
ఈ ధరాభారం మోయలేక సామాన్యుల నడ్డి విరుగుతున్నది. అసలు ధరలు ఆకాశాన్ని ఎందుకు అంటుతున్నాయన్నది మీ మధురస్వరం నుండి వినాలన్న సామాన్యుల ఎదురు చూపులు ఫలించేదెన్నడు? సంవత్సరానికి ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రజల ఖాతాల్లోకి వేస్తామన్న రూ.1.5 లక్షలు, వ్యవసాయాన్ని రెండింతల లాభం వచ్చేటట్లు చేస్తానన్న ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదంటే ఈ మాటలు మీ మనుసులో నుండి వచ్చినవి కావా ? దేశాన్ని విశ్వగురువును చేస్తానన్నారే! అలాంటిది ప్రపంచ ఆహార సూచికలో 101వ స్థానానికి చేరి జనం పెడుతున్న ఆకలి కేకలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, దేశం వంద లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన వైనం... ఇవేవీ మీ మనసులోని మాటల జాబితాలో స్థానం సంపాదించుకోలేదే ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమం ఈ ఏప్రిల్ 30 నాటికి 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ నాయకుడూ ఇలాంటి గొప్ప ప్రయోగం చేయలేదని బిజెపి అనుకూల మీడియా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాల మేధావులు కీర్తి ప్రవచనాలు చేస్తున్నారు. టి.వి చర్చల్లో పాల్గొంటున్న పాలక అనుకూల పారాయణులు యథాశక్తి తమ పాండిత్యం ప్రదర్శిస్తున్నారు. నిజంగానే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు తన మనసులోని మాట చెబుతున్నారా అనే సందేహం ప్రతి భారతీయుడిలో (అదానీ, అంబానీ లాంటి వారు మినహా) కలుగుతుంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా మీడియా సమావేశం జరపలేదు కాబట్టి. ఎన్నికల ముందు చెప్పింది, నేడు చేస్తున్నది వేరు కాబట్టి. తొమ్మిదేళ్ల నాడు చెప్పినదానికి, చేసినదానికి పొంతన లేదు కాబట్టి. ప్రధాని మనసులో మాటను ప్రజలు వినడం కాదు, దేశ ప్రజల మనసులో మాటను ప్రధాని వినాలి.
బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ దృష్టిలో విజయదశమి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత వుంది. ఆ రోజున ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సరిగ్గా అలాంటి విజయదశమి నాడు 2014 అక్టోబర్ 3న 'ప్రధాని మనసులోని మాట' కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. అంటే ఇది పక్కాగా ఆర్‌ఎస్‌ఎస్ మనసులో నుండి పుట్టిన కార్యక్రమం. ఇప్పటి వరకు ప్రధాని మాట్లాడిన 99 ఎపిసోడ్‌లలో అనేక చిన్న చిన్న విషయాలను కూడా మహా నాటకీయంగా చెప్పారు. కర్ణాటకలో సులగిట్టి నరసమ్మ మంత్రసానిగా ఎందరో గర్భిణీలకు సేవలందించిన విషయం గురించి ప్రధాని మన్ కి బాత్ లో చెబుతుంటే... పేదలకేమో మంత్రసానులు, సంపన్నులకు కార్పొరేటు ఆసుపత్రులు అన్న మీ నీతి అర్థంకాలేదు. విజయనగరం జిల్లాలోని ద్వారపూడి పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులకు రాత్రిపూట చదువు చెబుతున్న విషయం చెబుతుంటే నూతన విద్యావిధానం పేరుతో అత్యధికమంది పేదలను చదువులకు దూరం చేసే ఎత్తుగడ మీ మనసులో వుందని అనుకోలేదు. న్యూజిలాండ్‌లో ఎంపీగా ఎన్నికైన గౌరవ్ శర్మ అనే ప్రవాస భారతీయుడు సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం పలుకుతుంటే రానున్న రోజుల్లో ప్రాచీనకాలం నాటి వేదాధ్యయనం తప్పనిసరి చేస్తారని గుర్తించలేకపోయాము. ఆసియాలో తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ గురించి చెప్పినప్పుడు గుజరాత్‌లో బిల్కిస్ బానో, ఉన్నావోలో మైనర్ అమ్మాయి, ఢిల్లీ నగరంలో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడలేదన్న భారతీయుల సందేహాలను మీ నూరవ మన్ కి బాత్ లో తీరుస్తారని ఆశించవచ్చా!
ప్రజల మనుసులోని మాట
మోడీ పాలనకు ముందు వంట గ్యాస్ రూ.399 ఉంటే నేడు రూ.1150 అయింది. పెట్రోలు రూ. 71 నుండి 110కి, డీజల్ రూ.55 నుండి రూ.97కు, వంటనూనె రూ. 83 నుండి 175కు పెరిగిపోయాయి. ఈ ధరాభారం మోయలేక సామాన్యుల నడ్డి విరుగుతున్నది. అసలు ధరలు ఆకాశాన్ని ఎందుకు అంటుతున్నాయన్నది మీ మధురస్వరం నుండి వినాలన్న సామాన్యుల ఎదురుచూపులు ఫలించేదెన్నడు? సంవత్సరానికి ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రజల ఖాతాల్లోకి వేస్తామన్న రూ.1.5 లక్షలు, వ్యవసాయాన్ని రెండింతల లాభం వచ్చేటట్లు చేస్తానన్న ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదంటే ఈ మాటలు మనుసులో నుండి వచ్చినవి కావా? దేశాన్ని విశ్వగురువును చేస్తానన్నారే! అలాంటిది ప్రపంచ ఆహార సూచికలో 101వ స్థానానికి చేరి జనం పెడుతున్న ఆకలి కేకలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, దేశం వంద లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన వైనం... ఇవేవీ మీ మనసులోని మాటల జాబితాలో స్థానం సంపాదించుకోలేదే? ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవలసిన పండుగ రోజులు మనుషుల ప్రాణాలు తీసే రోజులుగా మారుతుంటే మాట్లాడరేం? దేశాన్ని పట్టి పీడిస్తున్న దారిద్య్రం, నిరుద్యోగం, పెద్ద నోట్ల రద్దు ప్రభావం, కరోనా మృతుల సంఖ్య పెరగడంలో ప్రభుత్వ బాధ్యత, ప్రైవేటీకరణ విధానాలు, జిఎస్‌టి వల్ల ప్రజలపై పడిన అదనపు భారాలు, అదానీ అవినీతి, వ్యవసాయ రంగం దుస్థితి, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం, ప్రజాస్వామ్య హక్కులపై దాడి, న్యాయస్థానాలను బలహీనం చేసే చర్యలు, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే సహచర మంత్రుల ఉపన్యాసాలు, చివరకు తాము నియమించిన మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పుల్వామా సంఘటనపై చేసిన వాఖ్యలు, తమ పార్టీకి చెందిన సుబ్రమణ్యస్వామి విమర్శల వంటివి ప్రజలను బాధిస్తున్నా... ప్రధాని మనసులోకి ఎక్కలేదు. వీటి గురించి ఆయన నోటి నుండి ఒక్క మాట రాకపోవడం ఆ మనసుకున్న మరకలకు నిదర్శనమా? దేశ సంపదను అవినీతి, అక్రమాల ద్వారా దోచుకొని దాచుకున్న కుబేరుల భరతం పట్టడానికి పెద్ద నోట్ల రద్దు అన్నారు. నల్ల డబ్బును వెలికి తీసి దేశాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు. నోట్ల రద్దు నాడు చెప్పిన మాట ఏమైంది? బ్యాంకుల ముందు క్యూలో నిలబడి మరణించిన వారు ప్రధాని మనసులో లేరు. అందుకే వారికి కనీసం నివాళి కూడా అర్పించలేకపోయారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం అత్యంత నేరపూరితంగా వ్యవహరించింది. అశాస్త్రీయ పద్ధతులు, లాక్‌డౌన్ వల్ల రోడ్లపైన లక్షల మంది వేల కిలోమీటర్ల దూరం నడిచిన తీరు భారతీయుల కళ్ళ ముందు కదులుతూనే వుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలో అలసత్వం, ఆక్సిజన్ కొరత వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించింది. వేలాది ప్రాణాలు హరించుకు పోయాయి. ఒక జబ్బు కారణంగా కొద్దిరోజుల వ్యవధిలో కొన్ని వేల మంది మరణించడం స్వాతంత్య్రానంతర చరిత్రలో ఇదే ప్రథమేమో! కరోనా బాధిత మృతుల సమస్య ప్రధాని మనసులో లేదు. అందుకే మనసు విప్పి ఆయన మాట్లాడలేదు.
స్వావలంబన అంటే ప్రైవేటీకరణా ?
దేశాభివృద్ధి, స్వావలంబన, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి నినాదాలు మాటల గారడీగా మారాయి. ప్రజల శ్రమతో, వారు చెల్లించిన పన్నులతో శతాబ్దాలుగా నిర్మించుకుంటూ వస్తున్న ప్రభుత్వ ఆస్తులను అతి చౌకగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేయడం మోడీ విధానం. 26,700 కిలోమీటర్ల జాతీయ రహదారులను లీజుకిస్తున్నారు. 43,300 కిలోమీటర్ల విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్లను ప్రైవేటీకరిస్తున్నారు. 600 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుదుత్పత్తి కేంద్రాలను కూడా ప్రైవేటీకరించేందుకు సిద్ధమయ్యారు. 4,000 కిలోమీటర్ల ఐ.ఒ.సి, హెచ్‌పిసిఎల్ పైపులైన్లు అమ్మివేయడం...150 బొగ్గు గనులు, 761 ఖనిజ నిక్షేపాలు, 11 ఓడరేవులు, 400 రైల్వేస్టేషన్లు, 150 రైళ్లు, రైల్వేట్రాక్‌లు, షెడ్‌లు, 25 విమనాశ్రయాలు, 12 జాతీయ క్రీడా ప్రాంగణాలు, గోడౌన్లు ఇలా ఒక్కటేమిటి... ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం చూస్తున్నాం. అయితే ప్రధాని మనుసు లోని ప్రైవేటీకరణ మాట మాత్రం ఈ 99 ఎపిసోడ్‌లలో ఎక్కడా వినిపించలేదు.
పేదలపై భారాలు, సంపన్నులకు వరాలు
2017 జులై 1 నుండి అమలులోకి వచ్చిన జిఎస్‌టి పన్ను ల విధానం ప్రజలపై మోయలేని భారంగా మారింది. 2017-18లో కేంద్ర ప్రభుత్వానికి సిజిఎస్‌టి, ఐజిఎస్‌టి ఖాతాల్లోకి రూ. 1,93,678 కోట్లు వచ్చాయి. అంటే నెలకు సగటున రూ.34,728.22 కోట్లు రాగా, 2019-20 నాటికి రూ.5,20,793 కోట్లు కేంద్రానికి జమ అయ్యాయి. అంటే నెల కు సగటున రూ.43,399.41 కోట్ల భారం ప్రజలపై పడింది. ఇది కాకుండా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి.
ప్రధానికి అత్యంత ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ ఆర్థిక సామ్రాజ్య విస్తరణలో జరిగిన అక్రమాల గురించి దేశంలో, విదేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ ప్రధాని మనుసును కదిలించలేకపోయాయి. సహచర పార్లమెంట్ సభ్యులు కొన్ని వారాలుగా ఆందోళన చేసినా జాయింట్ పార్లమెంట్ కమిటీ (జె.పి.సి) వేయడానికి కాదు కదా కనీసం అదానీ పేరు ప్రస్తావించడానికి కూడా ప్రధాని సిద్ధపడలేదు. 2014 నాటికి అదానీ ఆస్తుల మార్కెట్ విలువ రూ. 56,100 కోట్లు కాగా, 2022 నాటికి రూ. 16 లక్షల కోట్లకు ఎగబాకింది. దేశంలో ఒకవైపు దారిద్య్రం, పేదరికం, మరోవైపు కుబేరుల సంఖ్య పోటీలు పడి పెరిగిపోవడానికి మీ విధానాలు కారణం కాదా? హిందువులు బంధువులు అంటున్న ఆర్‌ఎస్‌ఎస్ మార్గదర్శకత్వంలో పాలిస్తున్న మోడీ పాలనలో ఆర్థిక అసమానతలు భారీగా పెరిగి, 30 శాతం మంది దగ్గర దేశ సంపదలో 90 శాతం, అందులో ఒక్క శాతంగా వున్న మహా కుబేరుల దగ్గర 40.6 శాతం దేశ సంపద పోగుబడితే ఏ హిందువులు మీ బంధువులు ?
నిరుద్యోగం పెరుగుదలపై అదుపు లేదు. కొత్త పరిశ్రమలు లేవు. ఉన్న ఉద్యోగానికి రక్షణ లేదు. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్‌కోడ్‌ల పేరుతో కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చివేస్తున్నారు. సంవత్సరానికి ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాల ఊసే లేదు. 2019లో 18.7 కోట్ల మంది నిరుద్యోగులుగా వుండగా...2022 నాటికి ఆ సంఖ్య 20.5 కోట్లకు పెరిగింది. తాజా లెక్కల ప్రకారం దేశంలో డిగ్రీ పూర్తిచేసిన యువతలో 17 శాతం మంది నిరుద్యోగులుగా వున్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కొత్త ఉద్యోగాల భర్తీ నిలిపివేత కారణంగా 2014లో 16.5 లక్షలుగా వున్న ఉద్యోగులు 2020 నాటికి 9.80 లక్షలకు తగ్గిపోయారు.
ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్రం, అందులో భాగంగా రూపొందిన రాజ్యాంగం నేడు అత్యంత ప్రమాదంలో పడ్డాయి. రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలన్నీ కేంద్ర పాలకుల చేతుల్లో విలవిలలాడుతున్నాయి. లౌకికతత్వం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యం అపహాస్య పదాలుగా మార్చబడుతున్నాయి. 11 రాష్ట్రాల్లో గెలిచిన ప్రభుత్వాలను అక్రమంగా పడగొట్టడం మీ మనసుకు నచ్చినప్పటికీ సగటు భారతీయుడికి నచ్చలేదు. న్యాయస్థానాలను కీలుబొమ్మలుగా మార్చుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుల అణచివేత, మేధావులపై అక్రమ నిర్బంధాలు/ హత్యలు, పాఠ్యపుస్తకాల్లో మత బీజాలు నాటేందుకు మహనీయుడు డార్విన్ మానవ పరిణామక్రమ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుండి తొలగిస్తున్న మీ ఆలోచన ఎంత ఆదిమ కాలం నాటిదో అర్థమవుతున్నది. ప్రశ్నించే గొంతులను ఎల్ల కాలం అణచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. మన్ కీ బాత్ చాటున జరుగుతున్న కపటత్వాన్ని దాచడం ఎల్లకాలం మీకు సాధ్యం కాదు.
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్