
మోడీ అంటే అదానీ - అదానీ అంటే మోడీ అన్న వాతావరణం దేశంలో ఉన్నమాట వాస్తవం. మోడీ సర్కార్ విధానాలను విమర్శించటం దేశద్రోహం అని చిత్రించినట్లుగానే ఇప్పుడు అదానీ కంపెనీ గురించి ఏదైనా ప్రతికూల అంశాలను చెబితే దాన్ని కూడా దేశద్రోహం అనే స్థితికి వెళ్లారు. మన వారు ధనికులు కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నిందిస్తున్నారు. అదానీ కంపెనీ ఆర్థిక విభాగ అధిపతి జగుషిందర్ సింగ్ మరో అడుగుకు ముందుకేసి హిండెన్ బర్గ్ నివేదికను బ్రిటీష్ వారి జలియన్‌వాలాబాగ్ మారణకాండతో పోల్చారు.
''విదేశీయులు చెప్పింది నమ్ముతారు తప్ప భారతీయులు చెప్పింది నమ్మరు '' అదానీ షేర్ల కుంభకోణాన్ని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ బట్టబయలు చేయడంపై స్వయం ప్రకటిత '' దేశభక్తులు వీరావేశంతో అన్నమాటలివి. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రకటించిన భరోసా, రాయితీల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో 2022లో ప్రపంచ స్టాక్‌మార్కెట్లో మన వాటాల విలువ 3.6శాతం పెరిగింది. ఇది ఎవరో విదేశీయులో మరొకరో చెప్పిన మాటలను బట్టి కాదు పక్కా భారతీయులు చెప్పిందాన్ని నమ్మబట్టే. కానీ తాజాగా ఒక విదేశీ కంపెనీ చెప్పిన అంశాలతో స్టాక్ మార్కెట్‌లో ఆ షేర్ల విలువ ఒక్కసారిగా 3.1శాతం (3.2లక్షల కోట్ల డాలర్లు) తగ్గింది. అబ్బే, అక్రమాలేం జరగలేదని పక్కా భారతీయుడు అదానీ జాతీయ జెండాను ఎగురవేసి 413 పేజీల వివరణ ఇచ్చినా మార్కెట్లో అతని కంపెనీల షేర్ల పతనం ఆగలేదు. గుజరాత్ మారణకాండ విషయంలోనూ అంతే. ఈ కుహనా దేశభక్తులు చెప్పినదాన్ని జనం విశ్వసించడం లేదు, బిబిసి చెప్పినదాన్ని విశ్వసిస్తున్నారు. నాడు జరిగిన ఉదంతాలపై బ్రిటీష్ రాయబారి తమ దేశానికి నివేదించిన అంశాలను బిబిసి వెల్లడించింది. విశ్వహిందూపరిషత్ వంటి సంస్థల పాత్ర గురించి అది తెలియజేసింది. చేతిలో అధికారం ఉంది కదా అని నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో ఆ డాక్యుమెంటరీని కనిపించకుండా చేసింది. అయినా, అవి బయటకు తన్నుకొస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు, చివరికి మన దేశానికి సంబంధించి అనేక అంశాల మీద సమాచారం కోసం బిబిసి రేడియో మీదనే ఆధారపడిన రోజులు దేశంలో ఉన్నాయి.1975లో అత్యవసర పరిస్థితి ప్రకటన అనేక మంది ముందుగా దాని ద్వారానే తెలుసుకున్నారు. మన ప్రభుత్వ, ప్రయివేటు మీడియా సంస్థలు పాలకులకు బాకాలుగా మారిన స్థితిలో నిజాల కోసం పరితపించిన జనాలు విదేశీ మీడియా కోసం ఎదురు చూస్తున్నారు.. మన దూరదర్శన్ కన్నా బిబిసి అనేక రెట్లు విశ్వసనీయమైనదని ఓ ఎన్నికల ప్రచార సభలో సాక్షాత్తు మోడీయే అన్న విషయం మరచిపోరాదు.
మోడీ అంటే అదానీ - అదానీ అంటే మోడీ అన్న వాతావరణం దేశంలో ఉన్నమాట వాస్తవం. మోడీ సర్కార్ విధానాలను విమర్శించటం దేశద్రోహం అని చిత్రించినట్లుగానే ఇప్పుడు అదానీ కంపెనీ గురించి ఏదైనా ప్రతికూల అంశాలను చెబితే దాన్ని కూడా దేశద్రోహం అనే స్థితికి వెళ్లారు. మన వారు ధనికులు కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నిందిస్తున్నారు.
అదానీ కంపెనీ ఆర్థిక విభాగ అధిపతి జగుషిందర్ సింగ్ మరో అడుగుకు ముందుకేసి హిండెన్ బర్గ్ నివేదికను బ్రిటీష్ వారి జలియన్‌వాలాబాగ్ మారణకాండతో పోల్చారు. దేశం మీద, దాని సంస్థల మీద పథకం ప్రకారం జరిపిన దాడి అన్నారు. జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడైంది. తరువాత స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీల వాటా ధరల పతనానికి దారితీసింది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు అదానీ షేర్ల పతనం మిగతా కంపెనీల షేర్ల పైనా పడింది. కొన్ని లక్షల కోట్ల మేరకు వాటాదార్ల సంపద ఆవిరైంది. సోమవారం నాడు రాయిటర్ వార్తా సంస్థ ఇచ్చిన కథనం మేరకు 65బిలియన్ డాలర్ల సంపద హరీమంది. ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటానని చెప్పిన చౌకీదార్ ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు దీని మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంత పెద్ద కుంభకోణం మీద జనాలకు ఏదో ఒకటి చెప్పాలా లేదా ? నిజంగా అదానీ కంపెనీల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంటే అవి ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ప్రకటించి అనుమానాలకు తెరదించాలి, మోడీ మౌనానికి అర్ధం ఏమిటి ?మన్మోహన్ సింగ్‌ను మౌన ముని అంటూ ఎద్దేవా చేసిన వారు మోడీ మూగనోముపై మాట్లాడరేం ?
2014లో అదానీ సంపదల విలువ 8 బిలియన్ డాలర్లు కాగా 2022లో అది 137బి.డాలర్లకు (1,600శాతం) పెరిగింది. ఈ వాస్తవాన్ని కాదనగలరా ? మిగతా కంపెనీలకు లేని ఈ అసాధారణ పెరుగుదల అదానీకి ఎలా వచ్చింది ? ఏదైనా మంత్రదండం ఉందా ? వందల సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తలుగా ఉన్న టాటా, బిర్లా, తరువాత వచ్చిన అంబానీ కంపెనీలకు రాని లాభాలు అదానీకి ఎలా వచ్చినట్లు ? క్రోనీ కేపిటలిజానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యం.
హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశాల్లో అదానీ గ్రూపు రుణాల గురించి మాత్రమే కాదు అదొకటి మాత్రమే. పన్ను స్వర్గాలతో సంబంధాలు పెట్టుకొని ఎగవేసినట్లు కూడా ఆరోపించింది. రుణ ఎగవేతదార్ల జాబితాలో అదానీ ఉన్నట్లు ఎవరూ చెప్పటం లేదు, అలాంటి ప్రమాదం ఉందని మాత్రమే అంటున్నారు.2015లోనే క్రెడిట్ సూసీ తన నివేదికలో తీవ్ర రుణ వత్తిడిని ఎదుర్కొంటున్న పది సంస్థలలో అదానీ గ్రూపు ఒకటని పేర్కొన్నది. తాజాగా అమ్మకానికి పెట్టిన ఎఫ్‌పిఓ వాటాలతో వచ్చిన సొమ్మును కొత్త పెట్టుబడి కోసం గాక ఇప్పటికే ఉన్న కంపెనీల అప్పులు తీర్చేందుకు అన్నది తెలిసిందే. బమ్మిని తిమ్మిని చేసి లేని విలువను సృష్టించి మోసానికి పాల్పడిన సత్యం కంపెనీ మాదిరి అదానీ చేసినట్లు చెప్పింది, దాని గురించి చెప్పకుండా రుణాల చుట్టూ తిప్పుతున్నారు. ఎల్‌ఐసి పెట్టిన పెట్టుబడుల కంటే ఇప్పటికీ విలువ ఎక్కువే ఉన్నదని, నష్టం లేదు కదా అని లెక్కలు చెబుతూ పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు. ఎల్‌ఐసి కొనుగోలు చేసిందంటే కంపెనీ విశ్వసనీయత కలిగినదని మదుపుదార్లు విశ్వసిస్తారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి ఉంటారన్నది ఒక అభిప్రాయం.
అదానీ కంపెనీలకు ఎస్‌బిఐ రుణాలు ఇవ్వటం, ఎల్‌ఐసి పెద్ద మొత్తంలో వాటాలు కొనటం వెనుక బిజెపి పెద్దల హస్తం ఉందన్న విమర్శలున్నాయి. అసలు వీరి సమస్య ఏమిటి ? ఆ పని చేస్తే నరేంద్రమోడీకి ఎవరు అడ్డుపడ్డారు ? ఇడి, సిబిఐలను అలాంటి అక్రమాల నిగ్గుతేల్చేందుకు పంపండి. అధికారానికి వచ్చి తొమ్మిదేళ్లు , అరిగిపోయిన రికార్డులను ఎన్ని సంవత్సరాలు ఇంకా వినిపిస్తారు ?
హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశాలకు అదానీ కంపెనీ 413 పేజీలతో సుదీర్ఘ వివరణ ఇచ్చింది.అసలు అంశాలను పక్కన పెట్టిందని, జాతీయతజెండాను కప్పి అక్రమాలను కనపడకుండా చేసేందుకు పూనుకున్నదని హిండెన్‌బర్గ్ స్పందించింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి సంబంధించిన విదేశీ సూట్‌కేస్ కంపెనీల లావాదేవీల గురించి తాము ప్రశ్నించినదానికి సమాధానం లేదని పేర్కొంది. వాటికి అదానీ కంపెనీల నుంచి పంపినవి, తిరిగి వాటి నుంచి అదానీ కంపెనీలకు చేరిన బిలియన్ల డాలర్ల నిధుల సంగతేమిటని, అవి వినోద్ అదానీకి ఎక్కడి నుంచి వచ్చిందీ చెప్పాలని హిండెన్‌బర్గ్ కోరింది. దానికి అదానీ కంపెనీ ఇచ్చిన వివరణ ఏమిటో తెలుసా ! '' ఆ కంపెనీలకు నిధులు ఎక్కడివో మాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందీ తెలుసుకోవాల్సిన అవసరమూ మాకు లేదు. వినోద్ అదానీ వాణిజ్యం, లావాదేవీల గురించి వ్యాఖ్యానించే స్థితిలో మేము లేము '' అని పేర్కొన్నారు. అదే గనుక నిజమైతే గౌతమ్ అదానీ తన సోదరుడిని విడిగా లేదా కుటుంబ సంస్థను నడుపుతున్నారు గనుక భోజన టేబుల్ దగ్గర గానీ ఆ వివరాలన్నీ అడిగి రహస్యాన్ని చేధించాలని, తాము లేవనెత్తిన ప్రశ్నలలో 62 నుంచి 88 వరకు నిర్దిష్ట సమాధానాలు చెప్పలేదని పేర్కొన్నది.
హిండెన్‌బర్గ్ సంస్థ నివేదికపై కుట్ర ఠియరీని బిజెపి ముందుకు తెస్తోంది. బిబిసి డాక్యుమెంటరీపై బుకాయించి మరింత అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఇప్పుడు హిండెన్‌బర్గ్ నివేదిక విషయంలోనూ అలాగే వ్యవహరిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ దీనిపై ఇప్పటికైనా నోరు విప్పాలి. అదానీ షేర్ల కుంభకోణంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలి. అందుకు ఈ నిరంకుశ ప్రభుత్వం సిద్ధపడుతుందా అన్నదే ప్రశ్న.
-సత్య