జీవితం
రెండు పార్శ్వాలుగా విడిపోతుందనీ
అవగాహనాలేమిలో కొట్టుకుపోతుందనీ
కాలం నిర్దయగా కరిగిపోతుందనీ
అయినా కలిసే ఉంటామని
కలనైనా అనుకోలేదు
మనిషికీ మనిషికీ మధ్య
మానవత్వాలు మమతలు కరువౌతాయని
అయినా కలిసే ఉంటామని
కాలస్పృహ కోల్పోయి
భలే భలేగా బతికేస్తామని
రెండు చేతులా సంపాదిస్తూ..
వ్యాపార బతుకులు బతికేస్తామని
అయినా కలిసే ఉంటామని
సెల్‌ఫోన్లో జీవంలేని ఊసులు
పొడి పొడిగా రాలుతుంటాయనీ
ఇంతేనా...! అంటూ రింగ్‌టోన్ ఎద్దేవా..
అయినా కలిసే ఉంటాను
కాస్త టచ్‌లో వుంటుందని కాల్ చేస్తే..
కవరేజ్ ఏరియాలో కవరే కాదాయే..
అయినా సర్దుకుపోతాను
భాగస్వామిని కదా..!
నా స్వామికి ఎక్కడి భాగాన్నో నేను..
ఓహో అర్ధభాగాన్నంట..నేను..
నువ్వెంతో.. నేనూ అంతే..
ఈగోలకు కవాటాలు
బార్లా తెరుచుకుంటాయి
తర్జనభర్జనలతో ఆదివారం ఆటవిడుపే
మనసుకు వారం సరిపడా గాయాలు..
ఓ ఆత్మీయ ఆలింగనం వుంటే బావుణ్ను
రోజూ ఈ నిట్టూర్పే..
బయటికీ లోపలికీ నడుమ
పలుచని పొర
ఎవరి వాంఛలు, వ్యాపకాలు వారివే
ఎవరి దక్కులూ, దిక్కులూ వారివే
అయినా కలిసే ఉంటున్నాం ...!
డా.కటుకోఝ్వల రమేష్
9949083327