Feb 05,2023 08:59

ఇంటర్నెట్‌ ప్రవేశంతో సమాచార, సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఇంటర్నెట్‌ వినియోగించేవారి సంఖ్య భారీగా పెరిగింది. పొద్దున్న లేచింది మొదలు.. సాయంత్రం పడుకునే వరకూ ఇంటర్నెట్‌పైనే కాలం గడిపేస్తున్న రోజులుగా మారిపోయాయి. ఇంటర్నెట్‌ రాకతో.. సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌ వంటి వాటిల్లో ఖాతాలు పెరుగుతున్నాయి. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకునే వేదికలుగా మారాయి. మరోవైపు కట్టడిపేరుతో ప్రభుత్వాలు వ్యక్తిగత స్వేచ్ఛకు కళ్లెం వేస్తున్నాయి. దీంతో పాటు బ్యాంకింగ్‌ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా ఫోన్‌ నుంచే డబ్బులు పంపేంతగా టెక్నాలజీ వృద్ధి చెందుతోంది. ఇదే క్రమంలో సైబర్‌ నేరగాళ్లు తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. దీంతో వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారానికీ భంగం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏటా ఫిబ్రవరి 7న 'సేఫర్‌ ఇంటర్నెట్‌ డే' నిర్వహించుకుంటున్నాం.. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇంటర్నెట్‌ని ఎవరు శాసిస్తున్నారు? ఎవరికి మేలు జరుగుతుంది? అనే అంశాలపైనే ఈ ప్రత్యేక కథనం..

1


అరచేతిలోకి మొబైల్‌ రాకతో.. అన్నీ ఇంటి దగ్గర నుంచే కొనుగోలు చేసే రోజులివి. దీనికి మొదటి కారణం టెక్నాలజీలో వస్తున్న మార్పులు అయితే.. మరో ప్రధాన కారణం ఇంటర్నెట్‌ అనే చెప్పొచ్చు. మానవుని జీవితంలో పంచేంద్రియాలతో పాటు మరో ఇంద్రియంగా మారిపోయింది ఇంటర్నెట్‌. ఇదే క్రమంలో ఆన్‌లైన్‌ మోసాల సంఖ్య భారీగానే పెరిగింది. తరచూ ఏదో ఒకచోట ఈ తరహా మోసాల గురించి సామాజిక మాధ్యమాల్లో మనం వింటూనే ఉంటాం. అత్యాశతో కొందరు, అవగాహనా రాహిత్యంతో మరికొందరు ఇంటర్నెట్‌ వేదికగా జరిగే ఆన్‌లైన్‌ మోసాలకు బాధితులుగా మారుతున్నారు. దీనిపై యూజర్లకు అవగాహన కల్పించేందుకే ఫిబ్రవరి 7న ప్రతి ఏటా 'సేఫర్‌ ఇంటర్నెట్‌ డే'గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్‌ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎదురౌతున్న సవాళ్లు.. అజమాయిషీ.. తదితర మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

 

  • సరిగ్గా 54 ఏళ్ల క్రితం..

మానవుల జీవితాలనే మార్చేసిన ఇంటర్నెట్‌ సరిగ్గా 54 ఏళ్ల క్రితం అక్టోబర్‌ 29, 1969న 22.30 నిమిషాలకు రెండు కంప్యూటర్ల మధ్య మొదటి సారిగా ప్రారంభమైంది. లాస్‌ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (యూసీఎల్‌ఏ) లో విద్యార్థి ప్రోగ్రామర్‌గా ఉన్న చార్లీ క్లైన్‌ ఏఆర్‌పిఏఎన్‌ఇటి (అడ్వాన్స్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ ఏజెన్సీ నెట్‌వర్క్‌) ద్వారా ప్రొఫెసర్‌ లియోనార్డ్‌ క్లెయిన్రాక్‌ పర్యవేక్షణలో ఎస్‌డిఎస్‌ సిగ్మా 7 హోస్ట్‌ కంప్యూటర్‌ నుంచి స్టాన్‌ఫర్డ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న మరో ప్రోగ్రామర్‌కు చెందిన ఎస్‌ఆర్‌ఐ ఎస్‌డిఎస్‌ 940 హోస్ట్‌ కంప్యూటర్‌కు మొదటి ఎలక్ట్రానిక్‌ సందేశాన్ని ప్రసారం చేశారు.

  • ఏడాది చివరికి 68 శాతం..

ఇంటర్నెట్‌ వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. అనేక విషయాలు తెలుసుకోవడం దగ్గర నుంచి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్‌, వ్యవసాయం, వినోదం వంటి అనేక అంశాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. దీనికితోడు ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌) తోడవ్వడంతో వేలిముద్రలు (బయోమెట్రిక్‌), ఐరిష్‌, ఫేస్‌రికగ్నిషన్‌ వంటి అనేక సదుపాయాలు.. మనం ఎలాంటి అంశాలను శోధిస్తున్నాము, ఎలాంటి ఆహారం ఇష్టం, ఎంత ఖర్చు చేస్తున్నాం.. ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాం.. వంటి అంశాల సమాచారమంతా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఏఐ వల్ల అనేక లాభాలతోపాటు ఇటువంటి నష్టాలూ ఎక్కువగానే ఉన్నాయి. అయితే మనదేశంలో 2018 చివరినాటికి 39 కోట్ల (29%) మంది ఇంటర్నెట్‌ వినియోగదారులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా 2023 చివరి నాటికి ఈ సంఖ్య 90 కోట్ల (64%) మందికి పెరిగే అవకాశం ఉన్నట్లు ఓ సర్వే చెబుతున్న అంచనా. ఇక ఇంటర్నెట్‌ వినియోగదారులు అత్యధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. అంటే చైనా తర్వాత మనదేశమే. అయితే దేశంలో ఇంటర్నెట్‌ చౌకగా అందుబాటులోకి రావడంతో వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో మన సమా చారాన్ని దొంగి లించే హ్యాకర్లు ఎక్కువగా పెరిగారు. దీంతో యూజర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆన్‌లైన్‌లో జాగ్రత్తలు తీసుకోకపోతే మాల్‌వేర్‌, పిషింగ్‌ అటాక్స్‌ బారిన పడే ప్రమాదం ఉంటుంది. మన విలువైన సమాచారం చోరీకి గురికావొచ్చు. ఇలా జరగకుండా సేఫ్‌గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఇప్పుడంతా ఏఐ చేతిలోనే..

ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అనగానే అదేదో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల భాష, మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ, లేచిన దగ్గర్నుంచీ పడుకునేదాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉంటోంది. అంతేకాదు, ఈ సోషల్‌ మీడియా వేదికలకు వర్చువల్‌ రియాలిటీ హంగులద్ది 'మెటావర్స్‌'గా మన ముందుకు తేవడంలోనూ కీలకపాత్ర దానిదే. మెటావర్స్‌ అనేది నెక్ట్స్‌ జెనరేషన్‌ టెక్నాలజీ. ఓ రకంగా ఫ్యూచరిస్టిక్‌ 3డీ ఇంటర్నెట్‌ అని చెప్పొచ్చు. ఫిజికల్‌ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ (ఫోన్‌ సహాయంతో), వర్చువల్‌ రియాలిటీ (ఆగ్యుమెంట్‌ రియాలిటీ సెట్‌ సాయంతో) లను కలిపి ఈ మెటావర్స్‌ టెక్నాలజీగా పిలుస్తున్నారు.

1
  •  వాయిస్‌ రికగేషన్‌...

ఇప్పుడు ఏ పని కావాలన్నా సిరినో, అలెక్సానో, గూగుల్‌ అసిస్టెంట్‌నో అడిగేయడం ప్రస్తుత తరానికి బాగా అలవాటైపోయింది. పర్సనల్‌ సెక్రటరీల్లా తయారైన ఆ ఆప్స్‌ పనిచేసేదీ ఏఐ సాయంతోనే. ఒక రకంగా చెప్పాలంటే మనిషి కోసం మనిషి తయారుచేసుకున్న మేధస్సు.. కాబట్టే దీన్ని కృత్రిమమేధ అంటున్నారు. యంత్రాలు- వాటికి అందజేసిన సమాచారాన్నీ, అనుభవాన్నీ ఉపయోగించుకుని ఒక స్థాయి వరకూ ఆలోచిస్తాయి, సమస్యల్ని పరిష్కరిస్తాయి.

  •  వైద్యరంగంలో..
1

కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా హెల్త్‌ రికార్డులను డిజిటలైజ్‌ చేయడం దగ్గర్నుంచీ పరిశోధనల వరకూ వైద్యరంగం ఎన్నోవిధాల లబ్ధి పొందుతోంది. ఏఐ సాయంతో ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించి, రోగనిర్ధారణ త్వరగా, కచ్చితంగా చేయవచ్చు. దీనిద్వారా ఎంఐటీ పరిశోధకులు శక్తిమంతమైన కొత్త యాంటిబయోటిక్‌ ఔషధాన్ని కనిపెట్టారు. 'హాలిసిన్‌' అని పేరు పెట్టిన ఈ మందు ఇప్పటివరకూ నయం కాని ఒకరకం క్షయతో సహా ఎన్నో బ్యాక్టీరియాలను చంపేస్తుందట.

  • పారిశ్రామిక విప్లవం..

ఆవిరి యంత్రం తొలిగా పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టగా, రకరకాల ఆవిష్కరణలతో పెద్దఎత్తున వస్తూత్పత్తికి తెరలేపుతూ సైన్సు రెండో విప్లవాన్ని తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన డిజిటల్‌ రివల్యూషన్‌ని మూడో పారిశ్రామిక విప్లవంగా పరిగణించిన పరిశోధకులు ప్రస్తుతం కృత్రిమమేధని నాలుగో పారిశ్రామిక విప్లవం అంటున్నారు.
ఉదాహరణకు ఈ కామర్స్‌ సంస్థలు నడిచేది ఏఐతోనే. ప్రకటనలతో వినియోగదారుని ఆకట్టుకోవడంతో మొదలుపెట్టి, వెబ్‌సైట్‌ ద్వారా వర్చువల్‌ షాపింగ్‌ అనుభూతిని కలిగించి, వస్తువు కొనగానే వేర్‌హౌస్‌ నుంచి వినియోగదారు ఇంటివరకూ చేరవేయడం, ఆ క్రమంలో ప్రతి దశనీ అతడికి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారమివ్వడం.. ఇదంతా ఏఐ చలవే.

1
  • మానవ వనరుల కల్పనలో..

కృత్రిమమేధతో పనిచేసే 'హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌' ఉద్యోగాల భర్తీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యోగ ప్రకటన దగ్గర్నుంచీ సరైన అభ్యర్థి ఎంపిక వరకూ అడుగడుగునా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ వినియోగిస్తున్నారు. తాము కోరుకుంటున్న అభ్యర్థికి ఏ లక్షణాలు ఉండాలో వాటిని కీ వర్డ్స్‌గా పెట్టి, వందలాది దరఖాస్తుల్ని క్షణాల్లో వడపోస్తున్నారు.
ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకి డబ్బు బదిలీ చేయాలంటే ఒక పూట పని. ఇప్పుడు చేతిలో ఉన్న ఫోనుతో నిమిషంలో ఆ పనిచేస్తున్నాం.

  •  సాగులో సాయం..
1

కంప్యూటర్‌ అంటే ఏమిటో తెలియని రైతుకీ ఆధునిక సాంకేతిక సేవల్ని అందించడం ఏఐతో సాధ్యమైంది. విదేశాల్లో ఇప్పటికే ఏఐ సాంకేతికతతో పనిచేస్తున్న యంత్రాలు, డ్రోన్లు మనిషితో పని లేకుండా వ్యవసాయం మొత్తం చేస్తున్నాయి. హైడ్రోఫోనిక్స్‌, వర్టికల్‌ ఫార్మింగ్‌లాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అయితే అచ్చంగా ఆటోమేటెడ్‌ సాగు చేస్తున్న సంస్థలూ ఉన్నాయి. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విశాలమైన మైదానాల్లో మేతకు వెళ్లే పశువులకు వాటి చెవులవెనుక అగ్గిపెట్టె సైజు పరికరం అమర్చి ఉంటుంది. సౌరశక్తితో పనిచేసే ఆ పరికరం ఆధారంగా పశువు ఎక్కడ ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి మేత తిన్నదీ తదితర సమాచారాన్నంతా యజమాని ఇంటి దగ్గర నుంచే గమనించగలుగుతాడు.

1
  •  వర్గానికి శక్తిమంతమే..

దేశంలో ప్రధాన మీడియా (ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌) కార్పొరేట్‌ కనుసన్నల్లో ఉంటే, సోషల్‌ మీడియా ప్రజావాణిగా రూపుదిద్దుకుంటోంది. అయినప్పటికీ సోషల్‌ మీడియాను కూడా శక్తిమంతమైన ఆయుధంగా వాడుకుంటున్నది పాలకులేనన్నది జగమెరిగిన సత్యం. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛ మరీ శృతిమించిందనే నెపంతో.. తప్పుడు వార్తలు, వదంతులు ప్రచారం చేసేవారిపై చర్యలనే పేరుతో వాస్తవాలను తెలిపే వారిపైనా ప్రభుత్వాలు చర్యలకు పూనుకుంటున్నాయి. ప్రభుత్వ చర్యలను నిర్వీర్యం చేసేవిగా ఉన్న ఆడియో, వీడియో క్లిప్పులను తొలగించాలని ట్విట్టర్‌, టిక్‌టాక్‌, హలో, ఫేస్బుక్‌లకు కేంద్రం ఆదేశాలిచ్చింది. ఓవైపు సోషల్‌ మీడియాపై ప్రభుత్వ స్పందనలు చూస్తే ఇటువంటి చర్యలు అవసరమే కదా అనిపిస్తుంది. కానీ గత అనుభవాలను పరిశీలిస్తే ఈ విధమైన చర్యలు ప్రజావాణిని నిరోధించటానికే అనేది సుస్పష్టం.
'గుజరాత్‌ అల్లర్లపై ఇటీవల బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బిబిసి) రూపొందించిన డాక్యుమెంటరీ నిషేధం' ఇందులో భాగమే. ఈ మేరకు యు ట్యూబ్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థలకూ సమాచార సాంకేతిక చట్టంలోని ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించడమే. ఈ చర్య ద్వారా దాదాపు 20 ఏళ్ల క్రితం ఒక మతానికి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని, గుజరాత్‌లో జరిగిన ఊచకోతకు సంబంధించిన నిజాలను దేశ ప్రజలు చూడకుండా అడ్డుకోవడం ప్రభుత్వ లక్ష్యం. ఈ దారుణం వెనుక నాటి గుజరాత్‌ పరిణామాల కారకుల హస్తం ఉందని ఆ డాక్యుమెంటరీలో పేర్కొనడమే ఈ నిషేధానికి కారణం. అన్ని ఆధారాలతోనే ఆ కథనాన్ని రూపొందించామని చెబుతున్న బిబిసి రెండో ఎపిసోడ్‌నూ విడుదల చేసింది. ఆ విషయం అలా ఉంచితే సత్యాన్ని ఎల్లకాలం గుప్పిట్లో దాచి, ఉంచలేరన్న సంగతి తెలిసిందే. బిబిసి ఎపిసోడ్‌ విషయంలోనూ అదే జరుగుతోంది.

  • సేఫ్‌ బ్రౌజింగ్‌ చాలా ముఖ్యం..
1

భద్రత విషయంలో జీమెయిల్‌ యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది గూగుల్‌. ఇందుకోసం వినియోగదారులు టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ చేసుకోవటం మంచిది. టూ స్టెప్‌ వెరిఫికేషన్‌లో భాగంగా మొదటి స్టెప్‌ పాస్‌వర్డ్‌ రూపంలో, రెండోది స్టెప్‌ పాస్‌ కోడ్‌ రూపంలో వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం మన మొబైల్‌ నెంబరును గూగుల్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. అకౌంట్‌ ఓపెన్‌ చేసే ప్రతిసారీ మొబైల్‌కి ఆరు అంకెల వెరిఫికేషన్‌ కోడ్‌ వస్తుంది. దీనివల్ల మెయిల్‌లో సురక్షితంగా లావాదేవీలు జరుపుకోవచ్చు.

  1.  బ్రౌజర్లు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఇంకా మొబైల్‌ డివైస్‌కు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం అవసరం.
  2.  సైబర్‌ దాడుల నేపథ్యంలో మన అకౌంట్స్‌కు సంబంధించి విభిన్నమైన పాస్‌వర్డ్స్‌ను సెట్‌ చేసుకోండి.
  3.  మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ఫుడ్‌ డెలివరీ, షాపింగ్‌, టిక్కెట్‌ బుకింగ్‌, గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా ప్రతి అవసరానికీ యాప్‌లు ఉన్నాయి. అయితే కొన్ని యాప్స్‌లో భద్రత లోపంతో మాల్‌వేర్‌ ద్వారా యూజర్‌ వ్యక్తిగత డేటా హ్యాకర్స్‌కు చేరిపోతున్నాయి. అలాంటి వాటిని గుర్తించి, ఏటా గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి మాల్‌వేర్‌ ఉన్న యాప్‌లను తొలగిస్తుంటాయి. అందుకే కొత్తగా యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసే ముందు వాటికి ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌ ప్రొటెక్షన్‌ ఉందా, లేదా అనేది సరిచూసుకోవాలి.
  4. ఆఫర్ల పేరుతో మెయిల్‌, మెసేజ్‌ల ద్వారా వచ్చే లింక్స్‌పై క్లిక్‌ చేయకపోవడమే మంచిది. వాటిలో ఎక్కువ శాతం యూజర్స్‌ డేటాను దొంగిలించేందుకు హ్యాకర్స్‌ మాల్‌వేర్‌ కోడ్‌తో వాటిని యూజర్‌ మొబైల్‌ లేదా మెయిల్‌కు పంపుతారు.
  5.  వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌), ఇది యూజర్లకు, ఇంటర్నెట్‌కు మధ్య సురక్షితమైన కనెక్షన్‌ను అందిస్తుంది. దీనిద్వారా ఆన్‌లైన్‌ బ్రౌజింగ్‌ చేస్తే మిమ్మల్ని ఎవరూ ట్రాక్‌ చేయలేరు. హ్యాకర్ల నుంచి డేటాను కాపాడుకునేందుకు కార్పొరేట్‌ కంపెనీలు ఎక్కువగా ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంటాయి. 2021 గణాంకాల ప్రకారం వీపీఎన్‌ నెట్‌వర్క్‌ ఉపయోగించే 85 దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.
  6. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఖాతాలేని వ్యక్తులు అరుదు. అయితే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫొటోలు, వీడియోలను సేకరించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో సోషల్‌ మీడియా కంపెనీలు యూజర్లకు మెరుగైన భద్రత కల్పించడంలో భాగంగా ప్రొఫైల్‌ లాక్‌, ప్రైవసీ ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వ్యక్తిగత గోప్యత, మెరుగైన ఆన్‌లైన్‌ భద్రత కోసం సోషల్‌ మీడియా ఖాతాల్లోని ప్రైవసీ ఫీచర్లు ఎనేబుల్‌ చేసుకోమని సోషల్‌ మీడియా సంస్థలు సూచిస్తున్నాయి.
  7. చాలా మంది బయటికి వెళ్లినప్పుడు మొబైల్‌ డేటా ఆదా చేసే ఉద్దేశంతో ఉచిత వైఫై సేవలను ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో అన్ని వైఫై నెట్‌వర్క్స్‌ సురక్షితం కావని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్‌కు చేరిపోయే ప్రమాదం లేకపోలేదని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.
  8. ఇటీవలి కాలంలో నకిలీ వెబ్‌సైట్లతో యూజర్స్‌ మోసపోతున్నారు. అందుకే బ్రౌజర్‌లో బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినప్పుడు అడ్రస్‌ బార్‌లో హెచ్‌టీపీపీఎస్‌ అని ఉండాలి. ఒకవేళ అడ్రస్‌ బార్‌లో హెచ్‌టీపీపీ అని ఉంటే ఆ పేజీని అనుమానించాల్సిందే.
  • వెబ్‌ వ్యాపారం..
1

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారాన్ని ప్రారంభించి, స్థిరంగా కొనసాగించడం చాలా క్లిష్టమైన పని. అయితే లక్షలాది ప్రజల నిత్యజీవితంలో ఇంటర్నెట్‌ కమ్యూనికేషన్‌ విషయంలో అత్యంత ముందంజలో ఉంది. కానీ కొన్ని అసందర్భమైన కారణాల వల్ల వ్యాపారంలో ఇంటర్నెట్‌ వాడకం తక్కువగానే ఉంది. అయితే వ్యాపారమేదైనా ఇంటర్నెట్‌ కీలకమైన పాత్ర పోషించగలదు. అనేక రకాలుగా వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ప్రధానపాత్ర వహించేందుకు అవకాశాలున్నాయి. మార్కెటింగ్‌, అడ్వర్టయిజింగ్‌, ప్రతిష్ట పెంపుదల, విశ్వసనీయత సాధన, క్లయింట్లతో సంప్రదింపులూ సమచార వినిమయం వంటి వాటికి ఇంటర్నెట్‌ ఇతోధికంగా ఉపయోగపడుతుంది. మారుమూల సేవలందించడానికి, ఆన్‌లైన్‌ లావాదేవీలకు మాత్రమే కాకుండా ఇటువంటి వాటికీ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. బ్లాగ్స్‌ ఏర్పాటు మాత్రమే ఇంటర్నెట్‌ విషయంలో ప్రధానం కాదు. వాటి నిర్వహణా ముఖ్యమే. అయితే అనేక వెబ్‌ పోర్టల్లో ఒకప్పుడు సమాచారం ఉచితంగా లభించేది. ప్రస్తుతం అదే సమాచారాన్ని అమ్మకానికి పెడుతున్నారు. దీంతోపాటు ముఖ్యమైన కంటెంట్‌ను అందుబాటులో లేకుండా చేయడం కూడా ఓ వ్యాపారం అయ్యింది. మరీ ముఖ్యంగా ఓ వర్గానికి చెందిన కంటెంట్‌ని కనిపించకుండా చేయడం, లేదా వారికి కావాల్సిన కంటెంట్‌ని మాత్రమే అందుబాటులో ఉండేలా చేయడమూ వ్యాపారమైంది. సూటిగా చెప్పాలంటే ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ని ఉపయోగించి, పాలక వర్గానికి అనుకూలంగా ఉండే సమాచారం మాత్రమే ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఉదయ్ శంకర్‌ ఆకుల
7989726815