May 19,2023 13:45

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌ : పుచ్చలపల్లి సుందరయ్య చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ అన్నారు. శుక్రవారం పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సభ కల్లూరు మండలం ఉలిందకొండలోని నరసింహాయ భవనం వద్ద నిర్వహించారు. సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జి.రామకృష్ణ హాజరై మాట్లాడుతూ .... సుందరయ్య నెల్లూరు జిల్లాలోని అలగానుపాడు గ్రామం వద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించారని అన్నారు. పేదల కోసం, కార్మికుల కోసం, వ్యవసాయ కూలీల కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా ఆర్థిక సమానత్వం కోసం పోరాటాలు నిర్వహించారని తెలిపారు. తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరి తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషించారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా పనిచేశారన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ప్రజలకు సేవలు అందించారన్నారు సుందరయ్య స్ఫూర్తితో మనం కూడా సమ సమాజం కోసం పాటుపడాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కే మధు, మండల నాయకులు ఏ.కృష్ణ, హరిబాబు, రామాంజనేయులు, అంజి, మారెన్న, పూలరంగడు తదితరులు పాల్గొన్నారు.