరాజా అన్ని జీవుల అవసరం. అందరికీ అవసరం!' అంది.
'నిజమే ఎలుగు మిత్రమా! కాలక్షేపం మాటలు కార్యాచరణకు నోచుకుంటే ఇలాంటి అనర్థాలే మిగులుతాయని ఇప్పుడు తెలిసొచ్చింది' అంది సింహం.
- బి.వి. పట్నాయక్
83098 72913