Aug 27,2022 06:35

ఇదేదో రెండు పత్రికల రెండు పార్టీల తగాదాలా మార్చే ప్రయత్నాలు కట్టిపెట్టాలి. ఒప్పందం ప్రకారం చేయకపోగా ఇతర వ్యాపారాల కోసం తెచ్చుకున్న అప్పులను ఎగవేసి, ఆ దివాళాకు లేపాక్షి భూములు తీసుకొమ్మని అధికారం ఇవ్వడం ఏం న్యాయం? ఆ చిన్నమొత్తం కూడా కట్టని వారికి బినామీగా వచ్చిన మరెవరికో ధారాదత్తం చేయడం ఏం న్యాయం? ఆ భూముల విలువలు చాలా పెరిగాయి. అందుకే అనేక అక్రమ లావాదేవీలూ జరుగుతున్నాయి. పాలక పార్టీ వారే చెబుతున్నట్టు ఈ భూములను చేతికి తెచ్చుకోవడానికి ఎలాగూ సమయం పడుతుంది గనక ఈలోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి. వందల కోట్ల విలువైన భూములను అప్పనంగా చేజిక్కించుకునే కుట్రలను అరికట్టాలి.

   మన దేశం లోనూ రాష్ట్రంలోనూ పాలక పార్టీలు అధికారంలో వున్నప్పుడు పరస్పరం కుంభకోణాల ఆరోపణలు గుప్పించుకుంటాయి. ఎన్నికలలో గెలుపు కోసం ప్రజలలో వాటిపై తీవ్ర ప్రచారం చేస్తాయి. తీరా తాము అధికారంలోకి వచ్చాక వాటి మూలాల్లోకి వెళ్లవు. ఎందుకంటే వారికీ వీరికి కూడా ఆర్థిక రాజకీయ ప్రయోజనాలుంటాయి. తీగ లాగితే డొంక కదులుతుందని తెలుసు గనక పైపై మాటలతో పుణ్యకాలం గడిపేస్తాయి. అదే కార్పొరేట్‌ శక్తులు అటూ ఇటూ మారుతుంటాయి. గద్దెక్కిన వారిని బట్టి ప్రయోజనం పొందే సంస్థలూ వ్యక్తులూ మారడం తప్ప విధానాలలో మార్పు వుండదు. మరీ అవసరమైతే కోర్టులూ నిబంధనలూ అంటూ తప్పించుకుంటాయి. నిరంతరం సాగిపోయే ఈ ధన హోమానికి ఆహుతైపోయేది ప్రజలూ ప్రజల సంపదలే. చరిత్రలో పలుమార్లు నిరూపితమైన ఈ సత్యాన్ని మరోసారి కళ్లకు కడుతున్నది పూర్వపు అనంతపురం (ప్రస్తుతం శ్రీసత్య సాయి) జిల్లా చిలమత్తూరు మండలం లోని లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూముల కుంభకోణం. కొన్ని వేల కోట్ల విలువైన 8844 ఎకరాల భూములను వేలం ప్రక్రియలో అయిదు వందల కోట్లకే అధికార పార్టీకి చెందిన వారు హస్తగతం చేసుకుంటుంటే అతకని సాకులతో సమర్థించుకుంటోంది ప్రభుత్వం. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజలకు, ప్రభుత్వానికి చెందాల్సిన ఈ భూమిని మరెవరో తాకట్టు పెట్టి ఇప్పుడు ఏకంగా అమ్మేసుకుంటుంటే సమర్థిస్తున్నది జగన్‌ సర్కారు. 2009లో మొదలైన ఈ ప్రహసనంలో మూడు ప్రభుత్వాలు, అయిదుగురు ముఖ్యమంత్రులు మారినా ఎవరూ కాపాడే ప్రయత్నం చేయకపోవడం విచిత్రం. ఇప్పుడు కూడా వ్యక్తిగత వివాదంగా తప్ప వ్యవస్థాపరమైన లోతుల్లోకి వెళ్లకపోవడం ప్రశ్నార్థకం.
 

                                                   84 వేల ఎకరాల సంతర్పణలో లేపాక్షి

వివిధ ప్రజావసరాల కోసం లేదా సంస్థల స్థాపన కోసం ప్రభుత్వ భూముల అప్పగింత లేదా కాలక్రమంలో పక్కదోవలు పట్టడం తెలిసిందే. ఇందులో ప్రభుత్వ భూములు ప్రభుత్వ వ్యవస్థ సాయంతో చౌకగా కొన్నవీ అనేకం. రెండేళ్లలోగా యూనిట్టు నెలకొల్పి ఉపాధి కల్పించడం, ఉత్పత్తి లేదా సేవలు అందించడం వాటి లక్ష్యం. అలా జరక్కపోతే ఆ భూములు తిరిగి తీసుకుంటామని కూడా ఒప్పందంలో పేర్కొంటారు. సెజ్‌లు, హబ్‌లు, క్యారిడార్‌లు ఇలా రకరకాల పేర్లతో ప్రైవేటు భూములను సేకరించి ఇవ్వడం వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో తారాస్థాయికి చేరింది. 2004-09 మధ్య మొత్తం 84,000 ఎకరాలు వివిధ సంస్థలకు కట్టబెట్టారు. వాటిలో పెద్దవి ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్‌, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, విమానాశ్రయం పేరుతో గాలి జనార్థనరెడ్డి, లేపాక్షి హబ్‌ ఒప్పందాలు. ఈ చివరి దాంట్లోనైతే వెనక్కు తీసుకోవడమనే నిబంధన కూడా లేకుండానే భూములు సేకరించి ఇచ్చారు. సంస్థ లేపాక్షి హబ్‌ కోసం పది వేల ఎకరాలు ఇప్పించాలని దాని ఎం.డి గా బాలాజీ అనే వ్యక్తి ఎపిఐఐసికి లేఖ ఇచ్చారు. తర్వాత రెండు రోజులకు కంపెనీని రిజిస్టర్‌ చేసినట్టు చెబుతున్నారు. అదేరోజు దాన్ని పది కోట్ల డిపాజిట్‌ కట్టమని ఎపిఐఐసి లేఖ రాసింది. 2010 అక్టోబర్‌ నాటికి ఈ భూముల సంతర్పణ ముగిసింది. 5800 ఎసైన్డ్‌ భూములు రూ. 1.75 లక్షల చొప్పున, ప్రభుత్వ పట్టాభూములు రూ. యాభై వేల చొప్పున లెక్కగట్టి సర్వీసు చార్జీలు వగైరా తగ్గించి రూ. 119 కోట్లకు స్వాధీనం చేశారు. వాటి విలువ ఎకరా రూ. అయిదు లక్షలు వున్నట్టు రెవెన్యూ నివేదిక చెబుతున్నా తక్కువకే ఇచ్చేశారు. ఆ భూమికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ. వందల కోట్లు ఖర్చు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. అక్కడ ఏవో పనులు చేయించడానికి లేపాక్షి సంస్థ రూ. పది కోట్ల లోపు ఖర్చు చేసింది.
 

                                                         ఇందూ ప్రవేశం, సిబిఐ కేసు

2010కి వచ్చేసరికి లేపాక్షి సంస్థ ఇందూ ప్రాజెక్టుకు సంబంధించిందని అధికారికంగా వెల్లడైంది. ఆ భూములు తాకట్టు పెట్టుకుని రూ. 223 కోట్లు అప్పు తెచ్చుకున్నట్టు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఎపిఐఐసికి లేఖ రాసింది. 2009లో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం, ఆయన కుమారుడు జగన్‌ మోహన్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానంతో విభేదాలు వచ్చి దూరం కావడం మొదలైంది. 2011లో ఆయనపై సిబిఐ దర్యాప్తుకు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం దగ్గర భూములు తీసుకున్న పెట్టుబడిదారులు జగన్‌కు సంబంధించిన 'సాక్షి' ప్రచురణకర్త జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌లలో పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపించింది. ఆ క్రమంలోనే ఇందూ సంస్థ రూ.70 కోట్ల పెట్టుబడి పెట్టినందున నిందితుల జాబితాలో చేర్చింది. అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావును, ఐఎఎస్‌ శామ్యూల్‌ను కూడా నిందితులుగా పేర్కొంది (ఆ కేసులపై ఇంకా పూర్తిస్థాయి విచారణ జరగవలసే వుంది. వాన్‌పిక్‌ను, కొందరు అధికారులను ఇటీవలే తెలంగాణ హైకోర్టు తప్పించింది. కొందరి అభ్యర్థనలు తోసిపుచ్చింది. వారి విడుదల తర్వాత తమనూ తప్పించాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ తర్వాతే హైకోర్టు విచారణ చేపట్టాలని జగన్‌ తరపు న్యాయవాదులు పిటిషన్‌ వేశారు). అది మరో కథ.
 

                                                           గత ప్రభుత్వ నిష్క్రియ

లేపాక్షి భూములకు వస్తే కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తూ 2014లో ఉత్తర్వులిచ్చింది. అయితే వాటిని సవాలు చేయడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దీనిపై కేసులు నడిచినపుడు కూడా. వాటిని స్వాధీనం చేసుకోగలిగిన ఎపిఐఐసి ఎలాంటి చొరవ చూపించలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 2015లో వాటిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జప్తు చేసింది. ఈ భూములపై ఏం జరిగింది ఏపిఐఐసి ఏ వైఖరి తీసుకుందనే ప్రశ్నకు జవాబు లేదు. ఈ వ్యాసకర్త అప్పటి చైర్మన్‌ ఐఎఎస్‌ కృష్ణయ్యను ప్రశ్నించగా ఇ.డి జప్తులో వున్నందున తమకేమీ తెలియదని జవాబిచ్చారు. జగన్‌ కేసులు, ఆరోపణలున్న భూముల వ్యవహారాలలో తీవ్ర విమర్శలు చేసే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కోర్టుకు వెళ్లలేదు? ఎందుకు భిన్నంగా వాదించలేదు? అనేది ఆశ్చర్యకరమైన అంశం. ఇప్పుడు ఈ కథనం రాసిన పత్రిక కూడా 2015 నుంచి 2019కి దాటవేయడం మరో విశేషం. ఒకవేళ ఇ.డి కోర్టులో విచారణ వంటి కారణాలు చెప్పినా ప్రభుత్వం లేదా ఏపిఐఐసి ఇంప్లీడ్‌ కోసం కోరి వుండాల్సింది కదా! అలా చేసే అవకాశం వుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
 

                                                     భలే మంచి కారు చౌక బేరమూ !

ఏమైనా మనం కూడా మధ్యలో కాలాన్ని దాటేసి 2019 మార్చికి వస్తే ఇందూ ప్రాజెక్ట్సు సంస్థ దివాళా ప్రకటించింది. వివిధ బ్యాంకులకు రూ. 4531 కోట్ల బకాయి తీర్చలేనని చేతులెత్తేసింది. దేశంలో చాలామంది బడాబాబుల ఎగవేత లాంటిదే ఇదీ. హైదరాబాద్‌ లోని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) ఎదుట 2021లో ఎర్తిన్‌ ప్రాజెక్ట్సు కంపెనీ కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్టుతో కలసి రూ. 500 కోట్లు చెల్లించేలా ఆమోదం లభించింది. ఈ మొత్తంతో లేపాక్షి భూములతో సహా ఇందూ ఆస్తులన్నీ దాని చేతికి వెళతాయన్న మాట. తమాషా ఏమంటే ఇంత కారుచౌకగా వేల ఎకరాలు సంపాదించిన ఎర్తిన్‌ సంస్థ ఆ మొత్తం కూడా కట్టలేదు. కేవలం అయిదు కోట్ల డిపాజిట్‌ మాత్రమే చెల్లించింది. దాంతో 2022లో మళ్లీ ఎన్‌సిఎల్‌టి విచారణకు వచ్చింది. అప్పటి జుడీషియల్‌ అథారిటీ బి.పి.మోహన్‌ ఎర్తిన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కె.రామచంద్రరావుపై విచారణ జరపాలని తీర్పునిచ్చారు. శిక్షగా డిపాజిట్‌ రూ.అయిదు కోట్లు కూడా తిరిగి ఇవ్వరాదంటూ దివాళా ప్రక్రియ మళ్లీ మొదలెట్టాలని ఆదేశించారు. ఇదంతా ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది. వాస్తవానికి ఆ దశలో జోక్యం చేసుకోవడానికి ఎపిఐఐసికి అవకాశం వుంది. గతం నుంచి వున్న ఆరోపణల నుంచి బయిటపడేందుకు జగన్‌ ప్రభుత్వం కూడా కేసులో చేరి వుండొచ్చు. రూ. 500 కోట్లు చెల్లించి భూములు కాపాడుకొని వుండొచ్చు. అందుకు బదులుగా కేసు చెన్నై లోని ఎన్‌సిఎల్‌టికి చేరింది. ఈలోగా ఎర్తిన్‌ ప్రాజెక్ట్లులో కడప ఎంఎల్‌ఎ రవీంద్రా రెడ్డి కుమారుడైన నరేన్‌ రామానుజుల రెడ్డి చేరారు. మొదటి ప్రతిపాదన ఆమోదం పొందింది. ఇది 2022 ఏప్రిల్‌లో జరిగిన పరిణామం.
 

                                                              ప్రజల ఆస్తిని కాపాడాలి

రామోజీ గ్రూపుకు చెందిన మార్గదర్శిపై మాజీ ఎం.పి ఉండవల్లి అరుణ కుమార్‌ పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ కావాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోనేే అందుకు వ్యతిరేకంగానే 'ఈనాడు' ఈ కథనం ఇచ్చినట్టు 'సాక్షి' ఆరోపించింది. ఇవి రెండు అంశాలు. విడివిడిగా చూడటం అవసరం. ఎవరి ఉద్దేశాలు, వ్యూహాలు, రాజకీయాలు ఎలా వున్నా ప్రజల సంపదను కారుచౌకగా కట్టబెట్టే ప్రక్రియను వివిధ ప్రభుత్వాలు ఎలా అనుమతిస్తున్నాయనేది అసలు ప్రశ్న. ముఖ్యమంత్రి బంధువూ వారి పార్టీ ఎంఎల్‌ఎ కుమారుడు ఇందులో చేరడం యాదృచ్ఛికమని, ఆయన పెట్టుబడి పెట్టారే గాని సంస్థ అధినేత కాదనీ ఆయన చెబుతున్నారు. రాజకీయాలలో ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం. ఎన్‌సిఎల్‌టి చెప్పిన దివాళా ప్రక్రియ ప్రకారం చేయడం అనివార్యం అంటున్నారు. కాని ప్రభుత్వం లేదా పౌరులెవరైనా కూడా దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చని ఎన్‌సిఎల్‌టి నిపుణులే చెబుతున్నారు.ఆ భూమి ఈడీ చేతిలో వుంది గనక చేతిలోకి తెచ్చుకోవడం చాలా కష్టతరమనీ, రూ.500 కోట్లు ఇవ్వడం సమర్థినీయమేనంటూ మరో గ్రూపు లావాదేవీలను పోటీ పెట్టి చూపడం సమాధానం కాజాలదు. ఈ వార్త నిజానికి ఇంగ్లీషు పత్రికల లోనూ వచ్చింది. కనక ఇదేదో రెండు పత్రికల రెండు పార్టీల తగాదాలా మార్చే ప్రయత్నాలు కట్టిపెట్టాలి. ఒప్పందం ప్రకారం చేయకపోగా ఇతర వ్యాపారాల కోసం తెచ్చుకున్న అప్పులను ఎగవేసి, ఆ దివాళాకు లేపాక్షి భూములు తీసుకొమ్మని అధికారం ఇవ్వడం ఏం న్యాయం? ఆ చిన్నమొత్తం కూడా కట్టని వారికి బినామీగా వచ్చిన మరెవరికో ధారాదత్తం చేయడం ఏం న్యాయం? ఆ భూముల విలువలు చాలా పెరిగాయి. అందుకే అనేక అక్రమ లావాదేవీలూ జరుగుతున్నాయి. పాలక పార్టీ వారే చెబుతున్నట్టు ఈ భూములను చేతికి తెచ్చుకోవడానికి ఎలాగూ సమయం పడుతుంది గనక ఈలోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి. వందల కోట్ల విలువైన భూములను అప్పనంగా చేజిక్కించుకునే కుట్రలను అరికట్టాలి. అనేకసార్లు ఒప్పందాలను ఉల్లంఘించారని ఆఘమేఘాల మీద వ్యాపార సంస్థలపై దాడులు చేసి కూల్చివేతలకు కూడా పాల్పడిన ఈ ప్రభుత్వం ఇంత పెద్ద వ్యవహారంలో ఏమీ చేయలేమన్నట్టు మాట్లాడ్డం, నిర్లిప్తంగా సాగనివ్వడం దారుణం.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి