సహకార రంగాన్ని కాపాడుకోకపోతే పూర్వకాలంలో లాగే రైతులు వడ్డీవ్యాపారుల కబంధ హస్తాల్లో పడి నలిగిపోతారు. ఒకరికొకరు సహాయం చేసుకునే వ్యవస్థ కుప్పకూలిపోకుండా కాపాడుకోవాలి. ఒకపక్క ప్రభుత్వ రంగంపై దాడి జరుగుతోంది. విద్యుత్తు, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్సు, చమురు వంటి కీలక రంగాల ప్రైవేటీకరణకు మోడీ ప్రభుత్వం బాటలు వేసింది. మరో పక్క ప్రైవేటు పెట్టుబడుల విస్తరణకు ఆటంకంగా ఉన్న సహకార రంగంపై వేటు వేస్తోంది. కేంద్ర మంతి అమిత్‌షా వేసే ఎత్తులకు మోసపోకుండా వాటిని తిప్పికొట్టాలి.
జులై 1న సహకార రంగ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల వైపు ప్రగతి సాధనలో సహకార సంఘాల ప్రభావాన్ని గుర్తుచేసుకున్నారు. పేదరికం, ఆరోగ్యం, ఆకలి, సంక్షేమం సమస్యల పరిష్కారంలో సహకార రంగ పాత్రను శ్లాఘించారు. తమకు తామే సహాయం చేసుకునే యంత్రాంగంగా సహకార రంగం గుర్తించబడింది. భద్రతను, సాధికారతను కల్పించటంలో సహకార రంగం ముందు పీఠిన ఉంది.
ఇటీవల ఇండియాలో జరిగిన జి-20 సమావేశాల్లో సహకార రంగంపై చర్చ జరిగింది. ఇంటర్నెట్ ఆధారిత ఆర్థిక సేవల్లో సహకార రంగంతో పాటు ప్రైవేటు పెట్టుబడిదారీ సంస్థలకు కూడా చోటు కల్పించాలని నిర్ణయించారు. పూర్వం ఊహాజనిత సోషలిస్టులైన రాబర్ట్ ఓవెన్, చార్లెస్ ఫోరియర్‌లు కార్మికులు ఒక వర్గంగా యాజమాన్యం వహించేందుకు సహకార రంగం ఉపయోగపడుతుందని భావించారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటానికి ఒక సాధనంగా సహకార రంగాన్ని ఉపయోగించుకోవాలని కారల్ మార్క్స్ సూచించారు. సహకార రంగం అభివృద్ధి చెందితే పెట్టుబడిదారీ వ్యవస్థ బలహీన పడుతుందని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సమానంగా సహకార రంగం అభివృద్ధి చేయబడింది. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఉన్న సహకార సంఘాల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహాలతో సహకార రంగం రైతులకు, ప్రజలకు సేవ చేస్తూ అభివృద్ధి బాటలో నడిచింది. అటువంటి సహకార రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కూలగొట్టే పని సరళీకరణ విధానాల అమలు క్రమంలో ప్రారంభమైంది.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను మూసివేసేందుకు, ప్రైవేటీకరించేందుకు, వాటి సైజులను తగ్గించేందుకు నాటి టిడిపి ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసింది. ప్రపంచ బ్యాంకు వద్ద వ్యవస్తీకృత సర్దుబాటు రుణం తీసుకుని దాని షరతులకు అనుగుణంగా సహకార రంగంలో సంస్కరణలు అమలు చేసింది.
ఆ సమయంలోనే ఒకప్పుడు వెలుగొందిన సహకార రంగం కుదేలైంది. సహకార చక్కెర మిల్లులు, నూలు మిల్లులు కనుమరుగయ్యాయి. ఇపుడు ఉన్న కొద్దిపాటి సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూత దశలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరువాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు సహకార రంగంలో సంస్కరణలను కొనసాగించాయి, కొనసాగిస్తున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం కల్పించాయి.
రాష్ట్రంలో పాల వెల్లువలో ప్రముఖ పాత్ర పోషించిన సహకార పాల రంగం క్రమేపీ కనపడకుండా పోయింది. అక్కడక్కడ మిణుకు మిణుకుమంటోంది. ప్రముఖ సహకార డెయిరీలు కంపెనీలుగా మారిపోయాయి. సహకార చక్కెర మిల్లులను పునరుద్ధరిస్తామని కాంగ్రెసు, వైసిపి ప్రభుత్వాలు తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదు. రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో సహకార సంఘాలు ఒకే ఫెడరేషన్ కింద లేకుండా అనేక ఫెడరేషన్లుగా విచ్ఛిన్నమయ్యే, ఆ తర్వాత ఆ ఫెడరేషన్లు కంపెనీలుగా మారే విధంగా చట్ట సవరణలు చేశారు.
సహకార రంగంలో మిగిలి ఉన్న ఏకైక వ్యవసాయ పరపతి విభాగాన్ని కూడా ప్రైవేట్ పెట్టుబడులకు అప్పగించే ప్రక్రియను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. 50 శాతం వాటాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ చట్ట సవరణలు చేసింది. అదే సమయంలో సహకార రంగానికి పూర్వ వైభవం తెస్తామంటూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పరిధిలో సహకార శాఖను ఏర్పాటు చేసింది. సహకార రంగాన్ని తన చేతిలోకి తెచ్చుకునేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టానికి సవరణ చేసి రాష్ట్ర పరిధిలో ఉన్న సహకార సంఘాలు బహుళ రాష్ట్ర సహకార సంఘాలుగా మారే దారి కల్పించింది. అపుడు అవి కేంద్రం అధీనంలోకి పోతాయి.
గుజరాత్ రాష్ట్రంలోని అమూల్ డెయిరీ ఇప్పటికీ గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జి.సి.ఎం.ఎం.ఎఫ్.ఎల్) పేరుతో ఒక రాష్ట్ర సహకార సంఘంగా ఉంది. రాష్ట్ర సహకార శాఖ పరిధిలో ఉంది. అది తన పాల ఉత్పత్తులను దేశంలో, విదేశాల్లో అమ్ముకుంటోంది. ఇతర ఐదు సహకార సంఘాలతో (ఇతర రాష్ట్రాలవి) విలీనం చేసి బహుళ రాష్ట్ర సహకార సంఘంగా మారుస్తామని కేంద్ర మంత్రి అమిత్‌షా 2022 లోనే ప్రకటించారు.
ఈ క్రమంలో అమూల్ డెయిరీ బహుళ రాష్ట్ర సహకార సంఘంగా మారినట్లు ఇంకా వార్తలు ఎక్కడా రాలేదు. మన రాష్ట్ర పాల ఫెడరేషన్‌ను కూడా బహుళ రాష్ట్ర సహకార సంఘంగా మార్చిన దాఖలాలు లేవు. అలా మారకుండానే మన రాష్ట్రంలో అమూల్ విస్తరణకు వైసిపి ప్రభుత్వం తోడ్పడుతోంది. ఒంగోలు, చిత్తూరు డెయిరీలను అది స్వాధీనం చేసుకుంది. పాల సేకరణ, పంపిణీ, పాల ఉత్పత్తుల తయారీ కోసం రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రజలతో, రైతులతో సంబంధం లేకుండా మోడీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైసిపి ప్రభుత్వం నడుస్తోంది. చివరికి ఇది ఒక పెద్ద ప్రైవేటు కంపెనీగా మారే ప్రమాదం ఉంది.
ఒకే సహకార సంఘం పేరుతో గ్రామీణ సేవలన్నింటినీ ఒక గొడుగు కిందికి తెచ్చే విధానాన్ని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకే సొసైటీలో పాలు, చేపలు, వ్యవసాయ రుణాలు, ఇతర వ్యవసాయ సేవలు, కామన్ సర్వీసులు తదితరాలన్నిటినీ కలుపుతామని పదే పదే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. మోడీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల సేవలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలోకి వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో తెస్తోంది. అలా తేవటమేగాక పిఎసిఎస్ లలో వాటాలను 50 శాతం ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు అమ్ముతూ 1964 ఏపి సహకార సంఘాల చట్టానికి సవరణలు చేసింది. ఆర్.బి.కె. లను ఈ చట్ట సవరణ ద్వారా పిఎసిఎస్ లలో విలీనం చేసింది. ధాన్య సేకరణ, ఎరువులు, గోడౌన్‌లతో సహా సహకార సేవలన్నీ ప్రైవేటుపరం కానున్నాయి.
మోడీ ప్రభుత్వ భారీ కుట్రలో రాష్ట్ర వైసిపి ప్రభుత్వం పాలు పంచుకుంటోంది. రాష్ట్రంలో సహకార వ్యవస్థ మొత్తం ఒకే గొడుగు కింద ప్రైవేటుపరం కానుంది. ఇది దేశం మొత్తంలో జరగబోయే పరిణామానికి ప్రారంభ సూచిక కానుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు అనుగుణంగా సహకార విభాగాలను ఒక్కోటిగా కూలగొట్టింది. ఇపుడు వైసిపి ప్రభుత్వం ఇంకా మిగిలి ఉన్న ఆ విభాగాలన్నిటినీ ఒకే చోటికి చేర్చి ప్రైవేట్ పెట్టుబడులకు అప్పగిస్తున్నారు.
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ప్రధానంగా ఈ కుట్రకు వేదిక కానున్నాయి. వ్యవసాయ పరపతి రంగానికి సంబంధించిన పిఎసిఎస్‌లు, డిసిసిబిలు, ఆప్కాబ్ తదితరాలు మొత్తం ప్రైవేటీకరణ కానున్నాయి. ఈ రంగంలో ఉన్న ఉద్యోగులు మేల్కొనాలి. ఉద్యోగుల కంటె పిఎసిఎస్ లలో వాటాదారులుగా, పాలక మండళ్లుగా ఉన్న రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించాలి. ప్రైవేటీకరణ కుట్రను తిప్పికొట్టాలి.
సహకార రంగాన్ని కాపాడుకోకపోతే పూర్వకాలంలో లాగే రైతులు వడ్డీవ్యాపారుల కబంధ హస్తాల్లో పడి నలిగిపోతారు. ఒకరికొకరు సహాయం చేసుకునే వ్యవస్థ కుప్పకూలిపోకుండా కాపాడుకోవాలి. ఒకపక్క ప్రభుత్వ రంగంపై దాడి జరుగుతోంది. విద్యుత్తు, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్సు, చమురు వంటి కీలక రంగాల ప్రైవేటీకరణకు మోడీ ప్రభుత్వం బాటలు వేసింది. మరో పక్క ప్రైవేటు పెట్టుబడుల విస్తరణకు ఆటంకంగా ఉన్న సహకార రంగంపై వేటు వేస్తోంది. కేంద్ర మంతి అమిత్‌షా వేసే ఎత్తులకు మోసపోకుండా వాటిని తిప్పికొట్టాలి. ఇది ఒక్క వ్యవసాయ పరపతి సహకార సంఘ పరిధి లోని రైతుల సమస్య మాత్రమే కాదు. మొత్తం రైతుల సమస్య. సహకార వ్యవస్థను ఒక చోటకు చేర్చి ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పే కుట్రను రైతులు, ప్రజలు అందరూ ఏకమై ఓడించాలి.
/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు /
పి.అజయ కుమార్