Oct 31,2023 09:41

          'గ్రంథాలయం. పుస్తకాల భాండాగారం' అని అందరికీ తెలుసు. కానీ సాంకేతికత అందిపుచ్చుకున్న ప్రస్తుత ఆధునిక యుగంలో అరచేతిలో ప్రపంచం ఆవిష్కరమవుతున్న వేళ, గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చదివే తీరిక ఎవరికి వుంటుంది? అని అనుకుంటారు చాలామంది. అయితే తెలంగాణ, నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, గుండ్రాంపల్లి గ్రామ యువత మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. యువత ఉద్యోగ అవకాశాలు సంపాదించాలంటే గ్రంథాలయాలే పట్టుకొమ్మలని భావించారు. ఆ దిశగా గ్రామంలో సొంత ఖర్చుతో గ్రంథాలయం నిర్వహిస్తున్నారు.

grandalayam


          'జీవితంలో ఎదిగేందుకు గ్రంథాలయం ఉపయోగపడుతుంది. ఇది ఆర్భాటం కాదు, అవసరం' అంటారు గ్రంథాలయ నిర్వాహకుడు అనుముల శ్రీనివాస్‌. ఈ ఒక్క గ్రామంలోనే కాక, జిల్లా వ్యాప్తంగా పలు గ్రంథాలయ స్థాపనలో ఆయన ముందుంటున్నారు. డొనేషన్ల రూపంలో సేకరించి వీటిని నిర్వహిస్తున్నారు. 'సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పుస్తక పఠనం ద్వారానే విజ్ఞానం వస్తుంది' అంటారు శ్రీనివాస్‌. దాతలు అందించిన చిన్న గదిలోనే గ్రంథాలయం నిర్వహిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వివిధ పుస్తకాలు, పోటీపరీక్షలకు ఉపయోగపడే పత్రికలతో పాటు నిరుద్యోగులకు ఉపయోగపడే 100 నుండి 200 రకాల వార్తా పత్రికలను కూడా అందులో ఉంచుతున్నారు.
         ఈ గ్రంథాలయాలకు విశేష స్పందన వస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో కూడా ప్రజలు వీటిని ఉపయోగించుకున్నారు. 'నేను గ్రూప్‌ పరీక్షలకు సిద్ధం అవుతున్నాను. ఇక్కడికి వచ్చి నాకు కావాల్సిన అన్ని పేపర్లు, పుస్తకాలు చదువుకుంటాను. ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. పోటీ పరీక్షలకు ఈ గ్రంథాయలం చాలా సహకరిస్తోంది' అంటున్నారు గ్రామానికి చెందిన జి అంజయ్య అనే నిరుద్యోగి.
         'నేను ఆటో డ్రైవరుని. పగలంతా ఆటో నడుపుకుంటాను. సాయంత్రం అయ్యేసరికి ఇక్కడికి వచ్చేస్తాను. పుస్తకాలు, వార్తాపత్రికలు, మాసపత్రికలు వంటివన్నీ చదువుతూ ఇక్కడే చాలా సమయం గడుపుతాను. ఇక్కడికి వస్తే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది' అంటున్నాడు గ్రామానికే చెందిన ఆటోడ్రైవరు వెంకటేశ్వమ్‌. విజ్ఞానం సముపార్జన కోసం గ్రంథాలయాలు నిర్వహిస్తున్న ఈ గ్రామ యువత ఎంతోమందికి మార్గనిర్దేశకంగా నిలుస్తున్నారు.