Jan 11,2023 07:22

      రాష్ట్ర ప్రజలు ఆర్టీసీ బస్సు ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆర్టీసీ బస్సును కదిలే దేవాలయంలా భావిస్తారు ప్రయాణికులు. ఆర్టీసీల అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన సహకారం ఎంతో ఉంది.
         ప్రజాభిమానాన్ని ఇంతగా చూరగొన్న ఎపిఎస్‌ఆర్టీసీ 69 బస్సులు, 16 డిపోలు, 561 మంది సిబ్బందితో 1958 జనవరి 11వ తేదీన ప్రారంభమైంది. నేడు 12 వేల బస్సులు, 129 డిపోలు, 49 వేల మంది సిబ్బంది, మరో 14 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, హైర్‌ బస్‌ డ్రైవర్లతో నడుస్తున్నది.
       1979లో విశాఖ నగరంలో ప్రైవేటు సిటీ బస్సులు వద్దని వాటిని జాతీయం చేయాలని విద్యార్థి, యువజన సంఘాలతో పాటు ప్రజలు పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు నాయకులు ఆ పోరాటంలో ముందు నిలిచారు. పోరాట ఫలితంగా ప్రైవేటు సిటీ బస్సులను ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆదరిస్తున్న ఫలితంగానే సంస్థకు ఆక్యుపెన్సీ పెరుగుతున్నది. ఆర్టీసీ సంస్థ, సిబ్బంది ప్రయాణికులకు సేవలందించి వారి మన్ననలు పొందుతున్నారు.
అయితే...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఆర్టీసీల విస్తరణకు అవరోధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న ఫలితంగా రాష్ట్రాలలో కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేటీకరణ సంస్కరణలను చేయాలని ఒత్తిడి చేస్తున్నది. ఈ సంస్కరణల అమలులో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుంది. దీనికి ప్రపంచ బ్యాంకు నుండి రుణాల సమీకరణ కూడా ఒక కారణం.
          ఇలా వుండగా...విలీనంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఎన్నో హక్కులను కోల్పోయారు. చివరకు ఒక వేతన ఒప్పందాన్ని సైతం నష్టపోయారు. రివర్స్‌ పిఆర్సీ కారణంగా ప్రతి ఒక్కరు 20 శాతానికి పైగా వేతనాలను కోల్పోయారు. అనేక పారామీటర్లలో ఎంతో ముందడుగులో ఉంటూ, ఆర్టీసీ ఉద్యోగులు శ్రమిస్తున్నా బోనస్‌ల ఊసే లేదు. రిటైర్డ్‌ ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. విలీనం పేరుతో ఆశ కల్పించి పెన్షన్‌కు ప్రభుత్వం ఎగనామం పెట్టింది.
            ఉద్యోగుల సమస్యలపై సంఘాలతో చర్చిస్తామని శాసనమండలిలో చెప్పి...తూతూ మంత్రంగా చర్చలు జరిపి మమ అనిపించారు. సమస్యలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. కార్మిక సంఘాల ఉనికినే సహించలేమన్నట్టు ప్రభుత్వ వ్యవహారం ఉంది. చివరకు ప్రభుత్వం చేసిన 2019 ఆర్టీసీ చట్టాన్ని ధిక్కరిస్తూ ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వవలసిన లక్షలాది రూపాయల బకాయిలను పెండింగ్‌లో పెట్టింది. హామీలను విస్మరించి సంస్థను ప్రైవేటీకరణ వధ్యశిలపైకి నెట్టింది.
         నేడు రవాణా రంగంలో ఏటా 16 శాతం కొత్త బస్సుల డిమాండ్‌ పెరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ రవాణ మంత్రిత్వ శాఖ ఈ అంచనా వేసింది. మన రాష్ట్ర ప్రజలకు ఇప్పుడున్న బస్సులు ఏమాత్రం సరిపోవు. కనీసం 30 వేల బస్సులు అవసరం. దీనితో వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఇందుకు అద్దె బస్సులు ఏమాత్రం పరిష్కారం కాదు. ప్రభుత్వమే నిధులు ఇచ్చి ఆర్టీసీకి బస్సులను కొనుగోలు చేయాలి. ఆర్టీసీ ఆదాయంలో ప్రతి నెలా 25 శాతం సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. దీనిని ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు, కొత్త బస్సుల కొనుగోలుకు వినియోగించాలి. ఆర్టీసీ విస్తరణ జరగాలి. ప్రజలకు ఎప్పటిలా సేవలందించాలి.
          ఆర్టీసీ సంస్థ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ప్రజలకు, ప్రయాణికులకు, వివిధ తరగతులకు, సామాజిక తరగతులకు, సీనియర్‌ సిటిజన్లకు, విద్యార్థులకు జర్నలిస్టులకు సాలీనా రూ. 1500 కోట్ల విలువైన టికెట్ల రాయితీలు ఇస్తున్నది. ప్రభుత్వం ఈ రాయితీల సొమ్మును ఆర్టీసీలకు తిరిగి చెల్లించడం లేదు. ఆర్టీసీ విస్తరణ ఆగిపోతే ఈ రాయితీలు లభ్యం కావు. రూ. 50 వేల కోట్ల విలువచేసే ఆస్తులు కలిగిన, అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రజా రవాణా సంస్థ ప్రజల సామాజిక ఆస్తి. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర సమాజానిదే. ప్రజా రవాణా వ్యవస్థ కనుమరుగైతే ప్రైవేటు సంస్థల దోపిడీకి పట్టపగ్గాలుండవు. పండుగల రోజుల్లో ప్రైవేటు బస్సుల రేట్లు రెండు మూడు రెట్లు అమాంతం పెంచుతుండటం చూస్తూనే ఉన్నాం. ఆర్టీసీని కాపాడుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు...ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల సహకారంతో విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది.

(వ్యాసకర్త శాసనమండలి సభ్యులు)
షేక్‌ సాబ్జీ

షేక్‌ సాబ్జీ