Sep 10,2023 07:56

'ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..' అన్నట్లు భూమ్యాకాశాల అనుబంధం అలనాటిది. ఆధునిక ప్రపంచంలో అత్యంత వేగంగా మార్పులు సంభవిస్తున్నట్లుగానే.. పర్యావరణంలోనూ అనేక మార్పులు జరుగుతున్నాయి. ప్రకృతి శక్తులను, సహజ వనరులను విచక్షణారహితంగా దుర్వినియోగం చేస్తుండటంతో.. సమతుల్యత లోపించి, ప్రకృతి వికృతిగా మారుతున్న దైన్యాన్ని, మానవాళిని కాటువేస్తున్న పర్యావరణ కాలుష్య ప్రమాదాన్ని.. దాని పరిణామాల తీవ్రతను అనుభవిస్తూనే వున్నాం. ''పచ్చదనం కోసం ఉద్యమించి, చెట్టుచేమలతో స్నేహించండోయ్, పర్యావరణాన్ని సంరక్షించండోయ్, సగటు జీవి ఆయుర్దాయాన్ని పెంచండోయ్'' అంటాడో కవి. ఇప్పుడు కలుషితం కానిదంటూ ఏదీ లేదు. గాలి, నీరు, ఆహారం.. సమస్తం కలుషితమయం. ఎంతంటే ఆకాశంలోని ఓజోన్‌ పొర పలచబడేంతగా.. ఫలితంగా దాని ప్రభావం మళ్లీ భూమిపై వాతావరణంలో మార్పులకు దారితీస్తోంది. ఇవి రెండూ ఒకదానికొకటి అనుసంధానం కలిగిన విషయాలు అందుకే ఈ నెల 16వ తేదీన 'ప్రపంచ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం' సందర్భంగా ప్రత్యేక కథనం..

22

            'ప్రకృతిని ఆశ్రయించినంత కాలం మానవజాతి ప్రకృతితో పాటు పరవశించింది. ప్రకృతికి ద్రోహం తలపెట్టగానే మానవజాతి కూడా ప్రకృతితో పాటు కన్నీరు కారుస్తున్నది' అంటారు దాశరథి రంగాచార్యులు 'జీవనయానం' తనలో 'సకల ప్రాణజాలం ప్రకృతిలో భాగం.. ప్రకృతితో జీవిస్తే దాని ఆకృతి నిలుస్తుంది.. ప్రకృతిని హతం చేస్తే, ప్రకృతిని చెరిస్తే, సకల ప్రాణజాలానికి విలయం తప్పదు' అంటూ ఆయన హెచ్చరించారు.
             మనిషి స్వార్థం వల్ల ప్రకృతి ప్రమాదంలో పడుతూనే వుంది. వాహనాలు విస్తృతంగా పెరగడం.. రోజుకో కొత్త టెక్నాలజీ రావడం.. ఏసీలు వాడకం పెరగడం.. పరిశ్రమల నుంచి విచ్చలవిడిగా కాలుష్యం వెదజల్లడం.. ఇవన్నీ ఓజోన్‌ పొరకు నష్టం కలిగించేవి. దీనిపై ఎవరికివారు తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ప్రకృతి వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టడం వంటి అనేక కారణాలు వాతావరణ సమతుల్యత దెబ్బతినడానికి మరో కారణం. భూమికి రక్షణగా వుండే ఓజోన్‌ పొర.. మానవ తప్పిదాల వల్ల ఏయేటికాయేడు పలచబడిపోతోంది. ఫలితంగా సూర్యుని నుంచి వెలువడే అతినీలలలోహిత కిరణాలు ఎటువంటి వడపోత లేకుండా నేరుగా భూమి మీద ప్రసరిస్తున్నాయి. దీనివల్ల ఎన్నో దుష్ప్రభావాలు చోటు చేసుకుంటున్నాయి. ఓజోన్‌ పొరకు చిల్లులు పడటం వల్ల పెను ప్రమాదం పొంచి వుంది.

44


                                                                              అసలు ఓజోన్‌ అంటే..

సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల (యువి రేస్‌) ను నేరుగా భూమిపై పడనీయకుండా ఈ ఓజోన్‌ పొర అడ్డుకుంటుంది. ఈ ఓజోన్‌ పొర పూర్తిగా దెబ్బతింటే.. మానవాళితో పాటు భూమిపైనున్న సమస్త జీవజాతి అంతరించిపోతుంది. ఈ పొర లేకపోతే భూమి మీద జీవం పుట్టుకే సాధ్యం కాదు.
            అయితే, ఈ ఓజోన్‌ పొర ఎక్కడ వుంటుంది? ఎలా వుంటుంది? దీనివల్ల ఉపయోగం ఏంటి? అనే విషయాలకొస్తే.. ఒక ఆక్సిజన్‌ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్‌ పరమాణువులు వుంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అణువుకు మరో ఆక్సిజన్‌ పరమాణువు జత చేరినప్పుడు 'ఓజోన్‌' అణువు ఏర్పడుతుంది. ఇది మూడు ఆక్సిజన్‌ పరమాణువులతో కలిసి ఏర్పడుతుంది కనుక ఓజోన్‌ ను 'ట్రై యాక్సిజన్‌ (ఓ3) అని కూడా అంటారు. ఓజోన్‌ అణువులు భూమి చుట్టూ ఆవరించివున్న వాతావరణం పైపొరల్లో అత్యధిక సంఖ్యలో లేయర్స్‌గా ఏర్పడి వుంటాయి. ఓజోన్‌ పొర సాధారణంగా వాతావరణానికి ఎగువభాగమైన రెండవ పొర స్ట్రాటోస్పియర్‌లో వుంటుంది. భూమి చుట్టూ మొత్తం ఐదు లేయర్స్‌ వుంటాయి. అవి- ఎక్సోస్పియర్‌, థర్మోస్పియర్‌, మెసోస్పియర్‌, స్ట్రాటోస్పియర్‌, ట్రోపోస్పియర్‌. ఇందులో మొదటి పొర ట్రోపోస్పియర్‌.. ఇది భూమి నుంచి 10 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి వుంటుంది. రెండో లేయర్‌ అయిన స్ట్రాటోస్పియర్‌ ట్రోపోస్పియర్‌ నుంచి సుమారు 40 కిలోమీటర్ల మందంతో భూమి నుంచి 50 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి వుంటుంది. ఓజోన్‌ పొర సూర్యుడి నుంచి వెలువడే హానికారక అతి నీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకుంటాయి. రుతువుల్లో వచ్చే మార్పులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి ఓజోన్‌ పొర మందం మారుతూ వుంటుంది. ఈ ఓజోన్‌ పొర పలచబడటంగానీ, ఈ పొరకు రంధ్రం పడటంగానీ జరిగితే.. ఆ కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. తద్వారా ఏర్పడే రేడియోథార్మికత వల్ల భూమిపై నివసించే జీవకోటి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
 

                                                                                     ఈ పొర అవసరం..

భూమ్మీద జీవరాశి మనుగడ సాగించాలంటే.. స్ట్రాటోస్పియర్‌ ఓజోన్‌ పొర భూమి చుట్టూ ఆవరించి ఉండటం అత్యంత అవసరం. సూర్యుడి నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలను ఓజోన్‌ పొర సమర్థవంతంగా అడ్డుకోగలదు. తద్వారా జీవరాశిని సురక్షితంగా వుంచగలదు. ప్రకృతి సిద్ధంగా మానవాళికి ఏర్పడిన ఈ రక్షణ కొరవడితే సమస్త జీవరాశి మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు వంటి యంత్ర పరికరాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్‌ వంటి ప్రమాదకర రసాయనాలు స్ట్రాటోస్పియర్‌ వరకు వ్యాపించడం వల్ల ఓజోన్‌ పొర ఇప్పటికే దెబ్బతిన్నది. ముఖ్యంగా దక్షిణార్ధగోళంలో ఓజోన్‌ పొరకు రంధ్రం పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్ట్రాటోస్పియర్‌ వరకు వ్యాపించే ప్రమాదకర రసాయనాల వల్ల ఓజోన్‌ పొరకు నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు దశాబ్దాల కిందటే తమ పరిశోధనల్లో గుర్తించారు. ఓజోన్‌ పొరకు ఒక్క శాతం విఘాతం ఏర్పడితే, భూమిపై అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌ ప్రభావం పెరుగుతుంది. దీనితో మనుషుల్లో వ్యాపించే క్యాన్సర్లు 2-5 శాతం మేర పెరుగుతాయి. క్యాటరాక్ట్‌ వంటి కంటి సమస్యలు గణనీయంగా పెరుగుతాయి. అంతేకాకుండా మనుషుల్లోను, జంతువుల్లోను రోగనిరోధక శక్తి దారుణంగా దెబ్బతింటుంది. అకాల వార్ధక్యం ముంచుకొస్తుంది. వివిధ పంటలు దెబ్బతింటాయి. వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగక్రియకు విఘాతం ఏర్పడుతుంది. ఆహార పంటలకు నష్టం కలుగుతుంది. ఫలితంగా ఆహార లభ్యతకు విఘాతం ఏర్పడుతుంది. పెంపుడు జంతువులు సైతం క్యాన్సర్లకు గురవుతాయి. జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అంతేకాక ధ్రువప్రాంతాల్లో ఓజోన్‌ పొర పలచబడటం వల్ల సూర్యుని అతి నీలలోహిత కిరణాలు ఆ ప్రాంతాలను మరింత తీక్షణంగా తాకుతాయి. ఫలితంగా అక్కడి మంచు శరవేగంగా కరిగిపోయి, నీటిమట్టాలు అమాంతం పెరిగి, సముద్ర తీరాలు మునిగిపోతాయి. దీని ప్రభావంతో భూమిపై నివసించే మనుషులకు, పశుపక్ష్యాదులకు, సముద్రాల్లోను, నదుల్లోను జీవించే జలచరాలకు ఆహారాన్ని ఇచ్చే వృక్షజాతుల మనుగడకు పెనుముప్పు ఏర్పడుతుంది. ఫలితంగా జీవజాతులు క్రమంగా అంతరించిపోయే ప్రమాదం తలెత్తుతుంది. అందువల్ల ఓజోన్‌ పొర మానవాళికి అత్యంత అవసరమైనది, ప్రాణప్రదమైనది. 'విష వాయువుల విసర్జనను, పూర్తిగా అరికట్టే మార్గం చూడు, ప్రాణవాయువు శాతం పెంచి, ఓజోన్‌ పొర గాయాలను పూడ్చడం, ప్రపంచ ప్రజలందరి బాధ్యత సుమా!' అని అంటారు డాక్టర్‌ పి. విజయలక్ష్మీ పండిట్‌. మానవాళికి చేటును కలిగించే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకోగల ఓజోన్‌ పొరను రక్షించుకోవడం ప్రపంచ ప్రజలందరి బాధ్యత. దీనికి సంరక్షకులుగా వుండాల్సింది ప్రభుత్వాలే.
 

                                                                           ఎందుకు దెబ్బతింటోంది ?

పారిశ్రామిక విప్లవం తర్వాత ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అవి పనిచేయడానికి రసాయనాలు, ఇంధనం వాడకం పెరిగింది. ఈ యంత్రాలను నడపడానికి ఉపయోగించే కొన్ని రసాయనాలు ఓజోన్‌ పొరకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ విషయాన్ని దాదాపు ఐదు దశాబ్దాల కిందటే కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఈ రసాయనాలన్నింటినీ స్థూలంగా 'ఓజోన్‌ డెప్లీటింగ్‌ సబ్‌స్టెన్సెస్‌' (ఓడీఎస్‌) అని పేరు పెట్టారు. అయితే, ఈ ఓడీఎస్‌ రసాయనాలలో చాలావరకూ పర్యావరణానికి నేరుగా ముప్పు కలిగించవు. భూమికి చేరువగా ఉన్న వాతావరణంలో ఇవి ఉన్నంతవరకూ పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు. ఇవి భూమిని ఆవరించి ఉన్న తొలి వాతావరణ పొర ట్రోపోస్పియర్‌ను దాటుకుని, స్ట్రాటోస్పియర్‌ను చేరుకున్నప్పుడు మాత్రమే ఓజోన్‌ పొరపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఓజోన్‌ తన సహజమైన ట్రై యాక్సైడ్‌ (ఓ3) రూపాన్ని కోల్పోయి, మామూలు ఆక్సిజన్‌ (డైఆక్సైడ్‌-ఓ2) రూపంలో మిగులుతుంది. స్ట్రాటోస్పియర్‌కు చేరిన రసాయనాలు ఓజోన్‌ నుంచి కాజేసిన ఆక్సిజన్‌ పరమాణువును కలుపుకొని కొత్తగా రూపాంతరం చెందుతాయి. క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రో ఫ్లోరోక్లోరో కార్బన్లు, కార్బన్‌ టెట్రా క్లోరైడ్‌, బ్రోమినేటెడ్‌ ఫ్లోరోకార్బన్లు వంటి రసాయనాలను ఓజోన్‌ పొరను దెబ్బతీసే 'ఓడీఎస్‌' రసాయనాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ 'ఓడీఎస్‌' రసాయనాలు వర్షాలు కురిసినప్పుడు భూమ్మీదకు తిరిగి చేరుకునే పరిస్థితి ఉండదు. భూమ్మీద నుంచి పైకెగసిన ఈ రసాయనాలు స్ట్రాటోస్పియర్‌ వద్ద దీర్ఘకాలం అలాగే ఉంటాయి. ఇవి ఓజోన్‌ పొరకు కలిగించే అనర్థం అంతా ఇంతా కాదు. ఇవే కాకుండా, 'హాలోన్స్‌'గా పిలిచే బ్రోమినేటెడ్‌ ఫ్లోరోకార్బన్ల వాడకాన్ని కేవలం అగ్నిమాపక యంత్రాలకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. ఓజోన్‌ను దెబ్బతీసే ఇతర రసాయనాలతో పోల్చుకుంటే, హాలోన్స్‌ పదిరెట్లు ఎక్కువగా ఓజోన్‌ను దెబ్బతీస్తాయి.

88


                                                                       వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నివేదిక ..

భూ గ్రహం వేగంగా వేడెక్కుతోంది. మానవ అనుచిత ప్రవర్తన వాతావరణ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. పర్యావరణ క్రియాశీలతలో పెనుమార్పులు తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అడవులు ధ్వంసం కావటం గ్లోబల్‌ వార్మింగ్‌ సంకేతాలను బలంగా వినిపిస్తోంది. భూమిపై కర్బన ఉద్గారాల్లో దాదాపు 15 శాతం అటవీ నిర్మూలన కారణంగానే వెలువడుతుండగా.. ఏటా 10 మిలియన్‌ హెక్టార్లలో ఉష్ణమండల అడవులు తరిగిపోతున్నాయి. దీనిని 2030 నాటికి అరికట్టకుంటే గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే పెరగకుండా పరిమితం చేయడం అసాధ్యం. ఈ మేరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నివేదిక హెచ్చరిస్తోంది. ఉష్ణ మండలంలో 2002 నుంచి 60 మిలియన్‌ హెక్టార్ల కంటే ఎక్కువ అడవుల్ని కోల్పోయామని.. ఉష్ణ మండల అడవుల నరికివేతలో 80 శాతం కంటే ఎక్కువ వ్యవసాయం కోసం చేస్తున్నట్టు గుర్తించింది. 2021లోనే 11.0 మిలియన్‌ హెక్టార్లలో చెట్లు అంతరించిపోగా.. ఇందులో 3.75 మిలియన్‌ హెక్టార్లు ఉష్ణ మండల ప్రాథమిక వర్షారణ్యాలు ధ్వంసం ఫలితంగా 2.5 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయి. ఇవి మనదేశంలో వెలువడే వార్షిక శిలాజ ఇంధన ఉద్గారాలతో సమానంగా ఉండటం గమనార్హం. గ్రీన్‌హౌస్‌ వాయువులు, కర్బన ఉద్గారాలను 2030 నాటికి కనీసం 43 శాతానికి, 2035 నాటికి 60 శాతానికి తగ్గించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

99


                                                                     భూతాపాన్ని కట్టడి చేయకపోతే..

పారిశ్రామిక విప్లవానికి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ప్రపంచంలో సగటున 1.15 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంటే.. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌ కంటే పెరగకుండా కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఫలితంగా తీరప్రాంతాలలో ఉన్న భారత్‌, బంగ్లాదేశ్‌, చైనా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్‌, మపుటో, బ్యాంకాక్‌, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్‌, లండన్‌, లాస్‌ ఏంజిలిస్‌, న్యూయార్క్‌, బ్యూనస్‌ ఏరిస్‌, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు వాటిల్లుతుంది. మునుపటి శతాబ్దాల కంటే 1900 నుంచి ప్రపంచ సగటు సముద్రమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌ మించి పెరగకుండా పరిమితం చేయగలిగితే.. వచ్చే రెండు వేల సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది.
 

                                                                               ఇలా కాపాడుకుందాం..

ఓజోన్‌ పొరను కాపాడుకోవాలంటే.. దాన్ని దెబ్బతీసే పదార్థాల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. రసాయనిక ఎరువులు, పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులను, సేంద్రియ పురుగుమందుల వాడకాన్ని పెంచాలి.
పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఇంధనాలతో నడిచే వాహనాల నుంచి వెలువడే పొగ ఓజోన్‌ పొరను దెబ్బతీస్తుంది. వీలైనంతవరకు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి.
ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పరిశ్రమల్లో రసాయనాలతో తయారైన క్లీనింగ్‌ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. వీటిలో వినియోగించే రసాయనాలు ఓజోన్‌ పొరను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. కాలుష్య రహితంగా చేపట్టే ప్రతిపనీ ఓజోన్‌ పరిరక్షణకు చేరువచేస్తుంది.
         'ఓయి మానవుడా! / బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు/ సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?/ అందమును హత్య చేసెడి హంతకుండ/ మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ' అంటూ పూబాలల విలాపాన్ని హృద్యంగా వర్ణిస్తాడు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి తన పుష్పవిలాపంలో. ఇందులోనే మరో పాదంలో .. 'మా వెలలేని ముగ్ద సుకుమార సుగంధ మరంద మాధురీ/ జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె / మా యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి / మమ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా' అని ప్రశ్నిస్తాడు జంధ్యాల. నాగరికత నేర్చిన నదీనదాలు నిరాదరణకు గురైన తల్లిలా నిర్వేదంగా మారుతున్నాయి. దోపిడీదారులైన పాలకుల దురాక్రమణలో ఎండిన బొమికెల్లా ఇసుక రేణువులు బిక్కుబిక్కుమంటున్నాయి. జీవవైవిధ్యం జాతరలా పరిఢవిల్లిన చోట నైరాశ్యం తాండవిస్తోంది. ప్రకృతిలోని సమస్య జీవరాశుల్ని, వృక్ష సంపదని, కొండకోనల్ని, నదీనదాల్ని రక్షిస్తేనే మనిషి మనుగడ సాగించగలడు. మన తర్వాత మన తర్వాతి తరాలకు ఈ పచ్చదనాన్ని పదిలంగా అందించాలి. దీన్ని అనుభవించే హక్కు మాత్రమే మనకుంది. నాశనం చేసే హక్కు ఎవరికీ ఏమాత్రం లేదు.

88

                                                                         ఈ రోజు ఎలా ఏర్పడిందంటే..

ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 16ను ఓజోన్‌ పొర పరిరక్షణ కోసం అంతర్జాతీయంగా ఓజోన్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓజోన్‌ పొర యువీ కిరణాల నుంచి మనల్ని ఎలా రక్షిస్తుంది? హానికరమైన రసాయనాల నుంచి మనం ఓజోన్‌ పొరను ఎలా రక్షించుకోవాలి? అనే విషయాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే 'ఓజోన్‌ పొరను పరిరక్షించడం.. వాతావరణ మార్పులను తగ్గించడం' అనే లక్ష్యాన్ని ఈ ఏడాది థీమ్‌గా తీసుకున్నారు.
         ఈ ఓజోన్‌ పొరను మొదట జర్మన్‌-స్విస్‌ రసాయన శాస్త్రవేత్త క్రిస్టియన్‌ ఫ్రెడరిక్‌ స్కోన్‌బీన్‌ 1839లో ఓజోన్‌ను కొనుగొన్నారు. ఆయనే దీనికి ''ఓజోన్‌'' అని నామకరణం చేశారు. ఓజోన్‌పొర సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన యువీ కిరణాలలో 98 శాతం వరకు గ్రహించగలదని ఆయన గుర్తించారు. బ్రిటిష్‌ ఆర్కిటిక్‌ సర్వే తొలుత 1950లో అంటార్కిటికా మీద ఓజోన్‌ సాంద్రతను కొలవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు ఈ పొరలో సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. ఓ శతాబ్దం తర్వాత 1985లో బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే ఓజోన్‌ పొరకు రంధ్రం పడిందని నిర్ధారించింది. ఓజోన్‌ పొర పరిరక్షణ కోసం వియన్నా కన్వెన్షన్‌లో ఒక తీర్మానం ఆమోదించబడింది. అంటార్కిటికాపై ఓజోన్‌ పొరలో రంధ్రం కనుగొన్న తర్వాత ఈ అవసరం ఏర్పడింది.

3322

                                                                             వీరికి ప్రణామం..

కొందరుంటారు.. బాధితులు ఎవరైనాసరే.. వారి తరపున వకాల్తా పుచ్చుకుని పోరాడతారు. ఇంకొందరుంటారు.. పచ్చని చెట్టు కొమ్మను నరికినా, స్వచ్ఛ జలాలను పాడు చేసినా, పీల్చే గాలికి ప్రమాదం ముంచుకొచ్చినా తట్టుకోలేరు. మొదటివారు హక్కుల నేతలైతే, రెండోవారు పచ్చదనాన్నీ, పర్యావరణాన్నీ ప్రేమించే ఆకుపచ్చయోధులు.. పర్యావరణవేత్తలు. ఆ రెండు లక్షణాలను తన కర్తవ్యంగా చేసుకొని పోరాడిన అక్షరయోధుడు.. నైజీరియాలో ఒగోనీ తెగకు చెందిన కెన్‌ సారో వివా. రచయిత, మేధావి, హక్కుల నేత. అంతకుమించి పర్యావరణవేత్త. రాయల్‌ డచ్‌కు చెందిన షెల్‌ ఆయిల్‌ కంపెనీ నైజీరియాలో అడ్డగోలుగా క్రూడ్‌ ఆయిల్‌ కోసం జరిపే తవ్వకాల కారణంగా ఒగోనీ తెగ సాగు చేసుకునే పంటపొలాలు కాలుష్యంతో నాశనమైపోతుండటాన్ని భరించలేకపోయారు. ఈ దుర్మార్గంపై కెన్‌ సారో వివా అహింసాయుత పోరాటం చేశారు. తన జాతి కోసం తానే ఓ ఆయుధం అయ్యారు. దీంతో ఆయిల్‌ కంపెనీ పెద్దలకు, సైనిక పాలకులకూ శత్రువైపోయారు. ఓ హత్య కేసులో ఇరికించి, వివాతో పాటు మరో ఎనిమిది మందిని ఉరి తీశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. 2020 లోనే ప్రపంచ వ్యాప్తంగా 227 మంది పర్యావరణవేత్తలు దారుణ హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న హత్యల్లో మూడొంతులు లాటిన్‌ అమెరికాలోనే కావడం గమనార్హం. మన దేశంలోనూ పారిశ్రామిక కాలుష్యాన్ని ప్రశ్నించినందుకో, గనుల తవ్వకాల పేరిట ఆదివాసీల ఆవాసాలను దెబ్బతీస్తున్నారని పోరాడుతున్నందుకో గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు తీసేస్తోన్న ఘటనలు లేకపోలేదు.
           ఇలా పర్యావరణానికి తూట్లు పొడుస్తూ.. పర్యావరణ వేత్తలను చంపుకుంటూపోతే- ఈ ప్రపంచం భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది.

రాజాబాబు కంచర్ల
9490099231