May 20,2023 07:51

ఒకే ఏడాది సుమారు 6 కోట్లకు పైగా పని దినాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా చట్టంలోని మౌలిక అంశాలను, కనీస సౌకర్యాలను రద్దు చేసింది. రెండు పూటలా పని చేయాలని నిర్ణయించింది. ఎండాకాలంలో ఇస్తున్న 20 శాతం నుండి 30 శాతం అలవెన్స్‌ను తొలగించింది. చివరకు గుక్కెడు మంచినీళ్ళ కోసం ఇస్తున్న డబ్బులను సైతం రద్దు చేసింది. పొమ్మనకుండా పొగబెట్టి, పేదలే ఈ పథకం వద్దనేలా కేంద్ర ప్రభుత్వం కుట్రకు పూనుకున్నది. దీనికి తందాన అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా 10 శాతం నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది.

మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇచ్చేవారు. ఒకానొక సందర్భంగా 50 శాతం కూడా ఇచ్చారు. చట్టం ప్రారంభం అయినప్పటి నుండి వున్న ఈ అలవెన్స్‌ను ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కావాలనే రద్దు చేసింది. దీనివల్ల ఎర్రటి ఎండలో చేతులు బొబ్బలెక్కేలా పని చేసినా గిట్టుబాటు కూలి రావడం లేదు. పేదలు ఈ పని మానుకుంటే తప్పుడు మస్టర్లు సృష్టించి కాంట్రాక్టర్లు, దళారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

            మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదలకు ఒక వరం లాంటిదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు, 2020లో కరోనా మహమ్మారితో ప్రపంచమంతా తల్లడిల్లినప్పుడు మన దేశం కూడా అందులో చిక్కుకుంది. పారిశ్రామిక, సేవా, రవాణా, భవన నిర్మాణం మొదలుకొని ఐ.టి సంస్థలు సైతం మూతపడ్డాయి. వ్యవసాయ కార్మికులే కాకుండా ఇతర ప్రజానీకం పెద్ద ఎత్తున పని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదలను అక్కున చేర్చుకొని పట్టెడన్నం పెట్టింది. వ్యవసాయ కార్మికులు మొదలు పి.జి చదువుకున్న యువతీ యువకులు కూడా ఈ పనికెళ్ళి పొట్ట నింపుకున్నారు. అంతే కాకుండా ఈ చట్టం వల్ల దేశంలో సన్న చిన్నకారు రైతుల భూమిలో కూడా అభివృద్ధి పనులు జరిగేవి. అనేక సంవత్సరాలుగా పూడిక పోయిన చెరువులు, పంట కాలువలు అభివృద్ధి అయ్యాయి. అందుకే 2018లో బిజెపి ప్రభుత్వం ఉపాధి చట్టంలో ఉన్న హామీని తొలగించాలని చూసినప్పుడు ప్రముఖ ఆర్థికవేత్తలు ఈ చట్టం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఉపాధి హామీ చట్టం ఉండడం వల్లే భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగల్గిందని చివరకు ప్రపంచ బ్యాంకు సైతం కీర్తించింది. ఇంతటి ప్రాధాన్యత కల్గి కోట్లాది మంది గ్రామీణ పేదలకు పట్టెడన్నం పెడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సింది పోయి దీని పీక నొక్కడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంది. ఒకేసారి చట్టాన్ని రద్దు చేస్తే పేదలు తిరగబడతారనే ఉద్దేశ్యంతో తడిగుడ్డతో గొంతు కోసినట్టు బడ్జెట్‌లో నిధులు తగ్గించింది. 2020-21 సంవత్సరంలో రూ. లక్ష కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 30 శాతం నిధులు తగ్గించి కేవలం రూ.70 వేల కోట్లతో సరిపెట్టింది. ఇందులో కూడా సుమారు రూ. 20 వేల కోట్లు పాత బకాయిలు ఉన్నాయి. ఇవి పోగా మిగిలినది కేవలం రూ.50 వేల కోట్లు మాత్రమే. ఈ నిధులు అన్ని రాష్ట్రాలకు ఏ లెక్కన ఎంత వస్తుందో మనకు తెలియనిది కాదు. ఈ కారణంగా మన రాష్ట్రంలో ఏటా 25 నుంచి 30 కోట్ల పని దినాలు కల్పిస్తే ఈ సంవత్సరం 19 కోట్ల పని దినాలకు మించి దొరికే అవకాశం లేదు. ఒకే ఏడాది సుమారు 6 కోట్లకు పైగా పని దినాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా చట్టంలోని మౌలిక అంశాలను, కనీస సౌకర్యాలను రద్దు చేసింది. రెండు పూటలా పని చేయాలని నిర్ణయించింది. ఎండాకాలంలో ఇస్తున్న 20 శాతం నుండి 30 శాతం అలవెన్స్‌ను తొలగించింది. చివరకు గుక్కెడు మంచినీళ్ళ కోసం ఇస్తున్న డబ్బులను సైతం రద్దు చేసింది. పొమ్మనకుండా పొగబెట్టి, పేదలే ఈ పథకం వద్దనేలా కేంద్ర ప్రభుత్వం కుట్రకు పూనుకున్నది. దీనికి తందాన అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా 10 శాతం నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది.
           అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి వామపక్ష పార్టీల ఒత్తిడితో సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం బిజెపి ప్రభుత్వానికి ఇష్టంలేదు. 2006 ఏప్రిల్‌ 2న మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో ప్రారంభమైనప్పటి నుండి ఉపాధి హామీపై ఇంత తీవ్రమైన దాడి ఏనాడూ జరగలేదు. గడిచిన రెండేళ్ళ నుండి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండడం, ఉన్న కొద్దిపాటి పనుల్లో కూడా యంత్రాలు ప్రవేశించడం వల్ల గ్రామీణ పేదలకు పని లేక పెద్దఎత్తున వలసలు పోతున్నారు. చన్నీళ్ళకు వేన్నీళ్ళు తోడైనట్లు ఉపాధి చట్టం ఉండబట్టి కొంత ఉపశమనం కలుగుతున్నది. ఈ చట్టాన్ని కాపాడుకోకపోతే గ్రామీణ పేదల ఉపాధే ప్రశ్నార్ధకంగా మారుతుంది.
 

                                                             రెండు పూటలా ఎందుకు పని చేయాలి ?

ఉపాధి చట్టంలో పని చేసే కార్మికులకు రోజు వేతనం కాకుండా పీస్‌ రేట్‌ (కొలతలు) ప్రకారంగా వేతనాలు ఇస్తారు. మనం ఎన్ని గంటలు పని చేయాలన్న నిబంధన లేదు. ఎంత పని చేస్తే అంతే వేతనం చెల్లిస్తారు. అటువంటిది రెండు పూటలా పని చేయాలనే నిబంధన ఎక్కడా లేదు. ఈ ఏడాది రెండు పూటలా పని చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల చాలా చోట్ల ఉదయం 6 గంటలకు వెళ్ళి 11 గంటల తరువాత ఇళ్ళకు చేరుకోవాలి. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు చేయాలనే నిబంధన విధించడమే కాకుండా ఆన్‌లైన్‌లో హాజరు తీసుకోవాలని నిర్ణయించారు. ఒకవేళ ఆ పేదలు పని అయిపోయిన సమయానికి సర్వర్‌ డౌన్‌ అయ్యి నెట్‌ రాకపోతే ఎన్ని గంటలైనా ఎదురు చూడాలి. లేకపోతే ఆరోజు పని చేసినా హాజరు పడదు. దీని వల్ల కూలీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఎర్రటి ఎండలో 5 నుండి 10 కి.మీ. వెళ్ళి చేతులు బొబ్బలెక్కేలా పని చేసినా గ్రామీణ పెత్తందార్లు ఓర్వలేక ఉచితంగానే డబ్బులు వస్తున్నాయని కూలీలపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఉపాధి చట్టం ఉంటే పేదలు తమ మాట వినడం లేదని, చెల్లుబాటు కావడం లేదని ఈ చట్టాన్ని రద్దు చేయాలని గోల చేస్తున్నారు. వీరి మాటలకు తలొగ్గిన బిజెపి ప్రభుత్వం అనేక షరతులు పెట్టి ఉపాధి హామీ చట్టం పీక నొక్కడానికి పూనుకున్నది.
 

                                                                          సమ్మర్‌ అలవెన్స్‌

ఎండా కాలంలో నేల గట్టిగా ఉంటుంది. కాబట్టి తవ్వడం సాధ్యం కాదు. చాలా చోట్ల పేదలే ముందు రోజు సాయంత్రం పని చేసే చోట ట్యాంకర్లతో నీళ్ళు పోసి మరుసటి రోజు ఉదయం పని చేస్తారు. కాబట్టి ఎండాకాలంలో ఫిబ్రవరి, జూన్‌ నెలల్లో 20 శాతం... మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇచ్చేవారు. ఒకానొక సందర్భంగా 50 శాతం కూడా ఇచ్చారు. చట్టం ప్రారంభం అయినప్పటి నుండి వున్న ఈ అలవెన్స్‌ను ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కావాలనే రద్దు చేసింది. దీనివల్ల ఎర్రటి ఎండలో చేతులు బొబ్బలెక్కేలా పని చేసినా గిట్టుబాటు కూలి రావడం లేదు. పేదలు ఈ పని మానుకుంటే తప్పుడు మస్టర్లు సృష్టించి కాంట్రాక్టర్లు, దళారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
 

                                                                      కనీస సౌకర్యాల కొరత

పనిచేసే చోట భద్రత, ఎండలో సేద తీరడానికి టెంటు, మంచినీళ్ళ కోసం రూ.5, 5 కి.మీ దూరం మించి పనికి వెళ్ళాల్సి వస్తే రాను పోను చార్జీలు, గునపం సాన పట్టడానికి డబ్బులు, తట్టకు రూ.5, మేట్లకు రూ.3 ఇచ్చేవారు. గాయాలైతే ప్రాథమిక చికిత్సకు మెడికల్‌ కిట్లు, ఐదుగురి పిల్లలకు ఒక ఆయాను ఇచ్చేవారు. గర్భిణీలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు చేయగలిగే పనులు ఇచ్చేవారు. వీరు 70 శాతం పని చేసినా 100 శాతం వేతనం ఇవ్వాలని చట్టంలో కూడా ఉంది. కాని నేడు బిజెపి ప్రభుత్వం ఇవన్నీ రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ కనీస సౌకర్యాలను అందించలేకపోతున్నది.
 

                                                                              మస్టర్లు

చట్టం ప్రారంభం నుండి ప్రతివారం ఒక మస్టర్‌ ఇచ్చి ప్రతి ఒక్కరితో అటెండెన్స్‌ తీసుకొని, ప్రతి శనివారం అటెండెన్స్‌ పూర్తి చేసి, కొలతలు వేసి ఎపిఒ ఆఫీస్‌కి పంపేవారు. దీనితో పాటు అదే రోజు ఒక్కొక్క మనిషికి ఎంత వేతనం వస్తుందో ప్రతి కార్మికుడు తెలుసుకోవడానికి పే స్లిప్‌లు ఇచ్చేవారు. నేడు అవన్నీ రద్దు చేసి ఆన్‌లైన్‌లో అటెండెన్స్‌ తీసుకోవాలని నిర్ణయించింది. ఈ కారణంగా పని చేసే చోట నెట్‌ సౌకర్యం అందుబాటులో లేకపోతే అప్‌లోడ్‌ కాక చేసిన పని కూడా వృధా అవుతుంది, మస్టర్‌ కూడా పడదు. రాష్ట్రంలో చాలా గ్రామాలలో ముఖ్యంగా ఏజెన్సీలో ఫోనే పని చేయదు. అలాంటిది నెట్‌ సౌకర్యం ఎక్కడుంటుంది? దీనివల్ల అవినీతి కూడా పెరిగింది.
             గతంలో ప్రతి 10-20 మందికి ఒక గ్రూపు, దానికి ఒక మేట్‌ ఉండేవాడు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం మేట్లను తొలగించి వారి స్థానంలో సైట్‌ సూపర్‌వైజర్లను నియమిస్తున్నది. వీరికి కనీసం ఫోన్‌ కూడా ఇవ్వలేదు. కొన్నిచోట్ల క్షేత్రస్థాయి సిబ్బంది పై అధికారులతో, రాజకీయ నాయకులతో కుమ్మక్కై పని చేయని వారి దొంగ మస్టర్లు చేర్పించి డబ్బులు మింగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పేరుతో పేదల డబ్బులు కొల్లగొడితే...నేడు ప్రభుత్వ భవనాలు, సిమెంట్‌ రోడ్ల పేరుతో యంత్రాలను ఉపయోగించి కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకులు పేదల నిధులను బొక్కేస్తున్నారు. కాబట్టి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలతో సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున పోరాడాల్సిన సమయం ఆసన్నమైనది. ఒకపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి నిధులు ఇవ్వకుండా కుట్ర చేస్తుండగా... మరోపక్క దేశంలోకెల్లా ఆదర్శవంతంగా కేరళ రాష్ట్రం ఉపాధి హామీ చట్టాన్ని గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపచేసింది. ఉపాధి హామీలో పని చేస్తున్న పేదలను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. ప్రతి కార్మికుడు నెలకు రూ.50 చెల్లిస్తే ప్రభుత్వం దానికి తోడు చేస్తున్నది. ఈ డబ్బును వ్యవసాయ కార్మికుల కుటుంబాలు తమ పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు, శుభ అశుభ కార్యక్రమాలకు వాడుకోవచ్చు. కేరళ ప్రభుత్వం పేదల కోసం ఇంత సహాయం చేస్తే...కార్పొరేట్లు, పెట్టుబడిదారుల భజన చేస్తున్న బిజెపి ప్రభుత్వం ఉపాధి పీక నొక్కడానికి పూనుకుంది. అటువంటి బిజెపి ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలి. అంతేగాక ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం, బడ్జెట్‌లో నిధుల పెంపుకు, కనీస సౌకర్యాల అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజాసంఘాలు చేపట్టిన ఉద్యమంలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులందరూ పాల్గొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.

/ వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్‌ : 94900 98980 /
వి. వెంకటేశ్వర్లు

వి. వెంకటేశ్వర్లు