అబ్బా.. రోజూ ఇవే కూరలా..! ఆ కూర నాకు వద్దు.. నేను తినను..! లాంటి నిరుత్సాహాలూ, నిరసనలు ప్రతి ఇంటిలోనూ అప్పుడప్పుడూ వినిపిస్తూంటాయి. అందుకే వెరైటీ కోసం హోటల్స్, స్విగ్గీ, జొమాటోలపై ఆధారపడుతూంటాం. కానీ కాస్త సమయం.. ఇంకాస్త ఓర్పుతో ఈ వెరైటీ కూరలు చేసుకుంటే బోర్ అనిపించదు. గ్రేవీ కూరలూ, పులుసు కూరలూ నోటికి రుచిగా ఉండి రొటీన్‌కు భిన్నంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి. జిహ్వ చాపల్యం తీరాలంటే ఆ మాత్రం స్పెండ్ చేయాలి మరి. అలా రకరకాల రుచులను అందించే కొన్ని కూరలను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
గుడ్డు పొంగనాలతో..
కావలసినవి : ఉల్లిపాయ, టమాటా, జీర - స్పూను, పచ్చిమిర్చి - 2, పసుపు - 1/2 స్పూను, శనగపిండి - స్పూను, ఉప్పు, కారం - తగినంత
పొంగనాల కోసం : గుడ్లు - 5, ఉల్లిపాయ, ఉప్పు, కారం - తగినంత, ధనియాల పొడి - స్పూను, గరం మసాలా - 1/4 స్పూను
తయారీ : గుడ్ల సొనను బాగా చిలకాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో పొంగనాలు కాల్చుకుని పక్కన ఉంచుకోవాలి.
బాండీలో నూనె వేడిచేసి జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి తరుగులు వేయించాలి. టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. కొంచెం నీటిలో శనగపిండి కలిపి, కూరలో వేసి రెండు నిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. టీ గ్లాసున్నర నీరు పోసి, మరిగే సమయంలో ఈ పొంగనాలు వేసి ఉడికించాలి. అంతే గుడ్డు పొంగనాల కూర రెడీ అయినట్లే. ఈ కూర అన్నం, రోటీలలోకి చాలా బాగుంటుంది.
వడియాలతో..
కావలసినవి : మినప వడియాలు - కప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి - 3, టమాటా - 1, అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూను, ఉప్పు, కారం - తగినంత, పసుపు - 1/4 స్పూను, ధనియాల పొడి - స్పూను, పచ్చికొబ్బరి, గసగసాల పేస్ట్ - అరకప్పు, కొత్తిమీర - 2 స్పూన్లు, గరం మసాలా - 1/2 స్పూను, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ : ముందుగా వడియాలు వేయించుకుని, పక్కన ఉంచుకోవాలి. బాండీలో స్పూను నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, దోరగా వేయించాలి. టమాటా ముక్కలు వేసి ఉడికిన తర్వాత దోరగా వేయించి, ముద్దగా చేసిన గసగసాల పేస్ట్, పచ్చికొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కొంచెం నీరు పోసి, అన్నీ కలిసేలా తిప్పుతూ వేయించాలి. బాండీకి అంటకుండా ఉడికిన తర్వాత దానిలో వడియాలు, గరం మసాలా వేసి ఉడికించాలి. అంతే మినప వడియాల కూర రెడీ అయినట్లే.
ఇదే వడియాలతో పులుసు కూర కూడా చేసుకోవచ్చు.
పప్పుండల మజ్జిగ చారు..
కావలసినవి : పుల్ల మజ్జిగ - లీటరు, పచ్చి శనగపప్పు-1/2 కప్పు, పచ్చికొబ్బరి - 1/2 చిప్ప, అల్లం - అంగుళం, పచ్చిమిర్చి - 3, పసుపు - స్పూను, ఉప్పు - తగినంత
పొడి కోసం : మెంతులు - 1/2 స్పూను, ఎండుమిర్చి - 5, ధనియాలు - స్పూను, కందిపప్పు - 2 స్పూన్లు, జీలకర్ర - 1/2 స్పూను, బియ్యం - స్పూను
ఇవన్నీ సువాసన వచ్చేంత వరకూ వేయించి, చల్లార్చి, మెత్తని పొడి చేసుకోవాలి. దీనిని పచ్చికొబ్బరి ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు సరిపోయినన్ని నీళ్ళతో కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఈ ముద్దను పక్కనుంచుకోవాలి.
తర్వాత మూడు గంటలు నానబెట్టిన శనగపప్పు, కొంచెం జీలకర్ర, రెండు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి గారెల పిండిలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ముద్దను చేతికి నూనె రాసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకొని, ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద పది నిమిషాలు ఉడికించాలి.
బాండీలో కొంచెం నూనె వేసి తాలింపు పెట్టి దానిలో ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పచ్చికొబ్బరితో చేసి పక్కనుంచుకున్న ముద్దను బాగా వేపాలి. మంచి వాసన వచ్చేటప్పుడు అర లీటరు నీటిని పోసి, తిప్పుతూ మరిగించాలి. మజ్జిగపోసి హై ఫ్లేం మీద మరిగించాలి. పొంగు వచ్చినప్పుడు, ఆవిరి పప్పుండలు వేసి పదిహేను నిమిషాలు ఉడికించాలి. చివరిలో కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. అంతే.. పప్పుండల మజ్జిగ చారు రెడీ.