Mar 08,2023 07:50

ప్రపంచ దేశాల్లో స్త్రీల హక్కులకై జరుగుతున్న పోరాటాలు ... మహిళలను అణిచివేత, దోపిడీల నుండి విముక్తులను చేయాలంటే వారిని నాలుగు గోడలకు పరిమితం చేయడం వలన సాధ్యం కాదు. తమలా పని చేసే వారితో కలిసే అవకాశం కల్పించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సంఘటితమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడే పని ప్రాంతాలలో తమ తోటి మహిళలతో కలిసి సమస్యలను చర్చించుకొని పోరాడేందుకు సిద్ధపడతారు. సామాజిక సంబంధాల్లో మార్పులు కూడా పోరాటాల ద్వారానే వస్తాయి. సామాజిక ఉత్పత్తిలో భాగస్వాములు అవడం వలననే మహిళలు సైతం పురుషులు లాగా ఉత్పత్తి సంబంధాల్లో భాగస్వామలౌతారు.

మార్చి-8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అమానవీయ పని పరిస్ధితులకు వ్యతిరేకంగా...ఉపాధి భద్రత, 8 గంటల పని, కనీస వేతనం, ఓటు హక్కు కోసం పోరు సల్పిన మహిళా స్ఫూర్తిని మననం చేసుకోవాల్సిన రోజు. సమానత్వం, గౌరవం, భద్రత కోసం ఐక్యంగా పోరాడదామంటూ ప్రతిన పూనాల్సిన రోజు.
        18, 19 శతాబ్దాల్లో జరిగిన పారిశ్రామిక విప్లవం ఇళ్ళ నుండి మహిళలను బయటకు తీసుకొచ్చింది. కుటుంబ ఆర్థిక అవసరాలు సామాజిక ఉత్పత్తిలో పాల్గొనేట్లుగా చేశాయి. ఇంటి చాకిరి ఒక వైపు, మరోవైపు కర్మాగారాల్లో, అంతు లేని శ్రమ దోపిడీలో 14 గంటల నుండి 16 గంటలు పని చేయాల్సిన దుస్ధితి ఉండేది. అసమాన వేతనాలతో తిండి లేక చిన్నతనంలోనే వృద్ధాప్య చాయలు పొడ చూపేవి. నాటి శ్రామిక మహిళల ఆయు:ప్రమాణం 36 సంవత్సరాలకు దిగజారింది.
         అమెరికా దేశంలో కర్మాగారాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలు ఒకరికొకరు కూడబలుక్కొని సంఘటితం అయ్యారు. ఒకరి కష్టాలు ఒకరు అర్ధం చేసుకున్నారు. ఈ ఐక్యతే పోరాటాలకు నాంది. పలికింది. 1845లో 16 గంటల నుండి 10 గంటలకు పని తగ్గించాలని కోరుతూ సమ్మె నెల రోజులపాటు సాగింది. భారీ ర్యాలీలు జరిగాయి. ఈ ఉద్యమాన్ని యాజమాన్యం అణిచి వేయాలని ప్రయత్నించింది. 1857 న్యూయార్క్‌ నగరంలో ''ఆకలితో చస్తూ బతికే కన్నా పోరాటంలో చావడం మేలని భావించి బట్టల మిల్లుల్లో పనిచేసే మహిళా కార్మికులు సమ్మె చేసి విజయాన్ని సాధించారు. అనేక దేశాలలో హక్కుల కోసం భారీ ర్యాలీలు జరిగాయి.
        1863 జూన్‌ చివరి వారంలో లండన్‌ దినపత్రికల్లో ''అధిక శ్రమతో మహిళ మృతి'' అనే వార్త వచ్చింది. దొరసానుల బట్టలు కుట్టే 20 ఏళ్ళ మేరీ అన్నే వాక్లే గురించిన వార్త అది. మాంచెష్టర్‌ నుండి మద్రాసు వరకు ఫ్యాక్టరీల్లోని కార్మికులు ఎలాంటి కాలపరిమితి లేకుండా 18వ శతాబ్దంలో తమకు తామే యంత్రాలుగా మారిపోయారు. నడుం విరిచే, గుండెలు పగిలే పనిని భరించలేక యువ కార్మికులు ఎందరో మరణించారు. మేరీ అనారోగ్యానికి గురైనప్పుడు యజమాని పట్టించుకోలేదు. కిక్కిరిసిన గదిలో సుదీర్ఘ గంటలు పనిచేయడం వలన...గాలి, వెలుతురు లేని గదిలో నిద్రించడం వలన...అనారోగ్యానికి గురై మరణించిందని... ఆఖరి క్షణాల్లో ఆమెకు వైద్యం అందించేందుకు పిలవబడిన డాక్టర్‌ కోర్టుకు తెలిపారు.
          ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కార్మికులను ఏకం చేసే యత్నాలు మొదలయ్యాయి. 1864లో గ్రేట్‌ బ్రిటన్‌, జర్మనీ, ప్రాన్స్‌, పోలెండ్‌, ఇటలీలకు చెందిన కార్మిక ప్రతినిధులు లండన్‌లో సమావేశమయ్యారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు, సోషలిస్టు నాయకులు, సమావేశానికి వచ్చారు. వారిలో కారల్‌ మార్క్స్‌ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో ఇంటర్నేషనల్‌ వర్కింగ్‌ మెన్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భవించింది. 1886 మే 1న ఎనిమిది గంటల పని దినం కోసం పెద్ద ఎత్తున అమెరికా లోని చికాగోలో ర్యాలీలు నిర్వహించారు. 1889లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్‌ సదస్సుతో క్లారా జెట్కిన్‌ అధిక పని గంటలు, అతి తక్కువ వేతనాలు, అమానవీయ పని ప్రదేశాలు మొదలైన అంశాలపై శ్రామిక పురుషులతో పాటు మహిళలు కూడా మిముక్తి పొందాలని పిలుపునిచ్చారు.
          ''అంతర్జాతీయంగా'' మహిళా దినోత్సవం జరపాలని 1910, ఆగస్టు 26, 27 తేదీలలో డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హెగెెన్‌ లో మహిళా సదస్సు జరిగింది. 17 దేశాల నుండి దాదాపు వంద మంది ప్రతినిధులు హాజరయ్యారు. చర్చల అనంతరం ఓటు హక్కు, మెటర్నటీ అలవెన్స్‌, మాతా శిశుసంరక్షణ, 8 గంటల పని మొదలైన తీర్మానాలు ఆమోదించారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని సదస్సు పిలుపునిచ్చింది. చరిత్రలో మైలురాయిగా నిలిచిన అక్టోబర్‌ విప్లవానికి భూమిక మార్చి 8 కావటం విశేషం. ప్రపంచ దేశాల్లో స్త్రీల హక్కులకై జరుగుతున్న పోరాటాలు ... మహిళలను అణిచివేత, దోపిడీల నుండి విము క్తులను చేయాలంటే వారిని నాలుగు గోడలకు పరిమితం చేయడం వలన సాధ్యం కాదు. తమలా పని చేసే వారితో కలిసే అవకాశం కల్పించడం ద్వారా మాత్రమే సాధ్యమ వుతుంది. సంఘటిత మయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడే పని ప్రాంతాలలో తమ తోటి మహిళలతో కలిసి సమస్యలను చర్చించుకొని పోరాడేందుకు సిద్ధపడతారు. సామాజిక సంబంధాల్లో మార్పులు కూడా పోరాటాల ద్వారానే వస్తాయి. సామాజిక ఉత్పత్తిలో భాగస్వాములు అవడం వలననే మహిళలు సైతం పురుషులు లాగా ఉత్పత్తి సంబంధాల్లో భాగస్వామలౌతారు. ఈ ఉత్పత్తి సంబంధాలే వర్గ సమాజానికి కీలకమైన అంశం. రెండవ అంతర్జాతీయ కార్మిక సదస్సులో క్లారా జెట్కిన్‌ 8 గంటల పని, వేతనాలు, వారంలో ఒక రోజు సెలవు, ఓటు హక్కు మొదలైన అంశాలపై శ్రామిక పురుషులతో పాటు మహిళలు విముక్తి పొందాలని పిలుపునిచ్చారు. 1975 నుండి ఐక్యరాజ్యసమితి అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాల్సిందిగా పిలుపునిచ్చింది.
          ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలు భారతదేశ మహిళలపై ప్రభావాన్ని చూపాయి. 19వ శతాబ్దంలో రాజా రామ్మోహన్‌ రారు, విరేేశలింగం, గురజాడ, జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి వంటి వారు నడిపిన సంస్కరణోద్యమాలు మహిళా సంఘాలను, వామపక్ష వాదులను ఆకర్షించాయి. జాతీయోద్యమంతో పాటు సతీసహగమనం, బాల్యవివాహాలు, పరదా పద్ధతి రద్దు, స్త్రీ విద్య, ఉపాధి, ఓటు హక్కు, వితంతు పునర్వివాహాల కోసం మహిళలు నాయకత్వం వహించారు. ఆనాటి పోరాటాల ఫలితంగా కొన్ని హక్కులు సాధించుకున్నారు.
           75 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం నిరక్షరాస్యత, నిరుద్యోగం, సామాజిక వివక్ష, అత్యాచారాలు, దిగజారుతున్న విలువలు మహిళల పురోభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి. బిజేపి ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయ్యింది. మహిళలు కేవలం కుటుంబం, పిల్లలు సంరక్షణకు మాత్రమే పరిమితమై ఉండాలనే మనువాద సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ చివరకు వాటిని పాఠ్యాంశాలుగా మారుస్తున్నారు.
స్వాతంత్య్రానికి ముందు నుండి పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్‌ కోడ్‌లను మోడీ ప్రభుత్వం మార్చింది. 1948లో వచ్చిన ఫ్యాక్టరీ చట్టం ప్రకారం స్త్రీలు రాత్రి షిఫ్ట్‌లో పని చెయ్యడాన్ని నిషేధించారు. మోడీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. కాని భద్రతా సౌకర్యాల ఏర్పాట్ల గురించి పట్టించుకోలేదు. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ల పరం చేసింది. చదువు, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ప్రైవేటు సంస్థలు అమలు చెయ్యవు. 8 గంటల పని హుళక్కే. ఐ.టి రంగంతో సహా మాల్స్‌ వరకు 10 నుండి 12 గంటలు శ్రమ చేస్తున్నారు. అదనపు పనికి అదనపు వేతనం లేదు.
వేతనంతో కూడిన మెటర్నటీ సౌకర్యం సంస్థలో అరకొర గా అమలు జరుగుతోంది. మహిళలు పట్టణాల్లో 48 శాతం స్వయం ఉపాధిలో వున్నారు. ప్రభుత్వ స్కీముల్లో (అంగన ్‌వాడీ, మిడ్‌ డే మీల్‌, ఆశ, ఎస్‌ఎస్‌ఎ, ఐకెపి), మెడికల్‌ హెల్త్‌ రంగాల్లో కేంద్ర, రాష్ట్ర పథకాల్లో కోటి మంది మహిళలు పని చేస్తున్నారు. వీరికి కార్మిక ఉద్యోగులుగా గుర్తింపులేదు. ఉపాధి భద్రత, సామాజిక భద్రత సౌకర్యాలు లేవు. వ్యవసాయ రంగంలో వ్యాపార పంటలు, యాంత్రీకరణ పెరిగాక ఎక్కువుగా పనిదినాలు కోల్పోయింది. మహిళా కార్మికుల్లో 70 శాతం పైగా దినసరి కూలీలుగా, తక్కువ వేతనాలు వచ్చే ఉద్యోగాల్లో ఉన్నారు. కరోనా మహమ్మారి తర్వాత మహిళల పరిస్థితి మరింత దెబ్బతిన్నది. దాదాపు 5, 6 కోట్ల మంది తీవ్రమైన పేదరికం లోకి నెట్టబడ్డరాని అంచనా.
           గ్లోబల్‌ జండర్‌ గ్యాప్‌-2022 సూచికలో భారత్‌ ర్యాంక్‌ 146 దేశాలకుగాను 135వ ర్యాంకుకు చేరుకుంది. వివక్ష, అసమానతల వలన 15-24 ఏళ్ల మధ్య వయసు మహిళలు కూడా కార్మిక రంగానికి దూరమవుతున్నారు. మహిళల ఆదాయం, ఉత్పాదకత పెంచటంలో కీలకంగా ఉన్న ఉపాధి హామీ పథకానికి...మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌ ప్రతి ఏటా తగ్గిస్తున్నారు. నేషనల్‌ శాంపిల్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) సర్వే ప్రకారం బయట వేతన కార్మికులుగా పని చేసే మహిళలు ఇంటి పనులు, పిల్లలు, వృద్ధుల సంరక్షణ వంటి వేతనం లేని ఇంటి పనికి పురుషుల కంటే మహిళలు రెండింతలు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
మన స్వాతంత్య్ర పోరాట ఆంక్షలతో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన బిజెపి పాలకులు తిరోగమన మనుస్మృతిని ముందుకు తెస్తున్నారు. ఈ ప్రభుత్వం మతతత్వ, కులతత్వ భావజాలంతో మన ప్రజాస్వామ్య, లౌకికతత్వ ఉనికికే సవాలు విసురుతున్నది. మహిళలకు ఇది అత్యంత ప్రమాదకరం. మరోవైపు మహిళలపై పెరుగుతున్న హింస, వివక్ష, లైంగిక వేధింపులు, శ్రమ దోపిడి, అతి తక్కువ వేతనాలు, ధరలు, పన్నుల భారం, మద్యం మొదలైన అంశాలు మహిళలను మరింత పేదరికంలోకి నెడుతున్నాయి.
          చట్టసభలలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు మనువాదుల పాలనలో తెరమరుగున పడింది. 'డిజిటల్‌ సాంకేతిక రంగాలలో-లింగ సమానత్వం సాధించాలని ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది పిలుపునిచ్చింది. డిజిటల్‌ విద్య, సాంకేతిక రంగాల్లోకి మహిళల ప్రవేశంతో పనిలో నైపుణ్యం ఏర్పడుతుంది. అయితే సాంకేతిక విద్య అభ్యసిస్తున్న వారిలో మహిళలు 37 శాతానికి మించి లేరు. కరోనాలో ఆన్‌లైన్‌ విద్యకు బాలికలు 65 శాతం క్లాసులు వినలేక విద్యకు దూరమయ్యారని రిపోర్టులు ఉన్నాయి.
         నిత్యం మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, అసమానతలు, హింస మొదలైన సమస్యల పరిష్కారంతోపాటు... ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం కాపాడబడాలి. కుల మతతత్వాలకు వ్యతిరేకంగా అభ్యుదయ శక్తులను కలుపుకొని విస్తృతంగా మార్చి 8 నుండి 15 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిం చాలని అఖిల భారత ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. మార్చి 8 స్ఫూర్తితో అమరుల త్యాగాలను స్మరిస్తూ అన్నింటా లింగ సమానత్వం కోసం ముందడగు వేద్దాం.

/ వ్యాసకర్త : ఐద్వా పూర్వ రాష్ట్ర కార్యదర్శి /
కె.స్వరూపరాణి

కె.స్వరూపరాణి