Oct 05,2023 17:24

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : కోర్టులో పిటిషన్లకు రూపాయి స్థానంలో 20 రూపాయలు స్టాంపు వేయాలని బార్‌ కౌన్సిల్‌ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్తిపాడు కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ప్రతిపాడు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిట్టంశెట్టి పుల్లయ్య మాట్లాడుతూ.. కోర్టులో రోజు వందల సంఖ్యలో న్యాయవాదులు తమ కక్షిదారుల తరఫున పిటిషన్లు దాఖలు చేస్తారన్నారు. పిటిషన్‌లపై ఈనెల ఐదు నుండి రూపాయి స్టాంపుకు బదులు 20 రూపాయలు స్టాంపులు అతికించాలని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఉత్తర్వులు జారీ చేయడం దురదృష్టకరమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ తీర్మానం కక్షిదారులను, న్యాయవాదులను ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో వకాలత్‌ పై అతికించే వెల్ఫేర్‌ స్టాంపు 30 రూపాయలు ఉండగా, మన రాష్ట్రంలో 100 రూపాయలు ఉందన్నారు. బార్‌ అసోసియేషన్ల ఆమోదం లేకుండా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు చలంకూరి రామకృష్ణ, కార్యదర్శి బి.మధుబాబు, న్యాయవాదులు ఆర్‌ వెంకట్రావు, బి.చలం, రాయి శ్రీనివాసరావు, రాజాల చిట్టిబాబు, బండారు నరసింహారావు, కంద నానాజీ, కిలపర్తి శ్రీనివాస్‌, ఆర్‌ వెంకట్రెడ్డి, గెడ్డం కామేష్‌, పదివేల నాగేంద్ర, అశోక్‌, మంజూష, ప్రసన్న ఉన్నారు.