
కేరళ ఆర్టీసికి అక్కడి వామపక్ష ప్రభుత్వం ఈ అయిదు సంవత్సరాల వ్యవధిలో రూ. 6,695 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. జూన్ 13న ఆర్టీసీ కార్మికుల జీతాల కోసం రూ.145 కోట్లు విడుదల చేసింది. ఆర్టీసీలో 37 వేల మంది పెన్షనర్లు వున్నారు. ఈ పెన్షన్‌ను కూడా ప్రభుత్వ ఖజానా నుండే చెల్లిస్తున్నారు.
కేరళ చిన్న రాష్ట్రం. కేరళ ఆర్టీసిలో 6300 బస్సులు, 30 వేల మంది సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసికి ప్రాధాన్యతనిచ్చి సహకారాన్ని అందిస్తున్నది. ఇటీవల కొందరు సోషల్ మీడియాలో దేశంలోని ఏ ఆర్టీసిలోనూ కోవిడ్ కాలంలో జీతాలు ఇవ్వలేదని, కేవలం విలీనం అయిన ఎ.పి.యస్.ఆర్టీసి లోనే వేతనాలు చెల్లించారని అదేపనిగా పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఎ.పి.యస్.ఆర్టీసితో పాటు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అన్ని ఆర్టీసిలలోను దాదాపు ప్రభుత్వాలే వేతనాలు చెల్లించాయి. ప్రభుత్వంలో విలీనం కాకుండా ఆర్టీసి కార్పొరేషన్లుగా నడుస్తున్న చోట్ల కూడా అనివార్యంగా ప్రభుత్వాల ద్వారా వేతనాలు చెల్లించారు. ఈ వేతనాల చెల్లింపులో ఒక్కో నెల జాప్యం జరిగి వుండవచ్చు.
కేరళ ఆర్టీసి ఉద్యోగుల వేతనాలకు, పెన్షన్లకు ఆర్టీసి సంస్థ ఆదాయం సరిపోని కారణంగా ప్రతి నెలా ప్రభుత్వ ఖజానా నుండి రూ.50 కోట్ల వరకు చెల్లిస్తున్నది. ఈ విధంగా ప్రభుత్వంపై ప్రతి నెలా ఆధారపడకుండా ఆర్టీసి వనరులు సమకూర్చు కోవాలని అక్కడ రవాణా మంత్రి చెప్పినట్లు వచ్చిన వార్తను మార్చి ... కేరళ ఆర్టీసికి అక్కడ ముఖ్యమంత్రి పావలా కూడా ఇవ్వను అని చెప్పినట్లు ఇక్కడ అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. వారికి సమాచారం తెలిసి కూడా ఈ అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. వై.యస్.ఆర్. ప్రభుత్వం 2019 మే నెలలో... కేరళ ఆర్టీసికి చేస్తున్న సహాయంపై మన రాష్ట్ర రవాణా అధికారులతో కూడిన బృందాన్ని పంపించి అధ్యయనం చేయించింది.
2022 సంవత్సరం బడ్జెట్‌లో 700 సి.ఎన్.జి బస్సుల కొనుగోలుకు కేేరళ ఆర్టీసికి వామపక్ష ప్రభుత్వం సాయంగా అందించింది. దీనికి అయిన ఖర్చు రూ.455 కోట్లు. కేరళ ఆర్టీసి నష్టాల నుండి బయటపడి ఆదాయాన్ని పెంచుకొనే పథకంలో భాగంగానే ఇది జరిగింది. కొత్త సి.ఎన్.జి.బస్సుల వల్ల ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది.
ఆర్టీసితో పాటు ఇతర ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు కూడా వామపక్ష ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. కేరళ ఆర్టీసికి ఆయిల్ కొనుగోలు ఇతర అంశాలపై సబ్సిడీని ఇస్తున్నది. బ్యాంకులకు కేరళ ఆర్టీసి చెల్లించవలసిన బకాయిలన్నింటినీ ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఐదేళ్ళ నుండి బస్సుల కొనుగోలుకు నిధులు కేటాయిస్తున్నారు. కొత్త బస్సులు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా స్విప్ట్ (ఎస్.డబ్ల్యు.ఐ.ఎఫ్.టి) పథకం ద్వారా రూ.1000 కోట్లు కేరళ ఆర్టీసికి బడ్జెట్‌లో సమకూర్చారు. దీనితో పాటు డిపోల అభివృద్ధికి రూ.30 కోట్లు, ప్రయాణీకుల సౌకర్యాలకు మరో రూ.20 కోట్లు, అలాగే డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చడానికి రూ.50 కోట్లు కేటాయించారు. కె.యస్.ఆర్టీసి తన టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకుగాను 50 డీజిల్ ఔట్‌లెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందించింది. వీటిని కేరళ ఆర్టీసి యాత్రా ఇంధనాలు అంటారు. అవసరం అయిన సందర్భంలో కేరళ ఆర్టీసి చేసే అప్పులకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ లభిస్తున్నది. తమిళనాడు ఆర్టీసికి కూడా ఈ విధమైన సహకారాన్ని వివిధ రూపాలలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంత బస్సులకు ప్రభుత్వ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. 2022 బడ్జెట్‌లో తమిళనాడు ఆర్టీసికి రాష్ట్ర ప్రభుత్వం 2722 బస్సుల కొనుగోలుకు సహకారాన్ని అందించింది. తమిళనాడు ఆర్టీసిలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ఆర్టీసి ఉద్యోగులకు అమలవుతున్నది.
- సిహెచ్. సుందరయ్య,
ఎస్.డబ్ల్యు.ఎఫ్ ప్రధాన కార్యదర్శి.