Oct 01,2023 13:07

'ఎన్నాళ్లో వేచిన ఉదయం'. ఈనాడే ఎదురౌతుంటే'.. ఎందుకో తెలియదు. ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నతనం నుండీ ఇప్పటికీ రోజూ గుర్తుకొస్తుంది. ఇప్పుడు మా ఊరు తాటిపాకలో విక్టరీ బజారు వద్ద నా బాల్య మిత్రులను చూడగానే మళ్లీ ఆ పాట గుర్తు కొచ్చింది. ఇప్పుడు, మొదటిసారిగా ఈ పాట అవసరం అనిపించింది.
ఈ రోజు అజయ్, వరుణ్‌లను కలుస్తానని అస్సలు అనుకోలేదు.
వాళ్లిద్దరూ నేను బట్టతలలో ఉన్నప్పటికీ నన్ను గుర్తుపట్టారు. నవ్వుతూ నా వద్దకు వచ్చారు.
'గౌతమ్‌, ఎలా ఉన్నావురా? ఎన్నాళ్లకు? ఎన్నేళ్లకు? అంటూ నన్ను చుట్టేసారు. ఆత్మీయంగా పలకరించారు.
'వరుణ్‌.. జుట్టుకు రంగేసి కవర్‌ చేశావ్‌. కానీ మీసం తెల్ల బడుతోంది. చూసుకో' అన్నాను చిన్నగా నవ్వుతూ.
'అందుకే నేను మీసానికి కూడా రంగు వేసేస్తాను' అజరు తెలివిగా కవర్‌ చేశాడు.
'నాకు ఈ అవసరమే రాదు.పైన జుట్టులేదు. మీసం పెంచను.' నవ్వుతూ అన్నాను.
'గుడ్‌ వన్‌' నవ్వుతూ అన్నారు.
'ఆహా!చాలా ఏళ్లకు కలిసాం.. పనులెప్పుడూ ఉండేవే. పదండి. పక్కన హోటల్‌లో కూర్చుందాం' అంటూ అజరు నన్ను, వరుణ్‌ను బయలుదేరదీశాడు. ముగ్గురమూ, రౌండ్‌ టేబుల్‌కు అటూ ఇటూ కూర్చున్నాం.
వరుణ్‌ టీ ఆర్డరిచ్చాడు. కానీ చీటికి, మాటికీ చేతి రిస్ట్‌వాచీ చూసుకుంటున్నాడు.
'బాల్యం మధురం. బాల్య స్నేహితులు ఒక వరం. ఆ అమూల్యమైన రోజులు తిరిగి రానివి. మరువ లేనివి. నాకు బతకడానికి ఉపాధ్యాయ ఉద్యోగం ఉంది. ఖాళీ సమయంలో కథలు, కవితలు గట్రా రాస్తుంటాను.
మీరు నా పేరు చూసే ఉంటారు'.. కొంచెం గర్వంగా అన్నాను. 'నీలో ఓ కవి, కథకుడూ ఉన్నాడన్న మాట.
'నాది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. కొనడం, అమ్మడం, మిగిలిన లాభం దాచడం. సమయం ఈ మూడింటినీ చూసుకోవడానికే సరిపోవడం లేదు. ఇక నీ కవితలు, కథలు చదవాలంటే మరో జన్మ ఎత్తాలి'. కొంచెం వెటకారాన్ని కలగలుపుతూ, తిరిగి చేతి వాచీని చూసుకుంటూ అన్నాడు వరుణ్‌.
నా ఇగో హర్ట్‌ అయింది. 'వరుణ్‌ నీ దృష్టిలో డబ్బే బతుకు. నాకు కాదు. నువ్వు చాలా ఆనందాల్ని కోల్పోతున్నావు. చెప్పినా నీకు అర్ధం కాదులే' అంటూ అజరు వైపు చూసాను.
'వృత్తి.. బ్యాంక్‌లో క్లర్కు. ప్రవృత్తి.. ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తుంటాను. ఇంటి నిర్మాణం నిమిత్తం.. స్థలం కొనాలని వెతికితే వరుణ్‌ దొరికాడు. కలిసి వస్తుంటే నువ్వు కలిశావు. చాలా సంతోషం' అజరు అన్నాడు.
ఇద్దరికేసి నవ్వుతూ చూశాను.
'దయజేసి ఫోన్స్‌ సైలెంట్‌ మోడ్‌లో పెట్టండి. పది నిమిషాలైనా మనకోసం మనం కేటాయించు కుందాం. ఏమంటారు?'
'బాగా చెప్పావ్‌ గౌతమ్‌' అంటూ ఫోన్‌ సైలెంట్‌లో పెట్టారు.
ముగ్గురమూ చిన్నప్పటి సంగతులెన్నో చెప్పుకున్నాం. చిన్న పిల్లలమైపోయాం. మనసారా మాట్లాడుకున్నాం. హాయిగా నవ్వుకున్నాం.
ముగ్గురం తిరిగి లేచాం.
ఈ సారి వరుణ్‌ చేతివాచీతో బాటు తన ఫోన్‌ చూసుకున్నాడు. ఎన్నో మిస్డ్‌ కాల్స్‌. మరెన్నో మెసేజెస్‌.'డబ్బుకు లోటు లేదు. కానీ సమయమే సరిపోవడం లేదు' అంటూ నవ్వాడు.
'వరుణ్‌, సంపద కంటే సమయం ఎప్పుడూ గొప్పదే. జీవనం మార్చుకో. ఒత్తిడి తగ్గించుకో' చెప్పాను. అలా అన్నప్పుడు అజరు నాకేసి కొంచెం కోపంగా చూడటం నా దృష్టి దాటిపోలేదు.
అజరు, వరుణ్‌ల ఫోన్‌ నంబర్స్‌ ఇచ్చి పుచ్చుకున్నాము. వీలున్నప్పుడు తిరిగి కలుసు కోవాలనుకున్నాం. వాళ్లిద్దరూ వెళ్లారు. ఈ క్షణాలను మర్చిపోకుండా ఉండాలని నా డైరీలో రాసుకున్నాను. తిరిగి నా దినచర్యలో భాగంగా రోజూ స్కూల్‌కు వెళ్లడం, సాయంత్రం కధో, కవితో రాయడం, లేదా ఇతరులు రాసినవి చదవడంలో పడిపోయాను. వారం రోజుల తర్వాత అజరు నుండి ఫోన్‌ వచ్చింది.
'అజరు! మళ్ళీ మనం కలుద్దామా, ఎక్కడీ' ఆత్రంగా అడిగాను.
'వరుణ్‌ బిజినెస్‌లో భాగంగా వెడుతుంటే, రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.' వాడి నోట ఆ మాట వినగానే నిర్ఘాంత పోయాను. బాధేసింది. గుండె బరువెక్కింది. తక్షణం అమలాపురం బయలు దేరాను. వరుణ్‌ ఇంటికి చేరుకున్నాను. అజరు అప్పటికే అక్కడ ఉన్నాడు. వరుణ్‌ పార్ధీవ దేహాన్ని మంచు పెట్టెలో పెట్టారు. ఇంటి చుట్టూ వేసిన షామియానా నిండా జనం.
వరుణ్‌ను అలా చూడగానే వైరాగ్యం కమ్మేసింది. మనసులో ఒకరకమైన బాధ. నిర్లిప్తత.
అజరు కేసి తిరిగాను. 'వారం క్రితం నవ్వించాడు. ఇప్పుడు ఏడిపిస్తున్నాడు' తడిబారిన కళ్ళను తుడుచుకుంటూ అన్నాను.
'అవును' అజరు కళ్ళను తుడుచుకుంటూ అన్నాడు.
'అధునాతన భవనం కట్టాడు. కానీ ఈ రోజు నుండీ వాడు అందులో ఉండడు. ఉండలేడు. సమయం సరిపోవడమే లేదనే వాడు. ఇప్పుడు సమయం వాడికి లేదు. రోజులో ఇరవై నాలుగు గంటలూ డబ్బు కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఒక్కపైసా కూడా పట్టుకెడతాడా?' బతికున్నంతసేపూ ఎందుకురా వాడికా తాపత్రయం?' కొంచెం కోపంగా అన్నాను అజరు వైపు బాధగా చూస్తూ.
'గౌతమ్‌, నీకు కథలు రాయడమంటే ఇష్టం. నాకు బొమ్మలు వేయడమంటే ఇష్టం. లేకపోతే సమయం గడపడమే కష్టం. కానీ అందరికీ అవి ఇష్టమని చెప్పలేం. ప్రతివ్యక్తి రోజు గడపడానికి ఉద్యోగం తర్వాత ఏదొక వ్యాపకం కావాలి. లేదా ఉద్యోగమే వ్యాపకం కావాలి. మనిషి ఖాళీగా ఉండకూడదు. వరుణ్‌ వ్యాపకం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. ఆ వ్యాపారంలో అడ్డదారులు తొక్కలేదు. ఆనందంగా గడిపాడు.
మనతో సమయం సరిపోవడం లేదని అన్నాడు గుర్తుందా? అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నానని చెప్పకనే చెప్పాడు. 'ఏం? నువ్వు రాసిన కథలు కూడా పట్టుకెడతావా? నేను గీసిన బొమ్మలను నే పోయాక పట్టుకెడతానా?' అజరు మాట నాకు తూటాలా తగిలింది.
'గౌతమ్‌! ఒక్క నావలో ప్రయాణించిన వారందరి గమ్యం ఒక్కటి కాదు. ఏ నావది ఏ తీరమో? ఎవరు చెప్పగలరు? కానీ ప్రయాణించాలి. తీరం చేరాలి. ప్రయాణం పుట్టుకతో మొదలౌతుంది. తీరం చేరడం మరణంతో ముగుస్తుంది. మధ్యలో సమయమే ఒక్కొక్కరికీ ఒక్కో మార్గం సూచిస్తుంది.'
అజరు మాటలలో వేదాంతం ఉందనిపించింది. ఒకరి ఆనందం మరొకరికి ఆనందాన్ని ఇవ్వదు. కానీ ఉన్నంత వరకూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే నిజమైన జీవన సాఫల్యమనిపించింది. వరుణ్‌ పార్థివ దేహం కేసి చూశాను. గుండె బరువైంది. అప్రయత్నంగా ఒక కన్నీటిబొట్టు రాలింది. బరువెక్కిన హృదయంతో, వరుణ్‌ అంతిమ యాత్రలో పాల్గొనడానికి ముందుకు కదిలాము.

- కె.వి.లక్ష్మణరావు
90146 59041