
చందమామ రావే..జాబిల్లి రావే అంటూ లాలి పాడని గడప తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. తరతరాలుగా గొంతెత్తి పాడుతున్నా..చందమామ దరికి చేరింది లేదు..అందుకే చందమామ దగ్గరికి మనమే పయనమవుతున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సంకల్పించిన ఈ బహుదూరపు గమ్యానికి 2008లో చంద్రయాన్ 1తో 'మేమొస్తున్నాం..' అంటూ నెలరేడుకి హాయి చెప్పివచ్చాం. 2019లో మలి ప్రయత్నంలో జాబిల్లికి దగ్గరగా వెళ్లినట్టే వెళ్లి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయాం. ఇప్పుడు మళ్లీ బాటలో కుదుపులేవీ లేకుండా సజావుగా చందమామ చేరేందుకు సకల సాంకేతిక హంగులు పోదిపర్చుకుని చంద్రయాన్ 3 దిగ్విజయంగా దూసుకెళ్లింది. 2019లో చంద్రయాన్ 2 విఫలం కావడంతో నాటి ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టిన వైనం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనేవుంది. శుక్రవారం చంద్రయాన్ 3 నింగిలోకి నిప్పులు చెరుగుతూ దూసుకెళ్తుంటే కోట్లాది కొత్త ఆశలు చిగురించాయి. శాస్త్రవేత్తల నిరంతర కృషి, అకుంఠిత దీక్షా పట్టుదల అభినందనీయం. ఓటమికి కుంగిపోకుండా సాధించాలన్న తపనతో అనతికాలంలోనే మరో బృహత్తర ప్రయోగానికి సంకల్పించడం ఆషామాషీ కాదు. ఇప్పుడు చందమామను దక్షిణ ధ్రువంపై రోవర్ 'ప్రజ్ఞాస్' ఎప్పుడెప్పుడు ముద్దాడుతుందా! అని భారతావని ఎదురుచూస్తోంది. శ్రీహరి కోట నుంచి నింగిలోకి ఎగిసిన చంద్రయాన్ 3 చంద్రుడి దగ్గరకు చేరడానికి సుమారు 40 రోజుల సమయం పడుతుంది. చంద్రయాన్ 2 ప్రయోగం 2019 జులై 22న ప్రారంభం కాగా 2019 సెప్టెంబరు 6న విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రునిపై దిగేందుకు సిద్ధమై ఆఖరి క్షణాన విఫలమైంది. ఈ ప్రక్రియ 48 రోజుల్లో పూర్తయింది. చంద్రయాన్ 1 ప్రయోగం 2008 ఆగస్టు 28 మొదలై అదే ఏడాది నవంబరు 12న చంద్రుడి కక్ష్యను చేరింది. ఇందుకు 77 రోజులు పట్టింది. 1969లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చంద్రుడికి వ్యోమగాములను నాలుగు రోజుల్లో పంపగలిగింది. నేడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా..అది కూడా మానవ రహిత ప్రయోగానికి ఇస్రోకు ఎందుకు 40 రోజుల సమయం పడుతోంది? అంటే అంతరిక్ష పరిశోధనాల్లో మనం సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందన్న వాస్తవాన్ని గ్రహించక తప్పదు. ఇస్రో ప్రతి ప్రయోగానికి ముందు తిరుమలలో పూజలు చేయించేటువంటి అశాస్త్రీయ పద్ధతులు కొనసాగించడం శోచనీయం.
చంద్రుడిపై ఆవాసానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేది అధ్యయనం చేసేందుకు చేపట్టిన చంద్రయాన్ 3 ఇస్రో చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో మహోన్నతమైనదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చంద్రుడిపై రోవర్ ల్యాండ్ అయ్యే ప్రక్రియ ఇస్రోకు ఒక గడ్డు సవాల్‌గా నిలిచింది. ఇప్పటి వరకు కేవలం మూడే మూడు దేశాలు అమెరికా, చైనా, రష్యా జాబిల్లిపైకి తమ ఆనవాళ్లు పంపగలిగాయి. చంద్రయాన్ 3 తర్వాత వెనువెంటనే చేపట్టాల్సిన అనేక బృహత్ ప్రాజెక్టులకు ఇస్రో సంసిద్ధమవుతుండటం స్ఫూర్తిదాయకం. అంతరిక్షయానంలోకి తొలి భారతీయ మానవ సహిత మిషన్ కోసం గగన్‌యాన్, ఆ తర్వాత సూర్యుడిపై అధ్యయనం కోసం, తదుపరి శుక్ర గ్రహంపై పరిశోధనలు ఇలా ఒకదాని వెంబడి ఒకటి వరుసగా ఉన్నాయి. వీటన్నిటికి చంద్రయాన్ 3 విజయం కొత్త ఉత్తేజాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. అంతరిక్ష పరిశోధనలకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి చేయూతనందిస్తే శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుత విజయాలు సాధిస్తారు.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత శాస్త్ర పరిశోధనల రంగంపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. నిధుల కేటాయింపుల్లో కోతలు విధించడమే గాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశోధన రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. దశాబ్దాల పరిశోధనలు ఫలించి విదేశీ ఉపగ్రహాలను కూడా నింగిలోకి ప్రవేశపెట్టే స్థాయికి ఎదిగిన దశలో భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని ముక్కలుగా విడగొట్టి ప్రయివేటు కంపెనీలకు కట్టబెట్టే కుట్రను మోడీ సర్కార్ వేగంగా కొనసాగిస్తోంది. ప్రయివేటు సంస్థలు చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలకు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి మినహాయింపును ఇస్తూ ఇటీవల జరిగిన 50 కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా ప్రయివేటు జపం చేయడం మాని ప్రభుత్వ పరిశోధన సంస్థలను ప్రోత్సహించడంపై పాలకులు దృష్టి సారించాలి. చంద్రయాన్ 3 లాంటి అద్భుత ప్రయోగాలకు సంకల్పించిన శాస్త్రవేత్తలకు అదే గొప్ప అభినందన. ఇటువంటి ప్రతిబంధకాలన్నిటినీ అధిగమించి గొప్ప ధృడసంకల్పంతో పరిశోధనల కదనరంగంలోకి దూకిన ఇస్రో దిగ్విజయాన సాగిపోవాలని ఆకాంక్షిద్దాం.