
ఈ తరుణంలో, నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాల దాడి, సామ్రాజ్యవాద ఆధిపత్య వాదానికి వ్యతిరేకంగా మన గొంతును వినిపించడంలో ఏమాత్రం విఫలం కాకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం ఈ దారుణమైన దాడులను పోరాటాల ద్వారా ఎదుర్కొంటున్నది. కార్మికుల హక్కులు, జాతీయ సార్వభౌమాధికారంపై జరిగే దాడులతో సామ్రాజ్యవాద ఆధిపత్య దాడులకు గల సంబంధాన్ని బహిర్గతం చేయాలి.
శ్రామిక ప్రజల మనస్సులలోకి చొరబడుతున్న మతతత్వ విభజిత శక్తుల విషపూరిత దాడి కార్మికవర్గ ఐక్యతకు ఒక పెద్ద సవాలుగా మారింది. మతతత్వ శక్తుల ఈ కుట్రపూరిత చర్యలు కార్మికులు, సామాన్య ప్రజలపై హిందూత్వ సైద్ధాంతిక ప్రభావాన్ని తీవ్రంగా వేస్తున్నాయి. నిజానికిదంతా కార్పొరేట్లు, మతశక్తులు కుమ్మక్కై నయా ఉదారవాద విధానాల ద్వారా కార్మిక వర్గ, సామాన్య ప్రజల హక్కులు, జీవితాలపైన, జీవనోపాధి పైన నిరాఘాటంగా దాడి జరపటానికి వేసుకున్న ముసుగు మాత్రమే.
అందువల్ల మతోన్మాద భావజాలానికి, సమాజంపై దాని విషపూరిత దాడికి వ్యతిరేకంగా కార్మికోద్యమం అన్ని స్థాయిల్లో పోరాటాన్ని నిరంతరంగా నిర్వహించాల్సి వుంది. నయా ఉదారవాద విధాన పాలనను ఎదుర్కోవటానికి, ఓడించడానికి చేసే పోరాటంలో వర్గ ఐక్యతను కాపాడుకోవడం, విస్తృతం చేయడం మన కీలకమైన కర్తవ్యం. ప్రత్యేకించి దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం - ఇతర రాష్ట్రాలలోని డబుల్ ఇంజిన్ సర్కార్ల దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఇది అత్యవసరం.
బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కార్మికులు పెద్దఎత్తున భాగస్వాములయ్యారు. భారతదేశం అనే ఆలోచన దాని బహుళత్వంతో ఉద్భవించింది. స్వాతంత్య్రం, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం అనే భావనలపై ఆధారపడిన భారత లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాంగం రూపుదిద్దుకుంది. హిందూ మత రాజ్యం అనే సిద్ధాంతం వెనుక ఉన్న ఆర్‌ఎస్‌ఎస్, దాని సంస్థలు ఓడిపోయాయి. కానీ ఇప్పుడు అదే అనాగరిక మతతత్వ శక్తులు మన గడ్డపై మళ్లీ పూర్తి స్థాయిలో విజృంభిస్తున్నాయి. ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజించటానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిని మనం సమగ్రంగా అర్థం చేసుకోవటంతో పాటు దీనికి వ్యతిరేకంగా పోరాడాలి.
ఈ తరుణంలో, నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాల దాడి, సామ్రాజ్యవాద ఆధిపత్య వాదానికి వ్యతిరేకంగా మన గొంతును వినిపించడంలో ఏమాత్రం విఫలం కాకూడదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం ఈ దారుణమైన దాడులను పోరాటాల ద్వారా ఎదుర్కొంటున్నది. కార్మికుల హక్కులు, జాతీయ సార్వభౌమాధికారంపై జరిగే దాడులతో సామ్రాజ్యవాద ఆధిపత్య దాడులకు గల సంబంధాన్ని బహిర్గతం చేయాలి.
భారతదేశ స్వాతంత్య్రం యొక్క 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భమిది. ఈ సమయంలో దేశ సార్వభౌమాధికారం, భారత ఆర్థిక వ్యవస్థ స్వావలంబన విషయమై పాలనా యంత్రాంగం పూర్తిగా రాజీ పడడాన్ని మనం చూస్తున్నాము. పెట్టుబడిదారీ వ్యవస్థలో కొనసాగుతున్న సంక్షోభం అది మరింత తీవ్రతరం కావడానికి దోహదపడుతోంది. ఫలితంగా పారిశ్రామిక, సేవా రంగాల్లో స్తబ్దత ఏర్పడింది. కార్మికులపై దోపిడీ, ఒత్తిడి పెరుగుతున్నాయి. జాతీయ సగటు వేతనాల వాటా 30 శాతం నుండి 10 శాతానికి తగ్గింది. 30 శాతం అయితే పెట్టుబడిదారుల లాభం 10 శాతం నుండి 39 శాతానికి పెరిగింది.
కార్మికులను తగ్గించడం, ఆటోమేషన్, కత్రిమ మేధస్సు వినియోగం పెరగడం కారణంగా ఉపాధి సంబంధాల పునర్నిర్మాణానికి దారితీస్తోంది. నిరుద్యోగం తీవ్రమవుతోంది. సాధారణ ప్రజలపై పరోక్ష పన్నుల భారం పెరుగుతోంది. మౌలిక ఆస్తులు, సహజ వనరులపై భారీ అద్దెలు, పన్నులు విధించబడుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్/ పెద్ద వ్యాపారాలపై ప్రత్యక్ష పన్నులను భారీగా తగ్గించడంతోపాటు వివిధ రాయితీలు, మినహాయింపులు ఇవ్వబడ్డాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్, ఆజాదీ కా అమత్ మహోత్సవ్, అమత్ కాల్ నినాదాల అసలు స్వరూపం.. 'శ్రమయేవ జయతే' నినాదం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌ల రూపంలో అపహాస్యం చేయబడుతోంది. రక్షణ దళాల కాంట్రాక్టీకరణ ఒప్పందాలు-అగ్నిపథ్ పథ్ పథకం 'భారత్ మాతా కి జై' నినాదం యొక్క స్వభావానికి అద్దం పడుతోంది.
జాతీయ ఆస్తులను విక్రయించడానికి, ప్రభుత్వ రంగ సంస్థలను, ఆర్థిక సంస్థలను ప్రైవేటీకరించడానికి అన్ని ప్రయత్నాలూ నిరాటంకంగా జరుగుతున్నాయి. నీతి ఆయోగ్ యొక్క ప్రైవేటీకరణ ప్రణాళిక ఫలించలేదు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ క్రోనీలకు అప్పగించడానికి, మొత్తం ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్య నియంత్రణతో కార్పొరేట్ వర్గానికి ప్రయోజనం చేకూర్చడం కోసం ఉద్దేశించినదే నేషనల్ మోనటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎమ్‌పి).
కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వం
నిరంతర కార్మిక వర్గ ప్రతిఘటన మరియు ధిక్కరణ పోరాటాల కారణంగా 2 నుండి 3 సంవత్సరాలుగా లేబర్ కోడ్‌ల ముసాయిదాను నోటిఫై చేయలేకపోయింది. వ్యక్తిగత కార్మిక చట్టాలకు సవరణల ద్వారా కోడ్‌ల నిబంధనలను అక్రమంగా అమలు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పారిశ్రామిక ఉపాధి స్టాండింగ్ ఆర్డర్ల చట్టానికి సవరణలు చేయడం ద్వారా స్థిర కాల ఉపాధి, పని గంటలను పెంచడం, ప్రతి త్రైమాసికానికి ఓవర్‌టైమ్ పని గంటల పెంపు, కర్మాగారాల చట్టానికి సవరణల ద్వారా రాత్రి షిఫ్టులలో మహిళా కార్మికులను నియమించడం, 3 షిఫ్టులకు బదులుగా 2 షిఫ్టులు మొదలైన పద్ధతులు ఇప్పటికే కర్ణాటకలో అమలు చేస్తోంది. 200కు పైగా భారీ మరియు 1000 చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కార్మికులు దీనికి వ్యతిరేకంగా మార్చి 23వ తేదీన ఒక రోజు సమ్మె చేశారు.
ఈ నయా ఉదారవాద విధానాలపై ప్రజల ఆగ్రహాన్ని మళ్లించేందుకు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జైళ్లలో పెట్టడం, బెయిల్ పొందే అవకాశం లేని అభియోగాలు మోపడం, ఉద్యమకారులను ఆందోళనకారులుగా, దేశద్రోహులుగా చిత్రిస్తూ ప్రచారం చేయడం, రాజ్యంలో అంతర్రాష్ట్ర శత్రుత్వాలు సృష్టించడం వంటివి జరిగాయి. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్, ట్రిపుల్ తలాక్, హిజాబ్, అజాన్, హలాల్, గొడ్డు మాంసం, గోవధ వ్యతిరేక, మత మార్పిడి వ్యతిరేక చట్టాలు, సాధారణ పౌర నియమావళి, రామ మందిర నిర్మాణం, కాశీ, మథుర సమస్యలు, మైనారిటీల హత్యలు, అంజనాద్రి (హనుమంతుని జన్మస్థలం), పాఠ్యాంశాలలో విషపూరిత ద్వేషపూరిత ప్రచారాన్ని నిరంతరంగా వ్యాప్తి చేయడంతో మత విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారు.
కార్పొరేట్-మతతత్వ శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త విద్యా విధానం రూపొందించబడింది. అదే సమయంలో భారత రాజ్యాంగ ప్రాథమిక పునాదులకు విరుద్ధంగా హిందూ, హిందీ, హిందుస్తానీ నినాదాలతో గోల్వాల్కర్ కథనాల ఆర్‌ఎస్‌ఎస్ భావనకు అనుగుణంగా నిర్దిష్ట సామాజిక ఇంజనీరింగ్ చేయబడింది. వర్ణాశ్రమ ధర్మం, సాంఘిక వివక్ష మరియు అంటరానితనంపై ఆధారపడిన మను స్మృతిని పాలనా విధానంలో చొప్పించటానికి ప్రయత్నం జరుగుతోంది. ఇది దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, మహిళలపై పెరుగుతున్న దాడుల ద్వారా వ్యక్తమవుతోంది. ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి, వారి లక్ష్యమైన ''హిందూ రాష్ట్ర''ను సాధించడానికి ప్రయత్నిస్తున్నది. జాతీయ-అంతర్జాతీయ కార్పొరేట్ ద్రవ్య పెట్టుబడి, ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి సన్నిహిత బంధం యొక్క ద్వంద్వత్వం స్పష్టంగా కనిపిస్తున్నది. వర్గ ఐక్యతను దెబ్బ తీసే నయా ఉదారవాద విధానాలను మరింత ముందుకు తీసుకెళుతున్న కార్పొరేట్ కాషాయ దుష్ట కూటమిని ఓడించే స్పష్టమైన లక్ష్యంతో కార్మికులు ముందుకు కదలాలి. ప్రజలు తమ అసలైన శత్రువును గుర్తించి, ప్రజా వ్యతిరేక, దేశ విధ్వంసక పాలనను గద్దె దించేందుకు అవసరమైన ఐక్య పోరాటాన్ని ఉధృతం చేయాలి.
/ వ్యాసకర్త సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు /
కె.ఎన్. ఉమేష్