Jul 25,2023 07:26

          ప్రభుత్వం నెత్తికెత్తుకున్న విద్యారంగ 'సంస్కరణ'లు సర్కారీ బడి చదువులను చట్టుబండలు చేశాయి. మార్కెట్‌ సరుకుగా మారిన ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యను కొనుక్కోలేని బడుగు, బలహీన, పేద పిల్లలకు ప్రభుత్వ బడులే దిక్కు. కాగా ఆ అవకాశాన్నీ దూరం చేస్తోంది ప్రభుత్వం. వ్యాపార, ఏకరూప విద్య లక్ష్యంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని దేశంపై రుద్దగా, అన్ని ఇతర రాష్ట్రాల కంటే ముందు ఇక్కడే అమలవుతోంది. పర్యవసానం బడుల మూత. 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే సందర్భంలో ఒక్కటంటే ఒక్క స్కూలు మూతబడినా నిలదీసి ప్రశ్నించమంది ప్రభుత్వం. జరిగిందేమిటి? 1,2.. రెండు తరగతులే ఉండటంతో స్కూళ్లకు విద్యార్థులు రావట్లేదు. ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఒక టీచరే ఉండటం పిల్లలు రాకపోవడానికి మరొక కారణం. గతంలో పది మంది పిల్లలున్న స్కూళ్లల్లో ఇప్పుడు ఒక్కరూ లేరు. స్కూళ్లల్లో పిల్లలు లేరు కాబట్టి వాటిని మూసేయాలని ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 118 ప్రైమరీ స్కూళ్ల మూతకు సిద్ధమైంది ప్రభుత్వం. ఎయిడెడ్‌ స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగించండి, లేదంటే ఉపాధ్యాయులను సరండర్‌ చేసి, స్వంతంగా మీరే నడుపుకోమన్నందున వంద ఎయిడెడ్‌ పాఠశాలు బంద్‌ పెట్టే దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ బడులకు తాళాలు సామాజిక న్యాయానికి ఉరితాళ్లు.
           విద్యా వ్యాపారానికి చిరునామా ఇంటర్‌ విద్య. గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్నది ఎస్‌టి, ఎస్‌సి, బిసి, మైనార్టీ పిల్లలే. వారికి ఉచిత టెక్ట్స్‌ బుక్స్‌్‌ ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) రెండేళ్లపాటు పుస్తక ప్రసాదం పేరిట ఇచ్చి నిరుడు చేతులెత్తేసింది. సహాయం చేయాలని ఈ ఏట ప్రభుత్వం టిటిడిని అభ్యర్థించినా స్పందన శూన్యం. మార్కెట్‌లో అమ్మకాల కోసం తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలను ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు కొనుక్కోవాల్సిన పరిస్థితి. కెజిబివి, రెసిడెన్షియల్‌, వెల్ఫేర్‌ కళాశాలల్లో పుస్తకాలు ఉచితం అంటున్నా అన్ని పుస్తకాలూ అందుబాటులో లేవు. ఏవో కొన్ని ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. యూనిఫారాలు, కిట్లు, అన్నీ అంతే. నాసిరకం వంటి అక్రమాలు సరేసరి. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కొలవడానికి ఇంతకంటే కొలబద్దలేం కావాలి? ఆంగ్ల భాషలో విద్యా బోధన, సిబిఎస్‌ఇ సిలబస్‌, అంతర్జాతీయ స్థాయి కోర్సులు, జగన్‌ మామ భరోసా...ఇవన్నీ శుష్క వాగ్దానాలుగా విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు.
            విద్యారంగంలో మార్పులపై ప్రభుత్వానిది ఏకపక్ష ధోరణి. నిపుణులతో, ఉపాధ్యాయ సంఘాలతో, అధికారులతో సంప్రదింపులు నాస్తి. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ సంస్థ ఇచ్చే కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లిచ్చారు. బైజూస్‌ కంటెంట్‌ విద్యార్థులకు ఏ మేరకు ఉపయోగపడుతుందో కనీస మాత్రం అభిప్రాయాలు తీసుకోలేదు. వచ్చే ఏడాది బైజూస్‌ ఉచితంగా కంటెంట్‌ ఇస్తుందో లేదో ప్రభుత్వం ఎంత చెల్లించాలో తెలీదు. స్కూళ్ల విలీనంపైనా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ల చందం. స్వయాన 70 మంది స్వంత పార్టీ ఎంఎల్‌ఎలు వ్యతిరేకించినా లక్ష్యపెట్టలేదు. చివరికి విద్యాహక్కు చట్టానికి సైతం తమకనుకూలంగా సవరణలు చేశారు. అన్నింటికీ 'అమ్మఒడి'నే పరిష్కారంగా చెపుతున్నారు. దానికీ కొన్ని కోతలు పెడుతున్నారు. కోవిడ్‌, ఆపై స్కూళ్ల మూత వలన నిరుడు 1.73 లక్షల మంది పిల్లలు మధ్యలోనే బడి మానేశారు. ఎ.పి.లో సెకండరీ లెవెల్‌లో డ్రాపవుట్స్‌ రేటు 16.7 శాతంగా కేంద్రం పేర్కొంది. అదేమీ తక్కువ సంఖ్య కాదు. భావి భారత నిర్మాణానికి అడ్డంకి. రాష్ట్రంలో 50 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడైంది. నాలుగేళ్లయినా ఒక్క డిఎస్‌సి వేయలేదు. 'నాడు-నేడు' వంటి కొన్ని కార్యక్రమాలు తప్ప సర్కారీ స్కూళ్లు సాధికారమైంది లేదు. ఈ వాస్తవాలతో ప్రభుత్వ నినాదాలైన 'ప్రైవేటు బళ్లతో పోటీ, పెత్తందారీ తనం బద్దలు' వాగాడంబరమేనని అర్థమవుతుంది. విద్యను మరింత కార్పొరేటీకరించే కేంద్ర నూతన విద్యావిధానాన్ని విడనాడి, ప్రత్యామ్నాయాన్ని అమలు చేస్తేనే విద్య సార్వజనీనత సిద్ధిస్తుంది. విద్యాహక్కు కొంతైనా సాకారమవుతుంది.