Jul 31,2022 09:42

'రోజులు మారుతున్నాయి.. అమ్మాయిలు, అబ్బాయిలు తేడాలు పోతున్నాయి..' అని నాగరికులు ఎంత చెబుతున్నా... ఎక్కడో ఒకచోట ఆ భేదభావం కనిపిస్తూనే ఉంటుంది. నువ్విలా చేయలేవు అనో, ఇలా చేయడం నీవల్ల కాదు అనో, నువ్విలా చేయకూడదు అనో.. ఏదో ఒక సమయంలో పురుషులు స్త్రీలపై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు.. దీనికి కారణం పురుషుల యాటిట్యూడ్‌ అనేది మనస్తత్వ నిపుణుల చెప్పే మాట.. మరి అబ్బాయిల్లో ఈ యాటిట్యూడ్‌ ఎలా వస్తుందో ఎప్పుడైనా గమనించారా? మనలో ఎంతమంది ఆ యాటిట్యూడ్‌కి భిన్నంగా ఉంటున్నాం? ఇది ఆడవాళ్లు చేయాల్సిన పని.. ఇది మగవాళ్లు చేయాల్సిన పని అనే తేడా ఎందుకు? ఇదంతా ఒక రకం వాదన అయితే.. మేమూ వంట చేస్తాం..? వంటపనిలో ఆడవారితో భాగస్వామ్యం పంచుకుంటే తప్పేంటి..? ఫలానా పని ఆడవారే చేయాలి..? ఫలానా పని మగవారు చేయకూడదు? అని ఎక్కడైనా రూల్‌ ఉందా..? అనే వారూ ఉన్నారు. ఇలా అనే అబ్బాయిల శాతం తక్కువే అయినా.. నెమ్మదిగా ఆ తరహా భావన నేటితరంలోని ఎక్కువ మంది అబ్బాయిల్లో పెరుగుతోంది. ఈ మార్పు మంచిదే.. లింగ సమానతలపై అబ్బాయిల్లో ఆలోచనల్లో వస్తున్న మార్పేమిటి? మార్చుకోవాల్సిందేంటి..? ఈ మార్పులకు కారణాలేంటి? దీనిపైనే ఈ ప్రత్యేక కథనం..!

న దేశంలో పురుషులు స్త్రీలతో పాటు ఇంటి బాధ్యతలని తీసుకోవచ్చు. వారు కనుక ఈ పనిలో మనసుపెడితే అద్భుతాలు చేస్తారు. ఇల్లు శుభ్రపరచడంలో పురుషులే స్త్రీల కంటే బాగా చేస్తారని తాజాగా అనేక అధ్యయనాల్లో రుజువయ్యింది. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం ఇంటి పనులను పురుషులు మరింత జాగ్రత్తగా చేస్తారని తెలుస్తోంది. కానీ ఇంకా కొందరు పురుషులు మాత్రం ఇంటిపనులు స్త్రీలవేనని భావిస్తుంటారు. 'చూడండి మిస్టర్‌! కాలం మారింది. మీరూ చెయ్యగలిగే పనులు ఇంట్లో చాలానే ఉన్నాయి. ఇంటిపనుల బాధ్యత తీసుకోవడం ద్వారా ట్రెండ్‌ సెట్‌ చేద్దాం బ్రో!' అంటున్నారు నేటి నవతరం. దీనివల్ల మనం అమితంగా ప్రేమించే భార్యకి, లేదంటే తల్లిదండ్రులకో, సహోదరికో సహాయపడ్డ వాళ్లమవుతాం. చిన్నప్పటి నుంచే ఈ తరహా యాటిట్యూడ్‌ అలవాటైతే ఇక స్త్రీ, పురుష బేధాలు ఎందుకు ఏర్పడతాయి? ఇంట్లో ఆడవారికి సహాయం చేస్తూ వారికి పనుల నుండి కాస్త విశ్రాంతిని ఇవ్వాలనుకుంటే కనుక కొన్ని టిప్స్‌ అనుసరించడం ద్వారా ప్రతీ పురుషుడూ 'హౌస్‌ హస్బెండ్‌' కావచ్చు.
 

                                                                         మీ వెంట మేముంటాం..

ప్రస్తుతం చాలా కుటుంబాల్లో అమ్మాయిలను వారి అభిరుచులకు అనుగుణంగా కొడుకులతో సమానంగా చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పటి తల్లిదండ్రులకు భిన్నంగా అమ్మాయిలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఉద్యోగాల్లో, ఆటల్లో, పాటల్లో ఇతర రంగాల్లో రాణించేవారికి అండగా నిలుస్తున్నారు. వారి వెన్నంటే ఉండి, ప్రోత్సహిస్తున్నారు. దీంతో అన్నదమ్ములూ వారి తల్లిదండ్రుల మాదిరిగానే చిన్నతనం నుంచే ఆ తరహాలోనే పెరుగుతున్నారు. తల్లిదండ్రులతో సమానంగా అక్క, చెల్లెళ్లను ప్రోత్సహిస్తున్నారు. అమ్మాయిలనే చులకన భావాన్ని వదిలేసి, తమతో సమానంగా అన్నిరంగాల్లో రాణించేందుకు సహకరిస్తున్నారు. ఇదే తరహాను సహోద్యోగుల విషయంలోనూ.. సహ విద్యార్థుల విషయంలోనూ ప్రదర్శిస్తున్నారు.

 

cs 01


 

                                                                            భరోసా ఇవ్వాలి..

'అమ్మాయిలు భయస్తులు..!' ఇలా అనడానికి కారణం.. ఎప్పుడో ఇంట్లో పెద్దవారో.. తల్లిదండ్రులో ఇలా ముద్ర వేసేశారు. వాస్తవం అదికాదు.. ఎందుకంటే.. పుట్టినప్పుడు అమ్మాయిలు.. అబ్బాయిలు ఇద్దరిలోనూ ఒకే విధమైన ధైర్యసాహసాలు ఉంటాయి. కానీ అబ్బాయిల్ని ప్రోత్సహించినంతగా అమ్మాయిల్ని ప్రోత్సహించరు.. ప్రతిదానికీ 'నువ్వు అమ్మాయివి.. నీవల్ల కాదు.. నువ్వు చేయలేవు..!' అంటూ వెనక్కి లాగేస్తుంటారు.. దీంతో వారిలో ఆవిధమైన ఒత్తిడితో భయం పెరిగి, ధైర్యం సన్నగిల్లుతుంది. అంతేతప్ప వారిలో ధైర్యసాహసాలు లేక కాదు. ఏదిచేసినా ఎవరో ఒకరు.. ఏదో ఒకటి అంటూ తమను వెక్కిరిస్తారనో.. ఎగతాళి చేస్తారనో.. అనే భావనలోకి వెళ్లిపోతున్నారు. చివరికి వారు చదువులోనూ 'ఈ సబ్జెక్ట్‌ అయితే ఆడపిల్లలకు ఇబ్బంది ఉండదు.. ఏది కావాలన్నా నన్నడుగు.. నువ్వు తెచ్చుకోకు..!' అంటుంటారు. పుస్తకాలు, పెన్నులు.. ఏది కొనుక్కోవాలన్నా స్వీయ నిర్ణయం లేకుండా చేస్తుంటారు. ఒకవేళ నిజంగానే వారిలో ధైర్యం లేకపోతే.. ఎన్నో కుటుంబాలను ఒంటరిగా నెట్టుకొస్తున్న స్త్రీలలో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది..? భర్త వ్యసనాలకు బానిసైన కుటుంబాల్లో సంపాదించే తెగువ వారికి ఎక్కడిది..? నేడు అనేక రంగాల్లో అమ్మాయిలు విజయాలు సాధిస్తున్నారంటే ఆ ప్రతిభ ఎక్కడిది..? ఒక్కసారి ఆలోచించండి..!

                                                             ఉన్నత చదువు.. ఉద్యోగాల్లో.. తోడ్పాటు..

చాలా మంది మహిళలు పెళ్లిళ్ల తర్వాత చదువుకు స్వస్తి పలుకుతున్నారు. అయితే ఈ మధ్య 'పెళ్లిళ్ల తర్వాతా చదువుకోండి.. మీకు మేము అండగా ఉంటాం!' అంటూ ప్రోత్సహిస్తున్నారు నేటి భర్తలు. కొంతమంది అసలేమీ చదువుకోకపోయినా చదువుపై వారికి ఉన్న మక్కువను గమనించి, ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అదే గతంలో అయితే.. 'ఏం ఇప్పుడు నువ్వు చదివి ఊళ్లేలా..? ఉద్ధరించాలా..?' అనేవారు. ఇక ఆర్థిక పరిస్థితులు బాగోని కుటుంబాల్లో అయితే అబ్బాయిలను చదివిస్తూ.. అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసే పరిస్థితి ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అవసరమైతే తోడబుట్టిన వారు తమ చదువును త్యాగం చేసి మరీ అక్కచెల్లెళ్లను చదివించడం.. వారికి ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడం చేస్తున్నారు. అనేక కుటుంబాల్లో అన్నదమ్ములు స్థిరపడేందుకు తోడ్పడే అమ్మాయిలూ ఉన్నారు. అయితే నేటి పరిస్థితుల్లో యువకుల్లో వస్తున్న మార్పుల్లో ఇది ముఖ్యమైనదనే చెప్పుకోవచ్చు.
 

                                                                           ఇష్టాలను గౌరవిస్తూ..

గతంలో అయితే కొంతమంది ఉన్నత చదువు చదువుకొనీ పెళ్లి తర్వాత ఉద్యోగాలు మానుకునేవారు.. ఉద్యోగాలు చేయాలని ఉన్నా.. భర్త, అత్తమామలు సహకరించక ఇంటిపనికే పరిమితమయ్యేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది భర్తలు వారి భార్యల మనోభావాలకు, అభిరుచులకు అనుగుణంగా వారికిష్టమైన రంగంలో రాణించేందుకు ప్రోత్సహిస్తున్నారు. అలాగని పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చిందనీ చెప్పలేం.. ఇంకా అలాంటి వారు పెరగాలి. కానీ అత్యధికుల్లో ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఆర్థిక అవసరాలున్నా.. లేకపోయినా.. స్త్రీల అభిరుచులను గౌరవిస్తున్నారు. వారి ఇష్టాయిష్టాల్ని తెలుసుకుని మసులుకునేవారు పెరుగుతున్నారు. అలాగే బాగా చదువుకున్నా ఉద్యోగం చేయనీయకుండా ఇంటికే పరిమితం చేసే తరహా స్వభావాన్ని వదులుకోవాలి. అమ్మాయిల అభీష్టాలను గౌరవిద్దాం.
 

                                                                             నలభీమ పాకం..

నలభీమ పాకం అని వంటలో రిఫ˜రెన్స్‌ పురుషులనే (నలుడు, భీముడు) చెప్తారేంటి? ఇంకా చాలా హోటల్స్‌లో మగవాళ్లే వంట చేస్తారేంటి? అప్పుడు అనిపించింది.. వాళ్లు దాన్ని ఒక ప్రతిభగా, కళగా అనుకోవడమే. మనం గమనిస్తే వంట మాస్టర్స్‌ గాలిలో పూరీలు విసరడం, రుమాలి రోటి చేసేపద్ధతి, టీ పోసే పద్ధతి, కూరగాయలు తరిగే పద్ధతి అన్నీ కళాత్మకంగా ఉంటాయి. అందుకే చేసే పని ఇష్టంగా చేస్తూ.. కళాత్మకంగా చేస్తున్న నేటి తరం యువత ఎందరో.. అది వారి అభిరుచుల్లో ఒక భాగమవుతోందనేది గమనించాలి.. ప్రోత్సహించాలి.

 

cs 01


 

                                                                         కట్నాలు.. కానుకలు..

ఒకప్పటి యువతలో పెళ్లి అనగానే కట్నాలు.. కానుకలు ఉంటేనే.. కానీ నేటి యువతరం ఆ పరిస్థితులను పక్కకునెట్టి.. తాము నచ్చిమెచ్చిన వారినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. అంతేకాదు.. అవసరమైతే పెద్దవారిని ఎదిరించడానికీ వెనుకాడటంలేదు. చాలావరకూ తాము పెరుగుతున్న క్రమంలో పెద్దవారి ప్రవర్తనలోనూ మార్పు తెస్తున్నారు. పాతకాలపు చాదస్తాలకు స్వస్తి చెప్పాలని హితవు పలుకుతున్నారు. ఈ మార్పు క్రమంగా తల్లిదండ్రుల్లోనూ వస్తుంది. కొందరు తమ పిల్లల అభిరుచి మేరకే నడుచుకుంటున్నారు. అంతేకాదు అత్తమామలను చూసే పద్ధతిలోనూ మార్పు చోటుచేసుకుంటుంది. అబ్బాయి తరపు తల్లిదండ్రులతో సమానంగా అమ్మాయి తరపున తల్లిదండ్రులను చూస్తున్నారు. గౌరవిస్తున్నారు. అవసరాన్ని బట్టి వారి ఆలనా.. పాలన.. పోషణ బాధ్యతల్లోనూ భాగస్వాములవుతున్నారు. ఇదంతా ఓ మోస్తరుగానే జరుగుతున్నప్పటికీ మార్పును ఆహ్వానిస్తే.. ఈ సంఖ్య మరింత పెరిగి, మెరుగైన సమాజాభివృద్ధికి దోహదం చేస్తుంది. అందుకోసం పిల్లల్ని పెంచే పద్ధతిలోనూ మార్పులు రావాలి..

 

cs 02

 

కేస్‌-1 : 'మేం ఇద్దరం అన్నదమ్ములం. తమ్ముడు ఇంటర్‌ చదువుతున్నాడు. నేను డిగ్రీ చదువుతున్నాను. అమ్మకు ఆరోగ్యం బాగోదు. ఇంటిపనిలో అమ్మకు సాయం చేస్తూ ఉంటాం. నేను వంటపనిలోనూ, ఇల్లు తుడవడంలోనూ సాయం చేస్తే.. తమ్ముడు బట్టలు ఉతకడం, ఆరేయడంలోనూ సాయం చేస్తుంటాడు. అమ్మతోపాటు చుట్టుపక్కల వారు.. 'మగపిల్లలు మీకెందుకు ఈ పనులు?' అంటుంటారు. 'ఏ అబ్బాయిలైతే ఈ పనులు చేయకూడదా? అమ్మాయిలే ఇంట్లో పనులు చేయాలా? మరి మా ఇంట్లో అమ్మాయిలు లేరు. అప్పుడు అమ్మకు సాయం ఎవరు చేస్తారు?' ఇది విశాఖ సిరిపురానికి చెందిన ఇరవయ్యేళ్ళ రాహుల్‌ ప్రశ్న.

 

cs 03

కేస్‌-2 : 'నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను. మా మరదలి పెళ్లి జరుగుతోంది. మాతో పాటు పాప కూడా ఉంది. మా ఆవిడ పూర్తిగా పెళ్లి సందడిలో మునిగిపోవడంతో పాప నాతోనే ఉండిపోయింది.
      మేమంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా.. మా పాప మల విసర్జన చేసింది. వెంటనే నేను లేచి, శుభ్రం చేయడానికి వెళ్లాను. ఇంతలో మా అత్తగారు నన్ను అడ్డుకున్నారు. గదిలోపలకి తీసుకెళ్లి.. 'మీరు ఈ ఇంటి అల్లుడు. ఇలాంటి పనులు చేయడం చూస్తే బంధువులు ఏమనుకుంటారు? సోనీని పిలవండి. తను వచ్చి పాపకు డైపర్‌ మారుస్తుంది!' అన్నారు.
    నేను మరో మాట మాట్లాడే లోపలే, అత్తగారు మా ఆవిడను పిలిచి పాపకు డైపర్‌ మార్చమని చెప్పారు. నేనూ మా ఆవిడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నిలబడిపోయాం. మళ్లీ మా అత్తగారు గట్టిగా 'సోనీ!' అని అరిచేసరికి మా ఆవిడ పాపని వాష్‌రూమ్‌కు తీసుకెళ్లింది.
ఆ సంఘటన నాకు కాస్త వింతగా, ఆశ్చర్యంగా అనిపించింది. పాప డైపర్‌ మార్చడం నాకేం కొత్త కాదు. నేను 'హౌస్‌ హజ్బెండ్‌'నని మా అత్తగారింట్లో అందరికీ తెలుసు.
    ఆ పెళ్లిలో చాలామంది మొహాల్లో ఒక వెకిలి నవ్వు. 'అతడు హౌజ్‌ హస్బెండ్‌!' అనే మాట ఆ పెళ్లి గోలలో అప్పుడప్పుడూ నా చెవిన పడుతుండేది. కానీ ఆ విషయం అందరికీ తెలియడం మా అత్తమామలకు ఇష్టం లేదు.
      'నేను సిగ్గుపడాలనీ.. జనాలే కావాలని నన్ను హేళన చేస్తారని తెలుసు. కానీ, ఎవరేమనుకున్నా నేను సిగ్గుపడను.. నా పద్ధతిని మార్చుకోను. నేను ఇలానే హౌస్‌ హజ్బెండ్‌లా ఉంటాను. మా ఇద్దరిదీ ప్రేమ వివాహం. కెరీర్‌లో ఎవరికి మంచి అవకాశం వస్తే వాళ్లు ముందుకెళ్లాలని మొదటే నిర్ణయించుకున్నాం. మొదట్నుంచీ నా కెరీర్‌ సరిగ్గా లేదు. కానీ సోనీ మాత్రం తన కెరీర్‌లో వేగంగా దూసుకెళ్లింది. దాంతో, నేను ఉద్యోగం మానేసి, ఇంటిపనులు చూసుకోవాలని, తాను ఉద్యోగం కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. మాకు పనిమనిషి లేదు. ఇల్లు ఊడవడం, తుడవడం, కూరలు తేవడం, వంట చేయడం లాంటి అన్ని పనులూ నేనే చేస్తాను. నేను ఇంటిపని చేయడం ఇతరులకు వింతగా అనిపిస్తుందేమో! కానీ నాకు మాత్రం ఇది చాలా మామూలు విషయం' అని హైదరాబాద్‌కు చెందిన కిరణ్‌ చెబుతున్నారు.

 

cs 04

 

కేస్‌-3 : 'మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ముల్లో నేను ఆఖరివాడిని. చిన్నప్పుడు అమ్మకి ఇంటిపనుల్లో సహాయం చేసేవాణ్ణి. అప్పుడు నా స్నేహితులు నన్ను 'గృహిణి' అంటూ ఆట పట్టించేవాళ్లు. అయితే బాగా చదువుకుని, పెద్ద నగరాల్లో నివసించే నా స్నేహితులు 'నా ఛాయిస్‌'ను మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. కానీ మా సొంతూరు వెళ్లినప్పుడు మాత్రం నా స్నేహితులు బాగా ఆట పట్టిస్తూ ఉంటారు. ఏదైనా రాజకీయానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు, నేను మాట్లాడితే, 'ఇది నీకు సంబంధించింది కాదు, నీకు అర్థం కాదు' అని నన్ను పక్కనబెడతారు. ఓసారి ఇలాగే నా స్నేహితులంతా ఏదో చర్చిస్తుంటే, నేను కూడా మధ్యలో మాట్లాడాను. అప్పుడు వాళ్లు 'ముందు నువ్వు వెళ్లి చారు చేసుకొని తీసుకురా!' అన్నారు. నేనూ కూడా నవ్వి 'ఒక్క చారు ఏంటి... పకోడీలు కూడా చేసుకొస్తా.. కానీ వంటచేసే వాళ్లు చేతకానివాళ్లు అనే భావన వదులకోండి. మీకన్నా మరికొన్ని అదనంగా తెలిసినవాళ్లని తెలుసుకోండి' అన్నాను. అందరూ ఒక్కసారి నోళ్లువెళ్లబెట్టారు.
     నాగరికత పెరుగుతోంది.. స్త్రీలు.. పురుషులూ అనే తేడా లేకుండా అందరూ సమానమే అనే భావన మెల్లగా అలవాటవుతోంది. అయితే ఇప్పటికే బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్య భావజాలాన్ని నేటి ఆధునిక యువకులు ప్రశ్నిస్తున్నారు. స్త్రీ-పురుషుల మధ్య బేధాన్ని అర్థం చేసుకుని, స్త్రీలను తమతోపాటే సమానంగా గౌరవిస్తున్నారు. వారి అభిరుచులు, అలవాట్లకు విలువనిస్తూ.. వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. చాలా మంది పురుషుల్లో ఇప్పటికీ వంటగదుల్లో చేసే పని తమదికాదని భావించే పరిస్థితులు మారుతున్నాయి. అయితే ఇంకా మారాల్సింది చాలా ఉంది.

 

cs 05

                                                                        అబ్బాయిల పెంపకంలో..

ఇంట్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటే.. వాళ్లని అన్నివిషయాల్లో సమానంగా చూడాలి. ఏ విషయంలోనూ అబ్బాయికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, అమ్మాయిని తక్కువ చేయకండి.

  • అమ్మాయిలను తప్ప అబ్బాయిలను తల్లులు వంటపనిలో సాయమడగరు. అదీ తప్పే. వంట అమ్మాయిలే చేయాలని లేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న చెఫ్స్‌లో అత్యధికులు పురుషులే. అలా అని కెరీర్‌ కోసం వంట కాదు. ఇప్పుడు అలవాటు చేస్తే రేపు పెద్దయ్యాక భార్యకు సాయపడే అలవాటు వస్తుంది. ఇల్లు తుడవడం, గిన్నెలు కడగడం వంటివి మగపిల్లలు చేయకూడని పనులేవీ కాదని తప్పకుండా చెప్పండి.
  • ఏడవొద్దు అని మీ అబ్బాయికి ఎప్పుడూ చెప్పకండి. చాలామంది అంటుంటారు.. అబ్బాయిలు ఏడవకూడదు అని. అంటే అమ్మాయిలే ఏడవాలి అని పరోక్షంగా చెబుతున్నట్టే కదా! ఆడవాళ్లు ఏడుస్తూనే ఉంటారులే అనే యాటిట్యూడ్‌ వారిలో పెరిగిపోదూ!
  • అబ్బాయిలు సౌమ్యంగా, సుకుమారంగా ఉంటే.. 'ఏంటి ఆడపిల్లలా?' అంటుంటారు. దాంతో అబ్బాయంటే.. రఫ్‌గా ఉండాలన్న భావన పేరుకుపోతుంది. తర్వాత ఏమవుతుందో వేరే చెప్పాలా?
  • ఆడపిల్లలతో గౌరవంగా మాట్లాడటం నేర్పించండి. చెల్లెలైనా సరే కొట్టడం, తిట్టడం చేయనీయకండి.
  • ఆడపిల్లల విలువేంటో తెలియజేయండి. చరిత్రలో గొప్ప గొప్ప మహిళల కథనాలు చెప్పండి. ఆడపిల్లలూ చాలా సాధించగలరు.. సమర్ధులే అన్న నమ్మకం చిన్ననాడే ఏర్పడితే... అమ్మాయిలను తక్కువగా చూసే అలవాటు రాదు.
  • పిల్లలు టీవీ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలను బలహీనంగా చూపించేవి, తప్పుగా చూపించే వాటిని చూడనివ్వకండి. కొన్నిసార్లు వాళ్ల చిన్ని బుర్రలకి అవి తప్పుగా అర్థమైతే తర్వాత వాళ్ల ఆలోచనాధోరణిపై, వ్యక్తిత్వంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
  • చిన్నతనంలోనే ఇంత అవసరమా అనుకోకండి. మొక్కై వంగనిది మానై వంగదు. చిన్నప్పుడు నేర్పలేనిది పెద్దయ్యాక నేర్వలేరు. పిల్లల మనసులు తెల్ల కాగితాలు. వాటిపై మొదటే మంచి అక్షరాలు రాయండి. వాటినే జీవితాంతం చదువుకుంటూ ఉంటారు. పాటిస్తూ ఉంటారు. ఆదర్శంగా నిలబడతారు.
cs 06

                                                                         ఇలా కొంచెం భిన్నంగా..

మనం సాధారణంగా ఏదైనా కొంచెం భిన్నంగా చేస్తే మొదట ఎక్కువమంది వేళాకోళం చేస్తారు. తరువాత మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మనల్ని స్వీకరిస్తారు. అవేంటంటే..

  • ఇంట్లో కనుక పిల్లలుంటే వాళ్ల బాధ్యతనంతా భార్య నెత్తిన రుద్దకండి. తన బాధ్యతలని పంచుకోవడం నేర్చుకోండి.
  • సాధారణంగా ఒక నానుడి ప్రాచుర్యంలో ఉంది, స్త్రీ స్థానం వంటింటికే అని. 21 శతాబ్దంలో ఉన్న మనం ఇలాంటి రూల్స్‌ పాటించడం సిల్లీగా లేదూ? మనకే కనుక వంట చేయడం ఇష్టమైతే వెంటనే కుకింగ్‌ ఏప్రాన్‌ తగిలించుకుని అప్పుడప్పుడు గరిటె తిప్పితే ఇంట్లోని ఆడవాళ్ల ముఖాల్లో ఆనందం వెల్లి విరుస్తుంది
  • ఇంటి ఫ్లోర్‌ని ఊడ్చి శుభ్రంగా తుడవడం.. ఇలా ఇంటిపనుల్లో షేర్‌ చేసుకుంటే.. ఇంట్లో పని సులువుగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుంది.
  • పక్షానికోసారి దుప్పట్లు, కర్టెన్లు మార్చడం లాంటి పనులు చేయడం. పురుషులు ఇలాంటి పనుల్లో సహాయపడటం నేర్చుకుంటే తమ బంధాన్ని పటిష్టపరచుకున్నట్లే.
  • ఫర్నీచర్‌ని శుభ్రపరచడం.. టేబుల్స్‌ మీద దుమ్ము దులపడం వంటి పనుల ద్వారానూ బెస్ట్‌ హస్బెండ్‌ అనిపించుకోవచ్చు. అంతేకాదు ఇలాంటి పనులు చేయడం ద్వారా పిల్లలు కూడా వీటిని తర్వాతర్వాత అనుసరిస్తారు. తద్వారా స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు లేని మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది.

ఉదయ్ శంకర్‌ ఆకుల
7989726815