Nov 13,2023 17:57

ఒక ఊరిలో చింటూ అనే రైతుబిడ్డ ఉండేవాడు. అతను తన పొలంలో పండించే కూరగాయలను పట్నం తీసుకొనివెళ్లి అమ్మేవాడు. అలా రోజూ పట్నం వెళ్ళి వచ్చే క్రమంలో అతనికి చాలా ప్లాస్టిక్‌ కప్పులు, బాటిల్స్‌, బాగ్స్‌ అన్నీ కూడా రోడ్డుపైన చెత్తచెదారంలో పడి కనిపించేవి.
అది చూసి చింటూ అరె! ఇంత ప్లాస్టిక్‌ వాడడం వల్ల మనుషులు పీల్చుకునే గాలి కలుషితం అవటమే కాక జంతువులు వీటిని తినడం వల్ల వాటి ప్రాణం మొత్తం పాడవు తుంది కదా! ఈ పట్నం మనుషులకు అసలు బుద్ధి ఉందా! ఇంత ప్లాస్టిక్‌ని పోగేస్తున్నారు. అని అనుకుంటున్నాడు. ఆరోజు యధావిధిగా చింటూ ఇంటికెళ్ళి సాయంత్రం భోజనం అయ్యాక నిద్రపోయాడు. అప్పుడు ఆ ప్లాస్టిక్‌ అంతా కూడా అతనికి కలలో కనబడి ఒక భూతంలా తనపైకి ఆక్రమించినట్లుగా అనిపిస్తోంది. దాంతో చింటూకి నిద్రనుండి ఒక్కసారిగా మెలకువ వచ్చింది.
ఆరోజు రాత్రి చింటూ ప్లాస్టిక్‌ గురించి తీవ్రంగా ఆలోచించి దానిని ఎలా అయినా నిర్మూలించాలి అని అనుకుంటాడు. అప్పుడు అతను పట్నం వెళ్ళే క్రమంలో అతన్ని ఒక బోర్డు ఆకర్షిస్తుంది. దానిలో ప్లాస్టిక్‌ని రీసైకిల్‌ చేసి కుర్చీలు, బల్లలు తయారు చేయండి అని రాసుంటుంది. అది చూసిన చింటూ వెంటనే వెళ్ళి వాళ్ళని ఇది నిజమేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ సంస్థ యజమాని 'అవునండీ మీరు చూసింది నిజమే. మేమూ ఈ సంస్థలో ప్లాస్టిక్‌తో బల్లలు, కుర్చీలు, ఇతర వస్తువులు తయారు చేయటం నేర్పిస్తాము. దీనివల్ల మీకూ పని, ఆదాయం లభిస్తుంది.' అని అంటాడు.
అప్పుడు చింటూ ఆ ఊరిలో ఉన్న ప్లాస్టిక్‌ మొత్తాన్ని తన పొలం దగ్గర చేరుస్తాడు. అది చూసిన గ్రామం పెద్ద 'చింటూ నీకేమైనా పిచ్చా! ఇంత ప్లాస్టిక్‌ని ఒకే దగ్గర చేర్చి ఊరు మొత్తాన్ని కలుషితం చేద్దాం అనుకుంటున్నావా!' అని అడుగుతాడు. మిగతావాళ్ళుకూడా చింటూని ఎగతాళి చేస్తారు.
కానీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే చింటూ ఆ ప్లాస్టిక్‌తో వివిధ వస్తువులు తయారు చేయిస్తాడో అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. మెచ్చుకుంటారు. సన్మానిస్తారు. ఆ విధంగా చింటూ తన తెలివితో ప్లాస్టిక్‌ భూతాన్ని తన ఊరినుండి తరిమి కొడతాడు.
'మనం కూడా మన ఊరిలోనుండి ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొడదాం.'


ఎం. శాస్త్ర
6వ తరగతి విజరు హైస్కూల్‌,
నిజామాబాద్‌, తెలంగాణ