Sep 24,2023 07:22

'జోరుగా.. హుషారుగా.. సాగిపోదమా.. హాయి హాయిగా.. తియ్య.. తియ్యగా.. జోరుగా..' అంటాడు ఓ సినీ కవి.. అసలు జీవితమే ఒక ప్రయాణం. పర్యటించడం సృజనాత్మక జీవితానికి సంకేతం. ఆది నుంచి మనిషి సంచారి. తొలుత ఆహారం కోసం, మనుగడ కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారు. అది ఆనాటి అవసరం. అలా తిరగటంలోని జిజ్ఞాస ఆనంద పరవశుల్ని చేసింది. కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలను చవిచూశారు. తద్వారా విజ్ఞానం పొందారు. ప్రపంచ వింతలు, ప్రకృతి సౌందర్యం మనిషిని పరవశింపజేశాయి. సప్తసముద్రాల్ని ఈది, ఖండాంతరాలు దాటి ప్రయాణించడం వల్లనే మానవ జీవన వికాసం పరిఢవిల్లింది. ఊహకందనంత వైశాల్యం విస్తరించింది. లోకం పోకడలు, ప్రకృతి వైచిత్రి, జీవన రీతులు ప్రయాణంలోనే తెలుసుకోవడం సాధ్యమైంది. పర్యటించడమంటే చరిత్రలోకి చూపు సారించడం. వెనకటితరాల జీవన సంస్కృతులను తెలుసుకోవడం. కనుకనే 'యాత్రలు చేయడమంటే గడచిన శతాబ్దాల మనుషులతో మాట్లాడడం' అంటారు డెస్కార్టెస్‌ అనే తత్వవేత్త. ఇదొక అనుభవ సారం. విస్తృత ప్రయాణం మనస్సును విశాలం చేస్తుంది. కొత్త కొత్త భాషలు, కళలు, సంస్కృతులు, సంప్రదాయాలు, సామాజిక పునరుజ్జీవనం అనుభవపూర్వకం అవుతాయి. ఈ నెల 27వ తేదీన 'ప్రపంచ పర్యాటక దినోత్సవం' సందర్భంగా ప్రత్యేక కథనం..

kerala

గత రెండు, మూడు దశాబ్దాలతో పోల్చితే.. ప్రస్తుత ప్రయాణం సులభతరమైంది. ఏ మారుమూల ఏ వింత జరిగినా క్షణాల్లో తెలుసుకోగలిగే మాధ్యమాలు నేడు అందుబాటులో వున్నాయి. ఏ మూలకు వెళ్లాలన్నా ప్రయాణ సౌకర్యాలు, వసతి సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. సౌకర్యాలు, సౌలభ్యాలు, ఆహార వ్యవహారాల గురించి విస్తారమైన సమాచారం ఇప్పుడు అంతర్జాలంలో అందుతోంది. ప్రపంచ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తరాలు సైతం మానవ వికాసాన్ని, జీవన సంస్కృతుల్ని తెలుసుకోగలుగుతాయి. అందులో భాగంగానే ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 27న 'ప్రపంచ పర్యాటక దినోత్సవం' నిర్వహిస్తున్నారు. ఇదొక ప్రేరణ.. ఇదొక ఉత్సాహం.. ఇదొక విజ్ఞానం. ఇది నిరంతరం కొనసాగాల్సిన జీవనగమనం.
కోవిడ్‌ -19 మహమ్మారి ప్రభావం 2020 మార్చి నుండే కనిపించడం ప్రారంభమైంది. దీంతో 2020, 2021లో పర్యాటకులు దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ పర్యటించే పరిస్థితులు లేకపోయాయి. పర్యాటకరంగ దూకుడుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకానికి ఆదరణ పెరుగుతోంది. చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, కొండకోనలు, అద్భుతమైన సముద్రతీరాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. చాలా దేశాలకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. కోవిడ్‌ మహమ్మారి దెబ్బకు ఆర్థికవ్యవస్థ కుదేలైన దేశాలెన్నో.. ఆయా దేశాల ఆర్థికవ్యవస్థలను పటిష్టం చేయడమే గాక, కోట్లాదిమందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం.. అక్కడి ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట. ఈ ఏడాదిలో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య కోవిడ్‌కు ముందున్న సంఖ్యలో 80 నుండి 95 శాతం వరకు చేరవచ్చని యుఎన్‌డబ్ల్యుటిఓ అంచనా. ఆర్థిక మాంద్యం, వివిధ దేశాల్లో భౌగోళిక, రాజకీయ పరిస్థితులను బట్టి ఈ సంఖ్య అటు, ఇటుగా ఉండొచ్చని అంచనా వేసింది.

2

ఎప్పుడు.. ఎలా..

పర్యాటక ప్రాముఖ్యత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక అంశాల గురించి అంతర్జాతీయంగా అవగాహన కల్పించేందుకే పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించాలని 1979 సెప్టెంబర్‌లో నిర్ణయించారు. యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ (యుఎన్‌డబ్ల్యుటిఓ) 1980 నుండి ప్రతి ఏటా నిర్వహిస్తోంది. విశ్వవ్యాప్తంగా సుస్థిరమైన పర్యాటకాన్ని అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పడింది. పర్యాటక ప్రయోజనాలను పెంచడంలో సహాయపడడానికి, ప్రజలకు ఆహ్లాదకరంగా, వినోదం పంచేలా పర్యాటక ప్రాంతాలపైనా, పర్యావరణ విషయాలపైనా దృష్టి సారించింది. అందులో భాగంగానే ప్రతి ఏడాదీ ఒక్కో అంశాన్ని థీమ్‌గా తీసుకుని, దాన్ని ప్రచారం చేయడం ద్వారా పర్యాటకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు, ఆయా ప్రాంతాల చారిత్రక విషయాలను, సాంస్కృతిక విశేషాలను పదిలపరుచుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటోంది.

ఏడాది ఎక్కడంటే...

గతేడాది పర్యాటక దినోత్సవం ఇండోనేషియాలో జరిగింది. 'పర్యాటకం గురించి పునరాలోచించడం- విద్య, ఉద్యోగ అవకాశాల కల్పనలో అభివృద్ధి సాధించడం' లక్ష్యంగా దానిని నిర్వహించారు. ఈ ఏడాది (2023) పర్యాటక దినోత్సవాన్ని 'పర్యాటకం-పర్యావరణ పెట్టుబడి' అంశాన్ని థీమ్‌గా సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్నారు. కాగా, 2024లో 'టూరిజం అండ్‌ పీస్‌' థీమ్‌తో యూరప్‌, 2025లో 'టూరిజం, సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌' పేరిట దక్షిణాసియాలో ప్రపంచ పర్యాటక దినోత్సవాలను నిర్వహించడానికి అవసరమైన ప్రతిపాదనలను ఇప్పటికే యుఎన్‌డబ్ల్యుటిఓ ముందుంచాయి.

6

అత్యధికంగా సందర్శించే.. ఐదు నగరాలు..

ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు అత్యధికంగా సందర్శించే ఐదు నగరాల్లో చైనాలోని హాంగ్‌కాంగ్‌, మఖౌ, థారులాండ్‌లోని బ్యాంకాక్‌, లండన్‌, సింగపూర్‌ వున్నాయి. అలాగే ప్రపంచంలోనే అత్యధిక ఐలాండ్స్‌ వున్న దేశాల్లో స్వీడన్‌ ముందుంటుంది. ఈ దేశంలో మొత్తం 2,67,570 దీవులున్నాయి. రెండోస్థానంలో నార్వే, మూడో స్థానంలో ఫిన్లాండ్‌ వుండగా, ఆ తర్వాతి నాలుగైదు స్థానాల్లో కెనడా, యుఎస్‌ఎ వున్నాయి. వీటిని పర్యాటకులు నిత్యం సందర్శిస్తూనే వుంటారు.
అంతర్జాతీయ పర్యాటకరంగ అభివృద్ధిలో మనదేశం స్థానం క్రమేణా మసకబారుతోంది. జమ్ముకాశ్మీర్‌లో ఉద్రిక్తతలు, దేశంలో అనేక పర్యాటక ప్రాంతాల్లో మత ఘర్షణలు చోటుచేసుకోవడం తదితర కారణాలతో పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది. ప్రపంచ పర్యాటక సంస్థ గుర్తించిన 117 దేశాల్లో భారత్‌ 2019లో 46వ స్థానంలో ఉండగా, 2022లో 54వ స్థానానికి దిగజారినట్లు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యుఈఎఫ్‌) తన నివేదికలో పేర్కొంది.

మనదేశంలో.. చూడదగ్గవి..

మనదేశంలో పర్యాటకం మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతులను ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు.
మంచు పర్వతాలు..
కాశ్మీర్‌ వైభవం మరే ప్రదేశానికీ సాటిలేనిది. అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలకు నిలయం కాశ్మీర్‌. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని పచ్చిక భూములు, అందమైన సరస్సులు, ఆకర్షణీయమైన జలపాతాలతో కూడిన పరిపూర్ణ పర్యాటక ప్రదేశం కాశ్మీర్‌.

మైమరిపించే అనుభూతులు..

నగర పర్యటనలో ఆధునికతతో పాటు అనేక సంప్రదాయాలు కనిపిస్తాయి. సందర్శకులకు మరుపురాని అనుభూతులను కలిగిస్తాయి. ఎర్రకోట, చాందినీచౌక్‌, అక్షరధామ్‌, ఇండియా గేట్‌, కుతుబ్‌మినార్‌, లోడి గార్డెన్‌, లోటస్‌ టెంపుల్‌, రాష్ట్రపతి భవన్‌, రాజ్‌ఘాట్‌, నేషనల్‌ జూలాజికల్‌ పార్కు, పురానా ఖిల్లాలను సందర్శిస్తూ ఉంటారు.

తనివితీరా చూసేవి..

మనదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను విధిగా సందర్శిస్తారు. తాజ్‌మహల్‌ను చూడాలనే ఆసక్తితో వచ్చేవారే ఎక్కువ. తాజ్‌మహల్‌ను సందర్శించిన వారు ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉండే ఆగ్రా కోట, మొఘల్‌ గార్డెన్స్‌, జామా మసీదు, మోతీ మసీదు, సికింద్రా కోట, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటి ప్రదేశాలను తనివితీరా చూసి, ఇతర ప్రాంతాలకూ వెళతారు.

కొండలు కోనలు.. కొల్లాం తీరాలు..

దక్షిణాది రాష్ట్రాల అన్నిట్లో కేరళకు విదేశీ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చుట్టూ నీళ్లు.. మధ్యలో ఊళ్లు.. పడవ ప్రయాణాలు, కొబ్బరి, సుగంధద్రవ్యాల తోటలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తాయి. వాయనాడ్‌లోని కొండకోనలు, కొల్లాం సముద్రతీరాల్లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆయుర్వేద చికిత్సల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండే గాక, వివిధ దేశాల నుండీ వస్తూంటారు. తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో పురాతన కట్టడాలు, ఆలయాలను సందర్శిస్తూంటారు.

4

మనోహర విహారం..

ఈ విహార ప్రదేశం.. సుందరమైన సముద్ర తీరం. ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. మనదేశానికి దక్షిణ దిశగా బంగాళాఖాతంలో ఉన్న అండమాన్‌, నికోబార్‌ దీవులకు వెళ్లాలంటే.. పోర్టుబ్లెయిర్‌లోని ప్రత్యేక విమానాశ్రయానికి వెళ్లాల్సిందే. దేశంలోని చెన్నరు, కోల్‌కతా, ఢిల్లీ, భువనేశ్వర్‌, ముంబయి ప్రాంతాల నుండి నేరుగా విమాన సౌకర్యం ఉంది. సముద్రయానం ద్వారా చెన్నరు, కోల్‌కతా నుండి నెలలో నాలుగైదుసార్లు, విశాఖ నుండి నెలకోసారి మాత్రమే ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఇక్కడ సెల్యూలర్‌ జైల్‌, కోరల్‌ రీఫ్స్‌, దిగ్గాపూర్‌ తీరాలు, హోప్‌లాక్‌ తీరాలు, మెరైన్‌ నేషనల్‌ పార్కు, నికోబార్‌ దీవులను సందర్శించవచ్చు.

అరేబియన్‌ అందాలు..

మనదేశంలోని పశ్చిమదిశలో ఉన్న అతి చిన్న రాష్ట్రం ఇది. ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, పశ్చిమాన కర్నాటక రాష్ట్రాలతో సరిహద్దు కలిగి అరేబియన్‌ సముద్రం ఒడ్డున ఉన్న గోవా.. అన్ని కాలాల్లోనూ స్వదేశీ, విదేశీ పర్యాటకులతో కళకళలాడుతుంది. సప్త కోటేశ్వరాలయం, మేయమీలేక్‌, ముపాసా టౌన్‌, గుండా వగాటోర్‌ బీచ్‌, అంజునా బీచ్‌, కలన్‌గూటి బీచ్‌, పాంజిమ్‌ హేండీక్రాప్ట్‌ ఎంపోరియం, చర్చిలు, వరల్డ్‌ మ్యూజియం, క్రిస్టియన్‌ ఆర్ట్స్‌ మ్యూజియం, మంగేష్‌ టెంపుల్‌, శాంతా దుర్గా టెంపుల్‌, పురాతన గోవా మ్యూజియం కోల్వాబీర్‌, డోనిపౌలాబే, మిరామిర్‌ బీచ్‌లు ప్రసిద్ధి. క్యాసినో పార్టీలు సర్వసాధారణం. సముద్రపు ఆహార ఉత్పత్తులు, మద్యం ఇక్కడ ఎక్కువగా లభిస్తాయి.

చారిత్రక కట్టడాలు..

పింక్‌ సిటీగా పిలవబడే జైపూర్‌.. రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని. రాజపుత్రుల గత వైభవానికి ఆనవాలుగా నిలిచే చారిత్రక కట్టడాలు నేటికీ పర్యాటకులను విస్తుగొలుపుతుంటాయి.

పురాతన రాజప్రాసాదం..

కర్నాటక రాష్ట్రంలో ఉన్న హంపి విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దక్షిణాది పర్యటన ఉంటే తప్పనిసరిగా హంపిని సందర్శించకుండా పర్యాటకులు వెళ్లరు. పురాతన చారిత్రక శిథిల నిర్మాణాలు, విరూపాక్ష ఆలయం వంటి ప్రాచీన ఆలయాలతోపాటు ఆర్కియాలజికల్‌ మ్యూజియం, పాత రాజప్రసాదం వంటి ప్రదేశాలను తప్పక సందర్శిస్తారు.

మైసూరు ప్యాలెస్‌..

ప్రతి ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా ఈ సందర్భంలో మైసూరు పరిసర ప్రాంతాలను సందర్శిస్తూంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడే ఈ నగరంలో అనేక చారిత్రక కట్టడాలున్నాయి. మైసూరు ప్యాలెస్‌, బృందావన్‌ గార్డెన్స్‌, మైసూర్‌ సాండ్‌ స్కల్చర్‌ మ్యూజియం, కరంజి సరోవరం వంటి ప్రదేశాలు ఇక్కడ చెప్పుకోదగ్గవి.

apm], ts

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి పరంగా అనేక ప్రాంతాలు దేశ, విదేశీ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అందమైన ప్రదేశాలు..
విశాఖకు 120 కిలోమీటర్ల దూరంలో వున్న అరకు ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. విశాఖ రైల్వేస్టేషన్‌ నుండి ప్రతిరోజూ ఉదయం 6.50 గంటలకు విస్టాడోమ్‌ రైలు బయలుదేరుతుంది. 58 టన్నెల్స్‌, 84 వంతెనల నుంచి దాదాపు ఐదు గంటల ప్రయాణం మనస్సును భావోద్వేగంతో ముంచెత్తుతుంది. బొర్రా గుహలు, కటికి వాటర్‌ఫాల్స్‌, చాపరాయి వాటర్‌ఫాల్స్‌, తాడిమడ వాటర్‌ఫాల్స్‌, మత్స్య గుండం, భీమిలి బీచ్‌, సబ్‌మెరైన్‌ మ్యూజియం, కైలాసగిరి, రుషికొండ బీచ్‌, యారాడ బీచ్‌, రామకృష్ణ బీచ్‌ (ఆర్‌కె), సింహాచలం, అరసవల్లి ముఖ్యమైనవి. పోర్టు, స్టీల్‌ప్లాంట్‌ వంటి వాటినీ సందర్శించవచ్చు. తిరుమల, తిరుపతి పరిసరాల్లోని టిటిడి సహా పలు దేవస్థానాలు, చంద్రగిరి కోట, విజయవాడలోని భవానీద్వీపం, ఉండవల్లి గుహలు, అమరావతి, పల్నాడు జిల్లా -తెలంగాణాలోని నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న నాగార్జునసాగర్‌, నాగార్జున కొండ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. కడప జిల్లా గండికోట, కర్నూలు-కొండారెడ్డి బురుజులను పర్యాటకులు సందర్శిస్తున్నారు.

తెలంగాణాలో చారిత్రక నిలయాలు..

గోల్కొండ పోర్టు, ఎత్తిపోతల ఫాల్స్‌, బిర్లామందిర్‌, కుతుబ్‌షాహి, నెహ్రూ జూలాజికల్‌ పార్కు, తాజ్‌ఫలక్‌నామా హౌస్‌, నిజాం మ్యూజియం చార్మినార్‌, మంజీరా రిజర్వాయర్‌, ఖమ్మం కోట, వరంగల్‌ కోట, వేయిస్తంభాల గుడి చూడదగిన ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు.

ఫిలింసిటీకి కేరాఫ్‌

దేశ ఆర్థిక రాజధాని, మహారాష్ట్ర రాజధాని ముంబయిని విదేశీ పర్యాటకులు ఎక్కువగానే సందర్శిస్తూ ఉంటారు. హిందీ సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రం. ఇక్కడి విక్టోరియా టెర్మినల్‌, గేట్‌వే ఆఫ్‌ ఇండియా, హాజీ ఆలీ దర్గా, ఫిలింసిటీలను సందర్శించడానికి అమితాసక్తిని చూపుతారు.

5

అంతరిక్ష పర్యాటకం..

అంతరిక్ష పర్యాటకాన్ని 2030 నాటికి పట్టాలెక్కిస్తామని ఇస్రో చెబుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని టిక్కెట్‌ ధర కూడా నిర్ణయమైందని ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు సొంతంగా ఒక మాడ్యుల్‌ కూడా తయారు చేస్తున్నారు. టిక్కెట్‌ ధర సుమారు రూ. ఆరు కోట్లు వుండొచ్చు. కాగా, ఇప్పటికే ప్రపంచ కుబేరులైన జెఫ్‌ బెజోన్‌, రిచర్డ్‌ బ్రాన్‌సన్‌, ఎలాన్‌మస్క్‌ తమతమ స్పేస్‌ క్రాప్ట్‌ల ద్వారా 2021లో రోదసీ విహార పర్యటనకు వెళ్లి వచ్చారు. చాలాకాలం క్రితమే ఆర్బిటల్‌ స్పేస్‌ టూరిజాన్ని 'రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ' ప్రారంభించింది. 2001లో అమెరికన్‌ మిలియనీర్‌ డెన్నిస్‌ టిటో రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీకి రూ.165 కోట్లు చెల్లించి, అంతరిక్ష టూరిస్టుగా ఎనిమిది రోజులు గడిపి, వచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్‌ టూరిస్టుగా ఈయన రికార్డు నెలకొల్పారు.
అయితే, బిలియనీర్లు చేస్తున్న ఈ పర్యాటకం వల్ల పర్యావరణానికి, మానవాళికి తీవ్రమైన నష్టం జరుగుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఒక నివేదిక ప్రకారం.. రోదసీలో ఒక స్పేస్‌క్రాప్ట్‌ 11 నిముషాల పాటు ప్రయాణించడానికి ఒక ప్రయాణికుడికి దాదాపు 200 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ విడుదల అవుతుంది. ఇది భూ ఆవరణాన్ని విషతుల్యం చేస్తుంది. ఒక అపర కుబేరుని రోదసీ విహారయాత్ర ప్రపంచ జనాభా మొత్తం ఏడాదిపాటు విడుదల చేసే కర్బన ఉద్గారాల కన్నా, దాదాపు వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. పైగా అక్కడ ఒక హోటల్‌ను కూడా నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇదే జరిగితే పర్యావరణానికి నష్టం ఏ మేరకు ఉంటుందో ఊహించడం కష్టం.

6

నిరంతర ప్రయాణీకుల నిండైన జీవితం..

సృజనకారులు ఎప్పుడూ ఒకచోట నిలబడరు. నిరంతరం ప్రయాణిస్తూనే వుంటారు. ప్రయాణాల్లోనే నిండైన జీవితాన్ని అనుభవించి, పలవరిస్తారు. మన దేశంలో విపరీతంగా ప్రయాణాలు చేసిన సృజనశీలురలో రాహుల్‌ సాంకత్యాయన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెద్దగా రవాణా సౌకర్యాలు లేని కాలంలో ఏళ్ల తరబడి ప్రయాణాల్లోనే గడపడం చిన్న విషయం కాదు. తన పర్యటనల సారాన్ని రచనల ద్వారా ఎంతోమందిలో ఉత్తేజం నింపారు. హ్యూయాన్‌త్సాంగ్‌, ఫాహియాన్‌ వంటి వారు తమ పర్యటనానుభవాలను గ్రంథాలుగా వెలువరించారు. ఆ యాత్రాగ్రంథాలు చరిత్ర రచనకు ఉపకరణాలయ్యాయి. 'నన్నొక యాత్రికుడిగా గుర్తుపెట్టుకుంటే చాలు' అన్నాడు జపాన్‌కి చెందిన హైకూ కవితా పితామహుడు బషో (1644-1694). దేశాల చరిత్రని మార్చడానికి, విప్లవ చైతన్యాన్ని ప్రోది చేయడానికి సైతం యాత్రలు తోడ్పడతాయి. చే గువేరా తొమ్మిది నెలలపాటు లాటిన్‌ అమెరికా మీదుగా ఉత్తర అమెరికాకి మోటార్‌ సైకిల్‌ మీద ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రజల స్థితిగతులు తెలుసుకున్నారు. ఆ అనుభవాల నేపథ్యంతో చే గువేరా సృజించిన 'మోటార్‌ సైకిల్‌ డైరీస్‌' ఈనాటికీ పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేస్తున్నాయి.
తెలుగువారికి సంబంధించి.. ఏనుగుల వీరాస్వామి (1780-1836) ని యాత్రా పితామహునిగా చెపుతారు. యాత్రా చరిత్రలకు ఆద్యుడు ఈయన. నాయని కృష్ణకుమారి రచించిన 'కాశ్మీర దీపకళిక' కాశ్మీర్‌ని దర్శించాలనే తపనను పెంచేలా వుంటుంది. అలాగే సంజీవ్‌దేవ్‌ 'యాత్రా చరిత్రలు', కాలినడకన పర్యటించే నిత్యపథికుడు ఎం. ఆదినారాయణ, లోకేశ్వర్‌, దాసరి అమరేంద్ర.. తాజాగా 'స్వర్ణకిలారి' సంపాదకత్వంలో 'ఇంతియానం' అని, స్త్రీలందరూ చేసిన పర్యటనానుభవాల సంకలనం వచ్చింది. రెండో భాగంగానూ రానుంది. ఇలాంటివారి యాత్రా రచనలు తెలుగువారి పర్యాటక దీప్తికి తార్కాణాలు.

చారిత్రక విజ్ఞాన సముపార్జన..

ప్రయాణాలంటే కేవలం కాలక్షేపం కోసం చేసే యాత్రలు కాదు. పర్యటించడం అంటే మానసిక వికాసంతో పాటు జ్ఞాన సముపార్జన దిశగా పర్యాటకం సాగాలి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా చారిత్రక దృష్టితో చూడాలి. వాటి చారిత్రక వైభవాన్ని తెలుసుకోవాలి. వాటి చరిత్ర వెనుక కనిపించని కథలను, వాటికి ఆవల దాగుండే వైవిధ్యాలను తరచి చూడాలి. ప్రకృతి సౌందర్యం దోబూచులాడే ప్రాంతాలు, ఒకనాటి చారిత్రక వైభవానికి ఆనవాళ్ళుగా మిగిలిన పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. ముఖ్యంగా పిల్లలకు ఆ తరహా ప్రయాణాలు అలవాటు చేయాలి. అదేసమయంలో పర్యావరణ ప్రాముఖ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పర్యాటకంలోనూ కార్పొరేట్లు కాలుమోపిన తర్వాత పర్యాటక విలువలకు నీళ్లొదులుతున్నారు. పర్యాటకం ముసుగులో విశృంఖలతకు పెద్దపీట వేస్తున్నారు. దీనికి తోడు ప్లాస్టిక్‌ కవర్లు, బాటిల్స్‌ వాడకం నదులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే.. ప్రయాణాలైనా, పర్యాటకాలైనా. అందుకే.. ఈ ఏడాది పర్యాటక థీమ్‌ను ఆదర్శంగా తీసుకొని, భావితరాలకు అందమైన, అద్భుతమైన ప్రపంచాన్ని కానుకగా అందివ్వాలి.

షేక్‌ ఖాజావలి
9490099550

ఎక్కువమంది సందర్శించిన దేశాలు (2022-లక్షల్లో)
ప్రాన్స్‌ 826
యుఎస్‌ఎ 756
స్పెయిన్‌ 756
చైనా 593
ఇటలీ 524
యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 358
జర్మనీ 356
మెక్సికో 350
థారులాండ్‌ 326
టర్కీ 300