Nov 05,2023 13:40

పండ్లలో యాపిల్‌ ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందో.. కూరగాయల్లో బీట్‌రూట్‌ అంత కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజూ బీట్‌రూట్‌ తింటే.. అనారోగ్యాన్ని బీట్‌ చేయొచ్చు అంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలన్నా, రక్తహీనత, గుండె సమస్యల్ని దూరం చేయాలన్నా.. బీట్‌రూట్‌ తప్పకుండా తినాల్సిందే. భూమిలో ఉండే బీట్‌రూట్‌ ఎన్నో రకాల పోషకాలను సంగ్రహిస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌, విటమిన్‌ ఎ, సి ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. కానీ దీని రంగు, వాసన చూసి తినేందుకు కొందరు ఇష్టపడదు. అలాంటి వారు సైతం ఇష్టంగా తినేందుకు వెరైటీగా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

01

                                                                                   పకోడి

కావల్సినవి : బీట్‌రూట్‌ తురుము-కప్పు, శనగపిండి- కప్పు, కారం- రెండు స్పూన్లు, ఉల్లిపాయ- ఒకటి, మిర్చి- మూడు, జీలకర్ర- స్పూను, ఉప్పు- తగినంత, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- స్పూను, ధనియాల పొడి- స్పూను, కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె- డీ ఫ్రైకు సరిపడా.
తయారీ : ఒక పెద్ద గిన్నెలోకి బీట్‌రూట్‌ తురుము, శనగపిండి, మిర్చి, ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, జీలకర్ర, కారం, సన్నగా కట్‌ చేసిన కరివేపాకు, ఉప్పు వేయాలి. మొత్తం ఒకసారి చేతితో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్లు వేడినూనె వేసి, మరోసారి కలపాలి. ఒక బాండీలోకి నూనె పోసి, పొయ్యి మీద పెట్టి, వేడిచేయాలి. బాగా వేడయ్యాక, పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని పకోడీల్లా వేయాలి. ఎర్రగా వేగిన తర్వాత చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. అంతే బీట్‌రూట్‌ పకోడీ రెడీ !

022

                                                                                 చపాతీలు

కావల్సినవి : బీట్‌రూట్‌ తురుము-కప్పు, గోధమపిండి-కప్పు, పచ్చిమిర్చి-రెండు, కొత్తిమీర- గుప్పెడు, నీళ్లు- కొంచెం, ఉప్పు- తగినంత, నూనె- నాలుగు స్పూన్లు.
తయారీ : సన్నగా తురిమి పెట్టుకున్న బీట్‌రూట్‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, కొత్తిమీర, మిర్చిపేస్ట్‌ వేసి కలుపుకోవాలి. గోధమపిండి వేసి మరోసారి కలపాలి. కొంచెం, కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తం ముద్దలాగా చేయాలి. పది నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని, చపాతీలుగా ఒత్తుకోవాలి. పొయ్యి మీద ఇనుపపెనం పెట్టి, బాగా వేడిచేయాలి. ఒకదాని తర్వాత మరొక చపాతీ పెనం మీద వేసి, స్పూన్‌తో నూనె వేస్తూ కాల్చుకోవాలి. అంతే... బీట్‌రూట్‌ చపాతీలు రెడీ. వీటికి పెరుగు చట్నీ మంచి కాంబినేషన్‌.

334

                                                                                  హల్వా

కావల్సినవి : బీట్‌రూట్‌ ముక్కలు- రెండు కప్పులు, పంచదార- ఒకటిన్నర కప్పు, మొక్కజొన్న పిండి- అర కప్పు, డ్రైఫ్రూట్స్‌ (బాదం, జీడిపప్పు)- అర కప్పు, నెయ్యి-నాలుగుస్పూన్లు, యాలకల పొడి- స్పూను, నువ్వులు- స్పూను.
తయారీ : హల్వా కోసం ఓ ట్రేలో స్పూను నెయ్యి వేసి మొత్తం రాసి ఉంచుకోవాలి. అడుగున అక్కడక్కడ డ్రైఫ్రూట్స్‌ వేయాలి. బీట్‌రూట్‌ ముక్కలను, కప్పు నీళ్లు పోసి, మిక్సీలో మెత్తగా పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. జల్లెడలో ఉన్న మిశ్రమంలో మరో కప్పు నీళ్లు పోసి రెండోసారి మిక్సీ పట్టి, వడకట్టాలి. మిగిలిన పిప్పితో ఫ్రైగానీ, పచ్చడిగానీ చేసుకోవచ్చు. తీసిన బీట్‌రూట్‌ జ్యూస్‌ను మాత్రమే హల్వా చేసేందుకు తీసుకోవాలి. ఈ జ్యూస్‌ను మరోసారి వడకట్టుకోవాలి. ఈ జ్యూస్‌లో పంచదార, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. తర్వాత పొయ్యి మీద మందపాటి గిన్నెలో పోసి, సన్న మంట మీద ఉడికించాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో స్పూను నెయ్యి వేస్తూ హల్వాను గరిటెతో కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరకు వచ్చాక యాలకుల పొడి, సన్నగా కట్‌ చేసి, నేతిలో వేపిన జీడిపప్పు, బాదం పప్పులు వేసి కలపాలి. చివరిగా స్పూను నెయ్యి వేసి కలపాలి. వేడిగా ఉన్నప్పుడే రెడీ చేసి పెట్టుకున్న ట్రేలో పోసి, సమంగా సర్దాలి. ఆరిన తర్వాత చాకుతో ముక్కలుగా కట్‌ చేయాలి. ఈ హల్వా మృదువుగా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది.