Mar 03,2023 07:42

ట్విట్టర్‌, ఆపిల్‌, మెటా, అమెజాన్‌ వంటి ఐటీ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఒక్క అక్టోబర్‌ నెలలోనే సిలికాన్‌ వ్యాలీలో 45 వేల మంది ఉద్యోగులను తొలగించారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా తొలగింపునకు గురైన ఉద్యోగుల సంఖ్య 1.5 లక్షల మార్కును దాటి రెండు లక్షల దిశగా వెళ్తోంది. ఐటి కంపెనీల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఎందుకు జరుగుతోంది? సంస్థలు చెప్తున్న' కాస్ట్‌ కటింగ్‌' కారణాలు నిజమేనా? అదుపు లేకుండా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? నియంత్రణ లేని ద్రవ్యోల్బణం...ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందా? విదేశాల్లో జరిగే లే ఆఫ్స్‌ మన దేశంపై ప్రభావాన్ని చూపుతాయా?....అనేది పరిశీలిద్దాం.
        లే ఆఫ్స్‌ భారత ఐటీ రంగాన్ని కూడా చుట్టు ముడుతున్న సమయంలో....'లే ఆఫ్స్‌ వాంఛనీయం కాదు. కానీ ఆపలేము' అని ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ గోపాలకష్ణన్‌ చెప్పారు. ఇంతకు ముందు ఉద్యోగ భద్రతపై ఒక అంచనా ఉండేది. ఇప్పుడు ఉన్నట్టుండి పింక్‌ స్లిప్‌ జారీ అయిపో తోంది. కంపెనీలు అర్థం లేని కారణాలు చెప్పి ఇచ్చిన ఆఫర్లను వెనక్కు తీసుకుంటున్నాయి. మన దేశానికి చెందిన వ్యక్తి, అమెరికాలో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన ఉద్యోగి లింక్డ్‌ ఇన్‌లో పోస్ట్‌ చేస్తూ..'20 సంవత్సరాలకు పైగా సంస్థకు విశ్వాసంగా పనిచేసి నా తొలగించారు' అని బాధను వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కంపెనీ యాజమాన్యాల్లో మాంద్యం భయం పెరిగింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో క్షీణిస్తున్న స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) ఆధారంగా మాంద్యాన్ని నిర్ణయిస్తున్నారు. ఆర్థిక మాంద్యం లోకి వెళ్లడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న దేశాలు- అమెరికా, కెనడా, బ్రిటన్‌, జర్మనీ, జపాన్‌, సౌత్‌ కొరియా, యూరప్‌ దేశాలు. అయితే ఏ ఒక్క రంగమో కుంటుపడితే అది మాంద్యంగా చెప్పలేం. ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలన్నీ మందకొడిగా సాగుతుంటేనే మాంద్యంగా చెప్పవచ్చు.
 

                                                                 భారత్‌ ఐటీ కంపెనీలపై ప్రభావం...

భారత్‌ ఐటీ రంగంలో కన్సల్టెన్సీ సేవలే అధికం. గ్లోబల్‌ ఔట్‌ సోర్సింగ్‌ మార్కెట్‌లో భారత్‌ ఐటీ కంపెనీల వాటా 56 శాతం. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో సేవా రంగంలో పనిచేసే వారికి చెల్లించాల్సిన జీతాలు అధికంగా ఉంటాయి. ఆ కారణంగా పాశ్చాత్య దేశాలు భారత్‌లో పనిచేసే ఐటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని కన్సల్టెన్సీ సేవలు పని జరిపిస్తాయి. ఆ విధంగా విదేశీ ప్రాజెక్టుల మీద ఆధారపడే ఐటి కంపెనీలే భారత్‌లో అధికం. అలాంటి పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలలో కనిపిస్తున్న ఆర్థిక మాంద్య ధోరణి భారత్‌ కంపెనీలలో ఆందోళనను కలిగిస్తోంది. భారత్‌ ఐటీ కంపెనీలకు ఎక్కువగా ప్రాజెక్ట్స్‌ వచ్చేది అమెరికా, యూరోప్‌ దేశాల నుండే. రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత విదేశాలనుండి భారత్‌ కు ప్రాజెక్ట్స్‌ తగ్గిపోయాయి.ఆర్థిక సంక్షోభం వల్ల కూడా ప్రాజెక్టులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఖర్చును తగ్గించుకునే నిమిత్తం ఐటీ కంపెనీలు చర్యలు మొదలుపెట్టాయి. కొత్త నియామకాల శాతం తగ్గడం, జీతాల పెంపును వాయిదా వేయడం, ప్రమోషన్‌ ఇచ్చి కూడా జీతాలను పెంచకపోవడం, వేరియబుల్‌ పే ఇవ్వకపోవడం లేక వాయిదా వెయ్యటం.... ఉద్యోగం నుండి తొలగించడానికి మరో పార్శ్వం. గత ఆరు నెలలుగా భారత్‌ స్టార్ట్‌ అప్‌ కంపెనీల మీద ఈ ప్రభావం ఎక్కువగా పడింది. సంస్థ నిర్వహణకు అవసరమయ్యే ద్రవ్యా న్ని సమకూర్చుకోవడానికి ప్రాధాన్యతని స్తున్నాయి. 2022లో 1800 మందిని భారత్‌ స్టార్టప్‌ కంపెనీలు ఉద్యోగాల నుండి తొలగించాయి.
 

-ఎస్‌విఎం. నాగ గాయత్రి,
ఫోన్‌ : 9440465797