
జర్మన్ కుటుంబాలలో పిల్లలను చిన్నప్పటి నుండే వేరుగా పడుకోవటం అలవాటు చేస్తారు. ప్రసవ సమయానికి ముందే చిన్నపాటి ఉయ్యాల, దానిలోకి ఒక బెడ్ సిధ్ధంగా ఉంచుతారు. ప్రసవం అయిన వెంటనే బిడ్డ తల్లి పక్కన కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆ ఉయ్యాలలో పడుకోబెడతారు. అప్పటి నుండి బిడ్డ తల్లి ప్రక్కన పడుకోవటం బహు అరుదుగా జరుగుతుంది. పిల్లలను ఎత్తుకొని తిప్పరు. చిన్న బండి (స్ట్రోలర్) లో పడుకోబెట్టి తిప్పుతారు. ఉయ్యాలలో పడుకునే వయసు దాటిన తర్వాత పిల్లలకు ప్రత్యేక మంచం, దానిమీద బెడ్ ఏర్పాటు చేస్తారు. ఉయ్యాల కానీ, ఆ తర్వాత ప్రత్యేక మంచం కానీ తలిదండ్రులు పడుకునే మంచం పక్కనే ఉంచుతారు. అలా శైశవ దశ నుండి పిల్లలకు విడిగా పడుకోవటం అలవాటవుతుంది. కొంచెం వయసు వచ్చిన తర్వాత నెమ్మదిగా వేరే గదిలో పడుకోవటం కూడా అలవాటు చేస్తారు. దీనివలన పిల్లలు చిన్నప్పటి నుండి ఒంటరిగా బతకటం నేర్చుకుంటారు. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించి, ఆడిస్తారు.

ఉచిత విద్యావిధానం..
జర్మనీలో ప్రాథమిక విద్య నుండి యూనివర్శిటీ విద్య వరకూ అంతా ఉచితం. అంతేకాదు, హైస్కూలు వరకు నిర్బంధ విద్య, అందరికీ ఒకరమైన విద్య లభిస్తుంది. ఆ తర్వాత ఎవరి ఇష్టానుసారంగా వారు సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటారు. ఏం చదవాలనే విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం ఉండదు. తనకు మక్కువ ఉన్న సబ్జెక్టును విద్యార్థే ఎంపిక చేసుకుంటాడు. పని విషయంలోనూ అంతే. తాము ఏపని చేయదలుచుకుంటారో దానికి సంబంధించిన విద్య, దానికి సంబంధించిన సబ్జెక్టుల ఎంపిక ఉంటాయి.
ఇక చదువు ప్రాథమిక విద్య నుండి పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మశీ లాంటి వృత్తివిద్యలన్నీ వారి మాతృభాష జర్మన్‌లోనే ఉంటాయి. చివరకు పరిశోధనలు (పిహెచ్.డి) కూడా జర్మన్‌లోనే జరుగుతాయి. పరిశోధనా పత్రాలను (రిసెర్చ్ పేపర్స్) కూడా జర్మన్‌లోనే సమర్పిస్తారు. ఇంగ్లీష్ / ఫ్రెంచిలాంటి ఇతర బాషలు అదనంగా నేర్చుకుంటారు. అందువలన అసలు ఇంగ్లీషు తెలియనివారూ ఇక్కడ ఉన్నారు. మాతృభాషలోనే చదువుకోవటం వలన సబ్జెక్టును అర్థంచేసుకోవటం తేలిక. సబ్జెక్టు నేర్చుకునేటప్పుడు భాషనూ అర్థం చేసుకోవలసిన అవసరం వారికి ఉండదు. మనదేశంలో ఇంగ్లీషు నేర్చుకోవాలి, అరకొరగా వచ్చిన ఆ ఇంగ్లీషులోనే సబ్జెక్టు నేర్చుకోవాలి. మాతృభాషలో విద్య నేర్వడం వల్ల జర్మన్లు తెలివైనవారుగా ఉండటానికి ఒక ముఖ్యకారణం.

ప్రతిపనికీ గౌరవం..
పిల్లలు ఏ పని నేర్చుకుంటామన్నా, ఏ సబ్జెక్టు తీసుకుంటామన్నా తల్లిదండ్రులు అడ్డు చెప్పకపోవటానికి ప్రధాన కారణం, ఆ దేశంలో ప్రతిపనికీ గౌరవం (Dignity of Labour) ఉండటం. ఉదాహరణకు ఒక లాయరు లేదా డాక్టరు గారి కొడుకు చెప్పులు తయారుచేసేవాడు (షూ మేకర్) కావచ్చు. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అని అడిగితే మా అబ్బాయి షూ మేకర్ అని చెప్పుకోవటానికి ఆ తల్లిదండ్రులు ఏమాత్రం సంకోచించరు. లాయరైనా, డాక్టరైనా, డ్రైవరైనా, షూ మేకరైనా, వ్యవసాయదారుడైనా ఆ సమాజంలో ఒకే విధమైన గౌరవం ఉంటుంది. సమాజానికి అవసరమైన ప్రతిపనినీ వారు గౌరవంగా చూస్తారు. ప్రతిపనికి గౌరవం ఉంది కనుకనే, పిల్లలు ఏ పని నేర్చుకుంటామన్నా తల్లిదండ్రులు అడ్డు చెప్పరు. విద్య మాతృభాషలో ఉండటం, ప్రతిపనికి గౌరవం ఇవ్వటం, అనే ఈ రెండు అంశాలు జర్మనీ దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయి.
స్వతంత్రగా..
పిల్లలు 16 ఏళ్ల వయసు తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా స్వతంత్రగా బతకటానికి ఇష్టపడతారు. అందువలన వేరుగా ఉంటారు. తల్లి దండ్రులూ వారికి అడ్డు చెప్పరు. ఏదో ఒక పని చేసుకుంటూ తరువాయి 21 లోచదువు కొనసాగిస్తారు. తమ ఉపాధి తామే వెతుక్కుంటారు. దీనర్థం అసలు తల్లిదండ్రులు ఏమీ పట్టించుకోరని కాదు. ఏదైనా అవసరమైతే సహకరిస్తారు. ఇక పెళ్లి విషయంలో తమకు నచ్చిన భాగస్వామిని ఎంపిక చేసుకుని, పెళ్లి చేసుకుంటారు. దీనికి తల్లిదండ్రులు అడ్డు చెప్పరు. ఏదైనా ఉంటే సలహా ఇస్తారు. మనదేశంలో మాదిరిగా ఆ దేశంలో కుల సమస్య లేదు. తమ దేశంలోనే కాదు, విదేశాలలో పుట్టి జర్మనీలో స్థిరపడిన వారినీ జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అందువలనే ఆ దేశంలో భర్త ఒక దేశస్థుడైతే, భార్య ఇంకో దేశస్థురాలిగా కనిపిస్తుంటారు. తల్లిదండ్రులు కోడలు తమ చెప్పు చేతలలో ఉండాలని, కోడళ్ళ మీద పెత్తనం సాగాలని, తమ మాటే చెల్లుబాటు కావాలని భావించరు. కోడలిని స్వతంత్రురాలిగానే భావిస్తారు. కొడుకూ కోడలు ఇద్దరినీ స్వతంత్రులుగానే పరిగణిస్తారు.
ఆస్తులు.. అవగాహన..
మన దేశంలో తల్లిదండ్రులు ధనవంతులైతే, వారి పిల్లలు తాము దనవంతుల బిడ్డలమని, తమది ధనవంతుల కుటుంబమని భావిస్తారు. కానీ జర్మనీలో పిల్లలు అలా భావించరు. ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఏ యువకుడినైనా 'మీది ధనవంతుల కుటుంబం కదా' అని అడిగితే 'కాదు.. మా తల్లిదండ్రులు ధనవంతులు. నేను కాదు' అని సమాధానమిస్తారు. అక్కడ కూడా చట్టప్రకారం తల్లిదండ్రుల అనంతరం ఆస్తి పిల్లలకే చెందుతుంది. అయినా సరే తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకూ ఆ ఆస్తి తమది కాదని, తాము సంపాదించుకున్నదే తమ ఆస్తి అని పిల్లలు భావిస్తారు.

ఆధారపడరు..
తల్లిదండ్రులు కూడా వృధ్ధాప్యంలో పిల్లలు తమను చూడాలని, పిల్లల మీదనే ఆధారపడాలని కోరుకోరు. ఎవరి పని వారే చేసుకుంటారు. వారు తినే ఆహారం, చల్లటి వాతావరణం వారికి పనిలో అలసట తెప్పించవు. దానితో వారు చిన్నప్పటి నుండి అవసరమైన శ్రమ చేయటానికి అలవాటుపడతారు. అలాగే చిన్నప్పటి నుండి తమ పని తామే చేసుకోవాలి అన్న భావజాలంతో పెరుగుతారు. ఆ భావనే వృధ్ధాప్యంలోనూ కొనసాగుతుంది. తమ పని తాము చేసుకుంటారు. అంట్లు తోమటానికి డిష్ వాషర్లు, బట్టలు ఉతకటానికి వాషింగ్ మెషిన్లు, ఆహారం వేడి చేసుకోవటానికి ఓవెన్‌లు, వంట చేసుకోవటానికి విద్యుత్ స్టవ్‌లు, చలిరోజుల్లో వెచ్చదనాన్ని ఇచ్చే హీటర్లు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. మరీ భరించలేని అనారోగ్య పరిస్థితి ఉంటే తప్ప 80 ఏళ్ల వయసులో కూడా తమపని తాము చేసుకుంటుంటారు.
జర్మనీలో ఒకరిపై ఆధారపడనవసరం లేదు అన్న భావన పిల్లలకు శైశవ దశలో ఏర్పడుతుంది. వృధ్ధాప్యంలోనూ స్వతంత్రంగా జీవించాలన్న ఆలోచనే ఉంటుంది. ఎవరిపని వారు చేసుకునే పద్ధతి. భౌతికంగా ఆధారపడాలన్న ఆలోచన లేకపోవటమే కాదు. తమకి ఎన్ని ఇబ్బందులున్నా సరే, సంపాదించిన ఆస్తి ఖర్చు చేయకుండా దాచి, పిల్లలకు ఇవ్వాలని తల్లిదండ్రులకు ఉండదు. అలాగని వృథాగా ఖర్చు పెట్టరు. తల్లిదండ్రుల ఆస్తి వారి అనంతరం తమకు వస్తుందని తెలిసినా, వాటిమీద ఆధారపడి జీవించాలన్న ఆలోచన పిల్లలకీ ఉండదు. తాము స్వతంత్రంగా సంపాదించుకోవాలనే ఆలోచనే ఉంటుంది. దీనితో తల్లిదండ్రులు వృధ్ధాప్యంలోనూ విహారయాత్రలు చేస్తూ, సంతోషకరమైన జీవనం సాగిస్తారు. ఇది జర్మనీలో నా పరిశీలన.
- యం.వి. ఆంజనేయులు
సెక్రెటరీ, టాక్స్ పేయర్స్ అసోసియేషన్,
9440905552
విజయవాడ.