రమణీయమైన ప్రకృతిలో కమనీయ దృశ్యాలెన్నో! వికసించే మొక్కల నుంచి విరిసే పూలు, కాసే కాయలు అన్నీ అద్భుతాలే.. అందుకే పచ్చని ప్రకృతిని చూస్తే ఎంతటివారైనా ప్రేమలో పడిపోవాల్సిందే. ఇక ప్రకృతి ప్రేమికుల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? రోజులో ఒక్కసారైనా అలా చెట్ల చెంతన సేద తీరనిదే రోజు గడువదు. ఇంతలా మనుషులను ప్రేమలో పడేసే మొక్కల్లోనూ ప్రేముందని చూపించే కొన్ని రకాల మొక్కల గురించి ప్రేమికుల రోజు సందర్భంగా తెలుసుకుందాం..
ప్రేమికుల రోజు వస్తున్న సందర్భంగా అచ్చంగా హృదయాకారంలో కొలువుదీరి, మంత్రముగ్ధుల్ని చేసే కొన్ని మొక్కలున్నాయి. ఆధునికులు ఆన్‌లైన్ మెసేజ్‌లు, సెల్‌ఫోన్ చాటింగులతో పూలప్రేమను కోల్పోతున్నా.. ప్రకృతిలో అపురూప ప్రేమకు పూలకు మించిన చిహ్నం లేదంటే అతిశయోక్తి కాదు. మనసు లోతుల్లో అల్లుకుపోయే కొన్ని రకాలను చూసేద్దాం..
- రోజూ పూచే రోజా పువ్వు!
అందంలోనూ, ఆకారంలోనూ, పరిమళంలోనూ పరిమాణంలోనూ గులాబీ దానికదే సాటి. అందుకే దీన్ని పువ్వుల్లో రాణీ పువ్వుగా పిలుస్తారు. అందుకే ప్రేమ పట్టం కట్టే వేళ సిగ్గుమొగ్గలై, హైబ్రీడ్ గులాబీలు ప్రేమ స్వరూపాలుగా చేతులు మారుతుంటాయి.
- లిప్స్ ప్లాంట్..
అరుదైన పూలమొక్కల్లో ఇదొకటి. ఎర్రని పెదాల్లా నిగనిగలాడుతూ మురిపించే పూలమొక్క సైకోట్రియా ఎలాటా, పారి కోరియా ఎలాట. రూబియేసి కుటుంబానికి చెందిన దీన్ని గర్ల్‌ఫ్రెండ్ లిప్ అని కూడా పిలుస్తారు. డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఈ మొక్క పూలు పూస్తుంది. పొదలా ఎదుగుతుంది. మొగ్గ సమయంలో పువ్వులు ఇలా పెదాల్లా ఉంటాయి. పువ్వు పూర్తిగా విచ్చుకున్నాక ఆకారం మారిపోతుంది. ఈ గమ్మత్తయిన మొక్కకి ప్రపంచవ్యాప్తంగా బోలెడంత గిరాకీ ఉంది. అనేక ఔషధాల్లోనూ దీన్ని వాడతారు. అమెరికా వర్షారణ్యాల్లో బాగా పెరుగుతుంది. అంతరించిపోతున్న మొక్క జాతుల్లో ఇదొకటి.
- బోగన్విలియా ప్రియాంక..
హృదయాకారంగా మలుచుకునే మరో వనసుందరి బోగన్విలియా ప్రియాంక. నిజానికి ఇది ముల్లున్న పొదజాతి మొక్క. దీన్ని కాగితం పూలమొక్క అనీ పిలుస్తారు. ఈ మొక్కలు చిన్నచిన్న ఆకులతో నిత్యం పూలు పూస్తూ కావాల్సిన ఆకారంలో మలచుకునే అవకాశం ఉంది. ఎరుపు, గులాబీ, నీలం, చంద్రకాంత, తెలుగు, కాషాయం హృదయ ఆకారాల్లో పూసే ఈ ప్రేమపూల మొక్క ఏడాదికి ఎనిమిది నెలల పాటు పూస్తోంది.
- ప్లీయోస్పిలోస్ నెలి..
గమ్మత్తుగా హృదయాకారంలో విచ్చుకునే మొక్క ప్లీయోస్పిలోస్ నెలి. ఇది దక్షిణాఫ్రికా ప్రాంతానికి చెందినది. సకులెంట్ జాతి మొక్క. మధ్యభాగం నుంచి ఒక కాండం బయలుదేరి, చివర పువ్వుగా విచ్చుకుంటుంది. పువ్వు చూడ్డానికి డైసీఫ్లవర్‌లా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో విచ్చుకుని, సూర్యాస్తమయానికి ముడుచుకుంటుంది. నెలరోజులపాటు పువ్వు సజీవంగా ఉంటుంది. ఇసుక, రాళ్ల నేలల్లోనూ పెరుగుతుంది.
- మాల్పీజియన్ క్రీపర్..
ఆకుపచ్చని హృదయాకారంగా అల్లుకుపోయి, లయ విన్యాసం చేసే అద్భుతమైన మొక్క మాల్పీజియన్ క్రీపర్. చిన్ని చిన్ని ఆకులు గుబురుగా ఎదిగి, కావాల్సిన ఆకారాల్లో మళ్లిపోతుంది ఈ లతాంగి. ఇవి పార్కుల్లోనూ, ఇళ్ల ముంగిట, స్టూడియోల్లోనూ కనువిందు చేస్తాయి.
- డైసెంట్రా స్పెక్టాబిలిస్..
మెత్తని దూదిలా, హృదయాకార పూలను కలిగి ఉన్న మరో మొక్క డైసెంట్రా స్పెక్టాబిలిస్. దీన్నే అమెరికన్ హార్ట్ అని అంటారు. ఇందులో చాలా రంగులున్నప్పటికీ లేత గులాబీ రంగు దీని సహజ లక్షణం. తీగలాంటి కాండం బయలుదేరి, ఎత్తుగా పెరిగిన తర్వాత శివారున గుత్తులుగా పూలు పూస్తుంది. చల్లని వాతావరణంలో నిగారింపుగా ఉంటాయి. ఆగస్టు నుంచి శీతాకాలమంతా పువ్వులు పూసి, వేసవి నాటికి మందగిస్తుంది.
- హృదయాకార కాక్టస్ మొక్క..
కొమ్మ, రెమ్మ, పువ్వు, పిందె, ఆకులు వంటివి లేకుండా ఏకమాత్రంగా పెరిగేది. అందమైన ఆకుపచ్చని మొక్క ఇది. నెమ్మదిగా పెరిగే ఈ మొక్క కానుకలుగా ఇచ్చుకుంటారు.
- చిలుకూరి శ్రీనివాసరావు
8985945506