Jan 21,2023 07:26

        మానవ చరిత్రను పరికిస్తే ఎందరో మహామహా వ్యక్తులు సాక్షాత్కరిస్తారు. యోధులు, మేధావులు, సిద్ధాంతకర్తలూ సామ్రాట్టులు కవులూ ఇలా. వ్లాదిమిర్‌ ఇల్యిచ్‌ ఉల్యనోవ్‌ అనే అసలు పేరు గల లెనిన్‌తో పోల్చదగిన వారు కొద్దిమంది కూడా వుండరు. నూరేళ్ల కిందట అస్తమించిన ఆ మహావ్యక్తి మార్క్స్‌ సిద్ధాంతాన్ని మరింత ఆధునీకరించడమేగాక అమలు చేసి తొలి విప్లవం తీసుకువచ్చిన ధీశాలి. మార్క్స్‌, ఎంగెల్సుల బోధలను తన కాలానికి అనుగుణంగా సంపన్నం చేయడమే గాక ప్రపంచపు తొలి సామ్యవాద దుర్గంగా సోవియట్‌ యూనియన్‌ను స్థాపించి, తొలిగండాల నుంచి దాన్ని కాపాడి శక్తిగా మలచిన వ్యూహకర్త. దోపిడీ రాజ్యాలకు ప్రత్యామ్నాయంగా శ్రామిక రాజ్యానికి అంకురార్పణ చేసిన అనితర సాధ్యుడు. మార్క్సిస్టు సిద్ధాంత సారాన్ని, చరిత్ర గమనాన్ని సవ్యంగా అర్థం చేసుకుని ఖచ్చితమైన సైద్ధాంతిక రాజకీయ వ్యూహాలు అనుసరించగలిగిన అగ్రగణ్యుడు. ఇల్యా నికోలావిచ్‌, మరియా అలెగ్జాండ్రియా బ్లాంక్‌ దంపతులకు 1870 ఏప్రిల్‌ 22న లెనిన్‌ జన్మించాడు. తండ్రి స్వయంకృషితో స్కూళ్ల డైరెక్టరుగా ఎదిగారు. తల్లి పిల్లలను ప్రేమగా తీర్చిదిద్దారు. లెనిన్‌ అన్నయ్య అలెగ్జాండర్‌ విద్యార్థిగా వున్నప్పుడే జార్‌ చక్రవర్తిపై హత్యా ప్రయత్నం చేసి ఉరికంబమెక్కాడు. అన్నను ఎంతో ప్రేమించే లెనిన్‌ అన్న సాహసాన్ని స్మరిస్తూనే ఆ మార్గం సరైంది కాదని తెలుసుకున్నాడు. కజాన్‌ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ప్రగతిశీల ఉద్యమాలతో సంబంధం పెరిగింది. మార్క్సిస్టు సాహిత్యంతో పరిచయమేర్పడింది. అప్పటికి రష్యాలో ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న ప్లెఖనోవ్‌ వంటివారి లోపాలు కూడా తెలుసుకోగలిగాడు. కజాన్‌లో విద్యార్థిగా పోరాడుతున్నప్పుడే ఒక పోలీసు అధికారి 'నీవు గోడను ఢకొీంటున్నావు' అంటే 'కానీ అది కూలిపోవడానికి సిద్ధంగా వున్న గోడ' అని ధైర్యంగా జవాబిచ్చిన ధైర్యశాలి.
పందొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అత్యున్నత దశకు చేరింది. ఆ వ్యవస్థ అనేక నూతన లక్షణాలు సంతరించుకుంది. 'సామ్రాజ్యవాదం-పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ' (1916) అనే తన మహత్తర గ్రంథంలో లెనిన్‌ తొలిసారిగా ఈ లక్షణాలను క్రోడీకరించాడు. ఈ దశలో పెట్టుబడిదారీ విధానం గుత్త స్వభావం సంతరించుకుంటుంది. దేశాల ఆర్థిక వ్యవస్థల్లో గుత్త సంస్థలే కీలక పాత్ర వహిస్తాయి. శతాబ్ది చివరికి అమెరికా చమురు వ్యాపారంలో 90 శాతం రాక్‌ఫెల్లర్‌ చేతుల్లో వుంది. మోర్గాన్‌కు చెందిన స్టీల్‌ కార్పొరేషన్‌ మూడింట రెండు వంతులు ఉక్కు పరిశ్రమపై అదుపు కలిగివుంది. గుత్తాధిపత్యం సామ్రాజ్యవాద దశ మొదటి లక్షణం. సరుకుల ఎగుమతి బదులు పెట్టుబడి ఎగుమతి రెండో లక్షణం. 1914 నాటికి బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీల విదేశీ పెట్టుబడులు 2000 కోట్ల ఫ్రాంకుల వరకు వున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలగలసిన ఫైనాన్స్‌ పెట్టుబడి ప్రాబల్యం పెరగడం మూడో లక్షణం. నాలుగో లక్షణం వివిధ దేశాల గుత్తసంస్థలు చేతులు కలిపి గొలుసుకట్టుగా ఏర్పడ్డం చివరి లక్షణం ఈ క్రమంలో అగ్రస్థాయి పెట్టుబడిదారీ దేశాలు ప్రపంచ భూభాగాన్ని తమ మధ్య పంచుకోవడం ఆ పంపకాలలో వాటాలు పెంచుకోవడానికి పునర్విభజనకు యుద్ధాలు సృష్టించడం. ఇవీ లెనిన్‌ వివరించిన అంశాలు. వీటి ఆధారంగా తమ దేశంలో కర్తవ్యాలను వాటిని సాధించే రాజకీయ శక్తిగా కార్మికవర్గ పార్టీని ఆయన అంకురార్పణ చేశాడు. ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలోనే రష్యా ప్రపంచ విప్లవ శక్తులకు ప్రధాన ప్రేరణ అయింది. 1898లో రష్యన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఏర్పడింది. 1900లో తొలి విప్లవ పత్రిక 'ఇస్రో' ప్రచురణ ప్రారంభమైంది. 1903లో పార్టీ రెండవ మహాసభలో పార్టీ నాయకత్వానికి జరిగిన ఎన్నికలలో లెనిన్‌ భావాలను బలపరచేవారు అధికంగా ఎన్నికైనారు. తప్పుడు సిద్ధాంతాలను బోధించేవారు ఓడిపోయారు. వీళ్లనే బోల్షివిక్‌ (మెజారిటీ), మెన్షివిక్‌ (మైనారిటీ) అన్నారు. ఈ మహాసభ జార్‌ చక్రవర్తి కూల్చివేతతో సహా ప్రపంచంలో తొలి విప్లవాత్మక కార్యక్రమాన్ని ఆమోదించింది.
 

                                                                     తొలి రిహార్సల్‌పై పాఠాలు

1905 జనవరిలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ కార్మికులు సమ్మె చేశారు. జార్జి గపన్‌ అనే క్రైస్తవ మతగురువు బోధనలతో జనవరి 9 ఆదివారం నాడు లక్షన్నర మంది కార్మికులు జార్‌ నివసించే వింటర్‌ ప్యాలెస్‌కు ప్రదర్శనగా వెళ్ళారు. జార్‌ రెండవ నికోలస్‌ సైన్యం ఇష్టానుసారం జరిపిన కాల్పులలో వెయ్యి మంది అక్కడికక్కడే చనిపోయారు. అదే 'రక్తసిక్త ఆదివారం'గా మిగిలిపోయింది. జార్‌ చక్రవర్తి పైన, ప్రభువుల కరుణపైన భ్రమలు పటాపంచలయ్యాయి. జూన్‌ నెలలో యుద్ధనౌక ''పొటాంకిన్‌'' లోని నావికా సిబ్బంది తిరుగుబాటు చేశారు. వారిని అణచేందుకు పంపిన సైనికులు కూడా కాల్పులు జరిపేందుకు నిరాకరించారు. 1905 డిసెంబర్‌లో కార్మికులు సాయుధ తిరుగుబాటు చేయగా అది విఫలమైంది. అయినా ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ముఖ్యంగా కార్మికులలో ఐక్యత అవసరాన్ని చెప్పింది. ''1905 డ్రెస్‌ రిహార్సల్‌ లేకపోతే 1917 అక్టోబర్‌ విప్లవం అసాధ్యమై వుండేది'' అని లెనిన్‌ అన్నాడు. 20వ శతాబ్ది ప్రారంభం నాటికే వలసల కోసం అగ్రరాజ్యాల మధ్య ఘర్షణలు పరాకాష్టకు చేరుకున్నాయి. 1914 ఆగస్టు 1న మొదటి ప్రపంచ యుద్ధం ప్రజ్వరిల్లింది. అవకాశవాద కార్మిక నేతలు తమ తమ దేశాలలో పాలకులను బలపర్చే విధానం తీసుకున్నారు.
         1914లో నెదర్లాండ్స్‌లో వున్న లెనిన్‌ కార్మికోద్యమానికి నూతన విప్లవ కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు. ఇది సామ్రాజ్యవాద యుద్ధమంటూ అవకాశవాద పోకడలను ఖండించాడు. సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో వేర్వేరు దేశాలు వేర్వేరు దశల్లో ఉన్నందువల్ల అన్ని చోట్లా ఒకేసారి సోషలిస్టు విప్లవం రావడం సాధ్యం కాదని చెప్పారు. పెట్టుబడిదారీ గొలుసులో బలహీనంగా వున్న లింకును తెంచవచ్చునన్నాడు. ఈ పోరాటంలో కార్మికవర్గం కొత్త మిత్రులను కూడగట్టుకోవాలి. రైతాంగం అప్పటికే మిత్రపక్షంగా మారిపోయింది. ఇక వలస దేశాల ప్రజలు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంతో కార్మికవర్గం భుజం కలపడం అవసరమని ఆయన ఉద్బోధించారు. ఉద్యమాభివృద్ధికి పత్రిక, పార్టీ పటిష్టతకు కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు అవసరమని నొక్కి చెప్పారు. అతివాద దుస్సాహసిక చర్యలను సరికాదని స్పష్టం చేస్తూ ప్రజలతో పాటు నడిచారు.
          మిగిలిన దేశాలతో పోలిస్తే యుద్ధానికి అంతగా సిద్ధంగాని రష్యాలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు తలెత్తాయి. ఆహార కొరత తీవ్రంగా ఉంది. 1917 నాటికి ప్రజల అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరింది. ఆ జనవరిలో లక్షలాది మంది కార్మికులు అనేక సమ్మెలు చేశారు. ప్రజలు అంతకంతకు వెల్లువగా కదిలారు. మార్చి 12 నాటికి పెట్రోగ్రాడ్‌ తిరుగుబాటుదారుల స్వాధీనమైంది. మార్చి 15న ఒక తాత్కాలిక ప్రభుత్వమేర్పడింది. ఆ ప్రభుత్వంలో వామపక్ష పదజాలం వాడే కెరెన్‌స్కీ అనే ఒకే ఒక్క బూటక 'ప్రజాతంత్ర'వాది చోటు సంపాదించాడు. ఆ రోజునే రైల్వే కార్మికులు జార్‌ రైలును నిలిపివేసి అధికారం వదులుకుంటున్నట్లు సంతకం చేయించారు. ఆవిధంగా జార్‌ నిరంకుశ పాలన సమాప్తమైంది. లెనిన్‌ చెప్పినట్లు యుద్ధం అంతర్యుద్ధంగా మార్చబడింది. రష్యాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. వివిధ స్థాయిలలో కార్మిక, కర్షక ప్రతినిధులతో సోవియట్లు అనేవి ఏర్పడ్డాయి. 1917 ఏప్రిల్‌లో స్వదేశం చేరిన లెనిన్‌ 'సర్వాధికారాలు సోవియట్లకే! తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతు లేదు' అని నినాదమిచ్చారు.
విప్లవ విజయం
         అక్టోబర్‌ 25, 26 తేదీల (కొత్త తేదీ నవంబర్‌ 7) మధ్య తెల్లవారుతుండగా సైనికులు, నావికులు, చక్రవర్తుల నివాస భవనమైన వింటర్‌ ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధులను బందీలుగా పట్టుకున్నారు. మరో మూడు గంటల తర్వాత కార్మిక, కర్షక సోవియట్ల మహాసభ రష్యాను సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌గా ప్రకటించింది. రాజ్యాధికారం ప్రజల హస్తగతమైంది. మానవాళి చరిత్ర మహత్తరమైన మలుపు తిరిగింది. జార్‌ చక్రవర్తి కూల్చివేత అనంతరం కూడా లెనిన్‌ ఓపికతో అనేక వ్యూహాలు అనుసరించారు. అయితే తాత్కాలిక ప్రభుత్వం చేతుల్లోంచి సోవియట్లకు అధికారం బదలాయించేందుకు జరిగిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాకే విప్లవం అవసరమైంది. దానిపై పెట్టుకున్న ఆశలు వమ్మయినందువల్లనే ప్రజలు విప్లవాన్ని సంపూర్ణంగా బలపరిచారు. నవంబర్‌ 7న 2 కోట్ల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే సోవియట్ల ప్రతినిధులు లెనిన్‌ నాయకత్వాన నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సోవియట్‌ ప్రభుత్వం మొదటగా శాంతి కోసం విజ్ఞప్తి డిక్రీ ఆమోదించింది. భూస్వాములకు, చర్చిలకు సంబంధించిన పొలాలను, పశుసంపదను ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకునే మరో డిక్రీ, 8 గంటల పనిదినంపై ఇంకో డిక్రీ ఆమోదించింది.
           సోవియట్‌ రష్యా విప్లవ విజయానంతరం కూడా అనేక అగ్నిపరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. కూలిపోయిన కెరెన్‌స్కీ ప్రభుత్వం విప్లవ వ్యతిరేక ప్రతీఘాత శక్తులను ఎగదోసింది. వైట్‌ గార్డులనే పేరిట వారు గ్రామాల్లో చేరి తీవ్ర బీభత్సకాండ సృష్టించారు. వాటన్నిటి మధ్యనా లెనిన్‌ ఎంతో చాకచక్యంగానూ ఆర్థికాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాడు. 1918 జులైలో సోవియట్‌ తొలి రాజ్యాంగం రూపొందింది. 1918 మార్చిలో ఫ్రెంచి, బ్రిటిష్‌, అమెరికన్‌ సేనలు రష్యాలో దిగాయి. ఏప్రిల్‌ 4,8 తేదీలలో జపాన్‌, అమెరికా సేనలు కూడా ప్రవేశించాయి. ఈ పరిస్థితులలో విప్లవాన్ని సంరక్షించుకునేందుకై కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు రష్యాలోని కార్మికులు, రైతులు ఆయుధాలు చేబట్టి కదిలారు. స్వల్ప వ్యవధిలోనే 50 లక్షల మందికి పైగా ఎర్రసైన్యంలో చేరారు. ''అన్నీ యుద్ధ రంగానికే. అంతా విజయానికే'' అని కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన నినాదంతో ప్రజలు పోరాడారు. శౌర్య ప్రతాపాలతో త్యాగాలతో పోరాడి అంతర్గత, బాహ్య శత్రు శక్తులను ఓడించగలిగారు.
 

                                                                      అహరహం మార్గదర్శి

తర్వాత సోషలిజం నిర్మాణంలో సాగిన అంతర్యుద్ధాలు, బయిటి యుద్ధాలు ఇదంతా మరో అధ్యాయం. తమ దేశంతోనే ఆగక లెనిన్‌ ఇండియాతో సహా దేశదేశాల కార్మిక వర్గ పోరాటాలకు ఊతమిచ్చాడు. ప్రాచ్య దేశాల విశ్వవిద్యాలయంలో భారతీయ విప్లవకారులకు కూడా తర్ఫీదునిచ్చాడు. లెనిన్‌ శ్రామికవర్గ అంతర్జాతీయతను అమలు చేసిన ప్రపంచ నాయకుడు. తర్వాత స్టాలిన్‌ ఆ స్థానంలో నాయకత్వం చేపట్టాడు. ఒక వామపక్ష తీవ్రవాద యువతి హత్యాప్రయత్నం కారణంగా లెనిన్‌ తీవ్రంగా గాయపడినా...అక్కడ కూడా అధ్యయనం కొనసాగించాడు. దానివల్ల అలసిపోతున్నారని స్టాలిన్‌ కోప్పడితే డాక్టర్ల షరతులు పాటించబోనని ఆయన సరదాగా పోట్లాడేవాడు. విప్లవోద్యమ సహచరులకు వైద్య సహాయం తదితర అంశాలపై నాయకత్వానికి తరచూ లేఖలు రాసేవాడు. చివరకు 1924 జనవరి 21 లెనిన్‌ కన్నుమూశాడు. అప్పటి నుంచి అది 'లెనిన్‌ డే' అయింది. ఆయన సతీమణి కృపస్కయా కూడా మొదటి నుంచి విప్లవోద్యమ నాయకత్వంలో ఆయనతోపాటు నడవడమేగాక ఆయన మరణానంతరం కూడా సోవియట్‌ మంత్రిగా కొనసాగారు.
           విప్లవ విజయానికి దాన్ని కాపాడుకోవడానికి ప్రపంచంలో భిన్న వర్గాల, రాజ్యాల బలాబలాలు సరైన రీతిలో అంచనా కట్టి తగు ఎత్తుగడలు అనుసరించడానికి లెనిన్‌ జీవితమే ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. ఆయన బహుముఖ ప్రజ్ఞ, అపార అధ్యయనం, నిశితమైన సైద్ధాంతిక రచనలు మరెవరితోనూ పోల్చలేనివి. ప్రజలకే అధికారం అందించడం, వారితో మమేకం కావడం ఆయన ప్రధాన సూత్రం. గోర్బచేవ్‌ వంటి వారి కారణంగా విచ్ఛిన్న చర్చలు మొదలైనాక మొదట శత్రువులు లెనిన్‌ విగ్రహాలనే కూల్చడం యాదృచ్ఛికం కాదు. కానీ వారు లెనిన్‌ వారసత్వాన్ని ఎప్పటికీ కూల్చలేకపోయారు. 1991 ఆగష్టులో సోవియట్‌ విచ్ఛిన్నత వరకూ దారితీసిన పరిణామాలపై అనేక గుణపాఠాలు, చారిత్రిక సమీక్షలు వెలువడ్డాయి. అవేమైనా లెనినిజం నుంచి పక్కకు తొలగిన పర్యవసానాలు తప్ప మార్క్సిజం, లెనినిజం మౌలికతను వమ్ము చేసేవి కావవి. మా తప్పులను ఆత్మ విమర్శ చేసుకుంటే శత్రువులు నవ్వొచ్చు గాని మేము మాత్రం అది అవసరమనే భావిస్తాం. తప్పులు జరిగితే దిద్దుకుంటాం...అని ఒకటికి నాలుగు సార్లు ఢంకా బజాయించి చెప్పిన లెనిన్‌ స్ఫూర్తి ఈనాడు మనకు మరింత అవసరం. అవకాశవాద పోకడలపై పోరాటం, ఆశయాల పట్ల అవగాహన ఆచరణలో అప్రమత్తత ఇదే లెనిన్‌ మార్గం. నేటి పరిస్థితులలో సవాళ్లలో అనేకం మనకు లెనిన్‌ రచనల్లో యథాతథంగా కనిపిస్తాయి. ఎందుకంటే శ్రీశ్రీ అన్నట్టు ప్రపంచమనే కావ్యానికి ప్రతిపదార్థం లెనిన్‌. ఈ 99వ వర్ధంతి రోజున ఆయనకదే మరోసారి నివాళి.

తెలకపల్లి రవి