
ఆర్.టి.సి వనంలో అద్దె బస్సులంటే అవి సంస్థలను మింగే భూతాలే. ఈ విషయం ఆర్.టి.సి అధికారులకు అర్థమవుతున్నప్పటికీ అమాయకత్వాన్ని నటిస్తున్నారు. ఒకప్పుడు కేవలం పల్లెవెలుగు బస్సులు మాత్రమే అద్దెకు తీసుకున్నారు. నేడు అవే కాకుండా అన్ని స్పెషల్ పర్పస్ (ఎక్స్‌ప్రెస్/ డీలక్స్ /సూపర్ లగ్జరీ /ఇంద్ర / స్టార్ లైనర్) బస్సులను అద్దెకు తీసుకుంటూ సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. సిబ్బందిని బాగా తగ్గిస్తున్నారు. ఎప్పటికప్పుడు కుదిస్తున్నారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని మాత్రమే తీసుకుంటున్నారు. దేశ రక్షణకు సైన్యం అవసరం. సంస్థ రక్షణకు కార్మికులు అవసరం.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, రవాణా రంగ విధ్వంసకర విధానాలను అనుసరిస్తోంది. 'మోటారు వాహన సవరణ చట్టం-2019' ద్వారా ఆర్.టి.సి లకు చరమ గీతం పాడాలని చూస్తున్నది. దీనిపై కార్మికుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినట్లు నటించినా అందులోని కీలకమైన అంశాలను అమలు చేస్తున్నది. 2022 ఏప్రిల్ ఒకటి నుండి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నది. దీని ద్వారా సాధారణ నిర్లక్ష్యాలకు కూడా విపరీతమైన పెనాల్టీలు వేస్తున్నది. మొదటిసారి నిర్లక్ష్యానికి రూ. 500 నుండి రూ. 1000కి పెంచింది. పోలీస్ శాఖకు పెనాల్టీల టార్గెట్లు పెంచారు. దాంతో వాహనదారులు, డ్రైవర్లు పెనాల్టీల దెబ్బకు బెంబేలెత్తుతున్నారు.
వెహికల్ స్క్రాపింగ్ పాలసీ
ఈ చట్టం ద్వారా తొమ్మిది లక్షల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్.టి.సి బస్సులను, వాహనాలను స్క్రాప్ చేయాలని ప్రతిపాదించారు. ఈ విధానం ద్వారా వేల ఆర్.టి.సి బస్సులను స్క్రాప్ చేస్తారు. దీంతో ఆర్.టి.సి లకు బస్సులు లేకుండా పోతాయి. వాటి స్థానంలో ప్రైవేటు బస్సులకు, ప్రైవేట్ రవాణా సంస్థలకు పెద్ద పీట వేస్తారు. ఫలితంగా ప్రభుత్వ రంగ రవాణా సంస్థలు కనుమరుగై పోతాయి. ఈ కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత పెరిగింది. అందులో భాగంగా ఆర్.టి.సి లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. కేంద్రమే సమకూరు స్తున్నది. బస్సులను ఆర్.టి.సి కి ఇవ్వకుండా ప్రైవేట్ కన్సార్టియంలకు ఇస్తున్నారు. వాటికి ఎక్కువ రేటు నిర్ణయిస్తున్నారు. అదంతా ఆర్.టి.సి చెల్లించాలి. కాబట్టి ఆర్.టి.సి కి నష్టం పెరుగుతున్నది.
డీజిల్ దెబ్బ
2019 నుండి ఇప్పటికి సుమారు 19 సార్లు కేంద్రం డీజిల్ రేట్లు పెంచింది. ఫలితంగా ప్రతి కిలోమీటర్‌పైన ఆర్.టి.సి ఖర్చు పెరిగింది. ఆర్.టి.సి ఎంత ఆదాయం తెచ్చినా నష్టాల్ని చవిచూడ డానికి కారణం డీజిల్ రేట్లు పెరగడం తప్ప మరొకటి కాదు.
బల్క్ బయ్యర్ పాలసీ
ఇదొక విడ్డూరపు పాలసీ. ప్రపంచంలో ఎక్కడైనా టోకు ధరలు తక్కువగా ఉండి రిటైల్ ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ రివర్స్‌లో ఉన్నది. బల్క్ బయ్యర్‌కు అంటే పెద్ద మొత్తంలో డీజిల్ కొనేవారికి, ఆర్.టి.సి లకు ఎక్కువ రేటుకు అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా ఆర్.టి.సి లకు అదనపు భారం పడింది. కేవలం ఆర్.టి.సి లను దెబ్బతీయడానికి కేంద్రం కావాలనే ఈ బల్క్ బయ్యర్ పాలసీని తీసుకొచ్చింది.
నిధుల ఎగవేత
1950 ఆర్.టి.సి యాక్ట్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో ఆర్.టి.సి లకు నిధులు సమకూర్చాలి. కానీ 1989 నుండి కేంద్రంగానీ రాష్ట్రంగానీ ఒక రూపాయి కూడా ఆర్.టి.సి లకు పెట్టుబడులు సమకూర్చలేదు. అంటే 34 సంవత్సరాల నుండి కేంద్రం రాష్ట్రం పూర్తిగా నిధులు ఇవ్వలేదు. మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల 97 వేల కోట్లు. అందులో ఒక శాతం అంటే 2970 కోట్లు. అంటే 1000 కోట్లు సాలినా ఆర్.టి.సి కి ఇస్తే బడ్జెట్లో కేవలం 0.3 శాతం అవుతుంది. ప్రతి రోజు 75 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎ.పి.ఎస్.ఆర్.టి.సి కి ప్రభుత్వం బడ్జెట్లో 0.3 శాతం నిధులు కేటాయించలేదా? మరి నిధులన్నీ ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు? కేంద్రం 500 కోట్లు కేటాయించాలి. కేంద్రం, రాష్ట్రం కలిపి సాలీనా 1500 కోట్లు కేటాయించాలి. 34 సంవత్సరాలు నుండి కేంద్ర రాష్ట్రాలు కలిపి 51 వేల కోట్లు రూపాయలు ఆర్టీసీకి నిధులు ఇవ్వలేదు. ఈ 51,000 కోట్ల రూపాయల నిధులు ఆర్.టి.సి తన అంతర్గత వనరుల నుండి అంతర్గత సామర్థ్యం ద్వారా సమకూర్చుకుంది. కానీ ఆర్.టి.సి అప్పుల్లో ఉన్నదని ప్రభుత్వాలు నేడు కోడై కూస్తున్నాయి. ఇది న్యాయమా ?
ఎం.వి టాక్స్ వడ్డింపు
ప్రైవేటు బస్సులకు సీట్ పర్ క్వార్టర్ టాక్స్ విధానం ఉంది. కానీ ఆర్.టి.సి గ్రాస్ కలెక్షన్ మీద టాక్స్ చెల్లించాలనే చట్టం తెచ్చారు. ఫలితంగా ఆర్.టి.సి లపై ఎం.వి టాక్స్ భారం పెరిగింది. ఆర్.టి.సి లు పుంజుకోలేకపోతున్నాయి.
తోలుతీస్తున్న టోల్గేట్
ఆర్.టి.సి లకు టోల్గేట్ల భారం నానాటికి పెరిగిపోతున్నది. నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలపై 50 కిలోమీటర్లకు ఒక టోల్గేట్ పెట్టి వాహనదారుల నుండి ముక్కు పిండి టోల్గేట్ వసూలు చేస్తున్నారు. గతంలో 24 గంటల వరకు అప్ అండ్ డౌన్ టికెట్ చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ట్రిప్పు ట్రిప్పుకు టోల్ గేట్ వసూలు చేస్తున్నారు. టోల్గేట్ల నుండి ఆర్.టి.సి లకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తాజాగా 2023 ఏప్రిల్ ఒకటి నుండి టోల్గేట్ చార్జీలు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. నిజానికి ఇప్పుడు పెంచాల్సిన అవసరం లేదు. సిబ్బందిని ఏమైనా పెంచారా? ఉన్న సిబ్బందికి వేతనాలు ఏమైనా పెంచారా? మోనెటైజేషన్ (ఎన్‌ఎంపి)లో భాగంగా రోడ్లన్నిటినీ కార్పొరేట్లకు కట్టబెట్టాలన్న కుట్ర జరుగుతోంది. రోడ్లను వారు హస్తగతం చేసుకుని తర్వాత చార్జీలు పెంచేకన్నా ముందుగానే టోల్‌గేట్ రేట్లు పెంచి కార్పొరేట్లకు అప్పజెప్పి అప్పనంగా ప్రజల సొమ్ము కార్పోరేట్లకు దోచిపెట్టాలనుకుంటోంది. ఆర్.టి.సి పెద్ద మొత్తంగా టోల్గేట్ అమౌంట్ చెల్లించాల్సి వస్తోంది. సంస్థపై ఆర్థిక భారం పడుతున్నది.
ఆర్.టి.సి స్థలాల అన్యాక్రాంతం-అద్దె బస్సులు
ఎ.పి.ఎస్.ఆర్.టి.సి 129 డిపోలు బస్ స్టేషన్లతో దివ్యంగా ఉంది. నగరాల నడిబొడ్డులో ఉన్న ఇలాంటి స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ల పేరుతో బస్టాండ్లను 44 సంవత్సరాల పాటు బడా వ్యాపారవేత్తలకు లీజుకు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్.టి.సి మునుగడ ఎలా సాధ్యం ?
ఆర్.టి.సి వనంలో అద్దె బస్సులంటే అవి సంస్థలను మింగే భూతాలే. ఈ విషయం ఆర్.టి.సి అధికారులకు అర్థమవుతున్న ప్పటికీ అమాయకత్వాన్ని నటిస్తున్నారు. ఒకప్పుడు కేవలం పల్లెవెలుగు బస్సులు మాత్రమే అద్దెకు తీసుకున్నారు. నేడు అవే కాకుండా అన్ని స్పెషల్ పర్పస్ (ఎక్స్‌ప్రెస్/ డీలక్స్ /సూపర్ లగ్జరీ /ఇంద్ర / స్టార్ లైనర్) బస్సులను అద్దెకు తీసుకుంటూ సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. సిబ్బందిని బాగా తగ్గిస్తున్నారు. ఎప్పటికప్పుడు కుదిస్తున్నారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని మాత్రమే తీసుకుంటున్నారు. దేశరక్షణకు సైన్యం అవసరం. సంస్థ రక్షణకు కార్మికులు అవసరం.
ఆర్థిక దోపిడి
2020 జనవరి తరువాత ఆర్.టి.సి కార్మికులకు ఒక్క రూపాయి జీతం పెరగలేదు. 10.1 శాతం డిఏ పెండింగ్‌లో ఉంది. ఎన్‌కాష్మెంట్ ఇవ్వలేదు. ఆరు ఎన్‌కాష్మెంట్లు ఇవ్వాలి. 2017 సంవత్సరపు పేఅరియర్లు ఇవ్వలేదు. ఏ విధమైన అలవెన్స్‌లు ఇవ్వడం లేదు. హెచ్‌ఆర్‌ఏ 4 శాతం తగ్గించారు. పాత ఫిట్మెంట్లో 1.6 బేసిక్ తగ్గించారు. 2020 జనవరి నుండి ఏ విధమైన ఆర్థిక వెసులుబాటు లేకుండా పోయింది. ఈ విధంగా సంస్థపై ముప్పేట దాడి జరుగుతున్నది.
ఇదిలా వుండగా...ప్రతిఘటన, పోరాటం, ఆందోళనలు చేయరాదని అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యం ఊదరగొడుతున్నాయి. ఇది నిజమేమోనని కొన్ని కార్మిక సంఘాలనుకుంటున్నాయి. కార్మికులకు చెపుతున్నాయి. ఈ విధానం మారాలి. సంస్థ రక్షణకు ఆర్.టి.సి లో ఐక్య ఉద్యమ నిర్మాణం జరగాలి. సుదీర్ఘ పోరాటం జరగాలి.
దేశ ఆర్థిక స్వావలంబన, సార్వభౌమత్వాన్ని...ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకునేందుకు దేశ కార్మిక వర్గంలో భాగమైన ఆర్.టి.సి కార్మికులందరూ ఏప్రిల్ 5కి ఢిల్లీకి కదలాలి. ప్రభుత్వ రంగం జోలికొస్తే ప్రభుత్వాల కూసాలు కదులుతాయని నినదించాలి. పోరాడితే పోయేదేమీ లేదు ప్రభుత్వ రంగ రక్షణ తప్ప.
/వ్యాసకర్త ఎ.పి.ఎస్.ఆర్.టి.సి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్
ప్రధాన కార్యదర్శి/
అయ్యప్ప రెడ్డి