నేను.. భూమి ఆకాశం మధ్య
ఒక అందమైన అద్భుతాన్ని నేను..
ఈ భూమికి
పచ్చని సింధూర తిలకాన్ని
ప్రకృతి రమణీయతకు
శోభను కూర్చే కళారూపాన్ని
భూమాత గర్భం నుంచి
చిత్తరువుని.. ఒక తరువుని ..
నీకు తెలుసా..!
నేను.. సూర్యునితో పోరాడి
చల్లని నీడనిస్తున్నా..
నేను.. గాలితో పోరాడి
ప్రాణ వాయువునిస్తున్నా..
నేను.. మేఘంతో మాట్లాడి
వర్షాన్నిస్తున్నా..
నీకు తోడుగా.. తోబుట్టువుగా
నీతోనే ఉంటున్నా..
నీకు తెలుసా..!
లేలేత చిరు కొమ్మలని
కొమ్మచాటున రెమ్మలని
రెమ్మరెమ్మకూ పువ్వులని
పువ్వుల తోడుగా పండ్లనీ..
నన్ను నిలబెట్టిన వేర్లని..
అన్నీ ఇస్తున్నా.. తల్లిలా చూస్తున్నా..
నేను చిత్తరువుని.. ఒక మహత్తరువుని..
నీకు తెలుసా..!
నువ్వే.. నువ్వే..
వేరు చేస్తున్నావ్.. వేర్లతో సహా..
నా తల్లి భూమాత నుంచి
నన్ను పెరికి పారేస్తున్నావ్..
న్యాయమా.. నీకిది ధర్మమా..!
నన్నూ బ్రతకనివ్వు
నా ఆశలు చిగిరించనివ్వు
నా శాఖలు విస్తరించనివ్వు
ఓ మహా వృక్షమై..
నిన్ను.. ఈ సమస్తాన్ని
నా కౌగిలి చేర్చుకొని
కంటిపాపలా కాపుకాస్తా..
నీకు తెలుసా..!
నీ ఆయువుని నేనేనని..
నేనో మహత్తరువునని..
నీకు తెలుసా..!
వృక్షో రక్షతి రక్షిత: అనీ..!
లక్ష్మీ శ్రీనివాస్, 9676601192