
క్యాన్సర్ అన్న మాట వింటేనే ఒకప్పుడు చెప్పలేని భయం.. కానీ ఇప్పుడంత భయపడాల్సిన పనిలేదు. మెజారిటీ క్యాన్సర్లను ముందే పసిగట్టి పూర్తిగా నయం చేసేలా వైద్య రంగం ఒకడుగు ముందుకేసింది. అలాగే బాగా ముదిరిన క్యాన్సర్లను కూడా మంచి మందులతో తొందరగా మృత్యువాత పడకుండా ఎక్కువకాలం జీవించేలా మేనేజ్ చేయగలుగుతున్నాం. సమీప భవిష్యత్తులో క్యాన్సర్లకు కూడా షుగర్, బీపీల్లాగే మందులు వాడే మంచిరోజు వస్తుంది. అలాగే ఏ క్యాన్సర్‌నైనా ఎదుర్కొనగలిగే డిజైనర్ డ్రగ్స్, ఇమ్యూనోథెరపీలాంటివి కూడా అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ మహమ్మారిపై పూర్తిస్థాయిలో విజయకేతనం ఎగురవేసే కాలం ఎంతో దూరం లేదనిపిస్తుంది. ఫిబ్రవరి 4న క్యాన్సర్ డేను పురస్కరించుకుని ఈ ప్రత్యేక కథనం మీకోసం.

క్యాన్సర్ అంటే తెలీక గతంలో చాలామంది మరణించే వారు. ఆ తర్వాత క్యాన్సర్‌ను గుర్తించడం, కాలానుగుణంగా ఆధునిక చికిత్సా విధానాలు ఉత్పన్నమవడంతో మరణాల రేటు తగ్గింది. క్యాన్సర్‌ను ఎదుర్కోడానికి వైద్యంతో పాటు మనోధైర్యం చాలా అవసరం. అయితే ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ గుర్తించడం అనేది చాలా కీలకం.
- లక్షణాలు..
- మాట మారడం, కీచుగొంతు, గొంతునొప్పి.
- ఎ దగ్గు మూడు వారాలకు మించి ఉండడం.
- చర్మంపై అకస్మాత్తుగా నల్లటి మచ్చలు వచ్చి సైజు పెరగటం.
- నాలుక మీద, నోట్లో మానని పుండ్లు, అల్సర్లు.
- పురుషుల్లో రక్తహీనత రావడం.
- ఉన్నట్టుండి ఆకలి తగ్గిపోవడం
- అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం.
- విరేచనంలో రక్తం పడడం, దీర్ఘకాలిక మలబద్ధకం.
- స్త్రీలలో రొమ్ములో నొప్పి లేని గడ్డలు.
- నెలసరి మధ్యలో రక్తస్రావం కావడం.
- మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం అవడం.

తెలుగు రాష్ట్రాల్లో కనిపించే ప్రధానమైన లక్షణాలు ఇవే..
- స్త్రీలలో..
- రొమ్ము క్యాన్సర్ (పట్టణాలు, నగరాల్లో)
- గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ (పల్లెటూళ్లలో)
- పొట్టలో వచ్చే క్యాన్సర్
- ఊపిరితిత్తుల క్యాన్సర్ (వేరే వాళ్లు స్మోక్ చేసే పొగను పీల్చడం) ప్యాసివ్ స్మోకింగ్ వల్ల.
- నోటి క్యాన్సర్

- పురుషుల్లో..
- ఊపిరితిత్తుల క్యాన్సర్ (పొగాకు వల్ల)
- పొట్టలో క్యాన్సర్
- నోటి క్యాన్సర్
- ప్రోస్టేట్ క్యాన్సర్
- మలద్వార క్యాన్సర్
- క్యాన్సర్లకు కూడా బీపీ, షుగర్ లాగే ట్యాబ్లెట్లు !
బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి సమస్యలకు రోజూ ట్యాబ్లెట్ వేసుకున్నట్టే క్యాన్సర్‌కు కూడా మందులు అందుబాటులోకి వస్తున్నాయి. స్త్రీలలో ఇప్పటికే రొమ్ము క్యాన్సర్‌కి ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అలాగే లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజిలోనూ ట్యాబ్లెట్ వాడడం ద్వారా కొంత వరకూ రోగాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ల్యుకేమియాకీ ప్రస్తుతం ట్యాబ్లెట్లు రెగ్యులర్‌గా వాడుతున్నారు. భవిష్యత్తులో క్యాన్సర్లకు దీర్ఘకాలికంగా మందులు వాడుతూ కంట్రోల్ చేసుకునే అవకాశం వస్తుంది.

- రాకుండా ఉండాలంటే..
- ఆహారం మితంగా తినాలి.
- నిత్యం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి.
- నిద్ర కచ్చితంగా 6 నుంచి 8 గంటలు ఉండాలి.
- ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉండాలి.
- క్రిమిసంహారకాలు వాడని ఆహారం తీసుకోవాలి.
- పదే పదే కాగిన నూనెలో వేపే పదార్థాలు పూర్తిగా నివారించాలి.
- కాలుష్యం, ఆహార కల్తీలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.

- అపోహలు.. వాస్తవాలు..
- క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఇంకొకరికి క్యాన్సర్ రాదు.
- క్యాన్సర్ వస్తే కచ్చితంగా చనిపోతారు అన్నది నిజం కాదు. క్యాన్సర్లు తొలి దశల్లో గుర్తిస్తే దాదాపు 95శాతం నయం చేయొచ్చు. అడ్వాన్స్డ్ స్టేజీలో కూడా చాలా క్యాన్సర్లను ఇప్పుడు నయం చేస్తున్నారు.
- పచ్చళ్లు, కారం ఎక్కువగా తింటే పొట్టలో క్యాన్సర్లు వస్తాయనేదానికి కూడా పూర్తి ఆధారాల్లేవు.
- సెల్‌ఫోన్ రేడియేషన్ల వల్ల క్యాన్సర్ వస్తుందనే దానికి కూడా శాస్త్రీయ ఆధారాల్లేవు.
- కత్తిగాటుతో సర్జరీ చేస్తే క్యాన్సర్లు శరీరమంతా వ్యాపిస్తాయనే విషయంలో నిజం లేదు.
- కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మిగతావాళ్లలో కూడా క్యాన్సర్ వస్తుందనుకోవడంలో వాస్తవం లేదు.
- ఆయుర్వేదం, హోమియోపతి, ఇంకా రకరకాల చెట్ల మందుల వల్ల క్యాన్సర్లు తగ్గవు. ఎందుకంటే వీటి విషయంలో ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ లేవు.
- 2023 థీమ్.. గొంతు గొంతు కలుపుతాం..!
మా ప్రచారం నిరంతరం కొనసాగుతుంది. భావ సారూప్యత గలవారితో చేరతాం. మనం ఐక్యంగా ఉన్నప్పుడు మన బలం పెరుగుతుంది. మేము వాస్తవ ప్రపంచ పురోగతి కోసం అనేక రూపాల్లో ఉత్సవాలు జరుపుకుంటాం. న్యాయంగా చేసే మా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సహకరించండి. మేము ప్రచారం చేయడం మాత్రమే కాక, ఎలుగెత్తి చాటుతాం. మాకు బలమైన చేయూతనిచ్చే, వినూత్నమైన కొత్త సహకారాన్నందించే వారిని నిర్మించుకుంటాం.
- మా చర్యలకు లెక్కలేనన్ని రూపాలు..
క్యాన్సర్ చికిత్స సమయంలో అవసరమైతే తోటి వారికి రవాణా సౌకర్యం అందించడానికి, పొరుగువారిని ప్రేరేపించడానికి కృషి చేస్తాం. స్థానిక పాఠశాలల్లో ఆరోగ్యకరమైన, సరసమైన ఆహారాన్నందించే ఏర్పాట్లు చేస్తాం. మా స్నేహితులు, సహోద్యోగులు, వారి కుటుంబాలతో సహా కమ్యూనిటీలను సమీకరించుకుంటాం. ఎందుకంటే ఐకమత్యంగా చేస్తే ఏదైనా సాధించగలమని నిరూపిస్తాం.

- ప్రధాన కారణాలు..
- ఇండియాలో క్యాన్సర్లకు ప్రధానమైన మొదటి కారణం పొగాకు. నేరుగా స్మోకింగ్ చేయడం, పాసివ్ స్మోకింగ్, పొగాకు నమలడం వల్ల కావచ్చు. బీడీ, అడ్డచుట్ట, గుట్కా లాంటివి కారణం కావచ్చు. పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చే క్యాన్సర్లు దాదాపు నిన్న మొన్నటి వరకు 50 శాతం ఉండేవి. 2022కి అవి 30 శాతానికి తగ్గినప్పటికీ పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చే క్యాన్సర్లే ఎక్కువ. పొగాకుతో వచ్చే క్యాన్సర్లలో ప్రధానమైనది ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇది కాక, నోట్లో, గొంతులో వచ్చే ఓరల్ క్యాన్సర్లు, మెడ, తలలో వచ్చే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, పొట్టలో వచ్చే కోలన్ క్యాన్సర్లకు కూడా పొగాకే కారణం. పొగాకులో దాదాపు 400 హానికర రసాయనాలుంటాయి. అందులో 75 శాతం రసాయనాలు క్యాన్సర్ కారకాలని రుజువైంది.
- స్త్రీలలో వచ్చే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్‌కు కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. స్త్రీలలో వ్యక్తిగత శుభ్రత లోపించినా, విశృంఖల లైంగిక సంబంధాలున్నా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదముంటుంది.
- హెపటైటిస్-బి,సి వైరస్, ఆల్కహాల్ కారణంగా కాలేయ క్యాన్సర్ వస్తుంది.
- రొమ్ము క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, అండాశయాల క్యాన్సర్లలో వంశపారంపర్యత కారణంగా కనిపిస్తుంది. పీరియడ్స్ తొమ్మిదేళ్లకే మొదలవడం, తక్కువ వయసులోనే పీరియడ్స్ ఆగిపోవడం, అసలు పిల్లలు పుట్టకపోవడం, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ సొంతంగా వాడడం, స్థూలకాయంలాంటి కారణాల వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
- మనం పీల్చే గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నా కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదముందని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
- ఇక ఇటీవల ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతిదానికీ ప్లాస్టిక్ వాడుతున్నాం. ప్లాస్టిక్ వాడకం వల్ల కూడా క్యాన్సర్ల రేటు పెరిగింది.
- ఇక మనం తినే ప్రతీ ఆహారం మీద విపరీతంగా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకం పెరిగింది. పైగా ఆహారంలో కల్తీ కూడా విశంఖలంగా పెరిగింది. వీటివల్ల కూడా క్యాన్సర్ల రేటు పెరిగింది.

- అందుబాటులో ఉన్న చికిత్సలు..
1. సర్జరీ
2. రేడియేషన్.
3. కీమో థెరపీ
4. ఇమ్యూనోథెరపీ
5. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్
6. హార్మోన్ థెరపీ
7. టార్గెటెడ్ డ్రగ్ థెరపీ
8. క్రయోఅబ్లేషన్ థెరపీ
9. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్
10. క్లినికల్ ట్రయల్స్

క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్సపై దృష్టి
రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్‌పై దృష్టి సారించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఎస్‌పిఓ ఇచ్చారని పేర్కొన్నారు. శుక్రవారం దీనిపైనే సిఎం సుదీర్ఘంగా చర్చించారని, అన్ని చోట్లా స్క్రీనింగ్ నిర్వహించడం ద్వారా ముందుగానే పేషెంట్లను గుర్తించి వారికి ప్రాథమికదశలోనే చికిత్స అందిస్తే మెరుగవుతుందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి క్యాన్సర్ స్క్రీనింగ్, వైద్య చికిత్సపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని బోధనాస్పత్రుల్లో, కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలల్లో క్యాన్సర్ చికిత్స, నివారణా పరికరాలు ఉండేలా చూడాలని సిఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్ కాన్సెప్టులో భాగంగా ప్రతి ఇంట్లోనూ అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించాలనే నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. క్యాన్సర్‌కు కావలసింది ఖరీదైన వైద్యం కావడంతో ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్సలు చేయిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ప్రాథమికదశలోనే దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీని కోసం అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కృష్ణబాబు పేర్కొన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు
- తెలంగాణాలో మూడంచెల వ్యూహం
మొబైల్ స్క్రీనింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, చికిత్స అందిస్తున్నాం. నెలకు ఆరు క్యాంపులు పెడుతూ, సగటున 600 నుండి 800 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. నిర్ధారణ అయిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని వీచీజీ ఆసుపత్రికి పంపిస్తున్నాము. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సగటున సంవత్సరానికి రూ.100 కోట్లతో, 15 వేల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలందిస్తున్నాం. MNJ, నిమ్స్ ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్స అందిస్తున్నాం. ఇందులో భాగంగా MNJ క్యాన్సర్ హాస్పిటల్‌లో కొత్తగా 30 కోట్లతో ఎనిమిది మాడ్యులర్ థియేటర్లు ప్రారంభించాం. MNJ ఆసుపత్రిని రూ. 120 కోట్లతో స్టేట్ కాన్సర్ సెంటర్‌గా అభివద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటులో 20 లక్షల దాకా విలువ చేసే బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తున్నాం. రేడియో థెరపీ, కీమో థెరపీ చికిత్సలను ఉచితంగా అందిస్తున్నాం. పెరుగుతున్న కేసుల నేపథ్యం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వ్యాధిగ్రస్తులు హైదరాబాద్‌కు రావడంలో ఉన్న ఇబ్బందిని గుర్తించి, ప్రభుత్వం జిల్లా స్థాయిలోనే కాన్సర్ సేవలందించడానికి District cancer centersను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమిక ఆలోచన కలిగి ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 33 జిల్లాల్లో పాలియేటివ్ కేర్‌లు ప్రారంభించి, అవసాన దశలో ఉన్నవారికి ఆత్మీయంగా సేవలు అందిస్తున్నాం. తెలంగాణ డయాగస్టిక్ పథకం ద్వారా జిల్లా స్థాయిలోనే కాన్సర్‌ను గుర్తించడానికి అవసరమైన మమ్మోగ్రఫీ, బయాప్సీ వంటి అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పథకం ద్వారా సాధారణ కాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ములుగు, సిరిసిల్లలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలువనున్నది.
ఆరోగ్య మంత్రి హరీష్‌రావు
డిజైనర్ డ్రగ్స్, ఇమ్యూనో థెరపీ.. భవిష్యత్ ఆశాకిరణాలు..
శరీరంలో ఏదైనా కణం మెదడు కంట్రోల్ నుంచి తప్పిపోయి, తనంతకు తానుగా విశృంఖలంగా పెరిగిపోవడమే.. క్యాన్సర్. అసలిలా ఓ మంచి కణం, క్యాన్సర్ కణంగా ఎందుకు మారుతోందనే విషయంలో ఇటీవలికాలంలో చాలా కారకాలను గుర్తించగలుగుతున్నారు. అలాగే క్యాన్సర్లను ప్రేరేపించే కారకాలను గుర్తించి, వాటిని టార్గెట్ చేసే డిజైనర్ డ్రగ్స్‌ని తయారు చేస్తున్నాం. అలాగే ఒంట్లో రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనోథెరిపీ ఒకటి. క్యాన్సర్‌తో ఫైట్ చేయడంలో ఇమ్యూనోథెరపీ అన్నది బ్రహ్మాండంగా పనిచేస్తోంది. క్యాన్నర్ నాలుగో స్టేజీలో ఉన్నప్పటికీ ఇమ్యూనోథెరపీ బాగా పనిచేస్తోంది.
డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు, అమెరికా
ఇటీవల పెరిగిన క్యాన్సర్లు..
ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్లు బాగా పెరిగాయి. ఈ క్యాన్సర్లను తగ్గించడానికి ప్రధానంగా ప్రజల్లో అవగాహన పెంచాలి. అలాగే క్యాన్సర్ల స్క్రీనింగ్ పరీక్షలు కూడా పెంచాలి. ప్రతి జిల్లాలో ఉన్న ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో కచ్చితంగా ఆంకాలజీ వార్డు ఉండాలి. హెచ్.పి.వి, హెపటైటిస్ లాంటి వ్యాక్సిన్లు వేయించడం ద్వారా కొన్ని క్యాన్సర్లను నివారించవచ్చు. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, నోట్లో పుండ్లను చెక్ చేసుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా కూడా కొన్ని క్యాన్సర్లను అడ్డుకోవచ్చు.
డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, సౌమ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్.
-నాగ్‌రాజ్ 3 టీవీ హెల్త్ ఛానల్