- మళ్లీ వడ్డీ రేట్లు పెంపు
- నాణేల జారీకి మిషన్లు
- ఆర్‌బిఐ ఎంపిసి నిర్ణయం
ముంబయి : రుణ చెల్లింపు వాయిదాలు మరింత భారం కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపోరేటును మరో పావు శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతంగా నిర్ణయించింది. దీంతో గతేడాది మే నుంచి ఇప్పటి వరకు 250 బేసిస్ పాయింట్లు లేదా 2.50 శాతం పెంచినట్లయ్యింది. దీంతో ఇప్పటికే గృహ, వాహన, వ్యక్తిగత అప్పులు తీసుకున్న వారు, కొత్తగా తీసుకోబోయే వారిపై భారం పడనుంది. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన ఆర్‌బిఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) విధాన సమీక్ష బుధవారం ముగిసింది. ఈ భేటీ వివరాలను శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు.. ఆ అంశాలు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అయినా రిటైల్ ఇ-రూపీ ప్రయోగాలను మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ ప్రక్రియలో మరిన్ని బ్యాంకులకు భాగస్వామ్యం కల్పించనున్నామని శక్తికాంత దాస్ తెలిపారు. ఇ-రూపి సేవలను మరో 5 బ్యాంకులు, 9 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. టోకు అవసరాలకు సంబంధించిన ఇ-రూపీ ప్రయోగాలను గతేడాది నవంబర్ 1న, రిటైల్ అవసరాలకు సంబంధించిన ఇ-రూపీని డిసెంబర్ 1న ఆర్‌బిఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ ఇ-రూపీని ప్రయోగాత్మకంగా 50 వేలమంది వినియోగదారులు, 5 వేల మంది వ్యాపారులు వినియోగిస్తున్నారని ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ టి రవి శంకర్ తెలిపారు. ఇ-రూపీ కరెన్సీ వినియోగంలో ఎలాంటి అవరోధాలూ తలెత్తకూడదన్న ఉద్దేశంతో నెమ్మదిగా ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించామన్నారు. గౌతం అదానీపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌పై శక్తికాంత దాస్ స్పందించారు. వ్యక్తిగత సంఘటన లేదా ఓ కేసు ద్వారా బ్యాంకులు ప్రభావితం అయ్యే అవకాశం లేదన్నారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందని, మరింత బలోపేతం చేసుకునేందుకే చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు ద్రవ్యపరపతి విధానాన్ని సవాలుగా మార్చేశాయని శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ అప్రమత్తంగానే ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లో ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉండొచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి పెరుగుదల 6.5 శాతానికి మందగించవచ్చన్నారు. వచ్చే 2023-24లో ఇది 6.4 శాతానికి తగ్గొచ్చన్నారు. 2021-22లో 8.7 శాతం వృద్థి నమోదయిన విషయం తెలిసిందే.
నాణేల జారీకి ప్రత్యేక కాయిన్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తేనున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టుగా దేశంలోని 12 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. క్యూఆర్ కోడ్ ఆధారంగా నాణేలను పొందవచ్చని పేర్కొంది. నాణేల లభ్యతను పెంచడమే లక్ష్యమని శక్తికాంత దాస్ తెలిపారు.










