
1 నుంచి 5 తరగతుల ప్రభుత్వ పాఠశాల లేకుండా 6 నుంచి 10 వరకు ఉన్న ఉన్నత పాఠశాల ఎన్‌రోల్‌మెంట్ ఎక్కడ నుంచి పెరుగుతుంది? అలాగే ఇప్పుడు మూడు నుంచి పది వరకు పాఠశాలల్లోకి పిల్లలు ఎక్కడ నుంచి చేరతారు? కింద స్థాయిలో ఒకటి, రెండు తరగతి పాఠశాలల్లో పిల్లలు తగ్గిపోతే, అక్కడ నుంచి వచ్చేవారే కదా మూడు నుంచి పది వరకు పాఠశాలల్లో చేరేది. అప్పుడు 3 నుంచి 10 వరకు పాఠశాల ఎలా బతుకుతుంది? పునాది వంటి చిన్న బడి బాగు గురించి ఆలోచించకుండా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, విలీనాల మీద విలీనాలు, రేషనలైజేషన్ మీద రేషనలైజేషన్లు జరుపుకుంటూ పోతే పిల్లల సంఖ్య ఎలా పెరుగుతుంది ?
అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఇ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఒక్క రెండు రెండు, రెండు రెండ్లు నాలుగు... వారాల పేర్లు.. నెలల పేర్లు, శ్లోకాలు, పెద్దలను గౌరవించడంతో పాటుగా ఏ పండగైనా అందరం కలిసి చేసుకోవాలని నేర్పిన మన ఊరి చిన్న బడి మాయమైపోతోందంటే కడుపు తరుక్కుపోతుంది. నేటి టీచర్లు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ దాదాపుగా ఆ చిన్న బడిలో చదువుకున్న వారే. మరి నేటి పిల్లలకి ఆ చిన్న బడి కమ్మదనాన్ని అందించాల్సింది ఎవరు ?
2021 ఏప్రిల్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 33,813. ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 1287. అన్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 4040. మొత్తంగా 39,140 ప్రాథమిక పాఠశాలలు వున్నాయి. వీటిలో 26,50,910 మంది విద్యార్థులు అభ్యసించేవారు. ఇక ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, గిరిజన అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు కలిపి 61,137 పైగానే ఉన్నాయి. ప్రాథమిక తరగతులు బోధించే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 71 వేల మంది వరకూ వున్నారు. వీరికి అదనంగా సుమారు 3 వేల మంది ఎయిడెడ్, ఎస్.జి.టి.లు వున్నారు. 56 తెలుగు అక్షరాలు నేర్పడానికి ఎన్నో పథకాలు, ఎన్నో స్కీమ్‌లు అమలు చేశాం. ఉపాధ్యాయులకు శిక్షణ మీద శిక్షణ ఇచ్చాం. ఏమైందో తెలిసేలోపు 26 అక్షరాల భాష వచ్చేసింది. ఇదే సర్వస్వం అయిపోయింది. దీని చుట్టూ పాలసీలు రూపొందించేశారు. జీవో-117 వచ్చేసింది. ప్రపంచ స్థాయి విద్యార్థిని తయారు చేయడం లక్ష్యంగా మారింది. పిల్లలకు సబ్జెక్ట్ ఉపాధ్యాయులతో బోధన, ఉపాధ్యాయులకు కోరుకున్న ప్రమోషన్లు...చకచకా హైస్కూల్‌కి ఒక కిలోమీటర్ లోపు ఉన్న చిన్న బడిలోని 3,4,5 తరగతుల పిల్లలు, మ్యాపింగ్ జరిగిపోయాయి. అక్కడక్కడ గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చిన వారు కొందరు మా బడి, మా ఊరు లోనే ఉండాలన్నారు. చిన్నారులు సైతం మా చిన్న బడి కావాలని తల్లిదండ్రులను కదిలించారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, ప్రజా సంఘాల వారు కలపి బస్సు యాత్ర చేశారు. అక్కడక్కడ కొన్ని చిన్న బడులను అపగలిగారు. ఈ కథ అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు చదువుకు కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అసలు కథ మొదలైంది.
చిన్న బడి ప్రస్తుతం....
ఎలా ఉందో చూద్దామని వివిధ జిల్లాలలో పర్యటించాం. చిన్న బడిలో పిల్లలు చేరడం లేదని విని మనసు విలవిలలాడిపోయింది. గుంటూరు జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్న వట్టిచెరుకూరు మండలంలో గత సంవత్సరం 1 నుంచి 5వ తరగతి వరకు 97 మంది వున్నారు. వారిలో 60 మంది 3,4,5 తరగతి పిల్లలను దగ్గర్లో ఉన్న ఉన్నత పాఠశాలకు తరలించారు. ఈ సంవత్సరం 1,2 తరగతుల పిల్లలు 26 మంది మాత్రమే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో విలీనం కాకముందు 1 నుంచి 5 తరగతుల వరకు 98 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 3,4,5 తరగతుల నుండి 72 మందిని ఉన్నత పాఠశాలకు తరలించారు. ఒకటి, రెండు తరగతి పిల్లలు 26 మంది మిగిలారు. ఈ సంవత్సరం ఒకటి, రెండు తరగతి పిల్లలు కలిపి 16 మంది ఉన్నారు. కృష్ణా జిల్లా నందిగామ మండలంలో గతంలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు 56 మంది విద్యార్థులు ఉన్నారు. 3,4,5 తరగతుల 50 మంది విద్యార్థులను స్థానిక ఉన్నత పాఠశాలకు తరలించారు. ఇక్కడ ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు వున్నారు. నూతన అడ్మిషన్లు రెండు వచ్చాయి. కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని మరొక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు వరకు మొత్తం 123 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 109 విద్యార్థులను స్థానిక ఉన్నత పాఠశాలకు పంపారు. ఇక 14 మంది మిగిలారు. ఈ సంవత్సరం నూతన అడ్మిషన్లు మూడు. బాపట్ల జిల్లా లోని ఓ మండలంలో ఒకటి నుంచి ఐదు వరకు 44 మంది విద్యార్థులు ఉండేవారు. వారిలో 3,4,5 తరగతుల విద్యార్థులు 34 మందిని తరలించారు. ప్రస్తుతం పదిమంది ఉన్నారు. కొత్త అడ్మిషన్లు రెండు మాత్రమే వచ్చాయి. కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలంలో 1 నుంచి 5 తరగతులు విద్యార్థులు 136 మంది ఉండేవారు. వారిలో స్థానికంగా 3,4,5 తరగతులలోని 85 మందిని ఉన్నత పాఠశాలకు తరలించారు. ప్రస్తుతం ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు 33 మంది ఉన్నారు. ఇక్కడ అడ్మిషన్లు 10 దాకా వచ్చాయి. నెల్లూరు జిల్లా ఒక మండలంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు 89 మంది విద్యార్థులు గతంలో ఉండేవారు. గతంలో 3,4,5 తరగతులకు చెందిన 64 మందిని తరలించారు. ప్రస్తుతం ఆ పాఠశాల విద్యార్థుల సంఖ్య 27. ఈ సంవత్సరం అడ్మిషన్లు 3. ఈ పరిస్థితి 1,2 తరగతుల పాఠశాలల వరకే అనుకుంటే పొరబాటే. 1-5 తరగతులున్న ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఇదేవిధంగా ఎన్‌రోల్‌మెంట్ తగ్గిపోయింది. అలాగే అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లోనూ ఎన్‌రోల్‌మెంట్ మందగించింది. కృష్ణా జిల్లాలో ఒక ఎం.పి.యు.పి. పాఠశాలలో 1-8 తరగతుల వరకు 129 రోల్ ఉంది. ఒకటో తరగతిలో ఏడు మాత్రమే న్యూ అడ్మిషన్లు. ఒక ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతుల వరకు 31 మంది పిల్లలున్నారు. ప్రస్తుతం ఐదు తరగతులు నడుస్తున్నాయి. ఇక్కడ ఒకటో తరగతి అడ్మిషన్లు రెండు మాత్రమే. మరొక ఎంపీయూపీ పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఉన్నాయి. 104 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం ఒకటవ తరగతి అడ్మిషన్లు 3. మొత్తంగా 7 అడ్మిషన్లు మాత్రమే అయ్యాయి. అలాగే 1-5 తరగతులున్న ఒక పాఠశాలలో 14 మంది వున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ ఒక అడ్మిషన్ మాత్రమే అయ్యింది. ఇది భౌతికంగా కొన్ని జిల్లాల్లో చూసిన సమాచారం మాత్రమే. ఇంకా అన్ని జిల్లాలు, అన్ని పాఠశాలలను పూర్తి స్థాయి సర్వే చేస్తే ఇంతకంటే భిన్నంగా ఉండే అవకాశం ఏమీ లేదు.
అడ్మిషన్లు ఎందుకు తగ్గాయి ?
పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నాము, 'నాడు-నేడు'తో పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాము. కావాల్సిన జీవీకే కిట్లు ఇస్తున్నాము. పాఠశాల అద్భుతంగా ఉంది. ఇక నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులదే-అని ప్రభుత్వం చెప్తున్నది. ఎక్కువ ఎన్‌రోల్‌మెంట్‌తో సక్రమంగా నడుస్తున్న 1-5 తరగతుల వరకు ఉన్న చిన్న బడిని జీవో నెంబర్-117 పేరుతో...హైస్కూల్లో మ్యాపింగ్ ఎందుకు చేశారు? దానివల్లే కదా ఈ రోజు పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి అంటే దానికి సమాధానం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో 14,000 పైచిలుకు ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. 98 లోపు ఎన్‌రోల్‌మెంట్ ఉన్న యూపీ పాఠశాలలో 2,400 దాకా ఉన్నాయి. 137 కంటే తక్కువ రోల్ ఉన్న ఉన్నత పాఠశాలలు 500 పైగా ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఈ రోజు అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. తల్లిదండ్రుల దగ్గరికెళితే వాళ్ళు వాస్తవాలు చెప్తున్నారు. 'ఒక ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలకు మా పిల్లల్ని ఎలా పంపిస్తాం సార్? ముగ్గురు ఉపాధ్యాయుల ఉన్న దగ్గర కూడా ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నారు. మా పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా వస్తుంది?' అని అడుగుతున్నారు. సమాధానం ఎవరు చెప్పాలి. ఈ చిన్న బడి ఇలా మారిపోవటానికి కారణం ఎవరు ?
కథ మొదటికే
జూన్ 12వ తేదీన బడులు మొదలయ్యాయి. జూన్ 12 నుండి 25 వరకు వేసవి ఎక్కువగా ఉందనే పేరుతో ఆఫ్ డే స్కూళ్లు పెట్టారు. 27 నుంచి పూర్తి రోజు పాఠశాల ప్రారంభం అనుకుంటే రెండు రోజుల పాటు ఐ.ఎఫ్.పి. ట్రైనింగ్ ఇచ్చారు. డిజిటల్ బోర్డులు ఇస్తామని, దానిలో పిల్లలకు చదువు చెప్పాలన్నారు. గతంలో ఇచ్చిన బైజూస్ టాబ్‌లను ఈ డిజిటల్ బోర్డులోకి ఇన్‌స్టాల్ చేసి పాఠాలు బోధించాలి. రెండు రోజులపాటు స్కూల్ కాంప్లెక్స్‌లు. జీవీకే కిట్లు ఇచ్చారో లేదో మొత్తాన్ని అప్‌డేట్ చేయాలని ఒత్తిడి. ఇచ్చిన బూట్లు కొద్దిమంది పిల్లలకు సరిపోలేదు. సిబ్బందికి బదిలీలు, ప్రమోషన్ ఇచ్చారు. ఆ పోస్టులు ఒక చోటు నుంచి మరో చోటికి మార్చారు. క్యాడర్ స్ట్రెంత్ ఇంకా అప్‌డేట్ చేయలేదు. జీతాల సమస్య కొనసాగుతున్నది. ఇప్పుడు ఎన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయో, ఎంతమంది ఎస్‌జిటి ఉపాధ్యాయులు ఉన్నారో గణాంకాలు లేవు. ఏదేమైనా ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోతుంది. జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలు పెరుగుతు న్నాయి. ఇవన్నీ ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరుసు ్తన్నాయి. ఆలోచించాలి కదా. చదువు చెప్పటం తప్ప మరే ఇతరత్రా పనులు ఉండకూడదని ఉపాధ్యాయులు భావిస్తు న్నారు. పాఠశాలల్లో విద్యార్థికి నాణ్యమైన విద్య రావడం కోసం ఇంత ఒత్తిడి అవసరమా. ఇంత వర్క్ అవసరమా. తప్పకుండా ఆలోచించాలి. చర్చ జరగాలి. గతంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుకున్న ప్రస్తుత ఉపాధ్యాయులు, అధికారులు, రాజకీయ నాయకులు...చిన్న బడి చుట్టూ ఆలోచించాలి.
చిన్న బడి లేకుండా...
1 నుంచి 5 తరగతుల ప్రభుత్వ పాఠశాల లేకుండా 6 నుంచి 10 వరకు ఉన్న ఉన్నత పాఠశాల ఎన్‌రోల్‌మెంట్ ఎక్కడ నుంచి పెరుగుతుంది? అలాగే ఇప్పుడు మూడు నుంచి పది వరకు పాఠశాలల్లోకి పిల్లలు ఎక్కడ నుంచి చేరతారు? కింది స్థాయిలో ఒకటి, రెండు తరగతి పాఠశాలల్లో పిల్లలు తగ్గిపోతే, అక్కడ నుంచి వచ్చేవారే కదా మూడు నుంచి పది వరకు పాఠశాలల్లో చేరేది. అప్పుడు 3 నుంచి 10 వరకు పాఠశాల ఎలా బతుకుతుంది? పునాది వంటి చిన్న బడి బాగు గురించి ఆలోచించకుండా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, విలీనాల మీద విలీనాలు, రేషనలైజేషన్ మీద రేషనలైజేషన్లు జరుపుకుంటూ పోతే పిల్లల సంఖ్య ఎలా పెరుగుతుంది? ప్రభుత్వ చిన్న బడిలో ఎన్‌రోల్‌మెంట్ తగ్గితే దాన్ని ప్రభావం 3-10 తరగతులున్న పాఠశాల మీద పడుతుందనే చిన్న లాజిక్‌ను ప్రభుత్వం ఎందుకు అశ్రద్ధ చేస్తుంది? ఎందుకు ఉపాధ్యాయులు ఈ చిన్న అంశాన్ని పట్టుకోలేదు. సమాజానికి అర్థం అయ్యేటట్టు ఎందుకు చెప్పలేకపోయాం. చిన్న బడి లేకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే సాధారణ సూత్రాన్ని ఇప్పటికైనా ప్రజానీకానికి అర్థం అయ్యేటట్లు చెప్పాలి. చిన్న బడి బతకకుండా ఉపాధ్యాయులు కూడా మనలేరనేది అర్థం చేసుకోవాలి. చిన్న బడిలో పిల్లల్ని చేర్చే బాధ్యత, ప్రభుత్వ బడి మీద భరోసానిచ్చే బాధ్యత ఉపాధ్యాయులుగా మనం తీసుకోవాలి. హక్కుల కోసం అవసరమైన సందర్భంలో పోరాటం చేస్తూనే, బాధ్యతల విషయంలో అవసరమైతే మరొక గంట, మరొక పీరియడ్, మరొక సెలవు రోజు పిల్లలతో గడపటానికి, పిల్లలకు చదువు మీద ఆసక్తి పెంచడానికి కృషి చేద్దాం. ఆ శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. ఇప్పటికే పాఠశాలల సమయంతో సంబంధం లేకుండా పిల్లలతో గడిపే మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుందాం. వారిని గౌరవిద్దాం. ఎన్ని ఇబ్బందులు అయినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మన దగ్గరకు వచ్చే విద్యార్థులకు 4 అక్షరాలు నేర్పే ఒక కర్తవ్యాన్ని తీసుకుందాం. ప్రభుత్వ బడి మీద నమ్మకం కలిగిద్దాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ చిన్న బడి కోసం ఆ బడిని బతికించటం కోసం...ఏం చేయాలో మనమే ఒక ప్రణాళికను రూపొందిద్దాం. చిన్న బడిని బతికించుకుందాం.
/ వ్యాసకర్త యు.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు /
ఎన్. వెంకటేశ్వర్లు