
ఇంటర్నెట్ యుగం ఎంత వేగంగా నడుస్తుందో అంతే వేగంగా ప్రపంచంలో ఎక్కడ నుండో ఏ దేశంలో సొమ్మునైనా నేరుగా కాజేసే టెక్నాలజీ పెరిగిపోయింది. మాట్లాడుతూ ఉండగానే బ్యాంకు అకౌంట్లో డబ్బులు లాగేసే సమర్థులు నేటి సైబర్ ప్రపంచంలో కోకొల్లలు.. వెబ్ యుఆర్‌ఎల్ నుండి సాధారణ మెసేజ్ వరకూ ఏ పద్ధతిలో కావాలంటే ఆ పద్ధతిలో కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. వినిమయ సంస్కృతిని పెంచిపోషించడం.. వాటికోసం అప్పులివ్వడం.. సాధారణమైపోయింది. దానికి మొబైల్ యాప్‌లో మీ వివరాలు నమోదు చేసుకోవడమే. ఇదంతా వినడానికి.. అప్పు తీసుకోవడానికి.. బాగానే అనిపిస్తుంది. కానీ అప్పు దొరకడం ఎంత సులువో, తీర్చడం అంత నరకం. ఆ తర్వాతే అసలు కథ నడిచేది.. డబ్బులు చెల్లించకపోతే అదే సెల్‌ఫోన్ వారి ప్రాణాల్నీ హరిస్తోంది. దీనిమీదే ఈ ప్రత్యేక కథనం.
తెలియక జరిగే తప్పు ఒకటయితే, తెలిసి సైబర్ నేరగాళ్ల బారినపడేవారే ఎక్కువమంది. డబ్బులు పోగొట్టుకుని, సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడడం.. ఆత్మహత్యలకు పురిగొల్పడం.. సమాజంలో తీవ్ర అవమానాల పాలుచేయడం.. లోను తీసుకున్నవారి కాంటాక్టు నెంబర్లను సేకరించి.. మహిళలైతే వ్యభిచారులనీ, పురుషులైతే భార్యతో, చెల్లితో వ్యభిచారం చేయిస్తారని, బాలికలను అత్యాచారం చేశారనీ.. అతనికి దూరంగా ఉండాలనీ.. అందరికీ మెసేజ్‌లు పంపించడం. ఇలా అనేకవిధాల తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. వారి ఒత్తిడి ఎంత తీవ్రస్థాయిలో ఉందంటే పోలీసు సిబ్బందీ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కుటుంబంలో ఎవరైనా విద్యార్థినులు, యువతులు ఉంటే తలెత్తుకోలేని పరిస్థితి. చివరకు ఆత్మహత్యే పరిష్కారమనుకుంటున్నారు. ఇలాంటివాటిల్లో ఫిషింగ్ ఎటాక్, వెబ్‌సైట్ స్ఫూఫింగ్, రాన్‌సమ్‌వేర్, మాల్వేర్, ఐఓటి హ్యాకింగ్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. నేరాలన్నీ ఈ ఐదు రూపాల్లోనే.. వేర్వేరు పద్ధతులను అనుసరిస్తుంటారు. విచిత్రం ఏమిటంటే అభివృద్ధి చెందిన అమెరికాలో 59 శాతం కేసులు సైబర్ క్రైం మీదే ఉన్నాయి.
సెలామీ ఎటాక్ అంటే..

పెద్దపెద్ద నేరాలే కాదు.. చిన్న మొత్తాల్లో దోచేయడమూ ఇటీవల పెరిగింది. దీన్నే 'సెలామీ ఎటాక్' అంటారు. సహజంగా వెబ్ లింక్ పంపో, ఒటిపి చెప్పమనో అడిగి, డబ్బులు కాజేయడం ఒకటయితే.. ఆన్‌లైన్ లావాదేవీలు నడిపే వారి వివరాలు సేకరించి, నెలకు ఐదో, పదో కాజేయడం ఇంకోటి. కొన్ని లక్షల అకౌంట్ల నుండి నెలకు ఐదు రూపాయలు లాగేసినా వందల కోట్ల రూపాయలకు చేరుతుంది. ఇది ఎవరికీ అనుమానం రాని పద్ధతి. యూజర్లు, బ్యాంక్ అకౌంట్లున్నవారు తనిఖీ చేసుకోవాలి. ఐదు రూపాయలేగా అని పట్టించుకోకపోవడం దొంగలకు ఓ సదావకాశం. సుమారు రెండు లక్షల అకౌంట్ల నుండి ఐదు రూపాయలు తీసేస్తే రూ.10 లక్షలు, పది రూపాయలైతే.. రూ.20 లక్షలు. ఒక్క క్లిక్‌తో కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది.
సైబర్ క్రైమ్స్.. రకాలు..

ఇంటర్నెట్ ఆధారంగా జరిగే నేరం. ఈ పదం ఇటీవల ఎక్కువ వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికలు పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్ల పని సులువవుతోంది. వెబ్‌సైట్స్ హ్యాక్ చేయడం, ఫేక్ ఐడిలు, మొబైల్‌లో ఉండే వివరాలు సేకరించడం, మన మొబైల్ నుండే షాపింగ్ చేయడం వంటివన్నీ సైబర్ క్రైం కిందకే వస్తాయి. ప్రజలను దోచుకునేందుకు నేరగాళ్లు 21 రకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. అనధికారికంగా వేరే కంప్యూటర్లలోకి జొరబడటం అంటే హ్యాక్ చేయడమే.. ఐపి వ్యవస్థను ధ్వంసం చేయడమనీ అంటారు. దీనిద్వారా సమాచారాన్ని దొంగిలించి, డబ్బు గుంజడం. ఆన్‌లైన్ లావాదేవీలు జరిపే క్రమంలో క్రెడిట్‌కార్డు, ఇతర వివరాలు సేకరించి, మోసం చేయడం మరో పద్ధతి. ఇది ఒకరకంగా తెలిసి మోసపోవడం కిందకే వస్తుంది. ఈ పద్ధతిలో వినియోగదారుడే నేరుగా వివరాలు చెబుతుండటం.. పోలీసులూ ఏమీచేయలేని పరిస్థితి. వివరాలు వెల్లడించొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినకపోవడం ఒకభాగమైతే.. మోసగాళ్లూ అనేక కొత్త పద్ధతుల్ని వినియోగిస్తున్నారు. ఇలాంటి మోసాలకు ఎక్కువగా క్రెడిట్‌కార్డు వినియోగదారులు గురవుతున్నారని తేలింది. వాస్తవంగా సైబర్ నేరాలు మెట్రో నగరాల్లో ఎక్కువని అనేక నివేదికలు వెల్లడించాయి. వాస్తవంగా గ్రామాల్లో సైబర్ నేరాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ విషయాన్ని నేషనల్ క్రైం రికార్డు బ్యూరోనే వెల్లడించిన వాస్తవం.
మెసేజ్‌లు.. మోసాలు..

ఇక రెండో పద్ధతిలో సెక్యూరిటీ అలర్ట్ పేరుతో ఫోన్లకు మెసేజ్‌లు నిత్యం వస్తుంటాయి. 'మీ ఫోన్ నిండిపోయిందని, క్లీన్ చేయండని, వైరస్ వచ్చిందని, వెంటనే అలర్ట్ అయి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండని!' మెసేజ్‌లు వస్తూంటాయి. అలాగే 'మీ ఫోన్ స్లో అయిపోయింది వెంటనే క్లీన్ చేయండి!' అని మరో మెసేజ్. ఇవన్నీ నేరుగా ఫోన్ అడుగుతుందనుకుంటాం. అంతో ఇంతో అవగాహన ఉన్నవాళ్లు వాటిని వదిలేస్తారు. అప్పుడప్పుడే సెల్‌ఫోన్ వినియోగిస్తున్నవారు వాటిని ఓపెన్ చేస్తుంటారు. దాంతోపాటు మరోయాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో సెల్‌ఫోన్లోకి వచ్చేస్తుంది. అది గమనించక యాక్సెస్ ఇచ్చేస్తూపోతారు. అంతే నిమిషాల్లో వారి ఖాతాల్లో డబ్బు గుటకాయ స్వాహా. ఇదే పద్ధతిలో వెబ్ లింకులూ, ఈ మెయిల్స్ వస్తుంటాయి. కొన్ని మెయిల్స్ ఓపెన్ చేసినా ఫోన్ హ్యాక్ అవుతుంది. అధునాతనంగా సైబర్ నేరగాళ్లు వాట్సాప్ మెసేజ్‌లనూ లింకుగా వాడుకుంటున్నారు. సైబర్ నిపుణులు ఇటీవలే ఈ విషయాన్ని గుర్తించారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ఇలాంటివి సహజంగా పుకార్లతో కూడిన మెసేజ్‌లే ఉంటాయి. 'బొమ్మ పాలు తాగింది.. పది తలల పాము.. ప్రమాదంలో 100 మంది చనిపోయారు..' అని వార్తలు క్రియేట్ చేసి, 'దాని సమాచారం కోసం క్లిక్ చేయండి!' అని మరో లింకు పంపిస్తారు. ఇదొక తరహా ఎమోషన్ హ్యాకింగ్. వీటిని వాట్సాప్‌ల ద్వారా షేర్ చేస్తుంటారు. మనం వెంటనే నొక్కి చూస్తాం. అంతే ఖాతా ఖాళీ.
సైబర్ సోషల్ ఇంజనీరింగ్..
మీకు లాటరీ వచ్చిందనేది మరొక పద్ధతి. ఇటీవల ఈ తరహా నేరాలు పట్టణ ప్రాంతాల్లో తగ్గాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో అక్కడ పెరిగాయి. కీలకమైన మోసం తప్పుడు యుఆర్‌ఎల్ తయారుచేసి, వాటి ద్వారా వివరాలు సేకరించడం. కొద్దికాలం క్రితం టిటిడి ఆన్‌లైన్ వెబ్‌సైట్ పేరుతో మరొక వెబ్‌సైట్ తయారుచేశారు. ఎక్కువ మంది అదే నిజమైందనుకొని, దర్శన టిక్కెట్ల కోసం, ప్రసాదాల కోసం ఆ వెబ్‌సైట్లో డబ్బు జమ చేశారు. తీరా చూస్తే అది పచ్చిమోసమని తేలింది. దీనిపై టిటిడి ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఇక క్రెడిట్‌కార్డు విషయానికొస్తే.. ఎక్కువమంది వాటిని షాపింగ్‌మాల్స్‌లో వినియోగిస్తుంటారు. అక్కడ వారి వివరాలు తీసుకోవడం.. వెంటనే వినియోగదారుకు ఫోన్ చేసి, 'మీ కార్డుకు ఆఫర్ వచ్చింది, 50 శాతం రాయితీ వస్తుంది. దానికి అప్లయి చేస్తాము, మీకు వచ్చిన ఓటిపి చెప్పండి!' అని అడగ్గానే.. వెనకాముందు ఆలోచించకుండా చెప్పేస్తారు. దీంతో సైబర్ నేరగాళ్లు కార్డులో డబ్బంతా సెకన్లలో లాగేస్తారు. క్రెడిట్‌కార్డులో అయితే కచ్చితంగా డబ్బు ఉంటుండటంతో నేరగాళ్లు దీన్ని తేలిక మార్గంగా ఎంచుకున్నారు. చాలాచోట్ల వినియోగదారులు వారి వివరాలు ఇస్తూంటారు. అలాగే ఆన్‌లైన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కోసం ఆధార్, పాన్‌కార్డులు వినియోగిస్తూం టారు. వాటి వివరాలను చోరీ చేసి, ఒక్క క్లిక్‌తో డబ్బును లాగేస్తారు. దీన్నే సైబర్ క్రైంలో సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు.
స్టాకింగ్.. హాకింగ్..

ఇక సైబర్ స్టాకింగ్‌లో పోర్నోగ్రఫీ కేటుగాళ్లకో పెద్ద ఆయుధం. దాదాపు స్మార్ట్‌ఫోన్ ఉన్నవారిలో ఎక్కువమంది పోర్నోగ్రఫీ చూస్తున్నారనేది ఇటీవల ఇంటర్నెట్‌పై సర్వే చేసిన ఓ జర్నల్ ఇచ్చిన నివేదిక. దీంతో పొర్నోగ్రఫీని నేరుగా హ్యాకింగ్ కోసం వాడుతున్నారు. ప్రతి ఐపిని ట్రాక్ చేయడం ద్వారా వారు ఏం చూస్తున్నారు, ఎంతసేపు నెట్‌ను వినియోగిస్తున్నారనే అంశాలు డేటా ఎనలటిక్స్ ద్వారా క్షణాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నారు. మనల్ని ట్రాక్ చేస్తున్నారని గుర్తించడానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇంటర్నెట్‌లోగానీ, యూట్యూబ్‌లోగానీ ఒక అంశాన్ని వెతికితే.. కొద్దిసేపటికే దాని అనుబంధ వివరాలు, వీడియోలు దర్శనమిస్తూంటాయి. మనం వెతికాం గనుక అవి కనడ్డాయని భ్రమపడతాం. కానీ వాస్తవం మీరు బ్రౌజర్లో వెతికే పదాన్ని ఎంటర్ చేయగానే మీ ఐపి (ఇంటర్నెట్ ప్రొటోకాల్) నెంబరు మీరు ఏం కోరుకుంటున్నారో నిర్ణయించేస్తుంది. దాని అనుబంధ సమాచారం మీ ఐపిలోకి కుప్పలుతెప్పలు వచ్చేస్తూంటుంది. ప్రతి యూజర్ దీన్ని తేలికగా గుర్తించొచ్చు. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనేదే ఎవరూ ఆలోచించరు.. ఇక్కడే అన్ని మోసాలకు బీజం పడుతోంది. దీన్నే 'స్టాకింగ్' అంటారు. ఒక్కసారి స్టాకింగ్ మొదలైందంటే.. ఆ వ్యక్తి ఇంటర్నెట్లో ఏమి చూస్తున్నాడు.. ఏం చేస్తున్నాడు అనేది నిరంతరం ట్రాక్ చేస్తూంటారు. మీ ప్రతి అడుగూ సైబర్ నేరగాడి కనుసన్నల్లోనే ఉంటుంది. హోటల్‌కు వెళ్లాడా, షాపింగ్‌కు వెళ్లాడా.. ప్రతిదీ ట్రాక్ చేస్తూంటారు. అంటే వ్యక్తి నేరుగా పక్కనే ఉండడు. అతను వాడే ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ ద్వారానే నిరంతరం వెంబడిస్తూంటాడు. వివరాలు సేకరించి, ఆన్‌లైన్ పద్ధతిలోనో, వీడియో రూపంలోనో ఎర వేసి, ట్రాప్ చేస్తారు. చిక్కితే సర్వం దోచేస్తారు.
హానీ పాట్స్..
ఇక హానీ పాట్స్ విషయానికొస్తే ఇదొక తరహా పొర్నో పద్ధతే. దీన్ని ఇంతకముందే చెప్పినట్లు ఒక వ్యక్తిని స్టాకింగ్ చేయడం మొదలుపెట్టాక వారికి వీడియోకాల్స్ వస్తుంటాయి. అర్ధనగంగా, నగంగా వీడియోలు మాట్లాడుతూ.. అవతలి వ్యక్తినీ అదే పద్ధతిలోకి రావాలని రెచ్చగొడతారు. దీంతో అవతలివారు లొంగిపోగానే ట్రాప్ చేస్తారు. వీడియో కొనసాగాలంటే డబ్బు జమ చేయాలని కోరతారు. బ్యాంకు అకౌంటు వివరాలూ సేకరిస్తారు. ఫలానాచోటకు రావాలని ఆహ్వానిస్తారు. పొర్నోగ్రఫీకి అలవాటుచేసిన తరువాత సదరు వ్యక్తిని నెమ్మదిగా వాళ్ల గుప్పిట్లో పెట్టుకుంటారు. కానీ వాళ్లు నేరుగా కనిపించరు, కలవరు. ఇక అక్కడ నుండి బ్లాక్‌మెయిల్ మొదలవుతుంది. ఇదొక తరహా నేరం. ఇటీవల దేశ రక్షణకు సంబంధించిన వివరాలను ఇదే పద్ధతిలో సేకరించినట్లు కేంద్రం గుర్తించింది. ఈ పద్ధతిని అనుసరించే వారిని 'హనీ ట్రాప్స్' అంటారు. ఇదో రకమైన సైబర్ నేరమే. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అందమైన అమ్మాయి ఫోటో పంపించి, ట్రాప్ చేస్తారు. వాస్తవంగా అంత అందమైన అమ్మాయి. ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కానీ వాళ్లే తయారుచేస్తారు. కళ్లు, ముక్కు, గడ్డం, జుట్టు ఇవన్నీ కూడా వేర్వేరుచోట్ల నుండి సేకరించి, అందంగా తయారుచేస్తారు.
మెయిల్ స్పూఫింగ్..
ఇవి కాకుండా మెయిల్స్‌ను పంపడాన్నీ పలు రకాలుగా విభజించారు. ఈ మెయిల్ స్పూఫింగ్ (మక్కీకి మక్కీ వెబ్‌సైట్), స్పామింగ్ బాంబింగ్, ఐఆర్‌సి (ఇంటర్నెట్ రిలే ఛాట్) పద్ధతుల్లో నేరగాళ్లు తమ ప్రతాపం చూపిస్తారు. అంటే ఒకేసారి కొన్ని లక్షల మందికి మెసేజ్ పంపిస్తూంటారు. 'మీకు ఉద్యోగం వచ్చింది. లాటరీ వచ్చింది. మీరు ప్రధాన సంక్షేమ పథకానికి ఎంపికయ్యారు. మీకు కంపోజ్ చేయడం వచ్చా? వస్తే నెలకు రూ.70 వేల వేతనం, వెంటనే లింకులో వివరాలు ఎంటర్ చేయండి!' అనే రూపాల్లో ఆ మెసేజ్‌లు ఉంటాయి. ఒక్కసారి వివరాల కోసం లింకు క్లిక్ చేస్తే మధ్యలో ఆగిపోతోంది. మన డబ్బులు వాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతాయి.
ఆన్‌లైన్ ఫోర్జరీ..

ఇంటర్నెట్ ఆధారంగా జరిగే లావాదేవీలకు సంబంధించి రికార్డులను ఆన్‌లైన్ పద్ధతుల్లో ముఖ్యంగా సంతకాలు, ఫొటోలు, పోస్టల్ అడ్రస్‌లు సేకరించి.. వాటితో మోసం చేయడం. దీన్ని 'ఆన్‌లైన్ ఫోర్జరీ' అని పిలుస్తున్నారు. సరైన గుర్తింపు లేని, నిర్ధారణ లేని వస్తువులను ఆన్‌లైన్ పద్ధతిలో వేలం వేసి, వాటిని అమ్మడం. అది నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు కట్టేయడం ఇప్పుడు కొత్తగా వస్తున్న పద్ధతి. ఈ పద్ధతిలో సైబర్ నేరగాడు నేరుగా వినియోగదారు లనూ భాగస్వాముల్ని చేస్తున్నాడు. తొలుత తక్కువ మొత్తం కట్టించుకుని, మంచి వస్తువు పంపించడం అలవాటు చేస్తారు. తర్వాత భారీ మొత్తంలో చెల్లించాక, వివరాలన్నీ మాయం. ఎవరికి పంపించారో, ఎక్కడికి డబ్బు వెళ్లాయో తెలియదు.. లబోదిబోమనాల్సిందే!
గ్యాంబ్లింగ్..
ఇక గ్యాంబ్లింగ్ తెలిసిందే. 'నేను పేకాటాడి వేల రూపాయలు సంపాదించాను. మీరూ చేరండి వేలకు వేలు సంపాదించండి!' అనే ప్రచారం. దాంతో ఆన్‌లైన్ పేకాట గ్రూపుల్లో చేరి, లక్షల రూపాయలు పోగొట్టుకున్నవారు కోట్లలోనే ఉంటారు. గేమ్ ఆడే సమయంలో 'మీకు ఆఫర్ వచ్చింది. ఫలానాది గెలుచుకున్నారు' అని రాగానే మనసులో డిజె సౌండ్లు. ఓపెన్ చేశారో.. నిమిషాల్లో చావుమేళం వినిపిస్తుంది. ఇలాంటి పద్ధతులనే 'ఫిషింగ్ ఎటాక్' అంటారు.
ఫోన్లలో, కంప్యూటర్లను హ్యాక్ చేయడం కోసం హ్యాకింగ్‌తో పాటు మాల్ వేర్. త్రోజన్‌హార్స్‌్ వైరస్, రాన్‌సమ్ వేర్, కీలాగర్ ఇవన్నీ మాల్‌వేర్ కిందకు వస్తాయి. దీంతోపాటు సాఫ్ట్‌వేర్ పైరసీ ద్వారా వివరాలు సేకరించడం. అంటే నకిలీ సాఫ్ట్‌వేర్లో హ్యాకింగ్‌కు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ముందుగానే అందులో చేరుస్తారు. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోగానే కంప్యూటర్ / ఫోన్ వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందులో చేర్చిన వివరాలన్నీ క్షణాల్లో సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.
యాడ్స్‌తో బోల్తా..

ఆన్‌లైన్ పద్ధతిలో డబ్బు జమ చేయగానే.. 'మీరు జమ చేసింది ఇంతేనా?' అనే మేసేజ్ వస్తుంది. నిర్ధారణకు క్లిక్ చేయమని చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా క్లిక్ చేస్తాం. అంతే ఖాతాలో డబ్బు మాయం. దీంతోపాటు యాడ్ క్లిప్పింగ్స్, నిరంతరం యాడ్స్ పంపిస్తూంటారు. తమ వద్ద ప్రొడక్ట్ ఉందనీ, వెంటనే మీ వివరాలు నమోదు చేసుకుంటే తక్కువ ధరకే పంపిస్తామని చెబుతారు. దీనిలోనూ సైబర్ నేరగాళ్లు సోషల్ ఇంజనీరింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. పెద్ద పెద్ద గ్రూపులకు ఫోన్లు చేసి 'ఫలానా పెద్ద కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నాను. మీరు ఎంపికయ్యారు!' అనగానే.. పెద్ద కంపెనీ పేరు విని, ఆవేశపడి వివరాలిచ్చి మోసపోతున్నారు. ఇలా వివరాలన్నీ సేకరించడం కోసమే అనేక కంపెనీలు 24 గంటలూ పనిచేస్తూంటాయి. సైబర్ నేరాల్లో 80 శాతం వ్యక్తిగత వివరాలను సేకరించడం ద్వారానే జరుగుతున్నాయి.
అవగాహన అతిముఖ్యం..
దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. అనవసరపు మెసేజ్‌లు ఓపెన్ చేయొద్దు. గేమ్స్ ఆడుతూ వచ్చిన వెబ్‌లింకుల్ని ఓపెన్ చేయొద్దు. బ్యాంకు సంబంధ సమాచారాన్ని ఫోన్లలో షేర్ చేసుకోకపోవడం ఉత్తమం. ముఖ్యంగా మనం నిరంతరం వాడే సెల్‌ఫోన్ మనల్ని ట్రాక్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నామో గుర్తిస్తుందని తెలిసినా.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన యాప్స్‌ను వాడేస్తుంటాము. బ్యాంకు వివరాలన్నీ యాప్ యజమాని చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. క్రెడిట్, డెబిట్‌కార్డు స్వైప్ చేయడంతో.. వివరాలన్నీ షాపు యజమానికి వెళ్తాయి. అక్కడ నుండి నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇంకో కీలకమైందేటంటే.. మనం ఇన్‌స్టాల్ చేసుకునే ప్రతి యాప్ మన కాంటాక్టు, కెమెరా, మెసేజ్‌లను ట్రాక్ చేస్తుంది. అయినా మనం అన్నింటికీ అనుమతులిచ్చి, యాప్ ఇన్‌స్టాల్ చేస్తుంటాము. పైగా 'అన్నింటినీ వినియోగించుకునే అనుమతి ఇవ్వండి!' అని మెసేజ్ రాగానే అనుమతి ఇచ్చేస్తాము. తర్వాత అడగటానికి కూడా ఏమీ ఉండదు. ఈ పద్ధతిలోనే ఎక్కువ నేరాలు జరిగేది. ఆన్‌లైన్ లావాదేవీలు జరపాలనుకుంటే ఒక అకౌంటును మాత్రమే లింకు చేసుకుని, మిగిలిన వాటిని ఫోన్ వివరాల్లో లేకుండా చూసుకోవాలి. ఈ మధ్య ఫోన్‌పే, గూగుల్‌పే, పేటిఎం, భిమ్, వాట్సాప్ పేమెంట్ ఇవన్నీ ఆర్థికయాప్‌లే. వాటిల్లో ఒక బ్యాంకు అకౌంటులో తక్కువ నగదు పెట్టుకుని, మిగిలిన వాటిని వాటి నుండి తొలగించుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఎవరికైనా మన వివరాలు ఇవ్వాలి. ఆన్‌లైన్ గేమ్‌లకు దూరంగా ఉండాలి.
అవగాహనతోనే నివారణ: మొయిన్
సైబర్ నేరాలు మన కళ్లముందు జరుగుతున్నట్లు తెలిసినా నివారించలేని స్థితికి చేరామని అంతర్జాతీయ సైబర్ నిపుణులు మొయిన్ తెలిపారు. సెల్‌ఫోన్ జేబులో ఉంటే మరోవ్యక్తి మనతో ఉన్నట్లేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు ఫోన్ వాడే క్రమంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గేమ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లేకపోతే కుటుంబంలో ఉన్న ప్రతిఒక్కరి వివరాలూ మరొకరి చేతుల్లోకి వెళ్లిపోతాయనే విషయాన్ని మరువకూడదని హెచ్చరించారు. ముఖ్యమైన బ్యాంకు అకౌంటు ఉన్న ఫోన్ నెంబరుకు కీపాడ్ ఫోన్ వాడుకోవడం ఉత్తమమన్నారు. ఆన్‌లైన్ రుణాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకింగ్ లావాదేవీలపై తనిఖీ ఉండాలని తెలిపారు.
గ్రామీణ యువతపైనే గురి..

సైబర్ నేరాలకు ఎక్కువగా గ్రామీణ యువతనే వాడుకుంటున్నారు. ఇటీవల నోయిడా పరిధిలో వెలుగుచూసిన అనేక కాల్ సెంటర్లలో గ్రామీణ యువతే ఎక్కువగా ఉన్నారు. ఆకర్షణీయమైన జీతం ఉండటంతో చేరిపోతున్నారు. నేరం జరిగిన తరువాత జైళ్లపాలవుతున్నారు. బయటకు వచ్చినా, మరలా అదే వృత్తిలోకి దిగిపోతున్నారు. దీన్నే 'కార్పొరేట్ సైబర్ క్రైం' అనీ అంటున్నారు. ఇవన్నీ ఒకరిద్దరి లాభం కోసం జరుగుతుంటాయి. ఎక్కువమంది దీనిలో పనిచేస్తుంటారు. ఫోన్ల ద్వారా ఓటిపిలు కనుక్కోవడం, సమాచారం సేకరించడం, ఆన్‌లైన్ సర్వీసు నెంబర్లను మార్పిడి చేసి, డబ్బు దొంగిలించడం. ఇవన్నీ సైబర్ నేరాల కిందకే వస్తాయి. పోలీసులు కాల్ సెంటర్లో యువతను అరెస్టు చేసిన సమయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 'ఇది నేరమని తెలియదా?' అని ప్రశ్నిస్తే.. 'తెలుసు, కానీ ఉపాధి కోసం వచ్చాం!' అని యువత సమాధానం. ఇలాంటి సంస్థలన్నీ ఎక్కువగా గ్రేటర్ ఢిల్లీ చుట్టుపక్కలే ఉన్నాయి.
ప్రధానంగా టీనేజ్ అమ్మాయిల్ని ఆదాయమార్గాలు చూపిస్తామని చెప్పి, ట్రాప్‌లోకి దించుతున్నారు. తొలుత ఆన్‌లైన్ గిఫ్టులిచ్చి, చివరకు అన్నిరకాల చాటింగ్స్‌లోకి వారిని దించుతారు. ఆ చాటింగ్ స్క్రీన్లను, వీడియోలను కొన్ని కంపెనీలు కొనుగోలు చేసి, సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసి, డబ్బు సంపాదిస్తున్నాయి. దీనికీ చిన్న నగరాలు, గ్రామీణ యువతులనే నేరగాళ్లు ఎంచుకుంటున్నారు. ఎక్కువసేపు నెట్లో ఉండే ఐపి వివరాలను సేకరించి, ఎవరు ఎవరితో చాటింగ్ చేయాలో, ఏ నెంబరుకు ఫోన్ చేసి మాట కలపాలో కూడా సైబర్ కేటుగాళ్లు సలహాలు ఇస్తున్నారు. ఇటీవల బయటపడ్డ కొన్ని కేసుల్ని అధ్యయనం చేస్తే, ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. 'మీకో మంచి ఫ్రెండ్ కావాలా? మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఈ నెంబరుకు ఫోన్ చేయండి!' అనేది ఇలాంటిదే.
వల్లభనేని సురేష్
9490099208