
గతేడాది చివరిలో బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో పచ్చి మితవాద, ఛాందసవాద, మతతత్వ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ భద్రతా బలగాలు, యూదు సెటిలర్ల దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది.
1967 యుద్ధం నాటి నుంచి వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతంగా పరిగణించే అంతర్జాతీయ చట్టాన్ని దారుణంగా ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్‌లో వెస్ట్ బ్యాంక్‌ను కలిపేసుకునే దిశగా చర్యలు తీసుకుంటామని నెతన్యాహు ప్రభుత్వం నిర్లజ్జగా ప్రకటించింది.
వెస్ట్ బ్యాంక్‌లో ఇంతకుముందు నిర్మాణాలు చేపట్టిన 9 అక్రమ సెటిలర్స్ కాలనీలను (సెటిల్మెంట్స్‌ను) క్రమబద్ధీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో సెటిల్మెంట్‌లో 10వేల కొత్త ఇళ్ళు నిర్మించారు. అలాంటి 140 సెటిల్‌మెంట్లను ఇజ్రాయిల్ నిర్మించింది. 1967లో ఆక్రమించుకున్నప్పటి నుండి వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలలో దాదాపు 6లక్షల మంది యూదు సెటిలర్లకు అక్రమంగా ఆవాసాలను ఏర్పాటుచేసింది. వెస్ట్ బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనియన్లను వారి ఇళ్ళ నుండి, భూముల నుండి గెంటివేసేందుకు యూదు సెటిలర్ల అక్రమ ఆక్రమణలను ఇజ్రాయిల్ ప్రోత్సహిస్తూ పాలస్తీనీయులను తీవ్ర కడగండ్ల పాల్జేస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ సంకీర్ణ కూటమిలో భాగస్వాములుగా ఉన్న మతతత్వ పార్టీలు పాలస్తీనియన్ల తరలింపు, గెంటివేతలను బాహాటంగా సమర్థించుకొస్తున్నాయి. పాలస్తీనియన్లపై హింసాత్మక దాడులు ఈ కాలంలో విపరీతంగా పెరగడానికి ఇదొక ముఖ్య కారణం.
ఇజ్రాయిల్ రక్షణ బలగాలు, ఇతర పారా మిలటరీ బలగాలు వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్ల ఇళ్ళపై పదేపదే దాడులకు తెగబడుతున్నాయి. తీవ్రవాదులను అరెస్టు చేస్తున్నామనే సాకుతో ఈ అకృత్యాలకు అవి పాల్పడుతున్నాయి. జనవరిలో జెనిన్‌లో పాలస్తీనీయులపై పెద్దయెత్తున దాడులకు దిగాయి. ఈ దాడుల్లో పది మంది అమాయక పాలస్తీనా పౌరులు మరణించారు.. మృతుల్లో 61ఏళ్ళ వృద్ధ మహిళ కూడా వున్నారు. నబ్లస్ పట్టణంలోనూ ఇదే విధమైన ఊచకోతకు పాల్పడ్డాయి. ఫిబ్రవరి 22న జరిగిన ఆ దాడిలో 11మంది పాలస్తీనియన్లు మరణించగా, మరో 102 మంది దాకా గాయపడ్డారు.
మొత్తమ్మీద కొత్త సంవత్సరం ప్రారంభంలోనే 62మంది పాలస్తీనియన్లు మరణించారు. అంటే సగటున రోజుకో పాలస్తీనియుడి కన్నా ఎక్కువమందే హతులవుతున్నారన్నమాట.
ఆ విధంగా పాలస్తీనీయులు తమ సొంత గడ్డపై శరణార్థులుగా బతుకీడ్చే దుస్థితికి నెట్టబడ్డారు. పాలస్తీనీయులను ఇజ్రాయిల్ ప్రభుత్వం వెంటాడి వేదిస్తోంది. పిల్లినైనా నాలుగు గోడల మధ్య బంధించి కొడితే తిరగబడుతుంది. అదే విధంగా పాలస్తీనియన్లు తమపై జరుగుతున్న ఈ అన్యాయాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎదురు తిరగడం మొదలెట్టారు. నబ్లస్ దాడి తర్వాత, ఆ ప్రాంతానికి సమీపంలోని హువారాలో ఇద్దరు యూదు సోదరులను వారు కాల్చి చంపారు. అదేరోజు, 400మంది యూదు ఆవాసులు, ఐడిఎఫ్, ప్రభుత్వ బలగాలు కలసి మూకుమ్మడిగా దాడి చేశాయి. 30ఇళ్ళను తగలబెట్టాయి. మరో 40ఇళ్ళను, వంద కార్లను ధ్వంసం చేశాయి. ఈ దాడిలో ఒక పాలస్తీనా పౌరుడు చనిపోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా దళాలు విచక్షణా రహితంగా సాగించిన ఈ దాడులను పాలక సంకీర్ణానికి చెందిన సభ్యుడొకరు బాహాటంగా సమర్ధించుకొచ్చారు. అంతేకాదు, ఈ హత్యాకాండకు పౌర హక్కుల గ్రూపులే కారణమని నిందించారు.
సరిగ్గా ఆ సమయంలోనే గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ వైమానిక దాడులకు తెగబడింది. దీంతో ఆ ప్రాంతంలోని 20లక్షల మంది పాలస్తీనీయుల బతుకులు ఛిద్రమయ్యాయి.
అక్రమ సెటిల్మెంట్లను ఇజ్రాయిల్ ప్రభుత్వం బాహాటంగా సమర్థించడమంటే ఐక్యరాజ్య సమితి తీర్మానాలను తుంగలో తొక్కడమే. ఇజ్రాయిల్ నిర్మాణాలను, సెటిల్‌మెంట్ల విస్తరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 14న భద్రతా మండలి ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, ఇజ్రాయిల్ సెటిల్‌మెంట్ల కార్యకలాపాలను తక్షణమే ఆపేయాలని కోరుతూ పాలస్తీనా ప్రతినిధి ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానానికి, భద్రతా మండలి ఆమోదించిన తీర్మానానికి అసలు పొంతనే లేదు. అమెరికా జోక్యం చేసుకుని భద్రతా మండలి తీర్మానాన్ని ఎంతగా నీరుగార్చాలో అంతగా నీరుగార్చేసింది.
ఇంతకు ముందు సంపాదకీయంలో పేర్కొన్నట్లుగా, పాలస్తీనా ప్రయోజనాలకు మద్దతిచ్చే చిర కాల మిత్రత్వ వైఖరి నుండి భారత్ పక్కకు తప్పుకుంది. జెనిన్, నబ్లస్‌ల్లో ఇజ్రాయిల్ భద్రతా బలగాలు యథేచ్ఛగా సాగించిన హత్యాకాండ, హింసాకాండ గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా, జెరూసలేంలోని యూదు ప్రార్ధనా మందిరంపై దాడిని ఖండించడానికి మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్కడ లేని ఆతృత కనబరచింది. పైగా అమెరికా, యుఎఇ, ఇజ్రాయిల్‌లతో కూడిన మధ్య ప్రాచ్య క్వాడ్‌లో భారత్ ఈ మధ్య చేరింది. నెతన్యాహు ప్రభుత్వ పచ్చి మితవాద, యూదు దురహంకార వైఖరికి హిందూత్వ శక్తులు పూర్తి స్థాయి మద్దతునిస్తున్నాయి.
ఇజ్రాయిల్ దౌర్జన్యాలు, దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనియన్లకు భారత్‌లోని లౌకిక, ప్రజాతంత్ర శక్తులు సంఘీభావం తెలపడం అత్యంతావశ్యకం. మార్చి 7 నుండి 11 వరకు పాలస్తీనా సంఘీభావ ప్రచారాన్ని నిర్వహించాలంటూ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (అయిప్సో) పిలుపునిచ్చింది. ఈ ప్రచారాన్ని జయప్రదం చేసేందుకు అన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులూ కృషి చేయాలి.
(పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం)