
చలి తీవ్రతకు జనం గజగజ వణుకుతున్నారు. ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే చలికాలం అనేక అనారోగ్యాలనూ తెచ్చిపెడుతుంది. పైగా ఈ కాలంలో వైరస్‌ల దాడి అధికంగా ఉంటుంది. గాలిలో తేమ శాతం హెచ్చుతగ్గుల వల్ల అనేక రోగాలు చుట్టుముట్టే ప్రమాదమూ ఉంది. ప్రధానంగా మధుమేహం, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా చలి నుంచి ఉపశమనం కలిగించేందుకు అనేక సాధనాలూ అందుబాటులో ఉన్నాయి. వాటి అమ్మకాలు, వినియోగం, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చలి కాలంలో వ్యాయామం, ఆహార నియమాలు, మొక్కలు, జంతువుల సంరక్షణ తదితర అంశాలపైనే ఈ ప్రత్యేక కథనం..
చలికాలంలో చల్లదనం నుంచి రక్షణ పొందేందుకు అనేక పద్ధతులను పాటిస్తాం. అయితే ఇందులో వస్త్రధారణ ఒకటైతే మరో ప్రధానమైనది ఆహార నియమం. దీంతో పాటు శరీర, పరిసరాల పరిశుభ్రత వంటి విషయాల్లోనూ జాగ్రత్త పాటించాలి. దీనిద్వారా చలికాలంలో సంభవించే రోగాల బారి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో పాటు మన పెంపుడు జంతువుల ఆరోగ్యం కూడా మనపై ప్రభావం చూపుతుంది. అందుకే వాటిపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
ఇవి తింటే మంచిది..

సీజన్‌కి తగినట్లు ఆహార నియమాల్లో మార్పులు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా అందుతాయి. తద్వార రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సీజనల్‌గా దొరికే ఫలాలు, కూరగాయలు, ఇతర ఆహారాలూ తప్పనిసరిగా తీసుకోవాలి.
విటమిన్ సి : దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే చలికాలంలో యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే విటమిన్ సి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి తగినంత రోగనిరోధక శక్తినిస్తుంది. బెల్ పెప్పర్స్, నారింజ, నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు, జామకాయలు, బత్తాయిలు మొదలైన పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఉసిరి, అల్లం, పసుపులోనూ సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది.
జింక్ : జింక్ లోపం ఉందని తెలిసిన వెంటనే చాలా మంది వ్యక్తులు వెంటనే సప్లిమెంట్లను తీసుకుంటారు. నిజానికి ఆ అవసరమే లేదు. మాంసం, రొయ్యలు, పీతలు, చిక్కుళ్ళు, బీన్స్, గుమ్మడికాయ, నువ్వుల్లో జింక్ ఎక్కువగా లభిస్తుంది. ఆహారంలో జింక్ వున్న ఫుడ్స్ చేర్చుకుంటే చలికాలంలో వచ్చే అన్ని వ్యాధులనూ నివారించవచ్చు.
ప్రొటీన్స్ : చలికాలంలో జాగింగ్, రన్నింగ్ వంటి ఎక్సర్‌సైజ్‌లు చేయడంతో పాటు జిమ్‌కు వెళ్లే వారిలో ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అందుకే ఆహారంలో ఎక్కువ ప్రొటీన్లను భాగంగా చేసుకోవాలి. ప్రొటీన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరిక పుట్టదు. సూప్స్‌లో ఉడికించిన చికెన్‌ని యాడ్ చేయడం ద్వారా అధిక ప్రొటీన్ పొందొచ్చు. మొలకలు, ఉడకబెట్టిన చిక్కుడు గింజలు తినడం ద్వారా శరీరానికి అధిక ప్రొటీన్ అందుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: తాజా చేపలు, చేప నూనె, గింజలు వంటి ఆహారాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఇవి గొప్పగా సహాయపడతాయి.
వేడివేడి సూప్స్..

శీతాకాలంలో వేడి వేడి సూప్స్ తాగేందుకు చాలా మంది ఇష్టపడతారు.
ఈ సీజన్‌లో వివిధ కూరగాయలతో సూప్ తయారుచేసుకుని తీసుకోవడం మంచిది. ఇది శరీరంలో నీరు, పోషకాల కొరతను భర్తీ చేస్తుంది. వీటిలో నల్ల మిరియాల పొడిని చేర్చడం వల్ల మరింత ఉపయోగం. మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి.
రోటీలు..
చలికాలంలో ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది. అయితే వేడి పదార్థాలతో పాటు శరీరంలో వేడి పుట్టించే ఆహారాలూ తీసుకోవాలి. ఆహారంలో మొక్కజొన్న, జొన్న, రాగులను చేర్చుకోవాలి. వీటిని ఉపయోగించి జావ, రొట్టెలు, దోశె వంటివి చేసుకుని, తింటుండాలి. ఇవి మన బరువును నియంత్రిస్తూనే, శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.
జంక్ ఫుడ్స్‌తో ప్రమాదం..
చలికాలంలో జంక్ ఫుడ్ అధికంగా తినేందుకు ఇష్టపడతారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీయొచ్చు. అందుకే వీలైనంత తక్కువగా జంక్ ఫుడ్స్ తినాలని చెబుతున్నారు.
చలికాలంలో సెరోటోనిన్ స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల మనకు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. అయితే అలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని.. అందుకే కార్బోహైడ్రేట్లపై అదుపు అవసరమని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
చర్మ సంరక్షణ ఇలా..
చలి నుంచి చర్మాన్ని రక్షించుకోవాలంటే క్రీమ్ బేస్ మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ల వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది.
- లోషన్లు, మాయిశ్చరైజర్లు రాసుకోవడం వల్ల చర్మం కోమలంగా మారుతుంది. వ్యాజలైన్, కొబ్బరినూనె లాంటివి స్నానం చేసిన వెంటనే శరీరానికి రాసుకోవాలి.
- జెల్ సబ్బులు వాడితే మంచిది. పిహెచ్ 7కు తక్కువ ఉన్న సబ్బులు చర్మాన్ని రక్షిస్తాయి.
- వారానికోసారి ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత తలస్నానం మేలు.
- గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ముందుగా వైట్ ప్యారాఫిన్, పెట్రోలియం జెల్లీ, లిక్విడ్ ప్యారాఫిన్ లాంటి మాయిశ్చరైజర్స్ రాసుకుని స్నానం చేయడం మేలు.
- చలికి కళ్ల చుట్టూ దురదవచ్చే ప్రమాదం ఉంది. దీని నుంచి రక్షించుకోవడానికి విటమిన్ 'ఇ' క్రీమ్ రాయాలి.
- చలికి పెదాలు పగిలి, రక్తం కారే ప్రమాదముంది. వెన్న, పేరిన నెయ్యి వంటివి మేలు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన లిప్‌బాప్, వ్యాజలైన్ వంటివి కూడా ఉపయోగిస్తే మంచిది.
- చలికాలంలో ఎగ్జిమా లాంటి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదముంది. నీరు కారి పొక్కులు వస్తాయి. ఇలాంటప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
- చిన్న పిల్లలను, వృద్ధులను చలిలో తిప్పడం మంచిది కాదు. వీరు వెచ్చని దుస్తులు ధరించాలి.
- కొందరు బక్కెట్ల కొద్దీ వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల శరీరంపై ఉండే కణాలు చనిపోతాయి. చర్మం ముడుతలు బారుతుంది. అందుకే పది నిముషాల కంటే ఎక్కువసేపు స్నానం చేయకూడదు. అదీ గోరువెచ్చని నీటితోనే చేయడం ఉత్తమం.
- రాత్రి వేళల్లో బయట ఉండాల్సిన వాళ్లు ఉన్ని దుస్తులు ధరించాలి.
- చలిలో ద్విచక్రవాహనంపై ప్రయాణం చేసే సమయంలో స్కార్ఫ్, జర్కిన్, హెల్మెట్, షూ, గ్లౌజులు వంటివి ధరించాలి.
పాదాలు పదిలం..
చలికాలంలో పాదాలు త్వరగా పగిలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వంట చేసే ప్రాంతాల్లో తడి లేకుండా చూసుకోవాలి.
- పాదాలు పగిలితే రోజూ పడుకునే ముందు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో గానీ, సాధారణ గోరు వెచ్చటినీటిలో గానీ పాదాలను 5-10 నిమిషాలు ఉంచాలి. తరువాత సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత పొడి బట్టతో తుడిచి, మాయిశ్చరైజర్లు రాయాలి. విటమిన్ ఇ క్రీమ్స్ రాయడం మంచిది.
- కొందరు పగిలిన పాదాలను పదేపదే నీళ్లలో కడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల పగుళ్లలో ఫంగస్ వచ్చే ప్రమాదముంది. పగుళ్లకు పసుపు, నిమ్మరసం వంటివి రాయొద్దు. మధుమేహ రోగులు కాలి వేళ్ల మధ్య పగుళ్లు వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలి.
- ఎప్పటికప్పుడు గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసిన తరువాత జెల్లీ రాయాలి.
- గోరువెచ్చని నీటిలో స్పూను కొబ్బరినూనె వేసి, పాదాల్ని అందులో పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకోవాలి.
పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ..

- చిన్నారులను చలికాలంలో వయస్సును బట్టి కొంచెం సేపు సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి. గ్లౌజెస్ తప్పకుండా తొడగాలి. చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు వాడాలి.
- శీతాకాలంలో పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
- కోరింత దగ్గు, ఆస్తమా.. ఉంటే చల్లటి నీటితో స్నానం చేయించకూడదు.
- మంచులో ఉండే కాలుష్యంతో గొంతు దెబ్బతింటుంది.
- పెట్రోలియం జల్స్, లిక్విడ్స్ పెరాఫిన్ జల్స్ వంటివి స్నానం చేసిన 3 - 5 నిముషాల తరువాత రాయడం వల్ల చర్మాన్ని పగుళ్ల నుంచి, దురదల నుంచి కాపాడుకోవచ్చు.
- పిల్లలకు శీతాకాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. పోషక విలువలు కలిగిన ఆహారం మాత్రమే అందించాలి.
- నెలలోపు పిల్లలకు చలిగాలి తగలకుండా దుప్పట్లు కప్పి ఉంచాలి. గదుల్లో ఫ్యాన్‌లు, ఏసీలు వేయొద్దు. చిన్నారుల చర్మం పొడి బారిపోకుండా మెత్తగా ఉండేందుకు క్రీమ్స్ రాయాలి.
- ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలపై తిప్పకపోవడమే మంచిది. ఎదిగిన పిల్లలకు మాస్క్ వాడాలి. పిల్లలకు వేడిగానే ఆహారం పెట్టాలి. గోరువెచ్చని నీరు తాగించాలి. ఈ కాలంలో బయటి ఆహార పదార్థాలు తినకూడదు. శీతల పానీయాలు, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్‌లు తినకుండా చూడాలి.
గర్భిణీల కోసం..
- గర్భిణీలకు శీతల గాలుల వల్ల గుర్రపు వాతం, చర్మంపై దురదలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది.
- తినుబండారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
- పొద్దున వామ్‌అప్ చేయకూడదు.
- చలికాలం తీవ్రంగా ఉన్నప్పుడు కడుపులో బేబీ కదలికలను మరోసారి పరీక్షించుకోవాలి.
- ఉదయం పూట చలి, మంచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ బయటకు రాకపోవడమే మంచిది.
- ఈ కాలంలో ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చోకుండా మధ్యమధ్యలో అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. అలా చేయడం వల్ల తల్లి చురుగ్గా ఉండటమే కాకుండా బిడ్డకూ మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆస్తమా పట్ల అప్రమత్తం..
- ఆస్తమా ఇబ్బంది ఉన్నవారు చలిగాలి వీచే సమయంలో ఆరుబయట తిరగకూడదు. వ్యాధిని అదుపులో ఉంచే మందుల్ని క్రమం తప్పకుండా వాడాలి.
- చల్లని పానీయాలు, ఐస్‌క్రీం, చాక్లెట్లు తదతర వాటికి దూరంగా ఉండాలి.
- శరీరమంతా ఉన్ని దుస్తులు కప్పుకోవాలి. ముఖ్యంగా మంకీ క్యాప్, స్కార్ఫ్ తప్పకుండా ధరించాలి.
- వేడి పదార్థాలే ఆహారంగా తీసుకోవాలి.
- ఫ్యాన్ వాడకం తగ్గించాలి.
- చలి బాగా ఉంటే రూమ్ హీటర్ వాడాలి.
- పడని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
- దోమల కాయిల్స్ వాడటం మానేయాలి.
- నీటిని వేడి చేసి, గోరువెచ్చగా తాగాలి.
- గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
తగినన్ని నీరు తాగాలి..
చలికాలంలో చెమట రాదని చాలా మంది నీరు తక్కువగా తాగుతుంటారు. శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. అందుకే చలికాలంలోనూ నిత్యం 8 - 10 గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. నీరు తక్కువగా తాగడం మన జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. చాలినన్ని నీళ్లు తాగి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే హైడ్రేషన్ వల్ల శరీర ఊష్టోగ్రత అదుపులో ఉండటమే కాకుండా.. రోగ నిరోధకత పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఫలితంగా చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పరిశుభ్రతే ప్రధానం..

చలి కారణంగా రెండు పూటలా స్నానం చేయడానికి వెనకాడతాం. కానీ రెండుపూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. పిల్లలకు సున్నిపిండిలో పసుపు, పాల మీగడ / వెన్న / నువ్వుల నూనె వంటివి చేర్చి శరీరానికి పట్టించి, గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. మహిళలు, వృద్ధులు స్నానానికి ముందు కొబ్బరినూనె రాసుకోవాలి. స్నానం గ్లిజరిన్ సబ్బుతో చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటివి రావు.
ఙ ఈ కాలంలో చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తుంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే, ధరించే ఉన్ని దుస్తుల్ని, కప్పుకునే రగ్గులు, దుప్పట్లను రోజూ ఎండలో ఉంచాలి. అలా చేయడం వల్ల అందులో ఉండే దుమ్ము, క్రిములు నశించి, అలర్జీల వంటివి దరి చేరకుండా ఉంటాయి. బెడ్‌షీట్లను, దిండు గలేబుల్ని కనీసం వారంలో రెండుసార్లు మార్చుకోవాలి.
ప్రకృతి వైద్యం..
- తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.
- అల్లంలోని గుణాల వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అందుకే జలుబు, వైరస్ బారిన పడిన వారికి త్వరగా కోలుకోవడానికి అల్లం సహాయపడుతుంది.
- జలుబు వలన కఫం పేరుకుపోయినపుడు అరలీటర్ నీటిలో స్పూన్ వాముపొడి, స్పూన్ పసుపు వేసి కాయాలి. ఇవి కాస్త చల్లారాక తేనె కలిపి రోజులో ఎక్కువసార్లు తాగడం వల్ల కఫం కరిగిపోతుంది. మెత్తగా దంచిన వాము పొడిని స్పూన్ చొప్పున గ్లాస్ మజ్జిగలో కలిపి, తీసుకోవాలి. దీనివలన ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే మార్గం శుభ్రపడుతుంది.
- రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో కాస్త పసుపు కలిపి తాగాలి. దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఇట్టే ఉపశమనం లభిస్తుంది.
- కర్పూరాన్ని నువ్వులనూనెలో వేసి, కరిగించాలి. ఈ నూనెతో తల, ఛాతీ, పాదాలకు మసాజ్ చేస్తూ ఉండాలి.
- నల్ల మిరియాలతో కషాయం చేసుకుని, తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది.
- వేడినీటిలో కాసింత పసుపు, కర్పూరం వేసి ఆవిరిపట్టాలి.
అందుబాటులో అనేక పరికరాలు..
సాధారణంగా వేసవిలో ఏసీలు చల్లదనం కోసం వాడుతుంటాం. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏసీల్లో వేడిగాలిని విడుదల చేసేవీ ఉన్నాయి. దీంతో చలికాలంలో గదుల్లోని ఉష్ణోగ్రతలను పెంచుకోవడం ద్వారా చలి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక వేళ ఇంట్లో ఏసీలు లేనట్లయితే మార్కెట్‌లో రూం హీటర్లు అందుబాటులో ఉన్నాయి. సుమారు రూ.1,500 నుంచి ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఇవి గదిలోని తేమను తగ్గించడమే కాకుండా, ఉష్ణోగ్రతలనూ పెంచుతాయి. వీటితోపాటు వేడినీళ్లను, వేడి ఆహారాన్ని తీసుకునేందుకు అనుకూలంగా ఎలక్ట్రికల్ కెటిల్స్, ఛార్జింగ్ హాట్ క్యారియర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలా అనేకరకాలు అందుబాటులోకి వచ్చాయి.
వ్యాయామం మరవొద్దు..

చలికాలం వ్యాయామం ఎంతో ముఖ్యం. అయితే వ్యాయామం చేసేటప్పుడు కొన్ని పద్ధతులను మార్చుకోవాలి. సీజన్ మారింది కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యాయామం చేసే విధానంలోనూ మార్పు రావాలి. ఏ వ్యాయామం ప్రారంభించే ముందైనా వార్మప్ తప్పనిసరి అని మనకు తెలిసిందే. అయితే ఈ చలికాలంలో వ్యాయామానికి ముందు చేసే వామ్‌అప్ సమయం ఎక్కువ ఉండాలి. పది నిమిషాలకు బదులుగా పదిహేను నిమిషాలు వామ్‌అప్‌లో గడిపేలా ప్లాన్ చేయండి. ఎందుకంటే చలికి కండరాలు గట్టిపడిపోతాయి, శరీరం లోపలి నుంచి సరైన వేడిని ఇవ్వకుండా వ్యాయామం చేస్తే కండరాలు ఒత్తిడికి గురవుతాయి. కండరాలు తిమ్మిరి, నొప్పులతో బాధపడవచ్చు.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి చలికాలంలోనూ జాగింగ్ చేయవచ్చు. చలికాలంలో జాగింగ్ చేస్తే కొన్ని ప్రయోజనాలు, అలాగే కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి. ఈ కాలంలో జాగింగ్ చేయడం వల్ల శరీరంలోని నిరోధక శక్తి పెరుగుతుంది. తేలికపాటి లేదా మితమైన పరుగుతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండవచ్చు. సహేతుకమైన వేగంతో పరిగెత్తడం, నడవడం ద్వారా అది శరీరంలోని సహజ రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.
ఉన్ని దుస్తులతో ఉపశమనం...

చలికాలంలో ఎక్కువగా ఉన్ని దుస్తులు ధరించడం వల్ల చలి నుంచి ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు స్వెట్టర్స్, హుడీస్, మంకీ క్యాప్స్, మఫ్లర్లు, గ్లౌజులు, రగ్గులు వాడటం ద్వారా చలి నుంచి ఉపశమనం పొందొచ్చు. దీంతో పాటు వేడిని త్వరగా గ్రహించే డార్క్ కలర్స్ వాడటం మంచిది.
ప్రయాణాల్లో జాగ్రత్తలు..
ప్రకృతి ప్రేమికులు, ట్రావెలర్స్ చలికాలంలోనే ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. ఇలా కాకుండా లంబసింగి, హార్స్‌లీహిల్స్, మారేడుమిల్లి హిల్‌స్టేషన్స్ లాంటి కొన్ని ప్రత్యేక ప్రదేశాలను చలికాలంలోనే చూడగలం. అలాంటివారు ప్రయాణ సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిపోయే ఈ వాతావరణంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే కష్టంగా ఉంటుంది. అయినా ఉదయాన్నే లేచి, ప్రయాణాన్ని మొదలుపెట్టడం వల్ల తొందరగా గమ్యస్థానాన్ని చేరవచ్చు. అలాగే అర్ధరాత్రి గమ్యస్థానాన్ని చేరుకునేలా కాకుండా కొంచెం త్వరగానే వెళ్లేటట్లు ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే అక్కడ వాతావరణం ఎలా ఉందో ఒకటికి రెండుసార్లు ముందుగానే అడిగి, తెలుసుకోవడం మంచిది. స్వెట్టర్లు, మఫ్లర్లు, షూస్, గ్లౌజులు వంటివి వెంట తీసుకెళ్లడం మంచిది. ఆ ప్రదేశానికి వెళ్ళాక కొనుక్కుందాంలే అన్న ఉద్దేశంతో అజాగ్రత్త వహిస్తారు. ఎక్కువ సందర్భాల్లో అవి దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. అలాగే బ్లాంకెట్లు తీసుకెళ్లడం కూడా మర్చిపోకూడదు. జలుబు, జ్వరానికి సంబంధించి కొన్ని రకాల మందులు వెంట ఉంచుకోవడం మంచిది.
మొక్కలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

చలికాలంలో మనుషులే కాదు మొక్కలూ తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. వాతావరణ పరిస్థితులు మొక్కలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే వాటినీ జాగ్రత్తగా చూసుకోవాలి.
- ఈ కాలంలో మొక్కలకు నీరు ఎక్కువగా ఇవ్వకూడదు. తేమను బట్టి ఉదయమే నీరు ఇవ్వాలి. మరీ ఉదయమే కాకుండా ఎండ వచ్చిన తర్వాత ఇవ్వాలి. అవకాశం ఉన్నవాళ్లు బోరింగ్ నీళ్ళు ఇవ్వడమే మంచిది.
- కత్తిరింపులు వంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ కాలంలో మొక్కలు నిద్రాణస్థితిలో ఉంటాయి. కొత్త పెరుగుదలను అభివృద్ధి చేయలేవు.
- చలికాలంలో మట్టిని మల్చింగ్ చేయాలి. మల్చింగ్ చేయడం వల్ల మట్టిని వెచ్చగా ఉంచవచ్చు. మల్చింగ్ చేసేటప్పుడు మొక్కకు కొంచెం దూరంలో చేయాలి.
- చలికాలంలో మొక్కలను రీ పాటింగ్ చేయకూడదు. ఎక్కువగా పోషకాలు ఇవ్వకూడదు.
- బ్యాక్టీరియా, శిలీంధ్ర వ్యాధులు, వైరస్ వ్యాధులు రాకుండా క్రమం తప్పకుండా వ్యాధి నిరోధకాలను పిచికారీ చేయాలి.
జీవాలు జాగ్రత్త..

- చలి తీవ్రతతో పశువులు, పెంపుడు జంతువులకు పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. జీవాలకు తుమ్ములు, కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు వీటికి కారణమవుతాయి.
- క్రిముల ద్వారా సోకే అంటువ్యాధులతో పాటు, శ్వాస కోశ కణాలలో వ్యాధులు వస్తాయి. దీని నివారణకు గాలి, వెలుతురు సరిగ్గా వచ్చే ప్రాంతాల్లో అవి ఉండేలా చూడాలి.
- వాతావరణం అనుకూలంగా లేనప్పుడు జీవాలను బయటకు వదలకపోవడమే మంచిది. వాటి ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి. వ్యాధులు సోకినప్పుడు పశు వైద్యాధికారులను సంప్రదించాలి.
- వ్యాధి సోకకుండా అవసరాన్ని బట్టి ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్స్ వేయించాలి.
- జీవాలు చలికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉదయ్ శంకర్ ఆకుల
7989726815