Feb 26,2023 07:47

వదిలించుకోవాలి కొన్నింటిని
నీటి బిందువుల ప్రతిబింబాలని
ఏ ముక్కనో ఆకసానిది
రాలి పడింది నా ముంగిట్లో
వాకిలి తలుపులేసేప్పుడు
కొంచెం కంప కొట్టి పోయింది గాలి
చెల్లాచెదురుగా...
వర్షం కిటికీ వరకే కురిసింది
ఆవల ఆమె ముఖం బయటికి చూస్తోంది
కాగితం పడవల జ్ఞాపకాలలో
బాల్యాన్ని కొంగున కట్టుకొని
జడ వేసుకుంటుంది
వాన నీళ్లు కాలువగా.. పాయలుగా..
లయ తప్పిన శరీరాలేమో
గొణుక్కుంటూ పోతున్నాయి
కనికరం లేకుండా ఆ మాటలు..!
గుడ్డి దీపాల్లా మూలుగుతున్నాయి
లాంతరు దూరం వరకూ కనిపిస్తది
కానీ వెలుతురు ఇవ్వదు ఆవరణలో
పిట్టల రెక్కలు మెత్తనివి
గడప ముంగిట పడున్నవి
పొద్దెక్కేవరకూ కనిపిస్తయి!
రాత్రిలో... ఆ ఇంట్లో గిన్నెలు ఉడికి
కొంత వెలుగు బువ్వను ప్రసాదిస్తవి
నీళ్ల కుండలో నది పారుతది
నట్టింట్లో కోయిలలు తిరుగాడుతూ
వసంతాన్ని కురిపిస్తాయి
అక్కడున్న అందరూ
ఆర్ధ్రతతో చూస్తుంటారు
అలాగే బయటకు
హృదయ గవాక్షాలు తెరిచి..!!

రఘు వగ్గు
96032 45215